Wednesday 30 July 2014

మహిళలకు ప్రత్యేకం అయిన టూర్లు..

నిజమే. మహిళలు ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలు తిరిగి రావాలి అని అనుకున్నపుడు ఇంట్లో మగవాళ్ళకు తీరిక లేకపోతే ఎలా?  వివిధ కారణాల వలన మగవారి తోడూ లేకుండా మహిళలు బయటికి వెళ్ళాలంటే ఎలా? ఇలా అలోచించి 2005 లో ఢిల్లీ కి చెందినా సుమిత్రా సేనాపతి అనే మహిళ కేవలం మహిళల కోసం టూర్లు ఏర్పాటు చేసారు. అంటే వీటిని నిర్వహించేదీ, అందులో పాల్గొనేదీ కేవలం మహిళలే అన్నమాట. ఆ తరువాత పియా బోస్ అనే ఆవిడ దీనికి ప్రాచుర్యం తెచ్చారు. పేస్ బుక్ లో girlsonthegoclub  అనే కమ్యూనిటీ ప్రారంభించి ఈ రకమైన విహార యాత్రల ప్రాముఖ్యత ను చాటి చెప్తున్నారు. కార్పొరేట్ లాయర్ గా చేస్తున్న పియ బోస్, లక్షలు ఆర్జించే తన వృత్తిని వదిలి, ఆత్మసంతృప్తి కోసం ఈ పనిని చేపట్టినట్టు చెప్తున్నారు. ఈరోజున ఆ కమ్యూనిటీ కి 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు.

గ్రూప్ లో మహిళలు అందరూ ముందు పేస్ బుక్ లో మాట్లాడుకుని టూర్లు ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ సభ్యుల్లో ఎక్కువమంది ఒకచోటికి వెళ్ళాలి అని కోరుకుంటే, ఆ ట్రిప్ కు ఎంత ఖర్చు అవుతుంది, ఏ సమయాలు అనుకూలం, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు అన్ని వివరాలూ పియా బోస్ అందరికీ తెలియ చేస్తారు. వీరు ఇప్పటివరకు కెన్యా, కాశ్మీర్, ఈజిప్ట్, తో సహా దాదాపు భారత దేశం అంతా చుట్టి వచ్చారు.

ఈ గ్రూప్ లో అన్ని వర్గాల మహిళలు, అన్ని వయసుల వాళ్ళు అందరూ సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది అని అందులోని సభ్యులు అందరూ ఉత్సాహంగా చెప్తున్నారు.

Sunday 27 July 2014

పిల్లలు అందరూ తరచుగా చదివినవి అన్నీ మర్చిపోతున్నాను, ఎంత చదివినా గుర్తు ఉండడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆమాట వినగానే తల్లులు చాలా గాబరా పడిపోతారు, అయ్యో, పరీక్షల సమయంలో ఇలా ఉంటె ఎలా? మార్కులు, రాంకులు తక్కువ వచ్చేస్తే ఎలా, అని. కానీ, పిల్లలలో మతిమరుపు అనేది చాల  ఒక మానసిక భావన. చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలి అంటే, పాఠం వినేటప్పుడు అది దృశ్య రూపం లో గుర్తు ఉంచుకోవాలి. పాఠం చదివేటప్పుడు ఒక వరుసలో చిన్న చిన్న పాయింట్స్ గా రాసుకోవాలి. జవాబులు గుర్తు ఉండడం లేదు అనుకున్నపుడు ఆ జవాబును 2,3 సార్లు పుస్తకం లో బైటికి అనుకుంటూ వ్రాయాలి. ముఖ్యంగా దృశ్య రూపం లో గుర్తు ఉంచుకున్న పాఠాలు చాల త్వరగా మనసుకు హత్తుకుంటాయి. వెంటనే మర్చిపోవటానికి అవకాసం ఉండదు. అలాగే దేశాల రాజధానులు, కరెన్సీ, ఇటువంటివి నిరంతర సాధన వల్ల గుర్తు ఉంటాయి. టీవీ, కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ gadgets వాడకం తగ్గిస్తే, అక్కర్లేని విషయాలు చాల మటుకు మన మెదడునుంచి తొలగి పోతాయి.

పెద్దవాళ్ళలో మతిమరుపు కూడా తేలికగా అధిగమించవచ్చు. వస్తువులు ఎక్కడ పెట్టామో జ్ఞాపకం ఉండదు చాలా మందికి. ప్రతి వస్తువుకూ ఒక స్థానం నిర్ణయించి ప్రతి రోజూ అక్కడే పెట్టడం ద్వారా గుర్తు ఉంచుకోవచ్చు. ఉదాహరణకు, బీరువా తాళాలు, కొవ్వొత్తులు, బ్యాంకు పుస్తకాలు, మొదలైనవి. చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నపుడు అవి అన్నీ కాగితం మిద వ్రాసుకొని ప్రాధాన్యత క్రమం లో చేసుకోవడం వల్ల చేసే పనులు గుర్తు ఉంటాయి, తొందరగా కూడా పనులు ముగించుకోవచ్చు. అలాగే షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఏమేమి వస్తువులు కొనుక్కోవాలో ముందుగానే ఒక లిస్టు తయారు చేసుకోవటం వల్ల అన్ని వస్తువులు మర్చిపోకుండా కొనుక్కొగలుగుతాము. అన్నిటికన్నా ముఖ్యం, మన వరకు చేరే విషయాలలో ఏది గుర్తు ఉంచుకోవాలి, ఏది అక్కరలేదు అనే విచక్షణ మనలో ఉండాలి. అక్కర్లేని విషయాలు గుర్తు ఉంచుకోవడం వల్ల, అవసరమైన విషయాలు స్మృతి లో ఉండవు.

వైద్య పరంగా మతిమరుపు ఒక వ్యాధి కానేకాదు. కానీ ముసలివాళ్ళలో వచ్చే అల్జీమర్స్ ఒక వ్యాధి. వారు తమ బందువులనే ఒక్కోసారి గుర్తుపట్టలేరు. ఇటువంటి వాటికీ వైద్య సహాయం అవసరం. మతిమరుపును తగ్గించేందుకు ఆహారం లో గింజలు (బాదాం, అఖ్రోట్ ) బాగా పనిచేస్తాయి. విద్యార్ధులకు తప్పనిసరిగా బాదాం , ఆఖ్రోట్ గింజలు ఇవ్వాలి.  అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు పెద్దలు కూడా పత్రికలలో వచ్చే crossword puzzles , సుడోకు, వంటివి ఎక్కువ చేస్తూ ఉంటె మెదడు పదును దేరుతుంది. వీరికి పెద్ద వయసులో కూడా అల్జీమర్స్ వ్యాధి రావడానికి అవకాశం తక్కువ. అరటిపండు ను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

