Sunday 1 March 2015

నిన్న గురజాడ వారి స్వగృహం లో అయన జయంతి వేడుకలు జరిగాయి. మేము సాయంత్రం ఆ గృహం చూడడానికి వెళ్ళాము. మొత్తం కింద, పైన కలిపి 10 గదులు. మధ్యలో మండువా లాగా ఉండి, చుట్టూ గదులు. మేడ మిద ఒక వసారా, పంచ, రెండు గదులు. గాలి వెలుతురూ ధారాళంగా వస్తూ, ఎంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో ఇపుడు ఒక గ్రంధాలయం నడుపుతున్నారు. అలా అయినా మనుషుల రాకపోకలు ఉంటె, ఇల్లు పాడైపోదు అనే ఉద్దేశ్యం తో. కింద హాల్ లో అయన చిత్రపటం కు పూల మాల వేసి సత్కరించారు. పైన గదులలో ఒక గదిలో బీరువాలలో అయన చదివిన పుస్తకాలూ, అయన వాడిన కుర్చీ, కళ్ళజోడు, టేబుల్, వంటివి ఉంచారు. మరో గదిలో ఆయనకు వివిధ వ్యక్తుల నుంచి అందుకున్న లేఖలు పటం కట్టి ప్రదర్శించారు. అందులో అమృతాంజన్ కంపెనీ వారి నుండి వచ్చిన లేఖ, ఉదకమండలం క్లబ్ వారి లేఖ, కొండా వెంకటప్పయ్య గారి లేఖ, శ్రీ రబీంద్ర నాథ్ టాగోర్ గారి లేఖ, ఆంధ్ర పత్రిక వారి నుండి వచ్చిన లేఖ, బాలాంత్రపు వెంకట్రావు గారి లేఖ అన్ని మనం చూడవచ్చు. అయన స్వదస్తూరి తో వ్రాసిన దేశమును ప్రేమించుమన్నా గేయం, అయన డైరీ లలో కొన్ని పేజీలు కూడా ప్రదర్శించారు. అప్పటి కాలం నాటి విజయనగరం ఫోటోలు, అయన మహారాజ వారి కళాశాలలో లెక్చరర్ గా పనిచేసినప్పటి ఫోటో లు కూడా మనం అక్కడ చూడవచ్చు. అలాగే కింద హాల్ లో విజయనగరం నాకు చెందినా ఎంతో మంది మహానుభావుల చిత్ర పటాలను చూడవచ్చు. పి. సుశీల, మహారాజ ఆనంద గజపతి రాజు గారు, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, శ్రీ కోడి రామమూర్తి గారు, అమర గాయకుడూ ఘంటసాల, మహా మహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు, పద్య నాటక సార్వభౌమ శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు, హరి కథా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు వీరందరి చిత్రపటాలు ఉన్నాయి. మరొక గదిలో "కన్యాశుల్కం" నాటకం లోని ప్రముఖ ఘట్టాలు చిత్ర రూపంలో ఉన్నాయి.
ఒకటవ చిత్రం గురజాడ వారి ఇంట్లో మండువా స్థలం. 2.పైన వసారా 3. వారి స్వదస్తూరి తో వ్రాసిన దేశమును ప్రేమించుమన్నా గేయం. 4. ఆ కాలం లో గంటస్తంభం ప్రాంతం చిత్రం. 5. మహారాజ శ్రీ పూసపాటి ఆనంద గజపతి రాజు గారు.
