Thursday 24 December 2015

కోరికలు దు:ఖానికి హేతువులు....మహనీయులు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. దేనిమీద అయితే కోరిక కలిగి ఉన్నామో దానిని సాధించలేనపుడు దు:ఖం వస్తుంది. అది ఆగ్రహం గా మారుతుంది. మనిషి ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాడు. ఆక్షణంలో మరిన్ని తప్పులు చేస్తాడు. భగవద్గీతలో భగవానుడు బోధించినది కూడా ఇదే. కోరికలను జయించాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాలు జ్ఞాన సముపార్జనకు అడ్డంకులు అవుతాయి. కనుక ముందుగా అరిషడ్వర్గాలను జయించగలగాలి. అట్టి స్థితిని సాధించిన  వారు జ్ఞాన సంపన్నులవుతారు.  యుక్తాయుక్త విచక్షణ కలిగిఉండాలి. ఏది ఎంతవరకు మనకు అవసరమో గ్రహించగలిగి ఉండాలి. పరుల సొమ్మును ఆశించకూడదు. పరుల సొమ్ముపై మనకు హక్కు ఎందుకు ఉంటుంది? మనకు లభించిన దానితో సంతృప్తి చెందే లక్షణం అలవాటు చేసుకోవాలి... సంతృప్తి ఉన్న చోట ఆశలకు, కోరికలకు, స్థానం లేదు. ప్రశాంతమైన జీవితం గడపడానికి మార్గం ఇదే.
సర్వేత్ర సుఖిన:స్సంతు , సర్వేస్సంతు నిరామయా, సర్వేభద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దు:ఖమాప్నుయాత్....అందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఉండాలి, ఎవ్వరూ దు:ఖానికి లోను కాకూడదు అని భావించే గొప్ప బారతీయ సంస్కృతి మనది. సర్వజీవుల లోనూ భగవంతుడున్నాడని, కనుక ప్రతి ప్రాణినీ ప్రేమించాలని, ఏచిన్న ప్రాణికీ కీడు తలపెట్టరాదనీ బోధించాయి మన శాస్త్రాలు. దీనుల యెడ కరుణ కలిగి ఉండాలని, మానవసేవయే మాధవ సేవ అని కూడా మన సంస్కృతి మనకు చెప్తుంది. దయ, కరుణ కలిగిన వారు పరుల దు:ఖాలలో పాలుపంచుకుంటారు. భగవంతుడు మనలను సృష్టించినప్పుడు ఎంతో నిష్కల్మషంగా ఈ భూమి మీదకు పంపాడు. కానీ,మనం ఎదుగుతున్న క్రమంలో మానవతను కోల్పోతున్నాం...హృదయాలను పాషాణాలుగా మార్చేసుకుంటున్నాం. మనకు తరతరాలనుండీ వస్తున్న ఆస్థి మన పురాణాలు, ధర్మ శాస్త్రాలు. వాటిని నిర్లక్ష్యం చేయడం వలన మన సంస్కృతి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ఆదర్శదైవం శ్రీరాముడు 16 కళలతో విలసిల్లిన పూర్ణపురుషుడు. కరుణారస సాగరుడు. రామసేతు నిర్మాణంలో పాలుపంచుకున్న ఉడుత వంటి చిన్నప్రాణిని సైతం దయతో అనుగ్రహించాడు. ఇక శ్రీకృష్ణుడు ఎన్ని రకాలుగా దీనజనులను ఆదరించాడో లెక్కేలేదు..కుబ్జ, కుచేలుడు, వీరందరినీ కరుణతో బ్రోచినవాడు మాధవుడు. ఇంకా బలి, శిబి చక్రవర్తి, మనకు కరుణ, దయ గురించి తమ ప్రవర్తనల ద్వారా నేర్పించారు. ఈ కాలానికి వస్తే, క్రీస్తు, గాంధీజీ, రమణమహర్షివంటివారు దీనజన సేవను చేసి చూపించి మనకు ఆదర్శమూర్తులైనారు. అసహాయులను ఆదరించడంలో గొప్ప తృప్తి ఉంది. మనకు ఎంతో అదృష్టం ఉంటేనేకాని, దీనజన సేవాభాగ్యం లభించదు..అటువంటి సేవా అవకాశాల్ని లభించేలా చేయమని ప్రార్ధించడమే మానవజన్మకు సార్ధకత నిస్తుంది.
కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు...సాధించాలనే పట్టుదల, సత్సంకల్పం, అవిరామమైన కృషి ఉన్నప్పుడు విజయం తప్పక సిద్ధిస్తుంది..కార్యోన్ముఖులైనవారు మార్గమధ్యంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా కృంగిపోక తమ కృషిని కొనసాగిస్తారు....పరాజయం పాలైనా మరల మరల తమ ప్రయత్నాన్ని కొనసాగించే ధీరులను మాత్రమే విజయం వరిస్తుంది. ఈనాడు పేరుప్రఖ్యాతులు పొందినవారంతా వారి వారి రంగాలలో అవిరళ కృషిచేసిన ఫలితంగానే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం సాధించడానికి సంకల్పం, కృషితోపాటు దైవబలం కూడా అత్యవసరం....దైవకృపను పొందడానికి దర్మాచరణ ఒక్కటే మార్గం....దర్మమార్గం ద్వారా సాధించే విజయం శాశ్వతం గా నిలబడుతుంది...అర్జునుని వలే లక్ష్యం మీదనే చెడని ఏకాగ్రతతో దృష్టి నిలిపిన సాహసులే విజయానికి అర్హులు అని శాస్త్రవచనం.

