Friday, 16 September 2016

శ్రీ రమణ గారు "మిథునం" కథ ద్వారా మనందరికీ పరిచయమే.... "నాకు నచ్చిన కథ" శీర్షికన ఆయన వ్రాసిన మరో ఆణిముత్యం "బంగారు మురుగు" కథ పరిచయం చేయబోతున్నాను...నేను ఎంతవరకూ న్యాయం చేయగలనో తెలియదు..ఎందుకంటే వారి కథలను క్లుప్తీకరించి వ్రాయడం సాహసమే...అచ్చతెలుగు కథలకు మరో ఉదాహరణ ఈ " బంగారు మురుగు"..
ఈయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయస్థాయి వివేకానందా వ్యాస రచన పోటీలలో వరుసగా ఆరుసంవత్సరాలు ప్రథమ బహుమతి అందుకున్నారట..బాపు రమణలతో కలిసి చిత్రపరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేసారట...ప్రస్తుత కథ 1993 సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వార పత్రిక కోసం వ్రాసినది..ఈ కథకు "జ్యేష్ట లిటరరీ" అవార్డు లభించింది....
ఓ ఇంట్లో ఓ బామ్మకీ, మనవడికీ ఉన్న బంధం గురించి చెప్తుందీకథ. మడి, పూజ వంటివి లేకపోయినా, "మొక్కకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...ఇవే బామ్మకు తెలిసిన బ్రహ్మసూత్రాలు...గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే ఓ స్వాములారి సేవలో కొడుకుకు ఉన్న మడులూ, మాన్యాలూ అంతరించిపోగా, మనవడికి అంతా తానై పెంచుతుంది...పెరట్లో ఉన్న బాదం చెట్టు ఇద్దరికీ ఆవాసం..రాలిపడిన బాదం కాయలూ, అమ్మకి తెలియకుండా, చెట్టుతొర్రలో మిఠాయిలూ, జీళ్ళూ దాచే బామ్మే మనవడికి తోడూ, నీడా, దైవం అన్నీనూ...పరువు తక్కువగా... బయటి చిరుతిళ్ళు మనవడికోసం కొని పెడుతోందని తెలిసిన కొడుకూ కోడలూ బామ్మ చేతికి డబ్బులు అందకుండా చూస్తే,....... బియ్యం ఎదురిచ్చి జీళ్ళు కొంది బామ్మ....ఆ తరువాత బియ్యం డబ్బాకి కూడా తాళం పడితే, మనవడి పీచుమిఠాయి కోసం దేవుడిగదిలో కంచు గంటకి కాళ్ళొస్తాయి...మిఠాయిలూ, జీళ్ళూ, పీచుమిఠాయి ఆరోజుకి ఇచ్చేసి, మరుసటి వారం సంతరోజు వాడొచ్చి ఇంకా బాకీ ఉన్నానని మరిన్ని జీళ్ళూ, వగైరా ఇచాకగానీ ఇంట్లో కంచుగంట ఆచూకీ తెలియలేదు...పూజలూ, పునస్కారాలూ, స్వాములోర్లూ, సత్కారాలూ, జప తప హోమాదుల్లో మడులూ మాణ్యాలూ కరిగిపోవడం ఎలా తెలియలేదో, అంత దాకా ఒకటే కంచం, ఒకటే మంచంగా బామ్మతో బ్రతికిన మనవడికి కంచం , మంచం వేరయ్యాక గానీ, తనకి వయసొచ్చిందని తెలియలేదు...పెళ్ళీడు వచ్చాక, వరస అయిన మనవరాలు (కూతురి కూతురు) ఉన్నా కూడా ఆమే గుణం తెలిసి బయట సంబంధం చూస్తుంది బామ్మ..నాలుగు కాసుల బంగారం దగ్గర సంబంధం చేజారుతుందంటే, ఏదో మాయ చేసి, సంబంధం ఖాయం చేస్తుంది..పెళ్ళి సమయం లోనూ, మరణ శయ్య మీద ఉన్నప్పుడూ ...అసలు మనవడికి గ్రాహ్యకం వచ్చినదగ్గర్నుండీ ఎన్నో జీవిత సయ్తాలు చెప్తుంది బామ్మ....విచారించకు వెర్రి నాగన్నా....ఇప్పుడు వెళ్ళి, అటూ ఇటూ కాస్త పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అని మనవడికి భరోసా ఇచ్చి కన్ను మూస్తుంది...