Saturday 26 July 2014

ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం రెండు మూడు రోజులు తెగ హడావిడి చేస్తుంది. స్కూల్ బస్సు ప్రమాదం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజులు బస్సులను తనిఖీ చేసి సీజ్ చేస్తారు.  కానీ సమస్య మూలాలలోకి వెళ్లి అసలు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా? డ్రైవర్ కు కానీ , క్లీనర్ కి కానీ మద్యపానం అలవాటు ఉందా? వారు ఫిట్ గా ఉన్నారా లేదా? వారి డ్రైవింగ్ సరిగా ఉందా లేదా అనే విషయాలు అటు స్కూల్స్ కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవు. బస్సులు సంగతి అటు ఉంచితే, స్కూల్ ఆటో ల మాట ఏంటి? అందులో అసలు ఎంత మందిని ఎక్కించుకోవాలి? ఎంత మంది పిల్లలు ఎక్కుతున్నారు? వాళ్ళ పుస్తకాల సంచులు, క్యారేజిల సంచులు కలిపి ఎంత బరువు ఉన్నాయి అనే విషయం ఎవరూ పట్టించుకోరు. అసలు తల్లి తండ్రులు కూడా తమ అబ్బాయి/అమ్మాయి ఆటో లో ఎంత క్షేమంగా వెళ్తున్నారు? వాళ్ళ పిల్లలు ఆటో లో ఎక్కడ కూర్చుంటున్నారు? ఆటో లో మొత్తం ట్రిప్పు కి ఎంత మందిని తీసుకెళ్తున్నారు? అనే విషయాలు అసలు పట్టించుకోరు. దానికి తోడూ, మన రాష్ట్రం లోని రహదారుల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాజధాని నగరం లో కూడా చిన్న వర్షం వస్తే, దారి ఎక్కడ ఉందొ, manhole ఎక్కడ ఉందొ కనిపెట్టలేము. నాలాలు నిండి దారి మీదే పారుతూ ఉంటాయి. వీటన్నిటిని వర్షాకాలం రాకముందే మరమ్మతులు చేసే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉండదు. వర్షాకాలం వచ్చాక మరమ్మతులు మొదలుపెడితే, పాపం పనిచేసే కార్మికుల ప్రాణాలకు కూడా హామీ ఉండడం లేదు.  కనీసం ప్రమాదం జరిగాక ప్రభుత్వం లోని ఏ శాఖా వారూ కూడా ఈ ప్రమాదానికి మేము ఎంత వరకు బాధ్యులము అని ఆలోచించారు. ఎంత సేపూ ఒకరి మీద ఒకరు నేరం నేట్టేసుకుని, ఒకవేళ జరిగిన ప్రమాదములో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి మిద నేరం నెట్టేసి చేతులు దులిపెసు కుంటున్నారు. ఒక వారం తరువాత మళ్లీ అంతా మాములే. అసలు తీర్చవలసిన ప్రజా సమస్యలు ఎన్నో ఉండగా, నేతలు అందరూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఈ రాష్ట్రం యొక్క దుస్థితికి మీరు కారణం అంటే మీరు కారణం అనుకుంటూ వీధులకు, పేపర్లకు ఎక్కడం తప్ప పరిపాలన మీద, ప్రజా సంక్షేమం మిద దృష్టి పెడుతున్నట్టు కనబడడం లేదు. ఇకనైనా ప్రభుత్వాలు, అధికారులు మేల్కొని ప్రతి సమస్యను మూలం నుంచి పరిష్కరించ ప్రార్ధన.

Thursday 24 July 2014

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ము క్షీయమామ్రుతాత్

ఈ మహా మ్రుత్యునజయ మంత్రం విశిష్టత అందరికీ తెలుసు. ఇది జీవన ప్రదాత వంటిది. దీర్ఘాయువు, శాంతిసౌఖ్యలు, ధన ధాన్యాలు, సంపద, సంతోషం, ప్రసాదించే పరమ పవిత్రమైన మంత్రరాజం. పాము కాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు వంటి ఆకస్మిక దుర్ఘటనల నుంచి రక్షించ గలిగి నటువంటి కవచం ఇది. భక్తీ విశ్వాసాలతో ఈ మంత్రం జపిస్తే అపర ధన్వంతరి వంటి వైద్యులు కూడా నయం కావు అని చెప్పిన మొండి రోగాలు సైతం నయం అయి మృత్యు ముఖానికి చేరువ అవుతున్నవారు కూడా ఆయుష్ మంద్తులవుతారు అని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని జ్జపిస్తే రోగ విముక్తులవుతారు. భోజనం చేస్తూ జపిస్తే తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవడమే కాకా, ఆహారం లోని విష తుల్యమైన పదార్ధాలు హరించా బడతాయి. పాలు, పానీయాలు తాగేటప్పుడు వాటినే తదేకంగా చూస్తూ జపిస్తే యవ్వనం సిద్ధిస్తుంది. రోగుల చెవిలోను, వారి సన్నిధి లోను ప్రతిదినమూ నిర్ణీత సంఖ్యలో ఈ మంత్రం జపం చేస్తే వ్యాధి బాధల నుండి విముక్తి కలిగి, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇంటిలో చిక్కు సమస్యలు, చికాకులు ఉంది మానసిక ప్రశాంతత లోపించిన వారు వేదవిదులైన పండితుల చేత మృత్యుంజయ హోమం కానీ, జపం కానీ చేయిస్తే చిక్కులు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.

గాయత్రీ మంత్రం జపం, చంద్రసేఖరాష్టకం, విశ్వనాధ అష్టకం, సౌందర్య లహరి వంటివి కూడా మృత్యువును దూరం చేస్తాయి.

ఆహారపు అలవాట్లు కూడా ఆయుర్దాయాన్ని పెంచడంలో ఎంతో ఉపకరిస్తాయి. రాత్రి పూట పెరుగును వర్జించి, పాలు అన్నం కలుపుకుని తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. మనసను ప్రశాంతంగా ఉంచుకోవడం, తలస్నానానికి చన్నీతిని, మాములు స్నానానికి గోరువెచ్చటి నీటిని, వాడటం, వారానికో సారి నువ్వుల నూనెను ఒంటికి మర్దనా చేసుకుని అభ్యంగన స్నానం చేయడం, బాగా వేడిగా, లేదా చల్లగా ఉండే పదార్ధాలను తినక పోవడం, పంచ గావ్యలను సేవించడం, ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం, సప్త వ్యసనాలకు దూరంగా ఉండడం, భోజనం చేసిన వెంటనే వంద అడుగులు నడవడం వంటివి ఆయుర్దాయాన్ని పెంచడానికి దోహద పడతాయి.

మానవుడు ఏ కారణం చేత పూర్ణాయుర్దాయం పొందలేకపోతున్నాడు అనే ద్రుత రాష్ట్రుని ప్రశ్నకు సమాధానంగా విదురుడు మహాభారతం లో " గర్వము, హద్దుమీరి మాట్లాడడం, మహాపరాధాలు చేయడం, క్రోధం, తన సుఖమే చూసుకోవడం, నమ్మిన వారిని మోసం చేయడం, అనే ఈ ఆరు లక్షణాలు పదునైన కత్తుల లాంటివి. దేహుల ఆయువును ఇవి నశింప చేస్తాయి. కాబట్టి ఇటువంటి వాటికీ దూరంగా ఉంటూ పైన చెప్పిన విధి విధానాలు పాటిస్తూ ఉంటె అయుస్శును పొడిగించు కోవడం అసాధ్యం ఏమి కాదు " అని చెప్తాడు.

ఆయుష్య సూక్త, వేద పారాయణ, యోగ, ప్రనాయామములు, ఆహార నియమాలు, నిరంతర భగవాన్ నామస్మరణ, శౌచ పాలనా, ఉపవసనియమలు, మహా మృత్యుంజయ ఉపాసన ఇవన్ని మానవుని ఆయు: ప్రమాణాన్ని పెంచడంలో ఉపకరిస్తాయి.

