Sunday 24 May 2015

ఒక మంచి కథ.
అనగనగా ఒక ఊళ్ళో ఒక దుందుడుకు అబ్బాయి ఉండేవాడు. అందరితో పరుషంగా మాట్లాదేవాడు, దుడుకుగా ప్రవర్తించేవాడు. వాడిని మార్చడానికి వాళ్ళ నాన్న చేసిన ప్రయత్నాలు ఎన్నో విఫలం అయ్యాయి. ఒకసారి అతను ఒక సంచీడు మేకులు తెచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి, "బాబూ! నీ ప్రవర్తనతో ఇప్పటికే నేను విసిగిపోయి ఉన్నాను. ఈసారి నుంచి నీకు ఎవరిమీదనైనా కోపం వచ్చినపుడు, ఏదైనా అల్లరి పని చేసినపుడు ఈ సంచిలోని మేకులు ఒక్కొక్కటి ఈ కనబడే గోడకు కొట్టు." అని చెప్పాడు. ఆ అబ్బాయికి ఏమి అర్ధం కాకపోయినా, తండ్రికి సరే అని చెప్పి మేకులు తీసుకున్నాడు. మొదటిరోజున అతను 37 మేకులు గోడకు కొట్టాడు. కొన్ని వారాల తర్వాత అతను ఎంతో ప్రయత్నం చేసి, తన దుడుకు స్వభావాన్ని మార్చుకోగలిగాడు. అందువలన గోడకు కొట్టే మేకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. గోడకు మేకులు కొట్టేకన్నా, తన స్వభావం మార్చుకోవడమే తేలికగా ఉంది అని అతను అనుకున్నాడు. ఆఖరికి ఒక రోజు అతను పూర్తిగా సాధుస్వభావి అయ్యాడు. అదే విషయం అతను తన తండ్రికి తెలియచేశాడు. అప్పుడు తండ్రి ఆ అబ్బాయితో "ఇక ముందు నువ్వు నీ దుడుకు తనాన్ని, కోపాన్ని, అల్లరిని నిగ్రహించుకోగలిగి నపుడల్లా గోడనుంచి ఒక్కొ మేకును తీసేయి" అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లే చేస్తూ కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయి మేకులన్నిటినీ గోడనుంచి తీసేయగలిగాడు. ఆ విషయం తండ్రితో చెప్పాడు. అప్పుడు తండ్రి అతని చేయి పట్టుకుని, గోడ దగ్గరకు తీసుకువెళ్ళి, " చూసావా నయనా! నువ్వు మేకులు తీసివేసినప్పటికీ గోడలో ఆ మచ్చలు ఉండిపొయాయి. అలాగే, నువ్వు ఎవరినైనా మనసు నొప్పిస్తే తరువాత క్షమాపణ చెప్పినప్పటికీ, వారి మనసులో ఆ మచ్చ అలాగే మిగిలిపొతుంది ఈ గోడకు ఉన్న మచ్చ లాగానే.... నిన్ను ప్రేమించేవారి మనసుకు ఒక్కసారి గాయం అయినతరువాత, నువ్వు నీ తప్పును సరిదిద్దుకున్నప్పటికీ, వారి మనసులో గాయం అలాగే ఉండిపోతుంది. శరీరానికి తగిలిన గాయం కంటే, మనసుకు తగిలే గాయం లోతుగా ఉంటుంది." అని చెప్పాడు. ఆ అబ్బాయికి సత్యం తెలిసింది. కనువిప్పు కలిగింది.
మనంకూడా ఎన్నొసార్లు ఇలాగే ప్రవర్తించి ఉంటాము, మన స్నేహితుల పట్ల, మన శ్రేయోభిలాషుల పట్ల. స్నేహితులన్నవారు మనిషికి నిజంగా ఎంతో విలువైన సంపద. నిజమైన స్నేహితులు ఎప్పుడూ మనలను ప్రోత్సహిస్తారు, మనస్పూర్తిగా మన క్షేమాన్ని కాంక్షిస్తారు. మన కష్టాలలో తోడుంటారు. మన చుట్టూ మనలను ప్రేమించే స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ ఎవరి మనసునూ కష్టపెట్టకండి. ఎవరి బాధకూ మీరు కారణం కాకండి.
ఒకవేళ మీ హృదయంలో బాధకు నేను ఎప్పుడైనా కారణం అయితే, నన్ను క్షమించండి.
ఒక మంచి కథ;
ఒక యువకుడు తన తండ్రిని ఒక హోటల్ కు తీసుకువచ్చాడు. తండ్రి పెద్దవయసు వాడు అయినందువల్ల, బలహీనత వల్ల అతను ఆహారం తీసుకునెటప్పుడు కొంచెం కొంచెం అతని బట్టల పైన, నేల మీద పడిపోతోంది. ఆ హోటల్ లొ ఉన్న మిగిలిన వారు ఆ పెద్దాయనను కొంచెం చికాకుగా చూస్తున్నారు. కొడుకు మాత్రం మౌనంగా తింటున్నాడు.
తండ్రి తినడం అయిన తరువాత, కొడుకు ఆయనను మెల్లిగా వాష్ రూం కి తీసుకెళ్ళి, ఆయనను శుభ్రం చేసి, బట్టల మీద పడిన అన్నం, ఆహార పదార్థాలను దులిపి, శుభ్రం చేసి, జుట్టు దువ్వి, కళ్ళజోడు సరిచేసి, ఇవతలికి తీసుకువచ్చాడు. ఆ హాల్ లో ఉన్న అందరూ వారి వైపు విచిత్రంగా చూస్తున్నారు. కొడుకు బిల్ చెల్లించి, మౌనంగా తండ్రిని వెంటపెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ సమయం లో, ఆ హాల్ లో ఉన్న వారిలో ఒక పెద్దాయన ఆ కొడుకును పిలిచి "నువ్వు ఇక్కడ ఏమైన వదిలేశావా బాబూ.." అని అడిగాడు. "లేదండీ, నేను ఏమి వదల్లేదు " అని జవాబిచ్చాడు ఆ యువకుడు. అప్పుడు ఆ పెద్దాయన " లేదు బాబూ... నువ్వు వదిలావు, నీ ప్రవర్తనతో, ప్రతి కొడుకుకూ ఒక పాఠాన్ని, ప్రతి తండ్రికీ ఒక ఆశను, ధైర్యాన్ని వదిలి వెల్తున్నవు". అని చెప్పాడు ఆనందంతో.
హాల్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది.
ఇది అంతర్జాలంలో చాలా ప్రాచుర్యం లో ఉన్న కథ. ముసలివాళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని, ఈరోజుల్లొ పెద్దవాళ్ళను పిల్లలు ఎలా చూస్తున్నారు అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఈ కథ.
మనసా వాచా, కర్మణా నిత్యజీవితం లో చేసే పొరపాట్లు దోషాలుగా లెక్కించబడతాయి. అంటే, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు కర్మలు---ఇవి మనం నిత్యం చేసే పాపాలు గానే పరిగణింపబడతాయి. ప్రతిరోజూ మనం తెలిసో, తెలియకో, తప్పనిసరి అయితేనో, ఎన్నో జీవులను, క్రిమి కీటకాదులను, చంపుతూ ఉంటాము. ఎంతో స్థితప్రజ్ఞులం అయితే తప్ప, మన మనసులో వచ్చే, చెడు ఆలోచనలను నియంత్రించలేము. ఇక మనం నియంత్రించుకోగలిగేది ఒక్క మాట ఒక్కటే. మనం మనసా, కర్మణా చేసే పాపాలను అడ్డగించలేనపుడు, కనీసం వాక్కు ద్వారా జరిగే పొరపాట్లను పరిమితం చేసుకోవచ్చు కదా...కేవలం, జీవులను చంపడం మాత్రమె హింస కాదు. మన ప్రవర్తనతో, మాటలతొ వేరొకరిని బాధ పెట్టడం, పరుష వాక్యములు మాట్లాడడం కూడా హింస గానే లెక్క అవుతుంది. అందుచేత సాధ్యమైనంతవరకు పరుష వాక్యములు మాట్లాడకుండా అలవాటు చేసుకొందాము.
ఒక చిన్న కథ:
ఒక పెద్దాయన తన పొలంలో ఉన్న గడ్డిమేటు దగ్గర తన వాచీ ని పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా కనపడలేదు. తన కొడుకు మొదటి సంపాదనతో కొన్న వాచీ కాబట్టి ఆయనకు అదంటే చాలా చాలా ఇష్టం. వెతికి వెతికి వేసారిపొయాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లల గుంపును చూసి, తన వాచీ వెదికి తీసుకొస్తే ఒక బహుమతి ఇస్తా అని ఆశ పెట్టి వాచీ కోసం వెతికించాడు. ఎవ్వరికీ దొరకలేదు. ఒక పిల్లవాడు మాత్రం గడ్డివామి దగ్గరే కూర్చున్నాదు. కొంతసేపటి తరువాత వాచీతో తిరిగి వచ్చాడు. వాచీ ఎలా దొరికింది? ఏమి చేసావు? అని అడిగాడు పెద్దాయన. "నేనేమి చేయలేదు. నిశ్శబ్దంగా దృష్టి కేంద్రీకరించి చెవులు రిక్కించి విన్నాను. గడియారం యొక్క టిక్ టిక్ శబ్దం ఎటువైపునుంచి వస్తోందో గమనించి అక్కడ వెతికితే కనబడింది" అని బదులిచ్చాడు కుర్రాడు.
సమస్యలకు పరిష్కారం మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలోచిస్తేనె దొరుకుతుంది. బాగా అలసిపోయిన మెదడుతో సమస్యలను
పరిష్కరించలేము. అసలు సమస్య ఏమిటో, ఏ దిశగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుందో ఒక నిర్ధారణకు రావాలి అంటే, ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఆలోచించిన కొద్దీ, ఒక్కోసారి సమస్య ఇంకా జటిలం అయిపోతూ ఉంటుంది. నిదానంగా ఆలోచిస్తే, సమస్యను పరిష్కరించడానికి సరి అయిన తోవ దొరుకుతుంది.
ఒకరోజు ఒక రైతు కు చెందిన ఒక గాడిద నూతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా గాని, దానిని రైతు పైకి తీయలేకపోయాడు. ఆ గాడిద సహాయం కోసం ఎంతో అరిచింది. కాని రైతు వల్ల కాలేదు. గాడిద కూడా ముసలిది అయిపోయింది, బావి కూడా పాడుపడినదే కదా అని ఆలోచించి ఆ రైతు గ్రామస్థులందరినీ పిలిచి ఆ బావిని కప్పేద్దాం అని చెప్పాడు. అందరూ పక్కన ఉన్న మట్టిని తవ్వి బావిలో వేయసాగారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, బావిలో పడుతున్న మట్టిని ఆసరా చేసుకుని , తనపైన పడుతున్న మట్టిని ఒక్కసారి విదిలించి దులిపేసుకుని, ఆ గాడిద ఒక్కో అడుగు పైకి రావడం మొదలుపెట్టింది. ఆఖరికి చక్కగా బావినుంచి పైకి వచ్చేసింది.
ఈ కథ కూడా మన జీవితం లాంటిదే. జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఇరుగుపొరుగు వాళ్ళు మనమీద ఎప్పుడూ బురద తవ్వి పోస్తూ ఉండదానికే ప్రయత్నిస్తారు. ఆ బురద భరిస్తూ, కడుక్కుంటూ అక్కడే ఉండాలా, లేదా ఆ బురదను దులుపుకుని ఒక్కసారి తల విదిలించి పైకి రావాలా అనేది మన చేతిలోనే ఉంది. జీవితం లో ఎదురయ్యే ప్రతి వైఫల్యాన్ని మనం ఒక్కో మెట్టుగా వాడుకొని పైకి రావాలి. ఎదగాలి.వాళ్ళు వేసే బురదను మనం మౌనంగా కడుక్కుంటున్నంత కాలం మనమీద బురద వేస్తూనే ఉంటారు. మన మీద బురద చల్లిన వాళ్ళకు ఆ బురద వారి మీదే పడినట్టు మన ఎదుగుదల ద్వారా సమాధానం చెప్పాలి.
సంతోషంగా జీవించడానికి పంచ సూత్రాలు.
1. మీ హృదయంలో ద్వేషానికి చోటు ఇవ్వకండి---శతృవులను క్షమించండి ( ఇది మీ శతృవులకు చేసె ఉపకారం కాదు. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం మనము చేసుకునే సహాయం)
2. మనం చాలా సాధారణంగా ఆందోళన చెందే విషయాలు ఎప్పటికీ జరగవు. అయినా మనం భయపడుతూ ఉంటాము. అటువంటి ఆందోళనలు మనసుని, ఆరొగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అటువంటి ఆందోళనలను పూర్తిగా మనసు నుంచి తొలగించండి
3. ఏదో లేదు అని బాధపడకుండా, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించండి. జీవితంలో సంతౄప్తి వలన కలిగే లాభం అంతా ఇంతా కాదు.
4.ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం అలవాటు చేసుకోండి. సంపదనైనా, సమయాన్నైనా...
5.ఎదుటివారి నుంచి తక్కువ ఆశించండి. ఎందుకంటే, మనం ఆశించినంత ఎప్పుడూ ఎదుటివారి నుండి పొందలేము. అది ప్రేమైనా సరే.....
ఏదైన వస్తువు కొనుక్కునేటప్పుడు మనం మరింత ఆకర్షణీయమైనది, మరింత మెరుగైనదే కొనుక్కుంటాము. మరి ఒకేఒక్కసారి లభించే ఈ జీవితాన్ని మరింత మెరుగ్గా ఎందుకు జీవించకూడదు? మరింత ఆకర్షణీయంగా ఎందుకు మలచుకోకూడదు? ఆలోచించంది.
ప్రతీపుడనే రాజుకు పెద్దవయసు వచ్చినా పిల్లలు లేకపోయేసరికి వృద్ధాప్యంలో భార్యతో కలిసి తపస్సు చేసాడు. ఫలితంగా కొడుకు పుట్టాడు. అతనికి శాంతనవుడు అని పేరు పెట్టాదు. ప్రతీపుడు గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు గంగాదేవి మానుషరూపం లో వచ్చి, అతని కుడి తొడ మీద కూర్చుని నన్ను పెళ్ళి చేసుకో అని కోరింది.ఎడమతొడ భార్య స్థానం. కుడి తొడ పిల్లల స్థానం. అందుకని ప్రతీపుడు, నువ్వు నా కుమారుడిని పెళ్ళి చేసుకొవచ్చులే అని చెప్పి పంపేసాడు.