స్థూలంగా ఇదీ కథ...అయితే, కథ ఆద్యంతం, తెలుగు భాష తీయదనం ప్రవహిస్తూ ఉంటుంది...బామ్మల దగ్గర బాల్యాన్ని గడిపిన అదృష్టవంతులందరూ ఈ కథలో తమ బాల్యాన్ని పోల్చుకుంటారు.
"పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ, వేధింపులూ బామ్మ దగ్గరలేవు"...
ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తీ రెండూ లేవు అంటే " దయ కంటే పుణ్యం లేదు..నిర్దయ కంటే పాపం లేదు...చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం,....నాకు తెలిసిందివే" ...
"మండువా లోగిలి పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువలా ఉండేది"...
"పిచ్చి సన్నాసీ! దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేవైనా ఉందీ!! మేలుకొలుపులూ మనకోసమే, చక్కెర పొంగలీ మనకోసమే!!"
"బాదం చెట్టు భోషాణం"..
"విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయిలు"...
"నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"...
"దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది---దిక్కులేని వాళ్ళకి"...
"ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నావరించింది"..
"ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?"..
" పిల్ల పొందిగ్గా ఉంది...పచ్చగా దొరసానిలా ఉంది...కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి...నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు..."
"అరటి దూట కూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, నైపుణ్యం కావాలి...అలాంటి అమ్మాయి సంసారాన్ని చక్కదిద్దుగోగలదు.."
"ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి.. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి...అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి"...
ఇలాంటి మనసు నిండే వాక్యాలు ఇంకా ఎన్నో ఈ కథలో, అన్నీ చెప్పాలంటే మొత్తం కథ చెప్పాలి...ఈకథని ఈపాటికి మీరందరూ చదివే ఉంటారు. చదవకపోతే తప్పనిసరిగా ఒక్కసారైనా చదవండి....ఒక్క సారి చదివాక, ఆరోజే మరో నాలుగైదు సార్లు చదవకుండా ఉండలేరు...ఇంత మంచి కథను చదవడం మిస్ అయ్యరంటే మాత్రం జీవితంలో కొన్ని అనుభూతులను మిస్ అవుతున్నట్లే...
మీ స్పందనని తెలియపర్చడం మర్చిపోవద్దు...
చిన్నతనంలో మేము చదివిన స్కూల్ లో ప్రతిరోజూ మూడు భాషల్లోనూ, డిక్టేషన్ వ్రాయించేవారు....ఈ మూడు భాషల టీచర్లూ క్లాసులోకి రాగానే ముందు డిక్టేషన్ చెప్పవలసిందే..ఆ తరువాత హోం వర్కులు చూసి, అప్పుడు కొత్త పాఠం మొదలుపెట్టడం...మూడు భాషలోనూ డబల్ రూల్ పుస్తకాల్లో కాపీ రైటింగ్ వ్రాయాల్సిందే....