వర్ష వృద్ది కర్మ:

సంవత్సరం పైబడ్డ పిల్లలు అందరకు ప్రతి ఏటా జన్మ తిథి నాడు ఆచరించే ఈ ప్రక్రియ వారి ఆయుష్షును పెంచడంలో సహాయ పడుతుంది. పిల్లల జన్మ తిథి నాడు. అక్షతలతో కూడిన మంటపంలో కులదేవత, జన్మ నక్షత్ర దేవత, మాతా పితరులు, ప్రజాపతి, సూర్యుడు, గణపతి, మార్కండేయుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాలి, ప్రహ్లాదుడు, హనుమంతుడు, విభీషణుడు, షష్టీ దేవత అనే 16 మంది దేవతలను ఆరాధించాలి. షష్టీ దేవికి పెరుగన్నం నైవేద్యం పెట్టాలి . ఈ కర్మ చేసుకునే రోజున క్షవరం , గోళ్ళు కత్తిరించుకోవడం, మిథునం, మాంసా హార భక్షణం చేయరాదు.

Wednesday 23 July 2014

మనలో చాల మందికి ఆరోగ్యం మీద కనీస అవగాహనా ఉండదు.  జ్వరం, తలనొప్పి, వాంతులు , కడుపు నొప్ప్పి, లేదా అజీర్ణం ఇలా సాధారణంగా వచ్చే రుగ్మతలకు ఇంట్లో ఉన్న, తెలిసిన మందులు వేసుకుంటాం. అలాగే కొన్ని చిట్కాలు, గృహ వైద్యాలు పాటిస్తాము. కానీ కొన్ని కొన్ని అనారోగ్య లక్షణాలు మనకు తెలియని జబ్బులకు దారి తీస్తాయి. వీటిలో ఒకటి కాల్షియం లోపం, విటమిన్ డి లోపం. ఎముకలు నొప్పిగా ఉండడం, తీవ్రమైన అలసట, నీరసం, మెట్లు ఎక్కడం, దిగడం లో ఇబ్బంది పడడం. నడుస్తుంటే ఆయాసం రావటం, మోకాళ్ళ నొప్పి కాకపోయినా, ఎముకల మిద ఒత్తిడి పడినపుడు నొప్పి రావడం ఇటువంటివి విటమిన్ డి లోపం ఉంటె వచ్చే రుగ్మతలు.

స్త్రీలకూ ఎక్కువగా కాల్షియం అవసరం అవుతూ ఉంటుంది. నడివయసు వారికీ, మెనోపాజ్ వచ్చిన వారికీ ఇంకా అదనపు కాల్షియం అవసరం. ప్రతిరోజూ పాలు మరియు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఒక్కటే చాలదు. అదనంగా వైద్యుల సలహాతో కాల్షియం సప్లిమెంట్లు కూడా తీసుకోవాలి. అలాగే, పైన చెప్పిన లక్షణాలు ఉన్నపుడు సాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళకుండా ఇంట్లో ఏవో మందులు వేసేసుకుంటాం. కానీ విటమిన్ డి లోపం వల్ల మనం తీసుకునే కాల్షియమ్ పూర్తిగా వంట పట్టదు.

ఈ విటమిన్ డి ఆహార పదార్ధాల ద్వారా ఎక్కువ లభించదు. ఇది లభించే ప్రముఖ వనరు సూర్య రశ్మి మాత్రమే. ఇదివరకు ఇంట్లో పెరడు, వాకిలి అన్ని వేరు వేరు గా ఉండేవి. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇంట్లోకి ధారాళంగా ఎండ పడేది. పిల్లలకు కూడా బయలు ప్రదేశాలలో ఆడుకొనే సమయం, వీలు ఉండేది, అందువల్ల విటమిన్ డి లోపం ఉండేది కాదు. కానీ ఇపుడు అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చింది. ఇంటి లోపలికి  ఎండ రావటం తక్కువే. మనం ఎండలోకి వెళ్ళటం కూడా తక్కువ అయిపొయింది. పిల్లలకు కూడా ఆడుకునే సమయం లేదు. ఒకవేళ ఆడుకున్నా, ఇంట్లో కంప్యూటర్, ఫోన్ ల లోనే ఆడుతున్నారు కాబట్టి ఎండ వారికీ తగిలే అవకాసం ఉండడం లేదు. అందువల్ల ప్రతివారి లోను ఈ లోపం ఎక్కువగా ఉంటోంది. పూర్వపు రోజుల్లో నెలల పసికందులను కూడా ఉదయం లేత ఎండలో కాసేపు ఉంచి లోపలి తీసుకెళ్ళేవారు.

ఇప్పుడైనాస్త్రీలు, పిల్లలు ఉదయం, సాయంత్రం కొంత సేపు ఎండలో నిలబడడం మంచిది. విటమిన్ డి లోపం వల్ల తలెత్తే సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పై లక్షణాలు  కనపడినపుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. పిల్లల్లో విటమిన్ డి లోపం నిర్లక్ష్యం చేస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఇందులో ఎముకలు పటుత్వం కోల్పోయి, కాళ్ళు వనకరగా అవుతాయి. ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీలలో ఎముకలు ద్రుధత్వం కోల్పోయి, బోలుగా తయారవుతాయి. అప్పుడు ప్రతి చిన్న దెబ్బకి ఎముకలు విరిగె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముందరే మనం జాగ్రత్త తీసుకొని, స్త్రీలలో, పిల్లలలో కాల్షియమ్, విటమిన్ డి లోపం తలెత్తకుండా చూద్దాం.

కాకినాడ లో అంధ విద్యార్ధులను చితకబాదిన గురువు.....
నిన్న రాత్రి న్యూస్ చానల్స్ నిండా ఈ వార్తే..... ఆ మాస్టారిని చుస్తే అసలు మనిషేనా అనిపించింది. చిన్న పిల్లలను.... అందునా అంధులను అలా గొడ్డును బాదినట్లు బాదడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో.... టీవీ లో చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు తిరిగాయి. అతనికి మనసు అనేది ఉందా అనిపించింది. పిల్లలు తప్పు చేస్తే, ఒకటి రెండు దెబ్బలు వేయటం ఎవరికైనా సహజం... కానీ మరీ ఇంత రాక్షసత్వమా? అవే దెబ్బలు ఆయనను కొడితే అయన తట్టుకోగలడా?
ఉపాధ్యాయులను ఎంపిక చేసేటప్పుడు, సబ్జెక్టు, మార్కులే కాకుండా మానవత్వం ఆధారంగా కూడా వారిని ఎంపిక చేయాలేమో! వారికీ మనస్తత్వ పరీక్ష పెట్టి కనీస మానవత్వం ఉన్న వారికే ఉపాద్యాయ పదవి ఇవ్వాలెమో...
పిల్లలను తెల్లవారు ఝామున లేపడం కష్టం అయిపోతోంది అని చాల మంది నాకు చెప్తున్నారు. . దీనికి ఒక పధ్ధతి ఉంది అండీ. అన్నిటి కన్నా ముందు, పిల్లలకి, తల్లులకి కూడా లేవాలి అని ఒక కమిట్మెంట్ ఉండాలి. తరువాత రాత్రి పూట త్వరగా పడుకోవాలి. అలాగే పడుకునే అరగంట ముందు టీవీ చూడకండి. చాల మంది అలారం పెట్టుకుని అది మోగగానే ఆపేసి పడుకుంటారు. అది చాలా తప్పు పధ్ధతి. అయితే అలారం కొంచెం ఆలస్యంగా పెట్టుకోండి. లేదంటే అది మోగగానే లేవండి. అంతే కానీ అలారం మోగిన తరువాత దానిని ఆపేసి మళ్లీ పడుకోవడం వల్ల పిల్లలకు నిద్ర లేవడం అస్సలు అలవాటు కాదు.