మనం ఒక 100 పరిష్కారాలు సూచించినా, మళ్లీ గొడవలు 101 వ సమస్యతో మొదలవుతాయి. ఇంటింటి రామాయణం....అంతే. నా మటుకు నాకు తోచిన పరిష్కారం ఏమిటంటే, గొడవ వచ్చినపుడు రెండు రోజులు ఆ విషయం మిద మాట్లాడకుండా ఉండి, తరువాత రోజు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. సమస్య తేలిపోతుంది. ఆవేశం లో మాట్లాడినపుడు మెదడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంది. రెండు రోజులు ఆగితే ఆ ఉద్రిక్తత తగ్గుతుంది. అప్పుడు మెదడు సరిఅయిన పరిష్కారం ఆలోచిస్తుంది. అంత కన్నా ముఖ్యంగా ఉద్రిక్తత తగ్గినా తరువాత అవతలి మనిషి చెప్పే మాటలు మెదడులోకి నాటుకుంటాయి. సమస్యను అవతలి వ్యక్తీ వైపు నుంచి చూడగలిగితే సమస్య దూదిపింజలా తేలిపోతుంది అని నా అభిప్రాయం
అరిషడ్వర్గాలను జయించడం చాల కష్టసాధ్యమైన పని. కానీ, వాటిని జయించనిదే మానవుని జీవితం సుఖమయం కాదు. ఎంతో నిష్ఠ తో తపస్సు చేసిన మహా మహా మునులకు, యోగి పుంగవులకే క్రోధాన్ని అసూయను జయించడం సాధ్యం కాలేదు. ఈ కలియుగం లో సామాన్య మానవునికి అంత శక్తి లేదని తెలిసి, పెద్దలు భగవంతుని కోసం దీక్ష లను ప్రారంభించారు. 41 రోజుల పాటు పాటించే ఈ దీక్షలు ఎవరి ఇష్ట దైవాన్ని బట్టి వారు తీసుకోవచ్చు. అయ్యప్ప దీక్ష, భవాని దీక్ష, గణపతి దీక్ష, హనుమాన్ దీక్ష, గోవింద మాల--ఇలా... దీక్షా ధారులు పాటించే నియమాలు సూక్ష్మం లో మోక్షంగా అరిషడ్వర్గాలను జయించే వైపుగా మానవుని ప్రేరేపిస్తాయి. సర్వుల లోను భగవంతుని చూస్తున్నట్టే, మగవారిని స్వామి అని, స్త్రీలను మాతా అని పిలవడం, ఇంద్రియ నిగ్రహం పాటించే విధంగా భూ శయనం , ఒంటిపొద్దు భోజనం, తామస గుణాలను ప్రేరేపించే ఆహారాన్ని విసర్జించడం, మద్య మాంసాలను విడిచి పెట్టడం, చన్నీటి స్నానం, ఇరు సంధ్యలలో దైవప్రార్ధన, మొదలైనవి. ఈ దీక్ష లోనే సాత్వికంగా మాట్లాడడం, ఈర్ష్య అసూయలను జయించడం కూడా ఒక విధి గా చెప్తారు. ఈ దీక్షలు అన్నీ, 41 రోజులు సాగుతాయి. ఒక మనిషి లోని రోగ లక్షణాలను మాన్పి, సేవించే మందు ఒంటికి పట్టి, ఆరోగ్యం చేకూరాలంటే, 41 రోజులు ఖచ్చితంగా ఔషధ సేవనం చేయాలి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. మన లోని తామస గుణాలు నశించి, పరిపూర్ణ వ్యక్తులుగా రూపొందడానికి ఈ దీక్షలు దోహదం చేస్తాయి అని పెద్దల ఉద్దేశ్యం.
కానీ, ఇప్పుడు ఎవరి వెసులుబాటు ప్రకారం, సప్తాహ దీక్ష, 18 రోజుల దీక్ష, ఇటువంటివి ప్రారంభం అయ్యాయి. దీక్షాధారులు దీక్ష విరమించే దేవాలయం ప్రక్కనే, బార్లు వెలుస్తున్నాయి. 41 రోజుల దీక్ష తరువాత కూడా వారిలోని కోపం, ఈర్ష్య, అసూయ అనే దుర్గునాలు తొలగడం లేదు. దీక్ష విరమించిన తరువాత మళ్లీ వారి ప్రవర్తన మునుపటి విధంగానే ఉంటోంది. అటువంటప్పుడు ఈ దీక్షలు తీసుకోవటం వలన ప్రయోజనం ఉందా? 41 రోజులు ఒక విధమైన కట్టుబాట్లలో ఉన్న వ్యక్తులు, తరువాత కూడా అలా ఉండలేరా? దీక్షాధారణ కు ఉన్న ప్రయోజనం చేకూరనప్పుడు దీక్షలు పాటించి లాభం ఏమిటి? ఇటువంటి దీక్షాధరుల వలన మనం వేరేవారికి మనలను విమర్శించే అవకాశం ఇస్తున్నామేమో! మానవుని సంకల్ప బలం ఎంతో గొప్పది. సంకల్పం ఉంటె, కొండను అయినా కదల్చవచ్చు. ప్రవర్తన సరిదిద్దుకోవటం అసాధ్యం కాదు. దయచేసి, దేవుని పేరు మిద దీక్షలు చేసేవారు మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండేలా, హిందూ ధర్మం యొక్క గౌరవం నిలిపేలా ఉంటారు అని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
మన ఇళ్ళల్లో, రోజూ పాడుకునే ఈ పాటలో కొన్ని చరణాలు మాత్రమె మనకు తెలుసు. ఈ రచన పూర్తీ పాఠం ఈ క్రింద ఇస్తున్నాను. ఇంకా చరణాలు ఎవరి దగ్గర అయినా ఉంటె దయచేసి తెలియచేయండి.