శాంతనుడు  క్రితం జన్మలో మహాభిషుడు అనే రాజు. బ్రహ్మ సభకు వెళ్ళి అక్కడ గంగను చూసి మోహిస్తాదు. బ్రహ్మ కోపించి, మానవ జన్మలో పుట్టి మళ్ళీ బ్రహ్మ లోకనికి వస్తావు అని శపించి, గంగను మోహించావు కనుక ఆమెయే నీ భార్య అవుతుంది. కాని నీకు అనుకూలంగా ఉండదు అని శపించాడు.

అష్ట వసువులలో ఆఖరివాడు అయిన ద్యుమంతుడు అనేవాడు భార్య మెప్పు కోసం, తన అన్నదమ్ములైన మిగిలిన ఏడుగురు వసువులనూ తోడు తీసుకుని, వశిష్ట మహర్షి ఆశ్రమంలోని హోమధేనువును దొంగ్లిస్తాడు. వారిని మనుషులుగా పుట్టమని శపిస్తాడు. మనుషులలో పుట్టడం శాపం ఎందుకు అవుతుంది అంటే, మానవ జన్మలో కర్మ బంధాల్లో చిక్కుకోవడమూ, మమకారాలు, బంధుత్వాలు అనే మాయలో చిక్కుకోవడమూ మానవ జన్మ లోనే జరుగుతుంది. శాపవిమోచనం అడిగిన వసువులతో వశిష్టుడు ఇలా చెప్తాడు. " మీ అందరూ ఒక్కొ సంవత్సరం ఒక్కొక్కళ్ళూ చొప్పున మోక్షాన్ని పొందుతారు. పాపకార్యంలో అసలు ముద్దాయి అయిన ద్యుమంతుడు మరిన్ని రోజులు భూలోకంలో ఉంటాడు. స్త్రీ కారనంగా పాపం చేసాడు కాబట్టి, అతనికి అప్పుడు స్త్రీ సౌఖ్యం, భార్య పిల్లలు ఉండరు అని చెప్తాడు.

దిగాలు పడిన వసువులు బ్రహ్మ సభనుంచి వస్తున్న గంగాదేవిని కలుసుకుని, ఇది మా కథ. ప్రతీపుని కొడుకు శాంతనవుని మేము తండ్రిగా చేసుకుంటాము, నువ్వు మాకు తల్లివై, మానవ లోకం నుంచి మేము బ్రహ్మ లోకానికి త్వరగా వచ్చేలా సహాయం చెయ్యాలి అని ప్రర్ధించారు.