అందువల్ల మాకు ఇప్పటికీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వ్రాయడం వస్తుంది. మిగిలిన గ్రూప్ సబ్జెక్ట్స్ కి ఎంత విలువ ఇచ్చేవారో, తెలుగు, హిందీ, ఇంగ్లీషు కీ అంత ప్రాధాన్యత ఇచ్చేవారు...ప్రతి సబ్జెక్ట్ లోనూ పాఠాలు వివరంగా చెప్పటం, పద్యాలు అయితే రాగయుక్తంగా పాడటం, పిల్లలచేత పాడించటం చేసేవారు మా టీచర్లు...మా హెడ్మిస్త్రెస్స్ పిల్లలతో ఎంత చనువుగా ఉండేవారో, తప్పు చేస్తే అంతగానూ శిక్షలు ఉండేవి...పిల్లల్తో చాల కలిసిమెలిసి ఉండేవారు ఆవిడ. ప్రతి విద్యార్థీ ఏ క్లాసు, ఏ సెక్షను అనేది ఆవిడకి ఎప్పుడూ గుర్తే...ప్రైవేటు స్కూల్ అయినా కూడా ఆవిడ మమ్మల్ని అన్ని పోటీలకూ పంపేవారు, అన్ని పరీక్షలూ వ్రాయించేవారు. ఏవో కేంద్ర ప్రభుత్వ పరీక్షలూ, తి.తి.దే. వారి పరీక్షలూ ..ఏమిటో చాలా చాలా వ్రాసేవాళ్ళం...ఒక్క చదువే కాకుండా చాలా ఇతర వ్యాపకాలలోనూ, ఆటల్లోనూ కూడా చాలా పోటీలకు వెళ్ళి, మా స్కూల్ పిల్లలు ఎన్నో బహుమతులు గెల్చుకునే వారు. ...మా హెడ్మిస్టెస్ టీచర్లను ఎలా సెలెక్ట్ చేసుకునేవారో కానీ, ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యం... పుస్తకాల్లో పాఠాలే కాక, ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్చుకున్నాం వారి దగ్గర...ఈరోజుకి, మేము ఉద్యోగాలు చేయకపోయినా, మా పిల్లలకు ట్యూషన్లు లేకుండా సొంతంగా ఇంట్లో చదువుచెప్పుకుని, వాళ్ళకు ఇంత క్రమశిక్షణ నేర్పగలిగాము అంటే అదంతా మా టీచర్లు, హెడ్మిస్ట్రెస్ చలవే...ఆ స్కూలు 1983 లో వదిలేసినా, ఈరోజుకి తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు...ఇప్పటికీ మా స్కూల్ మీద, మా టీచర్ల మీద గౌరవభావం , ప్రేమ అలాగే ఉన్నాయి నాకు..నాకే కాదు, మా స్కూల్ పిల్లలందరికీ అంతే బహుశా...
ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదూ..కాకినాడలో అప్పట్లో పేరెన్నిక గన్న స్కూల్....టాగూర్ కాన్వెంట్ హై స్కూల్...హెడ్ మిస్టెస్ పేరు శ్రీమతి సి.ఎం. ఇందిరా దేవి గారు. తెలుగుకి సుబ్బలక్ష్మి టీచర్, లెక్కలికి జోసెఫ్ మాస్టారు, సైన్స్ కి రాఘవలక్ష్మి టీచర్, పి.వి. శర్మ గారు, సోషల్ కి సావిత్రి మేడం, హిందీకి పద్మావతి టీచర్, పి.టి. సర్ సూర్యనారాయణ గారు, డ్రాయింగ్ కి సత్యనారాయణ సర్, ఇంగ్లీషుకి ఛార్లీ మాస్టారు...అబ్బబ్బ....అందరూ ఎంత బాగా చెప్పేవారో....
ఇవీ మా స్కూల్ విశేషాలు...ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా మా జీవితాలను తీర్చిదిద్దిన ఆ గురువులందరికీ పాదాభివందనాలు...
మీ అందరి స్కూల్ విశేషాలు కూడా పంచుకోండి మరి...
శ్రీ గురుభ్యో నమ:
ఈ సమూహం లో సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయులకు నా మన:పూర్వక "ఉపాధ్యాయ దినోత్సవ "శుభాకాంక్షలు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటం లో తల్లితండ్రుల తర్వాత మీ పాత్ర అమోఘమైనది. విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక నేర్పి ఉన్నత సంస్కారాలను విద్యార్ధులలో పాదుకొల్పడం లో మీ కృషి శ్లాఘనీయం . ఒక దేశ భవిష్యత్తు ఆ దేశం లోని యువత మీదనే ఆధారపడి ఉంది. అటువంటి యువతను తయారు చేసేది మీరు. అంటే పరోక్షంగా ఒక దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉంది.
పురాణం కాలం నుంచి రామ లక్ష్మణులను, కౌరవ పాండవులను మరెంతో మంది శిష్యులను ప్రతి యుగం లోను ఉన్నతమైన వ్యక్తులుగా రూపొందించిన గురువులు కలిగిన వేదభూమి మనది. ఈ ఆధునిక కాలం లో కూడా శ్రీ రాధాకృష్ణన్ వంటి ఎంతో మంది గురువుల నీడలో పెరిగిన ఎంతో మంది నేడు ప్రముఖులై దేశమాత సేవలో తరిస్తున్నారు.
. యువత మార్గనిర్దేశనం లో మీ పాత్ర ఎంతో విలువైనది. ఈ సమాజ నిర్మాణంలో మీ భాగస్వామ్యం విలువ కట్టలేనిది. మీ ఋణం తీర్చుకోలేనిది. దేశం లోని ప్రతి పౌరుడు మీకు సదా కృతజ్ఞులై ఉంటారు....
గురుర్బ్రహ్మా, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ:
పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చే పొరపాటు చేయకండి..అది ఇంట్లో ఉండే మిగిలిన పిల్లలతో అయినా సరే, ఇతరుల పిల్లలతో అయినా సరే..ఒక్కొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉండచ్చు...దానిని కనుక్కొని వెలికితీసి ప్రోత్సహించడం తల్లితండ్రులుగా మన విధి...పెద్దవాడికి చదువులో ఆసక్తి ఉంటే, చిన్నవాడికి పాటల్లో ఉండచ్చు....చాలా ఇళ్ళల్లో సాధారణంగా వినబడే మాట ఏంటంటే, అన్న లాగా నువ్వు ఎందుకు ఉండవు?, అక్క లాగా ఎందుకు ఉండవు? ఇద్దరూ ఎందుకు ఒకలాగా ఉండాలి? ఉండరు కూడా....అలా పోల్చి తిట్టడం వలన వాళ్ళ మనసుల్లో ఏర్పడే న్యూనతా భావం కొన్ని సంవత్సరాల వరకూ ఉండిపోవచ్చు...దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి...ఇంట్లో పెద్దవాళ్ళు అలా అనడమే కాకుండా...ఎవరితో అయినా చెప్పేటప్పుడు కూడా, పెద్దవాడు చాలా బాగా చదువుతాడండీ, చిన్నవాడికి అంత శ్రధ్ధ లేదు, ఆటల్తోనూ, టీవీ తోనూ సరిపోతుంది ...ఇలా చెప్పడం వలన, పెద్దపిల్లలు చిన్నవాళ్ళను చులకన చేయడం, బయటి వాళ్ళు కూడా చులకనగా చూడడం జరుగుతాయి. దీని ప్రభావం చిన్న వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది..ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే, వారందరి మధ్యన, ఒక బంధం, ఐకమత్యం ఉండేలా పెద్దవాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి..ఇలా సంతానం మధ్యన పోల్చి చూడటం వల్ల, వాళ్ళ మధ్యన ఉండే ఐకమత్యం, ప్రేమ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి బిడ్డా ప్రత్యేకమే..ఏ ఇద్దరూ ఒక్కలాగా ఉండరు. ..రేండో సంతానాన్ని కనేటప్పుడు తల్లి తండ్రులు గుర్తుంచుకోవలిసిన ముఖ్యమైన విషయం ఇది.