రామచంద్రయ జనకరాజ జ మనోహరాయ
మామకాభీష్ట దాయ మహిత మంగళం.
కోసలేంద్రాయ మందహాస దాస పోషకాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం.
చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం.
లలిత రత్న కుండలాయ తులసీవన మాలికాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం.
దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజా గురువరాయ భవ్య మంగళం.
పుండరీకాక్షాయ పూర్ణ చంద్ర వదనాయ
అండజ వాహనాయ అతుల మంగళం.
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం.
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరి వరాయ సర్వ మంగళం.
1.శాంతి మంత్రములు.
ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటికాలం లో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తీ అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలం లో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడె ఈ శాంతి మంత్రములు, సమాజం లో , దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వార పూర్వం రోజుల్లో బ్రాహ్మణులకు, గోవులకు భారతీయ సమాజం లో ఎంత ప్రాముఖ్యత ఉందొ తెలుస్తుంది.
1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
తా> సర్వ జీవులు రక్షింప బడు గాక. . సర్వ జీవులు పోషింప బడు గాక . అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం) . మన మేధస్సు వృద్ది చెందు గాక. మన మధ్య విద్వేషాలు రాకుండు గాక . ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాకా.
ఎంత మంచి భావనో కదా....
2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతి ర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు.
తా> సర్వులకు సుఖము , సంతోషము కలుగుగాక. సర్వులకు శాంతి కలుగు గాక. సర్వులకు పూర్ణ స్థితి (completeness ) కలుగుగాక. సర్వులకు శుభము కలుగుగాక.
3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...
తా> సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక. సర్వులు ఎ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక. అందరికీ ఉన్నతి కలుగు గాక. ఎవరికీ బాధలు లేకుండు గాక.

కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:
తా> మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్య స్యమలమై పండు గాక. దేశము లో ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక....
ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్ గమయ,
మృత్యోర్మా అమృతంగమయ,.
ఓం శాంతి: శాంతి: శాంతి:
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము (మిధ్య ) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. (అజ్ఞానం అనే ) అంధకారము నుండి (జ్ఞానస్వరూపమైన ) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము యొక్క దిశగా మమ్ము నడిపించుము.

4. స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య : శుభమస్తు నిత్యం , లోకా: సమస్తా సుఖినో భవంతు ...
తా> ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గం లో పాలింతురు గాక. గోవులకు, బ్రాహ్మణులకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.
5. ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణో , నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:
తా>> సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక.
బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను. సత్యము, బ్రహ్మము నన్ను రక్షించు గాక, నా గురువును, సంరక్షకులను రక్షించు గాక.
6. ఓం ద్యౌ శాంతి: అంతరిక్షం శాంతి:
పృథివీ శాంతి: ఆపా శాంతి: ఔషదయ శాంతి:
వనస్పతయ: శాంతి: విశ్వే దేవా: శాంతి:
బ్రహ్మ శాంతి: సర్వం శాంతి: శాంతి రేవా: శాంతి:
సామా: శాంతిరేది : ఓం శాంతి: శాంతి: శాంతి:
తా>> స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు, వనమూలికలు, అన్ని లోకము లందలి దేవతల యందు , బ్రహ్మ యందు, సర్వ జనుల యందు, శాంతి నెలకొను గాక. ( పంచభూతముల వలన కాని, బ్రహ్మ మొదలగు దేవతలా వలన కాని, అపాయములు కలుగకుండును గాక.) శాంతి యందె శాంతి నెలకొను గాక. నాయందు శాంతి నెలకొను గాక.
పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్ధించడం మన భారతీయ సంస్కృతీ లో ఉన్న గొప్పదనం.
ప్రపంచానికి కృష్ణ భగవానుడు స్వయంగా అందించిన ఒక గొప్ప సందేశం భగవద్గిత. ప్రతి కాలానికి, ప్రతి వర్గానికి సరిపడే సందేశాలు, ప్రతి సమస్యకు పరిష్కారాలు దొరికే అత్యుత్తమ గ్రంధం ఇది. భారతీయులే కాకుండా ఎంతోమంది విదేశీయులు ఈ గీత ను చదివి ఉత్తమ సంస్కారాన్ని పొందుతున్నారు. అనేక ఇంటర్వ్యూ లలో వారికి దిశానిర్దేశం చేసినది భగవద్గిత యే నని ఎంతో మంది మేధావులు చెప్పారు. ఎన్ని సార్లు చదివితే, అంత మన:శాంతిని ఈయగల ఏకైక గ్రంధం ఇది. చిన్నతనం నుంచి నేరుచుకొనే అవకాశం ఎలాగు ఉండటం లేదు. కనీసం కొంత వయసు వచ్చాక అయినా ఈ భగవద్గీత ను చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం అందరూ చేయాలి. ఈ పరమోత్క్రుష్టమైన గ్రంధాన్ని చదవడం ఎప్పుడో మానేసిందే కాక, ఇంట్లో ఎవరైనా మరణించినపుడు ఈ భగవద్గిత రికార్డు పెడుతున్నారు. ఎవరైనా ప్రముఖులు మరణించి నపుడు కూడా టీవీ లలోను కూడా ఇదే రికార్డు వేస్తున్నారు. ఫలితంగా భగవద్గిత చావు ఇంట్లో చదివేది అనే ఒక ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ తరం పిల్లలు, ఏ గుడిలోనో, అమ్మవారి, వినాయకుడి మండపల్లోనో, భగవద్గిత రికార్డు వేసినపుడు, ఇదేంటి, ఇక్కడ ఎవరు పోయారు, ఇప్పుడు భగవద్గిత ఎందుకు వినిపిస్తున్నారు అని అడిగే పరస్థితి వచ్చింది. ఇది ఎంతో విచారించవలసిన విషయం. పూర్వం ఎప్పుడో, ఎక్కడో, ఎవరో మరణించినపుడు, ప్రశాంతత కోసమో, లేక వేరే ఇంకే ఉద్దేశ్యంతోనో భగవద్గిత రికార్డు వేసి ఉంటారు. ఇప్పుడు అది ఎవరూ చెప్పని ఆచారం గా మారిపోయింది. దయచేసి, ఈ పవిత్ర గీతకు అటువంటి హోదాను అంటకట్టకండి. ఇకమీదట ఎవరైనా అలా చేసినా దయచేసి విజ్ఞులు ఖండించండి. మానవ మానసిక ఉన్నతికి తోడ్పడే ఇటువంటి గ్రంధ పారాయణ మీరు చేయండి. చేయించండి. మన:శాంతిని పొందడానికి ఉత్తమమైన మార్గం గీతను చదివి అర్ధం చేసుకొని, అందులో విషయాలను పాటించడమే.