ప్రతీపుడు శాంతనవుడికి రాజ్యం అప్పగించి అడవులకు వానప్రస్థం వెళ్ళిపోయాడు. శాంతనవుడు రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకు వెళ్ళి అలసిపోయి గంగానది ఒడ్డున సేదతీరుతున్నాడు. అక్కడికి గంగానది స్త్రీ రూపం లో వచ్చింది. ఇద్దరి మధ్యా మోహం కలిగింది. పెళ్ళికి గంగ ఒక షరతు పెట్టింది. నేను చేసే ఏ కార్యానికి నువ్వు అడ్డు చెప్పకూడదు అని. మోహంలో ఉన్న శాంతనవుడు అన్ని షరతులకూ ఒప్పుకున్నాడు.

ప్రతి యేడాదీ తనకు పుట్టిన కొడుకులను " నీకు మాట ఇచ్చినట్టుగానే నీకు శాపవిమోచనం చేస్తున్నాను" అని గంగ ప్రతి బిడ్డని నీళ్ళల్లొ వదిలిపెట్టేసేది. ఏడుగురిని అలా మోక్షం కలిగించిన తర్వాత ఇక ఆగలేక ఎనిమిదో బిడ్డను గంగ తీస్కెల్తుంటే అడ్డుకున్నాడు శాంతనవుడు.

నీకు, నాకు ఋణం తీరిపోయింది కనుకనే, నువ్వు నా పనులను అడ్డుకున్నావు. వీరందరూ వసువులు. వారిని శాపం నుంచి నేను విముక్టులను చేసాను. ఇంకా ఇతగాడి శాపం ఉండిపోయింది. నీతో ఉంచుకో అని ఆమె వెళ్ళిపోయింది. ఆ బాలుడే భీష్ముడు.

శాంతనవుడు మళ్ళి దాసరాజు కుమ్మర్తె సత్యవతిని మోహించినపుడు, తన పిల్లలు మాత్రమే రాజు కావాలి, రాజ్యం చేయాలి అని కోరింది. ప్రతిగా భీష్ముడు సంతానానికి కారణం అయిన వివాహాన్ని కూడా వద్దు అనుకున్నాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి, నిలుపుకున్నాడు కాబట్టే భీష్ముడు అయ్యాడు. ఇతని పిత్రుభక్తికి మెచ్చిన శాంతనవుడూ కొడుకుకు స్వచ్చంద మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.

నేను, నా అనే అహంకారాలను జయించాడు కాబట్టే, రాగద్వేషాలకు అతీతంగా ధర్మబధ్ధంగా వ్యవహరించి, చరిత్రలో చిరస్థాయిగా  మిగిలిపోయాడు భీష్ముడు.

ఇదీ భీష్ముడి కథ.

Tuesday 12 May 2015

హనుమజ్జయంతి:

శ్రీరామభక్తుడైన హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడు జన్మించినట్లు పలుచోట్ల చెప్పబడింది. కాగా, "పరాశర సంహిత" వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుడు జన్మించినట్లుగా చెపుతోంది. అందుకే దేశం లో కొన్ని ప్రాంతాలలో వైశాఖ మాసం లోను, కొన్ని ప్రాంతాలలో చైత్ర మాసం లోను, హనుమాన్ జయంతి ని జరుపుతారు.

హనుమజ్జయంతి రోజున ఆంజనేయస్వామిని పూజించడం వలన, గ్రహ దోషాలు నివారించబడతాయి. ఇంకా, భూత, ప్రేత, పిశాచాల పీడలు తోల్గి, గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చేకూరుతుందని శాస్త్రాలు చెబ్తున్నాయి. హనుమజ్జన్యంతి రోజున సుందరకాండ, హనుమాన్ చాలిసా పారాయణ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

బుధ్ధిర్బలం, యశో ధైర్యం,
నిర్భయత్వ మరోగతా:
అజాడ్యం వాక్పటుత్వన్ చ,
హనుమత్స్మరణార్భవేత్...

హనుమంతుని తలచుకున్నంత మాత్రాన, బుధ్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం (భయం లేకుండా ఉండడం,) వాక్పటుత్వం కలిగి, గ్రహ పీడలు వంటివి తొలగిపోతాయి అని శాస్త్ర వచనం.

ఆంజనేయ ప్రార్ధన.

గోష్పదీకృత వారాశిం, మశకీకృత రాక్షసం,
రామాయణ మహామాలా, రత్నం వందే అనిలాత్మజం.


యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం..

మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్టం.
వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామ దూతం శిరసా నమామి.

అంజనానందనం వీరం, జానకీ శోక నాశనం,
కపీశం అక్షహంతారం, వందే లంకా భయంకరం..

ఉల్లంఘ్య: సింధో: సలిలం, సలీలం,
యశ్శోకవహ్నిం జనకాత్మజాయా:
ఆదాయతైనైవ దదాహలంకాం,
నమామి తం ప్రాంజలి రాంజనేయం...



ఆంజనేయ స్వామికి తమలపాకుల తో అర్చన చేసి, సిందూరం అర్పించడం ఆనవాయితీ. స్వామిని అరటితోటలో పూజించడం మహా శ్రేష్టం. రామ నామ జపం జరిగే చోట హనుమంతుడు తప్పక ఉంటాడని నమ్ముతారు.

ఎల్లరకూ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.




Sunday 3 May 2015

మాఘమాస ప్రాశస్త్యం:

ఈ మాసం స్నానానికి ప్రసిధ్ధి. మాఘస్నానం ఇహపర శుభద్దయకం. సూర్యోదయం కాబోతున్న సమయంలో మాఘమాసంలో స్నానం చేస్తే మహాపాతకాలు పోతాయి. అన్ని వర్ణాల వారూ, నాలుగు ఆశ్రామాలా వారు అందరూ ఈ స్ననం చేయవచ్చు..

ఈ మాసంలో సూర్యుడు మకరంలో ఉండే సమయంలో సూర్యోదయానికి మునుపు, వేడినీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్య స్నాన ఫాలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ శతగుణం, మహానదే సంగమ స్నానం దానికి చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగా యమునా సంగమ (త్రివేణీ సంగమ ) స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయి. మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి చేయాలి. ఆరోగ్యం అనుకూలించనప్పుడు పాడ్యమొ, విదియ, తదియ,త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.

మాఘమాస ఆదివారాలలో నియమబధ్ధంగా సూర్యునకు క్షీరాన్నం వండి నివేదించితే రోగ, దారిద్ర్యాలు పోతాయి. ఆ రోజున తరిగిన కూరలు తినకూడదు. తైలాన్ని రాసుకోవడం, మాంసం, ఉల్లి, వెల్లిల్లి తినడం పనికిరాదు.

ఒక రోజులో సంధ్య ఎటువంటిదో, ఒక సంవత్సరంలో మాఘమాసం అటువంటిది. ఇది సంవత్సరానికి సంధ్య వంటిది. దైవశక్తులు జాగుర్తమయ్యే ధ్యానానికి అనువైన కాలం . యోగానికి ఉపాసనకి ఎంతో ఉపయోగకరం. అందుకే ఈ మాసంలో చవితి, సప్తమి, పూర్ణిమ, ఏకాదశి, మాసశివరాత్రి, అన్నీ మహాఫలాలను ఇస్తాయి.ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలలలో ఈ మాసానికి ప్రత్యేక స్ఠానం. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం ఇది. ఉత్తరాయణ పుణ్యకాలంలోని ఈ పవిత్ర మాసం లో సూర్యారాధన, విష్ణ్వర్చన, శివోపాసన వంటివి విశేష ఫలాల్ని ఇస్తాయి.

కార్తీకం దీపానికి ముఖ్యం, మాఘానికి స్నానం ముఖ్యం. సూర్యోదయానికి ముందు నదీస్నానం శ్రేష్టం. నది లభ్యం  కానప్పుడు తటాకం కానె, నూయి గాని, శ్రేష్టం. మాఘమాసం లో త్రివేణీ సంగమ స్నానం ఉన్నతమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రవచనం. స్నాన సమయంలో శివకేశవాది దేవతా స్మరణ, గంగ యమున సరస్వతి గోదావరి వంటి పుణ్య నదుల స్మరణ చేయాలి. ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే మంచిది.

మాఘ శుక్ల చవితి ఢుంఢి గణపతికి ప్రీతికరం. ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభంలో గణపతిని పూజించాలి. తిలలతో చేసిన లడ్డూలను నివేదించాలి. ఈ వ్రతం సంపదలను ప్రసాదిస్తుంది. ఈరోజు శివుని మల్లెపూవులతో పూజించితే ఐశ్వర్యం లభిస్తుంది.