Wednesday 23 December 2015

ఎల్లప్పుడూ పెదవుల మీద చిరునవ్వుతో కనిపించేవాళ్ళు అందరి మనసులలో స్థానం సంపాదించుకుంటారు. ధర్మబధ్ధమైన జీవితం గడిపేవారిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంటుంది. ఆ ప్రసన్నత , ఆ ఆనందం యొక్క కాంతి వారి వదనంపై ప్రతిఫలిస్తుంది. ఇటువంటి ఆనందం కలిగిన వెంటనే వారిలోని విరుధ్ధభావాలు తొలగిపోతాయి. పొరుగువారిని ప్రేమించే లక్షణం అలవడుతుంది. పాపకర్మలు చేయడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవసరం లేని ప్రశాంత జీవనం అలవాటు అవుతుంది. మనసా, వాచా, కర్మణా పాపకర్మలు చేయకుండా నియంత్రించుకోగలిగే సామర్థ్యం పట్టుబడుతుంది. నిర్మలమైన అంత:కరణ కన్నా మించిన జ్ఞాన సంపద మరొకటిలేదు...  ఈ స్థితిని పొందినవారందరూ ముముక్షువులే....ఇది ఒక మహాయోగం,....ఇది సాధించినవారందరూ యోగసాధకులే....
లక్ష్మిదేవి అనుగ్రహం పొందడానికి మనం ఎన్నెన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అష్టలక్ష్మి రూపాల్లో పూజలు అందుకునే లక్ష్మీదేవి ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుధ్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపునిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగల ఆరోగ్యం --=ఈ అన్నిటి రూపాల్లోనూ విలసిల్లుతోంది. కేవలం, డబ్బు, బంగారమే కాక, వీటిలో ఏ కొన్ని మనకు లభించినా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు లభించినట్టే. అన్నిటినీ మించి "నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను, అందుకు భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడను." అని ఎవరు సంతృప్తిగా ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం మిక్కిలిగా లభించినట్టు అర్ధం. ఈ ఆత్మతృప్తి ఉన్నచోటును లక్ష్మీదేవి వదిలిపోదుట. ఆమే అనుగ్రహం పొందాలంటే కొన్ని అర్హతలు సంపాదించవలసి ఉంటుంది. ప్రియభాషణం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమాభిమానాలు, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ, మితభోజనం, మితనిద్ర, ఇవన్నీ ...గట్టి గట్టిగా అరచుకోవడం, అందరితో పోట్లాటలు పెట్టుకోవడం, ఇతరులను చులకనగా చూడడం, ఆత్మస్తుతి, పరనింద ఇవన్ని మన గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి చోట లక్ష్మి నివసించదు అని పెద్దలు చెపుతారు. పూజలు,  నోములు చేయలేకపోయినా, పై మంచి లక్షణాలను అలవరచుకుంటే, కావలసినంత మన:తృప్తి, అఖండమైన లక్ష్మీకటాక్షం లభిస్తాయి.