****"భగవద్గీత కేవలం మరణము ఆసన్నమయినపుడో, మరణించిన తరువాతో వినిపించవలసిన గ్రంధం కాదు. దయచేసి గమనించండి. మీ దృష్టికి ఇటువంటి విషయం వచ్చినపుడు ఖండించండి. "****
భారత దేశం మిగిలిన ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం. ప్రపంచం లోని మిగిలిన దేశాలు ఎంతో కాలం నుంచి, సభ్యత సంస్కారాల కోసం భారత దేశం వైపు చూస్తున్నాయి. మన కట్టు బొట్టు, మన వేష ధారణా, మన పురాణాలు, ముఖ్యంగా భగవద్గిత నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఇక భగవద్గిత ను అనుసరించే విదేశీయులకు లెక్కే లేదు. అయితే అందుకు భిన్నంగా మన వారి సంస్కృతీ ని వంటపట్టించు కుంటున్నాం. పాశ్చాత్యులది ఒకింత స్వేచ్చా విహార సమాజం. అక్కడ అన్నీ అంగీకారమే. డేటింగ్ లు, ముద్దులు, సహజివనాలు. ఇవన్ని అక్కడ సమాజం అంగీకరించిన పద్ధతులు. మన సంస్కృతీ వేరు. మన సమాజం లో ముద్దులు, సరసాలు ఇవన్ని కూడా భార్య భర్తలకే పరిమితం. వాటి గురించి పది మందిలో మాట్లాడడం కూడా నిషేధం. విదేశీయులు వారి కి సంతోషం కలిగిన ప్రతి సందర్భాన్ని ముద్దుతోనే పంచుకుంటారు. వారు భార్యభార్తలైనా, స్నేహితులైన, ఇతర బంధువులు అయినా. ఒకసారి వివాహం అయిన తర్వాత, సొంత అన్నదమ్ములే సోదరి మిద చేయి వేసి మాట్లాడని సంస్కృతీ మనది. కాని ఇప్పుడు ఇదేమిటి? సాక్షాత్తు, దేశం లో అత్యధిక విద్యాదికులు ఉన్న రాష్ట్రం గా పేరు పొందిన కేరళ లో ఈ "కిస్ అఫ్ లవ్" కొత్తగా? అది మళ్లీ మొదటి నుంచి మాతృస్వామ్య సమాజంగా పేరు పడిన కోల్కతా కు పాకింది. పైగా దీనిని అమ్మాయిలే సమర్ధిస్తున్నారు. దీనిని నిషేధించ వచ్చిన పోలీసులతో, మా శరీరం మిద మీ ఆంక్షలు ఏమిటి అని అమ్మాయిలే ప్రశ్నించారు. ఈ విపరీతం ఏమిటి? శరీరం వారిదే అయినా, మనం ఒక సమాజం లో బ్రతుకుతున్నాం. ఒక సంప్రదాయం సంస్కృతీ లో బతుకుతున్నాం. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాన్ని బరితెగించి, బహిరంగ పరచవలసిన అవసరం ఉందా? లేదా ఈ పని వారు చేయటం వలన వారికీ కానీ, మన వ్యవస్థ కు గాని, మన సమాజానికి కానీ కించిత్తు ఉపయోగం ఉందా? అమ్మాయిలు సమర్ధిస్తున్నారు సరే, వారి తల్ల్లితండ్రులు కూడా సమర్ధిస్తున్నారా? ఈ వ్యవహారం లో పేపర్లకు ఎక్కినా ఆడపిల్లల తండ్రులు మరునాడు సవ్యంగా తల ఎత్తుకుని బయట తిరగాగాలిగారా? ఈ వ్యవహారం లో అయిన పరిచయాలు ఇంతటితో ఆగుతాయా? ఆడపిల్లల వస్త్రధారణను ఎవరైనా విమర్శిస్తే గందరగోళం చేసే మహిళా సంఘాలు, దీనిని ఎ విధంగా సమర్దిస్తాయి? ప్రతి విషయానికి రోడ్డు ఎక్కి ధర్నాలు , నిరసనలు చేసే మహిళలు, మహిళా సంఘాలు ఇంత వరకు ఎ ఒక్క రేప్ కేసులో కాని, గృహహింస కేసులో కాని బాధిత మహిళలకు న్యాయం చేసాయ? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, మనది కాని సంస్కృతిని మనం సొంతం చేసుకోవటం వలన ఏదైనా మేలు ఉందా? పెరుగుతున్న నాగరికత మనలను మళ్లీ ఆటవిక రోజుల వైపు పయనింప చేస్తోందా? ఇది అసలు నాగరికతేనా? విజ్ఞులు సమాధానం చెప్పమని ప్రార్ధన.