మాఘ శుధ్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో ఈ "శ్రీపంచమి" గురించి విశేషంగా చెప్పారు. ఈ రోజు సరస్వతీ దేవిని ఆరాధించాలి. ప్రతిమలో కాని, పుస్తక రూపంలో గాని, పటం రూపంలో కాని సరస్వతీ ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. క్షీరాన్నం, పళ్ళు, కొబ్బరి, ఇతర పిండివంటలను నివేదించాలి. తెల్లని పూవులతో పాటు ఇతర కుసుమాలను అర్చనకు ఉపయోగించాలి. ఈరోజున శారదాంబను ఆరాధిస్తే, విద్యాబుధ్ధులు లభిస్తాయి. మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. దేవతలు సైతం ఈ రోజున సరస్వతీ దేవిని ఆరాధిస్తారుట. జ్ఞానవిజ్ఞానాలు, లౌకికమైన చదువులే కాక, పరమమైన బ్రహ్మవిద్య కూడా ఈ జగజ్జనని కృప చేతనే లభ్యం అవుతాయి.

మాఘ శుధ్ధ సప్తమి నాడు సూర్యుని ఆరాధించడం గురించి భవిష్య పురాణమున విశేషముగా వర్ణనలున్నాయి. షష్టి నాడు రాత్రి ఉపవసించి సప్తమి నాడు అరుణోదయమున స్నాన మాచరించిన ఏడు జన్మముల పపము తొలగునని రోగశోకములు నశించునని, జన్మజన్మల నుండి మనోవాక్కాయకృతమును, జ్ఞాతాజ్ఞాతమును అగు ఏడు విధములయిన పాపములు పోతాయని ధర్మగ్రంధల్లో ఉంది. స్ననము చేయునపుడు ఏడు జిల్లేడాకులు కాని, ఏడు రేగు ఆకులు కాని తలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ "ఆదిత్య హృదయం" వంటివి పారాయణం చేయడం మంచిది. ప్రతి ఆదివారమ ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం వండి సూర్యుని అర్చించాలి. ఈరోజు తరిగిన కూరలు తినరాదు.

మాఘ శుధ్ధ అష్టమి భీష్మాష్టమి అంటారు. ఈరోజు నువ్వులతో తర్పణాలు విడవాలి. ఇలా చేసిన వారి పాపాలు సత్వరమే హరితాయి.

మహాభారతానికి ఆదిపురుషుడు భీష్ముడు. ధర్మ శాస్త్రాలు తెలిసిన జ్ఞాని. త్యాగపురుషుడు, మహోదాత్తుడయిన వీరుడు. భీష్ముడు తనువు చాలించింది అష్టమి నాడే అయినా శ్రీకృష్ణుడు తనకెంతో ప్రీతిపాత్రమయిన ఏకాదశీ తిథిని భీష్ముని పెరిట ఏర్పాటు చేసి, భీష్మ ఏకాదశిని పర్వదినం చేశాడు. తాను ఎరిగిన విష్ణుమూర్తి కృపా విశేషాలన్నింటినీ ఏర్చి కూర్చి ఐహికాముష్మిక మహానందానుసంధాయకమైన ఈ విష్ణు సహస్రనామాలని భక్తకోటికి వరంగా ప్రసాదించాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు తనకు తానుగా భీష్ముడు అంతిమ శ్వాస విడిచే సమయానికి వచ్చి, తన సహస్రనామాలను స్వయంగా విని ఆనందించి భీష్మునికి మోక్షం కలిగించాదంతే, భీష్ముని గొప్పతనం ఎంతటిదో కదా!ఈ విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన వారందరికీ కామితార్ధములు ఈడేరి అంతమున విష్ణు సాయుజ్యం పొందగలరని సాక్షాత్తూ కృష్ణ భగవానుడే చెప్పాడు.

మాఘ శుధ్ధ ఏకాదశి నాడు ఏకాదశీ వ్రతం చేసి విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన వారు జీవన్ముక్తులు అవుతారని పురాణాలలో చెప్పబడింది.

ప్రతీనెలా బహుళ పక్షంలో 14వ రోజు మాసశివరాత్రి కాగా, మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. పద్మపురాణం, స్కాంద పురాణం, లింగపురాణం, గరుడపురాణం ఈ మహా శివరాత్రిని విశేషంగా వర్ణించాయి. ఈరోజు శివారాధన, శివసాన్నిధ్యంలో జాగారం ఎంతో విశేష ఫలితాలను ఇస్తాయి.  శివరాత్రి పర్వకాల నిర్ణయంలో కొన్ని నియమాలు ఉన్నాయి.ఆరోజు బహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి వరకూ ఉండాలి. దీనికి తోడు ఈ పర్వదినం మంగళవారం వస్తే ఇంకా ప్రశస్తం.

శివరాత్రి నాదు సంధ్యాదికములు పూర్తి చేసుకుని, నిత్యపూజ, జపం అయిన తర్వాత చతుర్దశి తిథి అంతా నిరాహారుడై ఉపవాసం చేయాలి. "ఓం నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని యధాశక్తి జపించాలి. శక్తి ఉన్నవారు రుద్రాభిషేకం చేసుకుంటారు. రుద్రాభిషేకమునకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. 
మా చిన్నప్పుడు వేసవి వస్తే, ఊరగాయలు పెట్టడం ఒక పెద్ద ప్రహసనం, ఒక గొప్ప వేడుకలా ఉండేది. ఒక్కో ఇంట్లో నలుగురేసి పిల్లలు, అంతమందికీ ఉదయం చద్దన్నాలు, అందులో ఊరగాయలు, ఎన్ని కాయలు పెడితే సరిపొతుంది? ఒక్కో ఇంట్లో వంద కాయలు ఆవకాయ పెట్టేవారు. ఈ రోజుల్లో లాగా, ఊరగాయ తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అనే నియమాలు ఉండేవి కావు. చిన్నా, చితకా, ముసలీ ముతకా అందరూ అన్నీ తినేవారు. అందుకే 100 కాయ ఆవకాయ పడేది ఒక్కో ఇంట్లో. ఇప్పటిలా కారం, ఆవగుండ బజార్లో కొనుక్కుని తెచ్చుకోవడం కాదు, పెద్ద పండుగ హడావిడి అవ్వగానే కొత్త మిరపకాయలు బజార్లో రాగానే, మిర్చి ఎంపికతో మొదలయ్యేది హడావిడి. వరంగల్ మిర్చి, జంగారెడ్డి గూడెం మిర్చి, గుంటూరు మిర్చి అంటూ అందులొ రకాలు.. వెడల్పుగా ఎర్రగా ఉన్న మిరపకాయ కారం ఎక్కువ లేకుండా మంచి రంగుతో ఉండి, సంవత్సరం పొడుగునా ఊరగాయ నల్లబడకుండా ఉండేది. కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు మిర్చి వాడేవాళ్ళు. అవి తొడిమలు తీసి ఎండబెట్టుకోవడం, ఆవాలు బాగుచేసుకుని ఎండలో పెట్టడం, రాళ్ళ ఉప్పు కూడా ఎండలో పెట్టి దంచుకోవడం, ఇవన్నీ పనులే. వేసవి సెలవులు ఆరంభం అవ్వడం పాపం.. ఈపనులు మా నెత్తిన పడేవి. కారం గుండ కొట్టించుకోవడం అదో పెద్ద కార్యక్రమం. ప్రతి ఇంట్లొను కుంది రోళ్ళు అని ఉండేవి. వాటిని ఏడాది పొడవునా ఏ పనులకీ వాడరు. ఈ ఊరగాయ పనుల్లోనే వాడేవారు. అవి ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి. వాటిని జామ ఆకులతో రుద్ది, దుమ్ము దులిపి శుభ్రం చేయటం పిల్లల వంతు. ఇరుగుపొరుగు 2,3 ఇళ్ళవాళ్ళు కలిసి కారం మనుషులను మాట్లాదుకుని కారం గుండ  రోళ్ళలో కొట్టించుకునే వారు. ఆరోజు ఇల్లాళ్ళూ అందరూ ఆ ఎండ వేడికి, మిరప ఘాటుకి మండిపోతూ ఉండేవారు. అల్లరి చేస్తే పిల్లలకి దరువులు పడేవి ఆరోజు. ఇంక మామిడి కాయ తెచ్చిన రోజు మళ్ళీ పిల్లలకు పనే. కాయ తుడవడం, ముక్కలు కొట్టాక మళ్ళీ తుడవడం, ఇలా ఆరోజు ఆడుకోవడానికి కుదిరేది కాదు. ఎందుకొచ్చిన ఊరగాయరా బాబూ అనుకుంటూ ఏడుస్తూ చేసేవాళ్ళం. కానీ అసలు మజా ఆవకాయ కలిపిన రోజున సాయంత్రం ఉండేది. అన్ని పనులు అయ్యాక, అందరి వాటాల్లోని పిల్లలనీ ఒకచోట చేర్చి, వేడి వేడి అన్నం వండి ఆ కొత్త ఆవకాయ కలిపి, చుట్టూ పిల్లలని కూర్చోపెట్టి, అందరి చేతుల్లో తలో ముద్దా పెడుతుంటే తినడం మహా సరదాగా ఉండేది. మళ్ళీ ఆవకాయల్లో ఎన్ని రకాలని.... వెల్లుల్లి ఆవకాయ, పనస ఆవకాయ, పులిహోర ఆవకాయ, సెనగ ఆవకాయ, పెసర ఆవకాయ, మెంతి ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఎండు ఆవకాయ, తొక్కు పచ్చడి, మాగాయ,.... ఎట్సెట్రా ఎట్సెట్రా,...ఇందులో గొల్లపూడి పచ్చ ఆవకాయ మరో విశేషం. ఎంతో రుచిగా ఉండేది. ఇన్ని రకాలు పెట్టి, మళ్ళీ ఇరుగు పొరుగు కు రుచికి ఇవ్వడం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటిని వాయనం అన్నట్టు, వారి ఊరగాయ మనింటికి, మన ఊరగాయ వాళ్ళింటికి.. ఎన్ని రోజులు తిన్నా అవి తెమిలేవి కావు. ఇప్పుడు ఆ రోజులూ కావు, ఆ సందడీ లేదు. ఒక్కొక్కరూ 4 కాయలు, 5 కాయలు,ఊరగాయ.  చద్దన్నాలూ లేవు, ఊరగాయ తిని అరాయించుకునే శక్తీ లేదు ఎవరికీ, అందరికీ సుగర్లూ, రక్తపోట్లూ.. ఇక ఏవీ తినద్దని చెప్పటానికి డాక్టర్లు ఉండనే ఉన్నారు నక్షత్రకుల్లాగ. పోనీ ఈ సరదాలైనా పిల్లలు చూస్తారు అనుకుంటే, పెద్ద పిల్లలు ఎంసెట్ కోచింగులు, చిన్న పిల్లలు సమ్మర్ కేంపులు...వేసవి సెలవుల్లో కూడా పిల్లల నవ్వులు వినే భాగ్యం, పిల్లల అల్లరి చూసే భాగ్యానికి నోచుకోలేదు ఎవ్వరూ. మన పని సజావుగా సాగాలి అంటే వాళ్ళకో ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నాం. ఈ జ్ఞాపకాలన్నీ తలుచుకుని, ఇలా పదుగురితో చెప్పుకుని మురిసిపోవటమే మిగిలింది...