ముందు ఒక టైం కి అలారం సెట్ చేసుకోండి. మోగిన వెంటనే లేవండి. మీకు ఇంకా బద్ధకం గా ఉంటె వెంటనే పని లోకి, పిల్లలు చదువు లోకి వెళ్ళకుండా ఒక పావుగంట అలా ఊరికే కూర్చుని బద్ధకం తీర్చుకోండి. ఇలా ఒక వారం చేయండి. తరువాతి వారం అలారం ఒక 20 నిముషాలు ముందుకి సెట్ చేసుకోండి. అప్పుడు కూడా అలాగే చేయండి. మళ్లీ తరువాతి వారం ఇంకో 20 నిముషాలు ముందుకి సెట్ చేయండి. ఇంక ఈవారం నుంచి బద్ధకం తీర్చుకోకుండా వెంటనే పనిలోకి వెళ్ళండి. ముందు చన్నీటితో ముఖం కడుక్కుంటే ఫ్రెష్ గా ఉంటుంది. కొన్నాళ్ళకు అలారం పెట్టుకోవడం మానేయండి. రాత్రి  పడుకునేటప్పుడు రేపు నేను ఇన్ని గంటలకి లేవాలి అని గట్టిగా అనుకోని పడుకోండి. ఉదయం కరెక్ట్ గా అదే టైం కి లేవగాలుగుతారు. ఇలా మీరు అనుకున్న సమయానికి లేచే వరకు ఈ పధ్ధతి పాటించండి. ఈ పధ్ధతి చాల బాగా పని చేస్తుంది.

Friday 18 July 2014

ఎవరైనా మనల్ని సలహా అడిగితె, ఓ, నన్నే అడిగారు కదా అని ఒకటికి రెండు లాభ నష్టాలు అలోచించి, నిజంగా మనం వాళ్ళకు శ్రేయోభిలాషులం ఏమో అని భ్రమించి ఒకటికి పది సలహాలు ఇచ్చెస్తాము. తీరా వాళ్ళు మన సలహాలు పాటించకపోతే మనను లెక్క చేయలేదని భావించి మనసు పాడుచేసుకొని, బుర్ర చెదగోట్టుకుని, పనులు మానుకుని, ఎంతో ఇదైపోతాం. కాని ఇలా సలహాలు ఇచ్చే వారు అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది ఏమిటంటే, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎవరికీ తోచినట్టు, ఎవరికీ వీలైనట్టు వాళ్ళు చేస్తారు. ఎవరి పరిస్థితుల బట్టి వారు వ్యవహరిస్తారు. అందుచేత ఎవరైనా సలహాలు అడిగినప్పుడు ఎక్కువ మతి చెడగోట్టుకోకుండా, నొప్పింపక, తానొవ్వక అన్నట్టు ఉంటె మంచిది. మరి అవతలి వాళ్ళు సలహాలు ఎందుకు అడుగుతారు అంటారా! అది కొందరికి కాలక్షేపం, కొందరికి మనం ఏమి చెప్తామో అనే కుతూహలం, మరికొందరికి మన అభిప్రాయం తెలుసుకోవాలనే జిజ్ఞాసా , వాళ్ళ సంకటం ఎవరితోనైనా షేర్ చేసుకుంటే కొంచెం భారం తగ్గుతుంది అనే ఆలోచన, తప్ప మరింకేమి కాదు. అందుకని ఎవరైనా సలహా అడిగినా ఎక్కువ బుర్ర పాడుచేసుకోకండి.

Wednesday 16 July 2014

యువత-స్నేహాలు.

ఈ రోజుల్లో అడ, మగ కలిసి చదువుకోవడం, ఆడ, మగ మధ్య స్నేహాలు సాధారణం అయిపోయాయి. ఇదివరకు రోజుల్లో ఆడ పిల్లలు, మగపిల్లలు కాలేజీ లలో కూడా మాట్లాడుకోవడానికి భయ పడేవారు. సంశయించేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ స్నేహంగా ఉంటున్నారు. కానీ ఆడపిల్లలకు వచ్చే ప్రమాదాలు ఇదివరకటి కన్నా ఎక్కువ అయాయి. ఒక్కోసారి నమ్మిన స్నేహితులే మోసం చేస్తున్నారు కూడా. ఇటువంటి పరిస్థితులలో స్నేహితులు, స్నేహం గురించి కొన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరం ఉంది.

**తల్లితండ్రులు పిల్లల స్నేహితుల మీద ఒక కన్ను వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపూ మొబైల్స్, చాటింగ్ , కంప్యూటర్ లో చాటింగ్ చేస్తూ ఉంటె మీరు కొంత అడ్డుకట్ట వేయాలి.

**కంప్యూటర్, laptop వాడేటప్పుడు ఎక్కడో మారుమూల గదిలో కాకుండా, అందరికీ కనబడేలా హాల్ లో కూర్చోమని చెప్పాలి.

**ఇంటికి పిల్లల స్నేహితులు వచ్చినపుడు అరా తీస్తున్నట్టు కాకుండా మీరు కూడా ఒక ఫ్రెండ్ లాగా వారితో కలిసిపోయి కొంత సమయం గడపాలి.

**ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా ఒక ప్రత్యేకమైన గదిలో కాకుండా, హాల్ లో కూర్చోపెట్టి మాట్లాడమని చెప్పాలి.

**మీ పిల్లల ముఖ్యమైన స్నేహితుల తల్లి/తండ్రులతో మీరు కూడా స్నేహం పెంచుకుంటే మంచిది.

**ఈరోజుల్లో పేస్ బుక్ స్నేహాలు కూడా ఎక్కువ అయిపోయాయి. ముక్కు మొహం తెలియని పేస్ బుక్ స్నేహితులను కలుసుకోవాలి అని మీ పిల్లలు అనుకున్నపుడు వారు తిట్టుకున్నా సరే, మీ పిల్లల క్షేమం కోసం, వారి వెంట మీరు తప్పనిసరిగా వెళ్ళండి.

**చాలా ఇళ్ళల్లో, పిల్లల స్నేహాల గురించి, దానివల్ల ఏదైనా చెడు పర్యవసానాలు వస్తే వాటి గురించి, సాధారణంగా తండ్రులకు తెలియకుండా దాస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. ఒక తల్లిగా నాకు ఈ విషయం తెలిసినపుడు, ఒక తండ్రిగా, ఇంటి యజమానిగా, మీ నాన్నకు కూడా ఈ విషయం తెలియాల్సిందే అని మీ పిల్లలకు ఖరాఖండి గా చెప్పండి.

**ఒకవేళ మీరు భర్తకు  తెలియకుండా ఒక విషయం దాస్తే, మీరు మీ పిల్లలకు మీ బలహీనత ఏమిటో చెప్పారన్న మాటే. మీ పిలక వారి చేతికి ఇచ్చారన్న మాటే.

**పిల్లల వల్ల తప్పు జరిగితే, ఇంట్లో అందరికీ తెలియాలి. దాని వల్ల, తండ్రి/తోబుట్టువుల దగ్గిర అవమానం అనే భావన వారిని తప్పు చేయకుండా ఆపుతుంది.

**అడ, మగ మధ్య స్నేహం తప్పు కాదు కానీ, ఎంత వరకు ఒక పరిధి లో ఉండాలి అనే విషయం మీ పిల్లలకు వివరంగా చెప్పండి.

**ఆడ, మగ మధ్య స్నేహం ఈ రోజుల్లో కల్చర్ అని మీరు అనుకుంటే మీరు చాల పొరబడ్డట్టే. కల్చర్ కి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటితే వచ్చే ఫలితాలు ఇద్దరూ సమానంగా అనుభవించాలి.