శీతాకాలం వచ్చేసింది
సబ్బులను దూరంగా పెట్టి సున్నిపిండి వాడే కాలం ఇది
సున్నిపిండి ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో ప్రయత్నిద్దాం
పెసలు అర కిలో
శనగలు 50 గ్రాములు 
బియ్యం 25 గ్రాములు
కచ్చూరాలు 10 గ్రాములు
బావంచాలు 10 గ్రాములు
కస్తూరి పసుపు 10 గ్రాములు
మంచిగంధం 10 గ్రాములు
బాదం పప్పు 25 గ్రాములు
వట్టి వేళ్ళు 10 గ్రాములు
కుంకుడు పొడి 25 గ్రాములు
శీకాయ పొడి 25 గ్రాములు
వీటిని ముందు చిన్న ముక్కలు చేసుకుని అప్పుడు మిక్సీ లో వెయ్యండి
లేదంటే మిక్సీ బ్లేడ్ గోవిందా
మరీ మెత్తగా అక్కర లేదు . జల్లించకుండా వాడండి .
మీ మేని మెరుపుకి ఇదే రహస్యం అని ఎవరికీ చెప్పకండి
ఇంత శ్రమ ఎవరు పడతారు అనుకుంటే బాబా రామ్ దేవ్ గారి షాప్ ల లో మంచి క్వాలిటీ సున్నిపిండి "ఉబూటాన్" అనే పేరుతో దొరుకుతుంది . 100 గ్రాములు 60 రూపాయలు . కొనుక్కోండి . చాలా ఖరీదు అనిపిస్తుంది . క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది .
సూచన : ఒకటి రెండు పదార్ధాలు లేక పోయినా పరవాలేదు .
కొందరికి పసుపు పడదు అనుకుంటే వెయ్యకండి . ఒకటి రెండు పదార్ధాలు లేక పోయినా పుట్టి మునిగి పోదు . చర్మ రక్షణకు ఆయిల్ రాసుకుంటే మంచిది . అది నువ్వుల నూనె అయితే మరీ మంచిది
courtesy: raghavanand mudumbaa gaaru.
శీతాకాలం -- వివిధ నూనెల ఉపయోగం.
శీతాకాలం వచ్చేసింది. చర్మానికి కష్టకాలం మొదలయింది. ఈ కాలం లో ప్రకృతి రమ్యంగా ఉన్నప్పటికీ, చర్మం పగిలి చిరచిర లాడుతుంటే, మహా చిరాగ్గా ఉంటుంది. కొంత మంది సున్నిత చర్మ తత్త్వం ఉన్న వాళ్లకి చర్మం తీవ్రంగా పగిలి, రక్తం కూడా వస్తుంది. ఈ కాలం లో సబ్బులను వదిలి సున్నిపిండి తో స్నానం చేయాలి. చలి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకుండా, గోరువెచ్చని స్నానం చేయడం, చర్మానికి, ఆరోగ్యానికి కూడా చాల మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు చలి గాలి సోకకుండా, ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం ఉత్తమం. అలాగే, ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించడం మేలు. స్నానానికి ముందు నువ్వుల నునె వ్రాసుకొని, సున్నిపిండి తో స్నానం చేయాలి. పూర్వకాలం లోనే నువ్వులనూనె ఉపయోగాలను మన పెద్దలు గుర్తించారు. చర్మానికి వట్టిగా వ్రాసుకున్నా, లేక మర్దనా చేసుకున్నా కూడా ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి, అలాగే గుండె పనితీరుకు కూడా నువ్వులనూనె మేలు చేస్తుంది. నువ్వుల నూనెను చర్మం లోకి బాగా ఇంకేలాగా మర్దన చేసుకొని కొంత సేపు ఎండలో నుంచుంటే, గుండె పని తీరు మెరుగు పడుతుంది. ఇందులో ఉండే కాల్షియమ్, మెగ్నీషియం చర్మ సౌందర్యానికి ఎంతో దోహద పడతాయి. తరువాతది కొబ్బరి నూనె, దీనిని మర్దన చేసుకోవడం వల్ల చర్మం బిగుతుగా ఉండడమే కాక, చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కొంతమందికి కొబ్బరి నూనె వల్ల చర్మం బిరుసుగా అయినట్టు