ఇవాళ ప్రపంచ నవ్వుల దినోత్సవం అట. అయినా విడ్డూరం కాకపోతే, నవ్వుకోవడానికి ఒక రోజు ఏంటండీ? హాయిగా ప్రతిరోజూ కసాబిసా నవ్వుకోక...అంటే ఈరోజు ప్రముఖ కార్టూనిస్టులు, కమెడియన్లను తలుచుకుంటారేమో బహుశా...అంతేలెండి, వాళ్ళకీ ఒకరోజు కావాలిగా అందరూ తలుచుకోవడానికి. ఈ ఆలోచన కూడా తప్పేమో! అంత గొప్పగా హాస్యాన్ని పంచేవారిని మనం ప్రతిరోజూ తలుచుకుంటూనే ఉంటాంగా! మరయితే ఈ దినం ఎందుకు ప్రారంభం అయిందబ్బా! ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిలెండి. చార్లీ చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు,  రమాప్రభ, శ్రీలక్ష్మి,  బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్,  దర్శకులు జంధ్యాల గారు, రచయిత భమిడిపాటి కామేశ్వరరావు గారు, కార్టూనిస్ట్ మల్లిక్,  ఇలా ఎంతోమంది మనకు నవ్వులు పంచారు, పంచుతూనే ఉన్నారు. మనిషికి మాత్రమే చేతనయిన ఈ విద్యని మనం నేర్చుకుందాం, అందరికీ నేర్పిద్దాం, దరహాసం, మందహాసం, వికటాట్టహాసం ఇలా నవ్వుల్లో ఎన్నో రకాలు. ఎలా నవ్వినా పర్వాలేదు, అసలంటూ ముఖం ముడుచుకుని మూల కూర్చోకుండా.....కొంతమంది ఉంటారు, జోక్ వేసినా అర్ధం కాదు. మనమే జోక్ వేసి, మనమే అర్ధం చెప్పి, మనమే నవ్వుకోవాలి అటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే, కొంతమంది మొహమాటస్తుల దగ్గర వాళ్ళు వేసే జోక్ కి నవ్వు రాకపోయినా వచ్చినట్టు నటించాలి. జీవితమే నటనమూ అనుకుంటూ. కొన్ని రచనలు, కొన్ని సినిమాలు ఉంటాయి, ఎప్పుడు, ఎన్నిసార్లు  చదివినా, ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తాయి. ఎప్పుడూ గంభీరంగా ఉండేవాళ్ళని కొంతమందిని దేవుడు తయారు చేస్తాడు. అలాంటివాళ్ళు మనందరికీ జీవితంలో ఒక్కసారి అయినా తారసపడతారు. ఇక వాళ్ళతో గడపడం అనే శిక్షకు మనం రెడీ అవ్వవలసిందే. ఏం చేస్తాం? ఒక్కో ఘడియ అలా ఉంటుంది. భరించక తప్పదు. అదండీ సంగతి. అసలే ఆదివారం. ఈ పాటికి అందరి ఇండ్లలో భోజనాలు అయిపోయి ఉంటాయి. మరి ఇవ్వాళ చక్కగా ఒక మంచి పుస్తకం చదువుతూనో, ఒక మంచి పుస్తకం చదువుతూనో హాయిగా గలగలా మనస్ఫూర్తిగా నవ్వేసుకోండేం... మీ నవ్వులు మీ ఇంట్లోనే కాకుండా, మీ చుట్టుపక్కల కూడా ప్రతిధ్వనించాలి మరి.....


Saturday 2 May 2015

 పుష్యమాస ప్రాశస్త్యం: (రెండవ భాగం )

దేవఋణం.
త్రిమూర్తి స్వరూపుడైన సూర్యనారాయణ భగవానుణ్ని ప్రపంచ పోషకుడిగా, వేడి-వెలుతురు-ఆరోగ్యం ప్రసాదించే వాడిగా, జ్ఞాన భాస్కరునిగా, యుద్ధాధిపతిగా భారతీయులు అనాదిగా ఆరాధిస్తున్నారు. ఇంద్ర, వరుణ, వాయుదేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షించడం వల్లనే మకర సంక్రాంతి పండుగానాటికి పంటలు పండి, మన చేతికి అందుతాయి. మన జీవన నిర్వహణ జరుగుతోంది. అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి, సూర్యాది దేవతలను పూజించి, కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలను పొంగించి, సూర్యభగవానునికి భక్తితో, కృతజ్ఞతలతో నివేదించడం ఆచారం.

పితౄణం:

పితృతర్పణాలు, పిండోదక దానాలు, శ్రాధ్ధకర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. మకరరాశికి శని అధిపతి. శని వాతప్రధాన గ్రహం. వాతం తగ్గాలంతే సంక్రాంతినాడు తెలకపిండితో , నువ్వులు, బెల్లంతో చేసిన అరిశెలు మొదలైన పదార్థాలు సేవించాలి. నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ మొదలైనవి దానం ఇస్తే శనిదోషం కొంత పోతుంది అంటారు.

భూతఋణం.

భూమి, నీరు, గాలి మొదలైన భూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. అందుకే కృతజ్ఞతతో వాటిని కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకులు, పసుపు కుంకాలు చల్లి, ఎర్ర గుమ్మడికాయను పగలగొట్టి దిష్టి తీయడం ఆచారమైంది. పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి. ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి. అందుకె కృతజ్ఞతా సూచకంగా కనుమనాడు పశువులను, పశుశాలలను శుభ్రం చేసి, అలంకరిస్తారు. ఇళ్ళ ముంగిట బియ్యంపిండితో రంగవల్లులు వేస్తారు. ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహారం. ఇలా మూగజీవులకు, భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాలను ఈ పండుగలో నిబధ్ధం చేశారు.

మనుష్య ఋణం.

ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం కొనసాగించలేము. అందుకు కృతజ్ఞతగా ఈ పండుగ నాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరకు, గోవులు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి విరివిగా దానధర్మాలు చేస్తారు. అతిథులను ఆదరిస్తారు. వ్యవసాయంలో సాయం చేసిన వారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ కొత్థ ధాన్యాన్ని పంచిపెట్టడం ఈ పండుగ లోని మరో ఆచారం.