Sunday, 28 August 2016

నిజంగా ఈ స్త్రీవాదం అంటే ఏంటో అంతుపట్టదు నాకు....మగజాతినీ, మగపుట్టుకనీ, చెడతిట్టడమేనా స్త్రీవాదం అంటే....నిజమే..పురాణకాలం నుంచీ స్త్రీలు వివిధ రకాలుగా, పురుషుల చేతుల్లో సమాజం చేతుల్లో బాధలు పడ్డారు....అలా అని మొత్తం మగజాతిని ద్వేషించలేము కదా....కొంతమంది స్త్రీవాదులు పెళ్ళితో వచ్చే సౌభాగ్య చిహ్నాలు కూడా వద్దనుకుని, తెల్లచీర, (సుమంగళులైనప్పటికీ) బోసి నుదురు, మెడ, చేతుల్తో వెలిగిపోతున్నారు..వాళ్ళ ఆశయాలకు హేట్సాఫ్....కొంతమందికి భారతం, రామాయణం లాంటి పురాణాల్లో కూడా బూతులు కనబడతాయి...ఈనాడు ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకుంటున్న ఈ ఇతిహాసాల్లో వాళ్ళకు తప్పులు కనబడుతున్నాయంటే, వాళ్ళది ఎంత వంకర చూపు, ఎంత వంకర ఆలోచనలు? హవ్వా, వీళ్లకు చెప్పేవాళ్లే లేరో లేకపోతే చెప్పినా వినరో నాకు తెలియదు..ఎక్కడో ఏదో జరిగిందని, మగజాతిని, సమూలంగా ద్వేషించడం తప్ప వీళ్ల అజెండాలో ఇంకేమీ కనిపించదు...పోనీ ఇంత స్త్రీవాదులు ఆడవాళ్ళకు జరిగే అన్యాయాలకు న్యాయం ఏమైనా చేయగలుగుతున్నారా అంటే అదీ లేదు...స్త్రీల మీద రేపులు జరిగాక, రోడ్ల మీదకు రావడం తప్ప, బాధితులకు ఏ పిసరైనా సాయం, న్యాయం చేసారన్న దాఖలాలు ఉన్నాయా? వీళ్ళ చొరవ వల్ల, నేరస్థులకు తొందరగా శిక్ష పడిందా ఎక్కడైనా, ఎప్పుడైనా? పోనీ, వ్యభిచార కూపం లో ఉన్న, పెళ్ళి ముసుగులో, పనివాళ్ళ ముసుగులో దుబాయికి అమ్మేయబడుతున్న ఆడపిల్లల గురించి ఏమైనా చేసారా? వాళ్ళకు (ప్రభుత్వ సాయం లేకుండా) శాశ్వత జీవనోపాధిని కల్పించారా? ముంబాయిలో డాన్సు బార్లు మూసినప్పుడు, హర్షం వెలిబుచ్చిన వీరు క్రికెట్ మ్యాచుల్లో సగం సగం గుడ్డలేసుకొని ఎగిరే చీర్ గర్ల్స్ ని ఎందుకు నిషేధించమనరు? ఇంకా బార్ గర్ల్స్ వల్ల కొంతమందికి పరోక్షంగా ఉపాధి ఉంది...చీర్ గర్ల్స్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం? వీరు అడిగే మరో ప్రశ్న, ....మగవాడు చేస్తే తప్పులేనిది మేము చేస్తే తప్పా? అమ్మా తల్లుల్లారా! మగవాడికి, ఆడదానికి ప్రకృతి పరంగా కొన్ని బేధాలు ఉన్నాయి. మానసికంగా కూడా స్త్రీ పురుషుని కన్నా బలవంతురాలు...అందుకే, అత్తింటి బాధ్యతలు, పిల్లల పెంపకం వంటివి ఆడదానికి కేటాయించాడు భగవంతుడూ, సమాజమూనూ...ఇది మనకు గర్వకారణం అనుకోవాలి....స్త్రీ మెదడు ఒకేసమయంలో రకరకాల విషయంలో గందరగోళం లేకుండా ఆలోచించగలదు..అందుకే స్త్రీ అన్ని విధులను ఏకకాలంలో సమర్ధించగల నిపుణురాలు...అందుకే అన్ని రకాల మనుషులను టాకిల్ చేయగలదు....స్త్రీకి గల ఇంత ఉన్నత వ్యక్తిత్వాన్ని వదిలేసి, మగవాళ్ళతో సమానంగా అర్ధరాత్రి తిరిగితే తప్పేమిటి, ప్యాంట్లు వేసుకుంటే తప్పేమిటి, చీరలే కట్టుకోవాలా?.......మా వస్త్రధారణ మా ఇష్టం, ...ఇదే అక్కర్లేని ఐడియాలజీ....అందర్నీ చెడగొట్టడం..... ఈ కాలం లో మగవాళ్ళు మరీ ఇదివరకటిలా కాకుండా కొంచెం మెరుగు....అయినా మగవాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు అంటే వాళ్ళను పెంచిన తల్లులది కూడా కొంత బాధ్యత ఉంది కదా...మరి అది ఎవరూ మాట్లాడరేం? మగైనా , ఆడైనా పిల్లలు చెడిపోయారన్నా, నడత బాలేదు అనుకున్నా, పెంచిన తల్లుల బాధ్యత ఉంటుంది...అంటే ఇక్కడ తప్పు ఆడవాళ్ళది కూడా కదా.. ఇలా మాట్లాడుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి....ఇప్పటికివి చాలు..
"తెలుగు భాషా దినోత్సవం"...ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మన భాషను మనమే చంపేసుకుంటున్నాం కనుక...ఓ పక్క భాషను  పూర్తిగా కప్పెట్టెయ్యడానికి లోతైన గోతులు తీసేస్తూ, "దినోత్సవం" చేసుకోవడంలో అర్ధం లేదు. ఏడాదికి ఓసారి మన భాషను గుర్తు చేసుకొని వలవలా ఏడవడం మనకే చెల్లింది...ప్రతిరోజూ గుర్తున్నా లేకపోయినా......పక్క వాళ్ళతో అన్నిటికీ పోటీపడతాం...పనికొచ్చే వాటికి తప్ప.....కొంచెం చిత్తశుధ్ధి ఉంటే చాలు...మన భాషను మనం కాపాడుకోవచ్చు.