****పిల్లలూ, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీ తల్లి తండ్రులు ఎప్పుడూ మీ శత్రువులు కారు. మీ మంచి కోరేవారు మాత్రమే. మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎంత మంది ఉన్నా, తల్లితండ్రుల తర్వాతనే ఎవరైనా! మీ పేరెంట్స్ మిమ్మల్ని అనుమానిస్తున్నారు అనేది మీ అభియోగం కావచ్చు. ముందు మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మేలా చూసుకోండి. మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉండాలి. మీరు ఎవరితో బయటికి వెళ్ళాలన్నా, ఎవరితో స్నేహం చేస్తున్న, తగిన కారణం మీరు చూపించ గలగాలి. అడ/మగ స్నేహలలో మీ ప్రవర్తన పట్ల మీ పేరెంట్స్ కు సందేహం ఉండకూడదు. వారిని కలవాలి అంటే, వారి ఇంట్లోనో, మీ ఇంట్లోనో కలవండి. మీ ప్రవర్తన పారదర్శకంగా ఉంటె, మీ తల్లితండ్రులు మిమ్మల్ని అనుమానించరు కదా!

****ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పి వెళ్ళండి. అదేమీ అవమానం కాదు. మీరు అనుమతి తీసుకునేది మీ తల్లి తండ్రుల దగ్గరే అనే విషయం గుర్తు పెట్టుకోండి.

****లేట్ నైట్ పార్టీలు avoid  చేయండి.

****మీ ముఖ్యమైన స్నేహితుల ఫోన్ నంబర్లు ఇంట్లో వ్రాసి పెట్టి వెళ్ళండి.

****ఈనాటి పిల్లల ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే, మా అమ్మ/నాన్న మాటిమాటికీ ఫోన్ చేస్తారు. అందువల్ల మా ఫ్రెండ్స్ నన్ను వెక్కిరిస్తున్నారు అని. ఇందులో నామోషి పడవలసినది ఏమి లేదు. మీ ఫ్రెండ్స్ ఒకవేళ మిమ్మల్ని వెక్కిరిస్తే, మా అమ్మ/నాన్న లకు నాపై చాల ప్రేమ, చాల కేరింగ్ గా ఉంటారు వాళ్ళు అని సమర్ధించండి.

****ఒకవేళ ఆడ/మగ స్నేహితులు పార్టీలకు పిలిస్తే, వారిని ఇంటికి తీసుకువచ్చి మీ తల్లిదండ్రులకు పరిచయం చేయండి. వారికీ ఉన్న అనుభవం తో వారి ప్రవర్తన చూడగానే, వారు ఎటువంటి వారు అని చెప్పే నైపుణ్యం ఇంట్లో పెద్దలకు ఉంటుంది. మీ స్నేహాలను ఇంట్లో  దాచే ప్రయత్నం చేయవద్దు.

****ఒకవేళ మీరు వెళ్ళిన పార్టీలో మీ స్నేహితులతో పాటు ఇంకా అపరిచితులు ఉంటె, వారి వివరాలు మీకు సంతృప్తి కలిగిస్తేనే, ఆ పార్టీ లో కంటిన్యూ అవ్వండి. వారు అనుమానితులు గా అనిపిస్తే, ఏమి పర్వాలేదు, పార్టీ నుంచి వెనక్కి వచ్చేయండి.