ఋషిఋణం:

ఈ పండుగ సమయంలో ఆచరించే జపతపధ్యానాది ఆధ్యాత్మిక సాధనలూ, సద్గ్రంథ పఠనాదులూ శీఘ్రఫలాలిస్తాయని విశ్వసిస్తారు. ధాన్యం, ఫలాలు, అజినం, కంచు, బంగారం, దానం శ్రేష్టం.

కనుము:

సంక్రాంతి పండుగలో ఆఖరిది కనుము పండుగ. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను గౌరవించే పండుగ ఇది. ఎద్దులు, ఆవులు మున్నగువాటిని, స్నానం చేయించి, అలంకరించి, వాటి కొట్టాలను శుభ్రం చేసి, అలికి, అలంకరించి, అక్కడ పొంగళ్ళు వండుతారు. వ్యవసాయకూలీలను కూడా గౌరవించే పండుగ ఇది. ఈ దినం పూర్తిగా కర్షకులకు సంబంధించిన దినం.  

Friday 1 May 2015

పుష్య మాస ప్రాశస్త్యం:

భారతీయ సంప్రదాయం ప్రకారం నెలకు రెండు పక్షాలు. శుక్ల పక్షం, కృష్ణ పక్షం. పక్షానికి 15 రోజులు. ఒక్కో రోజుకు ఒక్కో తిథి. అలా పదిహేను రోజులకు పదిహేను తిథులు. వాటిల్లో పదకొండో తిథి "ఏకాదశి:. ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క దేవుడిని ఆరాధించడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే తిథులన్నింటిలోనూ, మన పురాణాలు అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడిన తిథి "ఏకాదశి:.

వైకుంఠ ఏకాదశి:

మర్గశిర (ధను) మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన, విశేష ఫలాన్ని ప్రసాదిస్తాఇ. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. వైకుంఠ ద్వారాలు తెరచుకునే రోజుగా దీనిని భావిస్తాం. సౌరశక్తి ఉత్తరాయణంకి మారేముందు వచ్చే ఏకాదశి ఇది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఏకాదశినాడు ఉపవసించి, షోడశోపచారాలతో నారాయణుని అర్చించి, ద్వాదశి నాడు తిరిగి పూజించి, అనాదికాలు నివేదించి పారణ చేయాలి.

సంక్రాంతి:

ఆంధ్ర ప్రజలకు పెద్దపండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులు జరుపుతారు. మొదటిది భోగి. రెండవది మకర సంక్రాంతి. మూడవది కనుము.

భోగి:

సంక్రాంతి మొదటి రోజును భోగి పండుగ గా జరుపుతారు. ఈరోజు తెల్లవారుజాముననే నిద్రలేచి, భోగి మంటలు వేసి, చిన్నా,పెద్దా అందరూ చేరుతారు. ఇండ్లలో పనికిరాని పాత చెక్క వస్తువులు, కర్రలు మొదలైన వాటిని భోగి మంటల్లో పడేస్తారు. చిన్న పిల్లలకు సూర్యుని ప్రతీకలైన రేగు పండ్లతో భోగి పండ్లు పోసి పెద్దల, ముత్తైదువల ఆశీస్సులు తీసుకుంటారు.

మకర సంక్రాంతి.

సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య ఘడియలివి. ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. దేవమార్గం ప్రారంభం అయ్యే రోజు. ఈ సంక్రమణ వేళ స్నాన, దాన, జప తప, వ్రతాదులు శ్రేష్టం. గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. పంట చేతికందిన ఈ పర్వం నాడు ప్రతి ఇంటా శోభ వెల్లివిరుస్తుంది.విష్ణు సరస్రనామ పఠనం ఈ రోజున విశేషమైన శుభఫలాలను ఇస్తుంది. దేవ, పితృదేవతలను ఉద్దేశించి చేసే తర్పణాదులు, దానాదులు పుణ్యప్రదం. పౌష్యలక్ష్మి గా జగదంబను ఆరాధించే కాలం ఇది.

సంకార్తినాడు దేవతలకు, పితృదేవతలకు  పాత్రులకు ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకీ లభిస్తాయి. ఉత్తరాయణ పుణ్య కాలానికి ఆరంభమిది. ఈరోజు నువ్వులనూనె తో దీపం వెలిగించుట చాలా శ్రేష్టం. శివునకు  ఆవునేతితో అభిషేకం శ్రేష్టం. సంక్రమణం నాడు ఒంటిపూట భోజనం చేయాలి. రాత్రి భుజించరాదు. మంత్ర జపాదులు, ధ్యానం, పారాయణం యొక్క ఫలాలను శీఘ్రంగా ప్రసాదించే మహిమ సంక్రమణానికి ఉంది.

పంచ ఋణాల నుండి గృహస్థుల విముక్తి పొందే మార్గాలను ఆచారరూపంలో నిక్షేపించి, నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి.

(ఇంకా ఉంది ) 
మార్గశిర మాస ప్రాశస్త్యం:

ఈమాసం లో వచ్చే మొదటి షష్టిని సుబ్రహ్మణ్య షష్టి గా జరుపుకుంటారు. భారత దేశం అంతటా ఈ పండుగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. మార్గశిర పౌర్ణమి దత్తత్రేయ జయంతి. ఈ జయంతి, మృగశిర నక్షత్రం తో కాని, బుధవారం తో కానీ కలిసి వస్తే గొప్ప యోగం. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ దత్తాత్రేయుల వారిది గురు సంప్రదాయంలో ప్రత్యేక స్థానం. దత్త నామమే మహిమాన్వితం. దత్తాత్రేయ ఆరాధనకు ఈ రోజు చాలా మంచిది. అత్రి అనసూయలకు కుమారునిగా త్రిమూర్తుల తేజం "దత్త" నామంతో అవతరించింది. భాగవతం ప్రకారం తనను తాను పుత్రరూపంగా ఇచ్చుకొని అలా ఇవ్వబడిన కారణంగా "దత్త" నామధేయుడు అయ్యాడు. అత్రి కుమారుడు కనుక "ఆత్రేయుడు" అయ్యాడు. ఈ రెండు నామాలు కలిసి దత్తత్రేయుడు. ఇది గురు స్వరూపం. జ్ఞాన స్వరూపం. ప్రధానంగా నారాయణుదై, తదుపరి బ్రహ్మరుద్రాత్మకుడై, త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడయ్యాడు. కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. అందుకే స్వామికి "స్మర్తృగామి" అని పేరు. దత్తజయంతి రోజున దత్తారాధన, స్మరణ ఆవశ్యక ధర్మాలు.

ధనుస్సంక్రాంతి:

ఈరోజు సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే పుణ్యవేళ. ఈ సంక్రమణ కాలంలో విష్ణుపూజ, దానజపాదులు విశేష ఫలప్రదం. ఈరొజు నుండే ధనుర్మాసం ప్రారంభం. ఈరోజు నుండి వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో "తిరుప్పావై" పారాయణ ఆరంభిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం. 
ద్వాదశి నాడు విడిచిపెట్టాల్సినవి.
పగటి నిద్ర, ఇతరుల ఇంట భోజనం, రెండోసారి భోజనం, మైథునం, తేనె, ఇత్తడిపాత్ర లేక కంచు పాత్రలలో భోజనం, తైలము అనేవి ద్వాదశి రోజున విసర్జించాలి. ఇవి ఉపవాస ఫలితాన్ని నశింపచేస్తాయి.

ఉగాది నాడు బ్రహ్మదేవుని ప్రార్ధించాలి. ఆయనను ప్రార్ధించే ఏకైక పండుగ ఇదే!
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే!
నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే!
నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే!
                                               
శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ !
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం!

అంటే సర్వారిష్టాలు, (గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైనవి) నివారించబడి, సర్వసంపదలు కలిగి దీర్ఘాయువు, వజ్రము వంటి దేహము (రోగాలు లేకుండా అరోగ్యవంతమైన దృఢమైన దేహము ) లభిస్తాయని చెప్పబడింది.

ఉగాది పచ్చడి ఆరోగ్య రీత్యా చక్కటి ఫలితాలను ఇవ్వడమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచులతో మిళితం కావడం వలన ( వేప రుచికి బుధుడు, బెల్లం గురునకు, మామిడి ముక్కల రుచి శుకృనకు, నెయ్యి చంద్రునకు) గ్రహ దోషాలను నివారిస్తుందని చెబుతారు.

ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయడం, దేవతారాధన, ఉగాదిపచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం తో పాటు మనకు వీలయితే చేయవలసిన మహత్కార్యం ఇంకొకటి ఉంది. అదే ప్రపాదానం. అనగా చలివేంద్రం స్థాపించడం.