1. ఎంత హోదాలో ఉన్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడడం.

2. ముఖ్యంగా పెద్దవాళ్లతో పిల్లల సంభాషణ తెలుగులోనే ఉండేలా చూడడం.

3. పిల్లలను ' గొ, తకె థిస్, స్లీప్ బబ్య్ , సిత్ ప్రొపెర్ల్య్ " అంటూ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో పెంచడం..

4. చిన్న పిల్లలకు కాలక్షేపానికి గాడ్జెట్స్ ని ఇవ్వకుండా..ఆడుతూ పాడుతూ వారికి తెలుగు భాష నేర్పించడం..

5. కొంచెం ఎదిగిన పిల్లలకు రామాయణ భారతాల వంటి గ్రంధాలను తెలుగులో పరిచయం చేసి చదివించడం...

6. పిల్లలకు ముఖ్యంగా "ణ, ళ, " వంటి అక్షరాలను ఉచ్చారణ దోషం లేకుండా పలకడం నేర్పించడం....

7. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినపుడు తెలుగులోనే మాట్లాడుకోవడం....మనకు ఉన్న ఈ జాడ్యం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా జోక్స్ వేసినా, మనకు బుధ్ధిరాదు...

ఇవన్ని మనం మన పిల్లల పట్ల ఆచరిస్తే, తెలుగు భాష ఇంకో తరం పాటు సజీవంగానే ఉంటుంది. మన పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే, మరో తరం వరకు భేషుగ్గా వెలిగిపోతుంది మన భాష...మన తెలుగు కే సొంతం అయిన పద్య రచన, అవధానాలు, రంగస్థల నాటకాలు ఇటువంటి వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. మొదట్లో పిల్లలు వినకపోతే, ఓ పెద్ద బాలశిక్ష పుస్తకమో, తెలుగు లో బొమ్మల రామాయణాలో, కథల పుస్తకాలో వాళ్ళ కంటికి ఎదురుగా ఉండేటట్లు పెట్టండి. వాటినలా చూసి, చూసి, వాళ్ళకే ఆసక్తి కలుగుతుంది. చిన్న చిన్న నీతి కథలు, సామెతలు, ఇటువంటికి ఆసక్తిని పెంచేలా చెప్తే, పిల్లలకు భాష నేర్చుకోవాలనే జిజ్ఞాస పుడుతుంది.

ఎవరైనా తల్లితండ్రులు  మా పిల్లలకు తెలుగు మాట్లాడ్డం, చదవడం చేతకాదండీ అని బీరాలు పోయినపుడు రోతెక్కిపోతుంది..ఆ తప్పు ఎవరిది? పిల్లలది కాదు..ఖచ్చితంగా పెద్దవాళ్ళదే...


Thursday, 25 August 2016

వర్ధనమ్మ ఇల్లు తాళం వేసి ఎక్కడికో బైల్దేరబోతోంది. ఇంతలో ఢిల్లీ నుంచి కాంఫరెన్సుకు ఊళ్ళోకొచ్చిన  పెద్దకొడుకు ఆటో దిగుతూ కనబడ్డాడు. తాళం తీసి ఇంట్లోకి ఆహ్వానించింది...ఇంట్లో అతనికి పెట్టడానికి ఏమీ లేవు..కుశలప్రశ్నలు అయ్యాక భోజనానికి ఉండమంటుందని ఆశపడ్డాడు కొడుకు. తన భార్యకి ఒంట్లో బాగుండడంలేదు. అమ్మ ఒప్పుకుంటే నాలుగు రోజులు తీసుకెళ్ళచ్చు అనుకున్నాడు...తల్లిని చూడడానికి వట్టిచేతుల్తో వచ్చాడు తను. సంభాషణ ఎలా మొదలెట్టినా తల్లి క్లుప్తంగా జవాబులు చెప్పి మాట మధ్యలోనే తుంచేస్తోంది. ..అమ్మ బాగా మారింది అనుకున్నాడు...ఒక్కదానివి ఉండడం ఎందుకు? తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడు కదా, వాడి కుటుంబాన్ని దగ్గర పెట్టుకో....చేదోడువాదోడుగా ఉంటాడు అని సలహా ఇచ్చి, డబ్బులు ఇద్దామని తీయబోయిన పర్సు కూడా మళ్ళీ జేబులోనే పెట్టేసుకుని శెలవు తీసుకున్నాడు...