****తల్లి తండ్రులు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా తమ పిల్లలు వృద్ధిలోకి రావాలనే. వారు కష్టపడేది మీ కోసమే. అటువంటి వారిని, చిన్న తనం నుంచి మిమ్మల్ని కళ్ళల్లో వత్తులు వేసుకొని, మీ ఆలనా పాలనా చూసిన వారిని మధ్యలో వచ్చిన స్నేహితుల కోసం మోసం చేయకండి. మీ భవిష్యత్ బాగుండాలి అంటే మీ ఆడ/మగ స్నేహితులతో కూడా మీరు నిజాయితీ గా , పారదర్శకంగా ఉండండి. స్నేహం పట్ల నిబద్దతో తో ఉండండి. అప్పుడు ఎవరికీ ఏ సమస్యలూ రావు.
అబ్బా, ప్రపంచం లో మనుషులందరూ జీవితాన్ని జీవించడం మర్చిపోయి, ఎంత అద్భుతంగా నటించేస్తున్నారో? మాట నటన, మనసు నటన, నడక నటన, నడత నటన, స్వచ్చత లేని మనసు, స్పష్టత లేని మాట. బంధాలు-అనుబంధాలు ఏవి లేవు. రక్త సంబంధాలు మొదలే లేవు. అన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. భగవంతుడు ఇచ్చిన సమస్యలకు తోడు, మనం తెచ్చిపెట్టుకునే సమస్యలు కొన్ని, ఈ సమస్యల వలయంలో నటన కూడా అవసరమా? ఖర్మ కాలి ఈ క్షణం ప్రాణం పోతే, మరుక్షణం మనం ఏమి చేయాలన్నా చేయలేమే! తదుపరి ఘడియలో ఏమి జరుగుతుందో మనం చెప్పలేము. మరి బ్రతికిన నాలుగు రోజులు, తృప్తిగా నొప్పింపక, తానొవ్వక అన్నట్టు బ్రతకకుండా ఈ నటనలు ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి? నిజానికి మన మనసు పారదర్శకంగా ఉండకపోతే, మనకే మనశ్శాంతి ఉండదు కదా? మరి ఎందుకు తెచ్చిపెట్టుకున్న ముఖాలు, తెచ్చిపెట్టుకున్న నవ్వులు? బ్రతికినన్నాళ్లు పారదర్శకం గా బ్రతకలేమా?
పిల్లలు సాధారణంగా పెద్దలను అనుకరిస్తూనే పెరుగుతారు. ఇంట్లో పెద్దలు ఏమి చేస్తున్నారో, అది వాళ్ళు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. తాత మూకుడు తరతరాల అనే సామెత లో లాగా, మన ఏ పని చేసినా, అది వారి మనసు మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అందుకే అంటారు...భార్యా భర్తలుగా తప్పు చేయవచ్చు కానీ, తల్లి తండ్రులు అయ్యాక మాత్రం మన ప్రవర్తన ను మనం ఎప్పుడూ పరీక్షించు కుంటూ ఉండాలి. మన, మాటలు, చేతలు, ప్రవర్తన చూసే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు మంచి మాటతీరు నేర్పాలి అంటే ఈ క్రింది విషయాలు తల్లితండ్రులు గుర్తుపెట్టుకోవాలి.
1. మాట్లాడేటప్పుడు స్వరం అదుపులో ఉండాలి. గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడకూడదు.
2. మనం చెప్పే విషయం పట్ల మనకు పూర్తీ అవగాహనా ఉండాలి. మనం మాట్లాడే విషయం మీద పిల్లలు ప్రశ్నలు వేస్తె, జవాబు చెప్పగలిగే పరిజ్ఞానం మనకు ఉండాలి.
3. ఇతరులు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మనం మాట్లాడడం మొదలు పెట్టాలి.
4. కొంత మంది తమ వాదన సరి అయినది అని నిరూపించు కోవడానికి ఒకళ్ళు మాట్లాడు తుండగానే పెద్దగా స్వరం పెంచి మాట్లాడుతుంటారు. అది సరిఅయిన పధ్ధతి కాదు.
5. పదాల ఉచ్చారణ బాగుండాలి.
6. మాటిమాటికి ఊతపదాలు ఉపయోగించ కూడదు.
7. ప్రతి మాటకి తిట్టు, అశ్లీలమైన పదాలు ఉపయోగించ కూడదు.
8. ప్రక్కనున్న వాళ్ళను చరుస్తూ మాట్లాడడం, అనవసరమైన హావభావాలు పనికిరావు.
9. సమయం, సందర్భం గుర్తుంచుకోవాలి, గుడి, ఆసుపత్రి, వంటి చోట పెద్దగా స్వరం పెంచి మాట్లాడకూడదు.
10. మరీ నింపాదిగా, సాగదీస్తున్నట్టు, అలా అని, మరీ వేగంగా మాట్లాడకూడదు.
11. ఇద్దరు మాట్లాడుతున్నపుడు మధ్యలో కల్పించుకొని మాట్లాడకూడదు.
12. పనివారితో పిల్లల ఎదురుగా గద్దిస్తున్నట్లు మాట్లాడకూడదు. పనివారిని చిన్న చూపు చూడకూడదు.
13. పెద్దలతో, ఉపాధ్యాయులతో నమ్రతగా మాట్లాడాలి.
14.మన తప్పును సమర్ధించు కొనేందుకు గట్టిగా అరిచి ఒప్పించాలని ప్రయత్నించ కూడదు.
15. పిల్లల ఎదురుగా ఇతరులకు, ఇరుగు పొరుగు వారికీ నిక్ నేమ్స్ తో వ్యవహరించా వద్దు. చాల మంది చేసే పెద్ద పొరపాటు ఇది.
16. ఇతరుల వస్త్ర ధారణా, వ్యక్తిగత విషయాల గురించి పిల్లల ఎదురుగా చర్చ జరపకండి.
17. ఒకరి మాటలు ఒకరికి చెప్పడం, ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పడం, పిల్లలకు అలవాటు చెయ్యవద్దు. ఒకవేళ పెద్దలకు ఉంటె మీ పిల్లల సంక్షేమం కోసం ఆ అలవాటు మానుకోండి.
18. ఫోనులో మాట్లాడేటప్పుడు, సౌమ్యంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి.
19. మన గౌరవం, ఎదుటివారి గౌరవం దృష్టి లో పెట్టుకొని మాట్లాడడం పిల్లలకు చిన్నతనం నుంచీ నేర్పాలి.
20. ఒకవేళ మీ పిల్లల మాట తీరు లో ఏదైనా తేడా గమనిస్తే, వారికీ మెల్లగా అర్ధం అయ్యేలా చెప్పండి. వారి తప్పు ముందు చెప్పి, దానిని సరిచేసుకొనే పధ్ధతి కూడా చెప్పండి. ఊరికే వారి మిద అరవటం వల్ల వాళ్ళు విసిగిపోయి, కొన్నాళ్ళకు మన అరుపులకు భయ పడడం మానేస్తారు.
ఎవరినైనా ఒదార్చ వలసి వచ్చినపుడు....
ఎపుడైనా మనకు ఆత్మీయులైన వారు కష్టాల పాలైతే ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడతాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే confusion లో ఉంటాము. ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఓదార్చడం కొంత సులువు అవుతుంది.
1. బాధలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా ఆనందపరచాలి అని ప్రయత్నించకండి.
2. జరిగిన నష్టం చిన్నది అని, మర్చిపోండి అని తేలికగా మాట్లాడకూడదు.
3. బాధలో ఉన్న వారిని అకస్మాత్తుగా వేరే విషయాల మీదకు మళ్ళించాలి అని ప్రయత్నించకండి.
4. మనసు మార్చుకోవడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది.
5. బాధలో ఉన్న వారి మనసు మళ్ళించడానికి వ్యర్ధ ప్రసంగం, అసందర్భంగా మాట్లాడడం చేయకూడదు.
6. ఎవరైనా ఆత్మీయులు మరణించినపుడు ఒదార్చవలసి వస్తే, మరణించిన వ్యక్తీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి. కోలోపోయిన వ్యక్తీ గురించిన మంచి విషయాలు వినడం వారి సంబంధీకులకు ఆనందంగా ఉంటుంది.
7. మీరు వోదార్చేటప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుంటే, వారిని స్వేచ్చగా ఏడవనివ్వండి. వేదన కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తే, మనసు తేలికపడుతుంది.
8. పలకరించడానికి వెళ్ళినపుడు మీకు కూడా కన్నీళ్లు వస్తే రానివ్వండి. దానివల్ల అవతలి వారు మరింత దుఃఖ పడతారు అని సంశయించ వద్దు. వారి బాధలకు మీరు తోడూ ఉన్నారు అన్న ఫీలింగ్ వారిని తేలిక పడేలా చేస్తుంది.
8. బాధకు లోనైన వ్యక్తిని కూడా మాట్లాడనివ్వాలి. వారు ఏమి చెప్పినా ఓపికగా వినాలి. వారు ఒకటే మాట పది సార్లు చెప్పినా వినాలి.
9. ఓదార్చే సమయం లో వారితో కానీ, ఇతరులతో కానీ, అనవసర చర్చలు, అనవసర సంభాషణలు చేయకూడదు.
10. బాధ పడుతున్న వ్యక్తీ ఏమి చెప్పినా, అది మీకు అబద్ధం అనిపించినా, ఆ సమయం లో ఖండించకూడదు.
11. కష్టం వచ్చినపుడు అందరూ ఒక్కసారి కలుస్తారు. తరువాత ఎవరికీ వారె అన్నట్టు ఉంటారు. అలా కాకుండా, తరచూ కలుసుకో గలిగినంత దగ్గరలో ఉన్నట్టయితే, అవకాశం ఉన్నట్టయితే, తరువాత కొంత కాలం వరకూ తరచూ కలుస్తూ ఉండాలి.
12. బాధలో ఉన్న వ్యక్తీ భోజనం మానేయడం, బయటికి రావడం మానేయడం వంటివి చేస్తున్నపుడు వారిని ఒప్పించి నలుగురిలో తిరిగేల చేయాలి.
13. ఆత్మీయులను పోగొట్టుకున్నపుడు, అత్యంత వేదన అనుభవిస్తున్నపుడు, వారు ఆ బాధ నుంచి బయటకు రావడం ఒక్కోసారి చాల కష్టం అవుతుంది. అటువంటప్పుడు వారికీ ఉన్న హాబీలు ఇతరత్రా వాటి ద్వారా ఆ వేదన మర్చిపోయేట్లు చేయాలి.