 శ్రీరామభక్తుడైన హనుమంతుడు, చైత్ర పౌర్ణమి నాడు జన్మించినట్లు పలుచోట్ల చెప్పబడింది. ఉత్తర భారతం లోనూ, దక్షిణ భారతం లోని కొన్ని ప్రాంతాలలోనూ  ఈనాడే హనుమజ్జయంతి ని జరుపుకుంటారు. కొంతమంది మాత్రం పరాశర సంహిత లో చెప్పబడినట్లు వైశఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతి ని పాటిస్తారు. ఈరోజు హనుమంతుని పూజించడం వలన గ్రహదోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత పిశాచాల వంటి పీడలు తొలగి, గాలిచేష్టలవంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపొయి, ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పబడింది. హనుమజ్జయంతి రోజున సుందరాకాండ, హనుమాన్ చాలీసా లను పారాయణం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. పారాయణను గ్రుహములో చేసినా, దేవాలయములో చేసినా,మంచి ఫలితాలను పొందుతారు. ఇక కదళీ వనము నందు పారాయణ చేసినట్లయితే ఫలము, వేయి రెట్లుగా ఉంటుంది అని పెద్దలు చెపుతారు.
కార్తీక మాస ప్రాశస్త్యం (నాలుగవ భాగం)

ఉత్థానైకాదశి:

విష్ణుమూర్తి పాలకడలిలో  ఆషాఢ శుక్ల ఏకాదశినాడు యోగనిద్రలో శయనించిన విష్ణుమూర్తి కన్నులు విప్పి యోగనిద్రను చాలించి లేచిన రోజె " ఉత్థాన ఏకాదశి. ఉత్థానం అంతే లేచుట, మేల్కొనుట అని అర్ధం. యోగ సాధన చేయువారికి ఆకాశములోని నక్ష్త్ర మందలము నుండి భగవద్భక్తి తరంగాలుగా క్రిందకు దిగి శరీరములో ప్రవేశించి ఆత్మను మేల్కొలుపు కాలమిది..

మరునాడు వచ్చె ద్వాదశిని బోధన ద్వాదశి, హరిద్వాదశి , చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈరోజున ఉసిరి చెట్టుకు, తులసి మొక్కకు శ్రధ్ధాభక్తులతో పూజలుచేసి, చలిమిడి దీపాలు వెలిగించి, అవి కొండెక్కిన తర్వాత చలిమిడిని ప్రసాదంగ తీసుకుంటారు. ఈరోజున చేసే దీపదానం, వస్త్ర దానం విశేష ఫలితాలను ఇస్తాయి. ద్వాదశినాటి సాయంత్రం లక్స్మీదేవికల్యాణం చేస్తారు. పాల సముద్రము చిలికిన సమయములో లక్ష్మి ఉద్భవించినపుడు ఆమెకు విష్ణువుతో వివాహం జరిగిన రోజు ఇదే అని అంటారు. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు క్రింద శుచిగా వండిన వివిధ వంటల్ని కేశవారాధనతో నివేదించి బంధుమిత్ర సహితంగా ఆరగించడం అనేది "కార్తీక వన సమారాధన" గా నేటికీ ఆచరణలో ఉంది.

కార్తీక పూర్ణిమ:

చంద్రుడు మనసుకు ప్రశాంతతను ఇస్తాడు. తమోగుణాన్ని హరిస్తాడు. అతడిని శివుడు తన జటాజూటంలో ధరించాడు. అందుకే అతని పేరుతో ఏర్పడిన సోమవారం నెలలో విశిష్టమైనది. పూర్ణిమ నాటి వెన్నెల ఆరోగ్యకరం కనుక కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం వండుకుని పూజాదికాలు నిర్వహంచి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పూర్ణిమ నాడు తెల్లవారి నాలుగయిదు గంటల మధ్య కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. సమయంలో నదీస్నానం పుణ్యప్రదం అని, ఆరోగ్యదాయకం అని పెద్దలు చెబుతారు.

కార్తీక పూర్ణిమ శ్రేష్టమైనది. ఈరోజున ఉపవాసం, దానం, అర్చన, స్నానం విశేష ఫలదాయకం. పూర్ణిమ నాడు విశేషంగా దీపారాధన చేయడం మంచిది.

నరకచతుర్దశి..

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు తెల్లవారుజమునే నరక భయ నివారనార్ధం నువ్వుల నూనె తొ అభ్యంగన స్నానము చేయవలెను. దీపావళి పర్వదినాల్లో లక్ష్మీదేవి తిలతైలంలో (నువ్వులనూనె) ఉంటుందిట. కాబట్టి తిలతైలంతో తలస్నానం లక్ష్మీప్రదం అని చెప్తారు. చతుర్దశినాదు నీటిలో గంగాదేవి సమాహితమై ఉంటుంది. ఒకరోజు ముందుగానే నీటిని పట్టి పాత్రలలో నిలువ ఉంచి నీటితో స్నానం చేయాలి. పాత్రలలో ఉత్తరేణి, తుమ్మ, తగిరస చెట్ల కొమ్మలను నానబెత్తడం వలన వాటిలోని అఔషధ గుణాలు నీటిలోకి వచ్చి చేరుతాయి.

నరక చతుర్దశినాటి వంటకాల విషయములో కూడా కొన్నినియమాలు ఉన్నాయి. నువ్వులు, మినుములు,బెల్లం తో చేసిన పదార్ధాలు తప్పక తినాలి అని శాస్త్రం. ఇవన్నీ ఋతువులు మారిన కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి పెట్టిన నియమాలు. నరక చతుర్దశి నాడు సంధ్య వేల కాగడాలు చేత పట్టుకొని పితరులకు దారి చూపాలట. దాని నిమిత్తం ఇంటి వెలుపల ద్వారం వద్ద దీపాలు వెలిగించాలి.

 ధనత్రయోదశి:

త్రయోదశి నాటి సాయంకాలము ఇంటి వెలుపల యముని ప్రీత్యర్ధం దీపములు వెలిగించాలి. దీనివలన అపమృత్యువు నశిస్తుంది అని స్కంద పురాణమున చెప్పబడింది. రోజున పితృదేవతలు సూక్ష్మ రూపాలలో ఇళ్ళకు వస్తారు అని, దీపములు వెలిగించి వారిని సత్కరించాలి అని నమ్ముతారు. ఈరోజున కొంతమంది లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు బంగారం ఆభరణములు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


కార్తీక మాస ప్రాశస్త్యం: మూడవ భాగం :

కార్తీకం లో ఉన్ని, ఇంగువ, పుట్టగొడుగులు, గంజాయి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడు, పుచ్చకాయ, వెలగపండు, నూనె, చద్ది మొదలైనవీ, రెండుమార్లు వండిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ధాన్యాలు వాడరాదు.

శివుడు "ఆశుతోషుడు". అంటే వెంటనే సంతోషించే స్వామి. ఆయనకు అలంకారాలతో, నైవేద్యాదులతో రాజోపచారాలతో పనిలేదు. జిల్లేడు, ఉమ్మెత్త మొదలైన విలువ లేని పువ్వులే శివుడికి ప్రీతి. ఇటువంటి అశుతోషి శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికీ మాసం శ్రేష్టం. అయితే శివుడు అభిషేక ప్రియుడు. అందుచేత, రకరకాలా సంబారాలతో శివాభిషేకం చేయడం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను కలిగిస్తుందికార్తీక మాసం అంతా కార్తీక పురాణం పఠనం, శ్రవణం చేయాలి.

మాసం లో వచ్చె మొదటి పండుగ దీపావళి. పండుగను చాలా మంది 4 రోజులు చేస్తారు. ఆస్వయుజ అమావాస్యకు ముందుగా వచ్చే చతుర్దశిని "నరక చతుర్దశి" గాను, అమావాస్య నాదు దీపావళి లక్ష్మీ పూజ గాను, మరుసటి రోజు బలి పాద్యమి గాను, 4 రోజు "యమ విదియ"గాను జరుపుకుంటారు. లోకులను హింసిస్తున్న తన పుత్రుడి బారి నుంచి లోకులను రక్షించడానికి భూదేవి విష్ణువుతో మొర పెట్టుకోగా, శ్రీక్రిష్ణావతారం లో తన ప్రియ పత్ని సత్యభామతో కూడి నరకుడిని సంహరించిన రోజుగా "నరక చతుర్దశి" ని చెప్తారు. నరకుడి పీడ వదిలిన కారణంగా ఆరోజు, మరుసటి రోజు ఆనందోత్సాహాలతో, దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుకలు చేసుకుంటారు. రోజున యముడు తన సోదరి యైన యమున గృహమందు ఆమె వండి వడ్డించగా భోజనం చేసాడు కనుక దీనికి "యమ ద్వితీయ" అని పేరు. ఈరోజున అక్కచెల్లెని చేతి వంట తిని ఆమెకు వస్త్రాలంకారాలు సమర్పించాలి. దీనివల్ల ఉభయులకూ ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. సోదరునకు చిరంజీవనము, దీర్ఘాయుష్షు, మరియు సోదరికి అఖండ సౌభాగ్యము సిధ్ధిస్తుంది.