నాలుగు రోజుల తర్వాత ఊళ్ళో ఉటున్న చిన్నకొడుకు వచ్చాడు తల్లిని చూడడానికి...పెళ్ళి అయిన మొదట్లో భార్య మాటలకు తందానా పాడి విడికాపురం వెళ్ళిపోయాడు....ఆదాయం పెరగక, ఖర్చులు ఎక్కువై, ఎదిగిన పిల్లల్తో రెండు గదుల ఇంటి కాపురం చేయడంలో కష్టం తండ్రి పోయాక, తల్లి ఒంటరిగా ఉంటున్నప్పుడు తెలిస్తోంది...తల్లి ఇంట్లోనే అందరూ కలిసి ఉంటే అద్దె ఉండదు. పిల్లల మీద తల్లి అజమాయిషీ ఉంటుంది. తల్లి ఎలాగూ పని చేయకుండా కూర్చునే రకం కాదు కాబట్టి భార్యకు పనిలో కాస్త వెసులుబాటు ఉంటుంది. భార్య మెదడులోని ఆలోచన , అతని మనసులో రూపుదిద్దుకుంటోంది.
 
చిన్నకొడుకు ఎంత లౌక్యంగా మాట్లాడినా వర్ధనమ్మ తాను ఒంటరి జీవితానికే ఇష్టపడుతున్నాను అని అంతకన్నా గుంభనంగా చెప్పింది...అన్నయ్య డబ్బు పంపుతున్నాడు కాబట్టి, అమ్మ ఇలా మాట్లాడుతోంది..అనుకున్నాడు చిన్నకొడుకు కేశవ...అన్నగారు రెండుమూడు నెలలనుంఛీ డబ్బు పంపని విషయం తెలియక...తన మాట చెల్లకపోయేసరికి విసుక్కుంటూ ఇంటిదారిపట్టాడు...

ఒంటరిగా మిగిలిన వర్ధనమ్మ మనసులో ఏవేవో ఆలోచనలు...పదహారేళ్ళకు పెళ్ళి అయ్యి కాపురానికి వచ్చినదగ్గర్నుంచీ ఒకటే పని....చేసి చేసి అలసిపోయింది...దానికి తోడు భార్యను అజమాయిషీ చేయడం తప్ప  ప్రేమించడం పరువుతక్కువ అనుకునే భర్తతో ఆర్నెల్ల క్రితం వరకూ ఓ భార్యగా పక్కన కాకుండా, వెనకనే నడిచింది...తన మీదున్న బాధ్యతలన్నీ సంపూర్ణంగా తీర్చుకుంది...అందరికీ తలలొ నాలుకలా మెలుగుతూ....తండ్రి చనిపోయాక 12రోజుల కర్మలు చేసి అస్థి నిమజ్జనం తో సరిపెట్టుకున్నారు కొడుకులు. బతికున్నప్పుడు ప్రేమ చూపకపోయినా, భార్య పట్ల బాధ్యతగా తన పేరన ఒక ఇల్లు, కొంత బ్యాంకు బాలన్సూ ఉంచి వెళ్ళాడని ఆయన పోయినతర్వాతే తెలిసింది వర్ధనమ్మకు...లేని భర్తకీ, ఉన్నాడో లేడో తెలియని దేవుడికీ దణ్ణస్లుపెట్టుకుంది..ఆ పన్నెండు రోజుల్లోనే కొడుకుల, కోడళ్ళ అవకాశవాదాలు తెలిసొచ్చాయి...కాలం మహిమ అనుకుంది, కానీ ఎవరిని తప్పుగా అనుకోవడానికి మనస్కరించలేదు..