14. ఇదేమంత పెద్ద విషయం? అందరికి ఉండేదే కదా! లోక సహజం కదా! అన్నట్లు మాట్లాడకూడదు. ఎవరి కష్టం వారికీ పెద్దగానే ఉంటుంది.
15. వారి బాధను పోగొట్టడానికి అన్నట్టు, వారికీ ఇష్టమైన విషయం మాట్లాడాలి. అలా అని, క్రికెట్ గురించో, సినిమాల గురించో మాట్లాడడం చాలా అసందర్భంగా ఉంటుంది.
16. వారి దారిలోనే వెళ్లి వారి మనసు మళ్ళించాలి తప్ప, మన దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం హాస్యాస్పదం.
17. వారు పోగొట్టుకున్న వ్యక్తీ గురించి వివరాలు తెలుసుకోవాలని వినాలని అనుకుంటారు. అలా అని కోలోపోయిన వ్యక్తీ గురించి నెగటివ్ గా అసలు మాట్లాడకూడదు.
18. మౌనప్రేక్షకుల లాగా ఉండటం కంటే, ఏదో ఒకటి సవ్యంగా మాట్లాడడం మేలు.
19. చివరిగా, మన ఓదార్పు వారికీ శక్తి నిచ్చేదిగా ఉండాలి. వారిలో స్థైర్యం పెంచాలి. ఇలా చేస్తే, వారు జీవితాంతం మనతో బంధం కోరుకుంటారు.
భారత దేశం లో ఆయుర్వేద వైద్య విధానం అనాదిగా పాటింపబడుతోంది. దీని ప్రాశస్త్యం గుర్తించి దీనిని పంచమ వేదం గా పరిగణించారు మన పూర్వులు. మన చుట్టూ ప్రక్రుతి ప్రసాదించిన మూలికలు, వేర్లు, వివిధ వృక్షాలకు , తీగలకు సంబంధించిన భాగాములతోనే పూర్తీ రసాయన రహితంగా తయారయ్యే ఈ ఆయుర్వేద ఔషధాలు ఒక వ్యాధి యొక్క మూలాన్ని గుర్తించి, ఆ వ్యాధిని సమూలంగా నాశనం చేసే విధంగా తోడ్పడతాయి. ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాలు మన మునులు, ఋషులు, ఎన్నో పరిశోధనలు చేసి, మానవాళికి వరంగా అందించ బడ్డాయి. వీటిలో మానవుని నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు నివారిణి గా ఉపయోగపడే ఒక అపురూపమైన ఔషధం "త్రిఫల చూర్ణము".
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ల మిశ్రమమే త్రిఫల చూర్ణం. విడివిడిగా ఈ ఫలాలలో ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, ఈ మూడు కలిసినపుడు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి. వీటిని సమానమైన భాగాలలో తీసుకుని, గింజలు వేరు చేసి, పైన ఉండే బెరడును ఎండబెట్టి, దంచి మెత్తగా పొడి చేసి ఒక సీసా లో నిల్వ చేసుకొని రోజూ వాడుకోవచ్చు. పలుచని మజ్జిగలో, గోరువెచ్చని నీటితో, లేదా తేనెతో కలిపి వాడుకోవచ్చు. ఈ చూర్ణం కొద్దిగా వగరు రుచి కలిగి ఉంటుంది. కాబట్టి, మజ్జిగలో కొంచెంగా ఉప్పు వేసుకొని ఒక చెంచా పొడిని కలుపుకొని తాగితే మంచిది. సాధారణంగా దీనిని రాత్రిపూట భోజనం అయినాక పడుకునే ముందు తీసుకుంటారు.
ఉపయోగాలు.
1.జీర్ణ శక్తిని పెంచుతుంది.
2. అన్నవాహిక ను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా గ్యాస్, త్రేనుపులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
3. జీర్ణ కోశాన్ని పరిపుష్టంగా ఉంచుతుంది.
4. రక్తాన్ని శుద్ది చేస్తుంది.
5. జుట్టు రాలకుండా ఆపుతుంది.
6. జుట్టు తొందరగా తెల్లబడకుండా నివారిస్తుంది.
7. జుట్టు కుదుల్లను బలంగా చేస్తుంది.
8. శరీరం లోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.
9. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుతమైన ఔషధం.
10. రక్తపోటు ను నియంత్రించడంలో దోహదపడుతుంది.
11. కాలేయం, స్ప్లీన్ ల పనితీరు ను మెరుగు పరుస్తుంది.
12. కంటిలో శుక్లాలు, గ్లకోమ రాకుండా అడ్డుకుంటుంది .
13. ప్రేగులను శుభ్రం చేస్తుంది.
14. దీనిని క్రమం తప్పకుండా వాడితే చర్మం వయసుతో పాటు ముడుతలు పడకుండా నివారిస్తుంది.
త్రిఫల చుర్ణమును 1-2 చెంచాలు రాత్రి పూట అరగ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, రాత్రంతా అలాగే కదపకుండా ఉంచి, మరునాడు ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే, కంటి బాధలు తొలగిపోతాయి.
ఇంతటి అద్భుతమైన ఔషధం ప్రతి వారి ఇంటిలోనూ ఉండవలసినది. వయసు నిమిత్తం లేకుండా అందరూ వాడవచ్చు. గర్భిని స్త్రీలు మాత్రం వాడకూడదు. వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.* అన్ని రకాల రుగ్మతలకు పనిచేసే ఔషధం ఈ త్రిఫల
గత ఆదివారం సాక్షి దినపత్రిక అనుబంధం పుస్తకం లో ఒక కధ చదివాను. చాల మంది మిత్రులు చదివే ఉంటారు. ఆ కధ సారాంశం క్లుప్తంగా....పేదరికంతో రోజు గడవక, పిల్లల చదువు మాట అలా ఉంచి, అన్నం కూడా పెట్టలేని పరిస్థితులలో, వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఒక తల్లి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి కూలి పని కోసం సౌది వెళ్తుంది. అక్కడ చాకిరీ చేయగా వచ్చిన జీతంలో తను కొద్దిగా ఖర్చు పెట్టుకొని, మిగతా అంతా భర్తకు పంపుతుంది, అప్పులు తీర్చడం కోసం, ఉన్న పొలం సాగు చేయడం కోసం, పిల్లల ప్రస్తుత చదువుల కోసం, వారి భవిష్యత్ కోసం దాచమని భర్తకు చెప్తుంది. తీరా కొన్నేళ్ళు కష్టపడిన తర్వాత, అక్కడి రూల్స్ మారటం వల్ల ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇండియా కి వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అపుడు టికెట్ కొనుకోవడానికి కూడా డబ్బు లేక, భర్తకు డబ్బు పంపమని ఉత్తరం రాస్తుంది. దానికి భర్త ఏమి చెప్తాడు అంటే====నువ్ పంపిన డబ్బు నేను ఏదో కొద్దిగానే అప్పులు తీర్చాను. పొలం సాగులో లేదు. పిల్లల భవిష్యత్ గురించి కూడా ఏమి దాచలేదు, అంత డబ్బు ఒక్కసారిగా చూసేసరికి నాకు జల్సాలు ఎక్కువ అయినాయి, వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఫలితంగా రోగాల బారిన పడ్డాను, నీకు పంపడానికి నా దగ్గర ఏమి లేదు అని....
ఈ కధ నేను ఇక్కడ వ్రాయటానికి సందర్భం ఏమిటంటే, ఇది వట్టి కధ కాదు. నిజ జీవితం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. భార్య సంపాదించడానికి వెళ్తే, భర్తలకు లేనిపోని వ్యసనాలు అంటుకుంటున్నాయి. ఒక ఇంటిలో మగవాడు సంపాదించడానికి విదేశాలకు వెళ్తే, ఆ ఇంటిలోని పిల్లలకు చెడు అలవాట్లు అవుతున్నాయి. అక్కడ సంపాదించే వాడికి కష్టం తెలుస్తుంది కాని, ఆ డబ్బు అనుభవించే వాడికి కష్టం తెలియదు. ఇక్కడ పిల్లలు మాత్రం (అందరు కాదు, చాల మంది) బైకులు, పార్టీలు, ఖరీదైన ఫోనులు, ఇలా బాధ్యత తెలియకుండా జల్సా చేస్తున్నారు. కొంత మంది ఆడవాళ్లు కూడా మితి లేకుండా , బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నారు.
ఊరికే వచ్చే డబ్బు, కష్టం తెలియనీయని డబ్బు ఎప్పుడూ అనర్ధాలకే దారి తీస్తుంది. మీ జీవిత భాగస్వాములు విదేశాలకు వెళ్లి సంపాదిస్తున్నారు అంటే, ఇక్కడ వచ్చేది చాలదు, ఇక్కడి కన్నా మీకు మెరుగైన , సౌకర్య వంతమైన జీవితం ఇవ్వాలి అనేది వాళ్ల ఉద్దేశ్యం. రుచికరమైన భోజనం లేక, తినీ తినక, సరియైన వాతావరణ పరిస్థితులు లేక, అయిన వాళ్ళు దగ్గర లేక, కేవలం డబ్బు కోసం దూరాన ఉండి, వారు జీవిస్తున్నారు. పేస్ బుక్ లు, చాటింగ్ లు, స్కైపులు, మనసులను దగ్గర చేయలేవు. మనసులోని ఒంటరితనాన్ని దూరం చేయలేవు. వారి కష్టాన్ని గమనించుకోండి.
వారు పంపే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి.
చివరగా ఒక విషయం. "డబ్బును మన గుప్పెట్లో పెట్టుకున్నంత వరకే అది మన మాట వింటుంది. మన గుప్పిట దాటిందో, మనలను ఆడిస్తుంది.".
కధ వ్రాసిన రచయిత కు ధన్యవాదములు. శతకోటి నమస్సులు.
ప్రతి గర్భిణి స్త్రీ కి ఒక మొబైల్ ఫోన్ ఉచితం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యోచన.