కర్తీక మాసం లో మంత్ర దీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మ శాస్త్రాలు చెపుతున్నాయి. ముఖ్యంగా ఏకాదశి నుండి పూర్ణిమ వరకు -- ఐదు రోజులు శివమంత్రం కానీ, విష్ణు మంత్రం కానీ ఉపదేశం పొందడం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు.


(ఇంకా ఉంది )
కార్తీక మాస ప్రాశస్త్యం: ( రెండవ భాగం )

కార్తీక మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. దీపము దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు, అన్నదానము మొదలైనవి చేయాలి. దానమిచ్చుటవలన స్త్రీలకు ఐదవతనము వృధ్ధి అగుట, మంగళ ప్రదము, సఔభాగ్యకరము. తాను ఉపవసించి బీదలకు అన్నదానము చేసిన యెడల గొప్ప పుణ్యము లభించును. సూర్యాస్తమయము అయిన వెంటనే "సంధ్యా దీపము" వెలిగించుట, ముగ్గుపెట్టి ఇంటి ముందు దీపము పెట్టుట, తులసికోటలో దీపము పెట్టుటఉదయము తులసిపూజ, గౌరీపూజ చెసిన వారికి ఆర్ధిక బాధలు తొలగుతాయి.

సూర్యోదయానికి పూర్వము తలపై చన్నీటి స్నానము చేయడం వలన జీవితములో దు:ఖములు నశిస్తాయి. ప్రతి రోజు చేయ్లేక పొయినా, ప్రధాన తిథులలో (ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలు ) నైనా చేయాలి. నది, సముద్రం లభ్యం కాకపోతే, లభ్యమైన జలాలతోనే చేయాలి. కార్తీక దామోదర అనే స్మరణతో స్నానం చేయాలి. అరుణోదయ సమయంలో విష్ణ్వాలయం లో కాని, శివాలయం లో కాని గడపాలి. విష్ణు, శివాలయాల్లొ భగవత్ ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వలన వేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది. విష్ణు, శివ ఆలయాలు లభించని పక్షం లో మరి దేవాలయంలో లేదా, రావిచెట్టు మొదట్లో కానీ, తులసీవనం లో కానీ, భగవత్ స్మరణ చేయాలి. మాసం దీపారాధనకు విశిష్తమైనది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిలో కానీ, దేవాలయం లో కానీ "ఆకాశదీపం" పెట్టే సంప్రదాయం ఉంది.

తులసి దేవతా వృక్షం. తులసీ సన్నిధిలో, దీపారాధన చేయడం విశిష్టం. తులసి దళాలతో విష్ణువును పూజించడం, తులసి సన్నిధిలో ఆరాధించడం, పారాయణ, జపం వంటి సత్కర్మలు చేయడం భగవదనుగ్రహాన్ని కలిగిస్తాయి.

ఉభయ సంధ్యలలో శివ కేశవ మందిరాలలో, తులసి సన్నిధిలో దీపాలను వెలిగించడం మహోత్క్రుష్టమైన సత్కర్మ. అన్ని దానాలు ఒకవైపు, దీపదానం ఒకవైపు అని శాస్త్ర వచనం. తెలిసి గానీ, తెలియక గానీ మాసంలో దీపం వెలిగిస్తే ఇహపర ఐశ్వర్యాలు లభిస్తాయిఆలయాలలో, తులసి వనాలలోనే కాక, అరటి దొప్పల వంటి వాటిలో దీపాన్ని పెట్టి తటాక నది ఆదులలో విడిచిపెట్టి, భగవదర్పణం చేయడం ఎంతో ఉత్తమం. ఉసిరికాయపై వత్తిని పెట్టి దీపం విలిగించడం విష్ణు ప్రీతికరం. నియమంగా నెల్లాళ్ళూ దైవ సన్నిధిలో దీపారాధన చేయడం సర్వశ్రేష్టం. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలోనూ దీపాలు వెలిగించేవారికి దివ్య శుభ ఫలాలు లభిస్తాయి. ముఖ్యంగా మాసంలో పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమా తిథులు అత్యంత మహిమాన్వితమైనవి.

కార్తీక మాసంలో స్వగృహంలోనూ, తులసి సన్నిధిలోనూ, దేవాలయం లోనూ దీపం వెలిగించేవారికి అఖండైశ్వర్యం లభిస్తుంది. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివార్చన లేదా విష్ణు పూజ చేసుకొని, నక్షత్ర దర్శనం చేసుకొని భగవంతునికి నివేదించిన అహారాన్ని స్వీకరించడాన్ని "నక్త వ్రతం" అంటారు. నెలంతా "నక్తం" ని నియమంగా చేయడం సంప్రదాయం.నెలంతా కుదరక పోయినా సోమవారాలు వ్రతం ఆచరించడం శ్రేష్టం.


(ఇంకా ఉంది  )
కార్తీక మాస ప్రాశస్త్యం:

మన సంప్రదాయంలో కార్తీకమాసానికి ఎంతో విశిష్త ఉంది. మాసాన చేసే భగవత్పూజలు, వ్రతాలు, స్నానాలు, దీపారాధనలు గొప్ప ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఈనెలలో విష్ణువు "దామోదర" నామంతో పూజింపబడతాడు. అందువల్ల మాసాన సత్కార్యం చేసినా, "కార్తీక దామోదర ప్రీత్యర్ధం" అని సంకల్పించి చేయాలి. మాసముతో సమానమైన మాసము లేదంటూ అత్రి మహర్షి, అగస్త్యునితో చెప్పాదు. నెలరోజులు, రోజుకొక అధ్యాయం చొప్పున కార్తీక మహాత్మ్యం పఠనం, శ్రవణం భారతావని అంతా జరుగుతుంది. నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామపూజ, దైవపూజ, వనభోజనములు, కార్తీక మాసంలో నిర్వర్తించవలసిన ముఖ్య విధులుగా చెప్పబడుతున్నాయి.

నెలలొ పూర్ణిమ నాడు నక్షత్రం దగ్గరగా చంద్రుడు ఉంటే నెలకు నక్ష్త్రం పేరు రావడం మన ఖగోళ మాన సంప్రదాయం. పధ్ధతి ప్రకారం శర్దృతువులో చంద్రుడు పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాదు. అందుకే ఇది కార్తీక మాసం.

కృత్తికా నక్ష్త్రం ఆరు నక్షత్రాల కూటమి.ఇది దర్భ పొదల మాదిరిగా ఉంటుంది. శివుని వీర్యం నీటిలో పడి ఈపొదల మధ్య చిక్కుకోగా ఆరుగురు కృత్తికలు కల్లిసి దాన్ని ఏకం చేసి బిడ్డగా పెంచినట్టు పురాణ కథ. అతడే కార్తికేయుడు, అయ్యాడు. తారకాసుర సంహారం చేసాడు. విధంగా కృత్తికలు శివునికి ప్రీతిపాత్రులయ్యారు. వారి పేరున ఏర్పడిన కార్తీక మాసం అంటే శివునికి ఎక్కువ ఇష్తం. కనుకనే మాసంలో దేశవ్యాప్తంగా శివార్చనలు వైభవంగా జరుగుతాయి.

  మాసములో చెరువుల యందును, దిగుడు బావుల లోను, పిల్లకాలువల యందును హరి నివసించి ఉంటాదు అని శాస్త్రం.ఆవుపాదమంతటి జలంలో కూదా మాసంలో హరి నివసిస్తాడుత. అందుకే సూర్యోదయానికి పూర్వమే శిర:స్నానం చేయాలి. దీపారాధన చేసి, శివునికి, విష్ణువుకు, సుబ్రహ్మన్యస్వామికి పూజచేస్తే, విశేష ఫలప్రదము.

సోమవారాలు.

ప్రతి సోమవారము శివవ్రతానికి ఉత్తమమే కాని, ప్రత్యేకించి కార్తీక సోమవారాలు సర్వవిధాల శ్రేష్టం. ఈరోజు ఉదయాన్నే శివారాధన, అభిషేకదులు చేసుకుని, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం తిరిగి శివునికి పూజ చేసి, అన్నాదులు నివేదన చేసి, నక్షత్ర దర్శనం చేసి ప్రసాదాన్ని ఆరగించాలి. ముఖ్యంగా దీపారాధన స్నానానంతరం పొడిబట్టలతోనే చేయాలి.

(ఇంకా ఉంది )