ఆరునెలలౌ గడిచింది...ఇంట్లో ఓ మూడు గదులు అద్దెకిచ్చింది..ఆ అద్దె, బ్యాంకు వడ్డీ...రోజు గడుస్తోంది లోటు లేకుండా... ఇంట్లో పనులు బాగానే జరుగుతున్నాయి...మరి బయటవాటి సంగతి? ఎవరి చేస్తారు? గుళ్ళ పేరు పెరిగిపోయింది...అతుకు పెట్టించాలి..భర్త ఉంటే ఏంచేసేవాడో ఆలోచించింది..ఆయన ఉండగా ఎప్పుడూ బయటికి వెళ్ళిన మనిషి కాదు...తలుపు తాళం వేసి ఆచారి దుకాణం పేరు చెప్పి రిక్షా మాట్లాడుకుని వెళ్ళి పని పురమాయించింది...మొదట ఎవరేమనుకుంటారో అని బెరుకు అనిపించింది. పని పూర్తయ్యాక ధైర్యం వచ్చింది... కొన్ని రోజులయ్యాక ఆమేకు సినిమా చూడాలనిపించింది..సినిమా చూసి కొన్నేళ్ళు అయింది...తోడు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు...అయినా తనలాంటి ముసలి, ఒంటరి దానితో వేచ్చేవారెవరు? ఒక్కతే చూసి వచ్చింది..అందులో హీరోయిన్ తీసుకున్న నిర్ణయం సమాజ విరుధ్ధం అయినా ఆమె తెగువకి ముచ్చటపడింది....

ఈ పరిస్థితుల్లో తను కొడుకుల దగ్గరకు వెళ్తే జరుగుబాటు బాగానే ఉంటుంది? కానీ ఎణ్ణాళ్ళు? మళ్ళీ బాధ్యతల మడుగులో కూరుకుపోతుంది...కొంతకాలమైన తనకు దొరికిన ఈ స్వేచ్చ అనుభవించాలని ఉంది. ...సాయంత్రం పూట ఏమీ తోచలేదు...భర్త కాలక్షేపం ఏమిటో గుర్తు చేసుకుంది...దగ్గరగా ఉండే పార్కుకు వెళ్ళి కూర్చునేవాడు ఆయన...తను కూడా వెళ్ళింది..పిల్లలు, పెద్దలు, అందరితో సందడి సందడిగా ఉంది...వర్ధనమ్మకు ఊపిరాడినట్టయింది...మనసుకు రెక్కలు మొలిచినట్టు ఉంది....పిల్లల చేతుల్లో "పిడత కింద పప్పు" చూడగానే నోరూరింది...కాసేపు మడీ ఆచారం పక్కన పెట్టి, వాడు అడిగిన రూపాయిన్నర ఇచ్చి ఓ పొట్లం కొనుక్కుంది...బెంచి మీద కూర్చుని పొట్లం విప్పింది. ..పక్కనే ఉన్న ఏడెనిమిదేళ్ళ ముష్టి కుర్రాడు ఆశగా  తనకేసి చూస్తుంటే సగం వాడి దోసిట్లో పోసి, మిగిలినది తాను తింది. నోరు చుర్రుమంది..కాని కొత్త రుచి నోటికి తగిలింది...తన జీవితం మీద తనకి ఓ స్పష్టత వచ్చింది...భర్త కొంత ఆస్తి తనపేర వ్రాసి, తనకు కర్తవ్య బోధ చేసినట్టు తోచింది. ...ఆమె మనసు కొత్త రెక్కలు తొడుక్కున్నట్లయింది..

ఈ కథ ప్రముఖ రచయిత్రి అబ్బూరి చాయాదేవి గారు 1996 లో ఇండియా టుడే కోసం వ్రాసినది...ప్రత్యేకించి స్త్రీ స్వేచ్చ గురించి కాకపోయినా, భర్త, అత్తవారిల్లు, పిల్లలు, సంసారం వీటితోటే అలసిపోయిన స్త్రీలకు, కొంత వయసు తర్వాత బాధ్యతలు తీరిపోయాక, భర్త ఉన్నా, లేకపోయినా, తమకంటూ ఒక జీవితం ఉంది అని స్త్రీలకు స్పష్టంగా చెప్పిన కథ ఇది....ఇందులో మానవతా వాదం తప్ప స్త్రీవాదం లేదు...స్త్రీలు తమను తాము ఐడెంటిఫై చేసుకోవాలనే సందేశం తప్ప....

మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి మీ స్పందన తెలపండి.