గర్భిణి స్త్రీలకూ ఉచితంగా ఒక మొబైల్ ఫోన్ అందజేసి, సంక్షిప్త సందేశాల ద్వారా, ఆమె తీసుకోవలసిన టీకాలు, బలవర్ధక మైన ఆహారం వంటి వివరాలు అందజేయాలి , తద్వారా దక్షిణ భారతం లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా నమోదు అయిన రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో గర్భిణి స్త్రీల ఆరోగ్యం విషయం మిద శ్రద్ధ పెట్టి, మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి అని ప్రభుత్వ యోచన. ఇది ఈనాడు దినపత్రిక లో నిన్న అనగా 16 జూలై నాడు ప్రచురింపబడిన వార్త.

1.ఈరోజున గ్రామీణ ప్రాంతాలలో కూడా 90 శాతం ప్రజలు మొబైల్స్ వాడుతున్నారు. స్త్రీలకూ కూడా మొబైల్స్ ఉంటున్నాయి.
2. గర్భిణి లకు సూచనలు , సలహాలు అందజేయాలి అంటే, ఇంట్లో ఎవరో ఒకరికి మొబైల్ ఉంటె చాలదా? ప్రత్యేకించి ఆ స్త్రీకి ఉండాలా?
3.ఒక మాదిరి ఆర్ధిక పరిస్థితి, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారికి వైద్యులు ఇచ్చే సూచనలు సరిపోతాయి, ప్రత్యేకించి వారికీ మొబైల్ కొత్తగా ఈ విషయమై ఇవ్వవలసిన పనిలేదు.
4. అంతగా చదువు లేకుండా, మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న స్త్రీలకూ మొబైల్ ఇచ్చినా కూడా అది వారి దగ్గర నిలుస్తుంది అని నమ్మకం లేదు. అది ఇతర అవసరాలకు పనికి రావచ్చు. (పేదల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన రేషన్ కార్డులు 90 శాతం తాకట్టు లోనే ఉంటాయి ఎప్పుడూ).
5. బాగా విద్యాధికుల దగ్గరే కొండొకచో, మొబైల్స్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఇంకా నిరక్షరాస్యులైన వారికీ ప్రత్యెక మొబైల్స్ అవసరమా?
6.  నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటె, ఈ పధకం కింద ఖర్చు పెట్టె కోట్ల రూపాయలను, గర్భిణి స్త్రీల పోషకాహారానికి నేరుగా ఖర్చు పెట్టవచ్చు.
7. ప్రతి గ్రామం లో ఉన్న గ్రామా సేవికలు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా, గర్భిణి స్త్రీల పేర్లు, నమోదు చేసి, ప్రతి వారం , లేదా ప్రతి రోజు వారికీ పోషకాహారం నేరుగా అందివ్వవచ్చు. ప్రతినెలా వారి యొక్క ఆరోగ్యం పరీక్షించడానికి పరీక్షలు చేసి, టీకాలు ఉచితంగా ఇవ్వవచ్చు.
8. మన రాష్ట్రం లో ఎన్నో చోట్ల, ఎన్నో కుటుంబాలు స్వచ్చందంగా వేసవి కాలంలో అంబలి సెంటర్లు తెరిచి బీదలకు అంబలి పంచి పెడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం తలచుకుంటే ప్రతి గ్రామం లోను, ప్రజా వైద్య శాలల్లో గాని, అంగన్వాడి సెంటర్లలో కాని, ప్రతి రోజు గర్భినులకు ఆహారం అందజేసే కార్యక్రమం చేపట్టవచ్చు.
9. దీనికి కావలసినది అధికారులలో, చిత్తశుద్ది. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. వారి వారి కర్తవ్యమ్ పట్ల నిబద్ధత.
10, అసలు చెప్పుకోవాలంటే, మారుమూల గ్రామాలనుంచి గర్భినులకు ప్రసవ సమయం లో ఆసుపత్రికి చేరటానికి సరిఅయిన రహదారులు లేవు. ఏజెన్సీ ప్రాంతాలలో అయితే, వారి పరిస్థితి మరీ దుర్భరం. అక్కడ గర్భిణి స్త్రీ ప్రాణాలకు ఏ విధమైన గారంటీ లేదు.
11. ముందు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ వైద్య శాలల్లో సౌకర్యాలు మెరుగు పరచండి. వైద్యులు అక్కడే ఉండి, ఏ సమయం లో నైనా వైద్యం అందించే పరిస్థితి కల్పించండి.
12. ఉచిత మందులు, ఉచిత టీకాలు ప్రజలకు అందే ఏర్పాట్లు చేయండి.
13. ఇవి అన్నీ లేనపుడు మీరు మొబైల్స్ ఉచితం గా ఇవ్వడం ఎంతవరకు సబబు?
14. మొబైల్స్ ఉచితంగా ఇస్తే పై సమస్యలు అన్నీ తీరిపోతాయ?
15.మాతా శిశు మరణాలు రేటు తగ్గడానికి ముందు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను educate  చేయండి. వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం వీటి పట్ల అవగాహనా కల్పించండి.
16. పల్స్ పోలియో కార్యక్రమం లాగా ఈ అవగాహనా కార్యక్రమం కూడా ఏళ్ళ తరబడి నిరంతరాయంగా సాగేలా చుడండి.
17, ప్రజలు educate  అవనంత వరకు మీరు ఎన్ని మొబైల్స్ ఉచితంగా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
18. పైగా, మొబైల్స్ ఉచితంగా ఇవ్వడం వల్ల ఇంకా అనర్ధాలకు దారి తీసిన వారు అవుతారు. ఎందుకంటే టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి కాబట్టి. దాని విలువ తెలుసుకోలేని వారి దగ్గర అది ఎప్పుడూ దుర్వినియోగం అవుతుంది.

**************ఈ పోస్ట్ చుసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, లేక ప్రభుత్వం తో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులు ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సంతోషిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వరకు ఈ పోస్ట్ చేరవేయాలి అంటే దాని process  నాకు తెలియదు.