అనిపిస్తుంది. అటువంటి వారు కొబ్బరి నూనె, రోజ్ వాటర్ కలిపి వ్రాసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. బాదాం నూనె చర్మానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. ఇందులో ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ లు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొన్ని బాదాం నూనెలు కొంచెం జిడ్డుగా , ఉన్నట్టు అనిపిస్తాయి. అటువంటప్పుడు కొద్దిగా వెచ్చ చేసి వ్రాసుకుంటే, ఆ జిడ్డు ఉండదు. దుస్తులు మరకలు పడవు. ఆలివ్ ఆయిల్ కూడా విటమిన్ ఇ, కలిగి ఉంటుంది కాబట్టి చర్మం మృదువుగా మారడానికి దోహదం చేస్తుంది. దీనిని ఆహారం లో కూడా ఉపయోగించ వచ్చు. అనవసర కొవ్వును తీసివేసి, మంచి కొవ్వును పెంచడం లో ఇది సహాయకారి. అవకడో ఆయిల్, చర్మం మిద ముడుతలను తగ్గిస్తుంది. వచ్చే ముడుతలను నివారిస్తుంది. ఈ నూనెలు అన్నీ చర్మానికి మేలు చేసేవే. మృదువుగా ఉంచి, ముడుతలను నివారిస్తాయి. నూనె వ్రాసుకుని, మర్దనా చేసుకుని స్నానం చేసే వీలు, సమయం లేకపోతే, స్నానం చేసిన తర్వాత, ఆఖరున కొద్ది నీటిలో కొన్ని చుక్కల నునె కలిపి పోసుకున్నా, ప్రయోజనం ఉంటుంది. అలా కాక, moisturiser వాడేవాళ్ళు, స్నానం చేసాక, చర్మం కొంచెం తడిగా ఉండగానే వ్రాసుకుంటే శరీరం అంతా సమానంగా వ్యాపించి, లోపలికి ఇంకుతుంది. పాదాలకు సాక్సులు వేసుకోవడం కూడా ఈ కాలం లో తప్పనిసరి. సున్నిపిండి వాడె తీరిక లేని వాళ్ళు, పెసర పిండి , బియ్యం పిండి సమపాళ్ళలో తీసుకుని శరీరం రుద్దుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
తేనెటీగలు చివరి భాగం.
ఆయుర్వేదం లో కంటికి సంబంధించిన అనేక ఔషధాలలో తేనెను వాడతారు. తేనెకు కొవ్వును కరిగించే గుణం ఉంది. బ్రాంకైటిస్, ఆస్తమ వంటి వ్యాదులలో కఫాన్ని కరిగించి బయటకు పారద్రోలే గుణం తేనెకు ఉంది. టి.బి. వ్యాధి నివారణ లో తేనెను కూడా వాడుకుంటే, రోగ నిరోధక శక్తి పెరిగి, దగ్గు తగ్గి, బరువు పెరుగుతారు. తేనే రక్తహీనతను తగ్గిస్తుంది. బాగా బలహీనం గా ఉన్నవారికి సత్వర నివారణ ఇస్తుంది. కాలేయం, గుండె సంబంధిత వ్యాదులలో తేనెను వాడి ఫలితాలు తొందరగా పొందవచ్చు. నరాల ఉద్రేకాన్ని తగ్గిస్తుంది. ఉద్వేగం, కోపం, టెన్షన్, ఆందోళన, వంటి మానసిక ఉద్రేకాలకు తేనే మంచి ఔషధం. బాక్టీరియా ను చంపుతుంది. శరీరం పైన వచ్చిన పుండ్లు తేనెను పైపూత గా వ్రాస్తే త్వరగా తగ్గుతాయి. అల్లం తో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు లాంటివి తగ్గించుతుంది. మల బద్దకాన్ని నివారిస్తుంది. గోరువెచ్చని నీటితొ కలిపి తీసుకుంటే, గొంతు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అన్ని రకాల కీళ్ళ జబ్బులను, మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. చర్మ కాంతిని పెంచుతుంది. రక్త శుద్ధికి చక్కటి తేలికైన ఔషధం తేనే. ఉదయం పరగడుపున గ్లాసుడు గోరువెచ్చని నీటిలో తేనే, నిమ్మరసం కలిపి తీసుకుంటే, బరువు తగ్గుతారు అనే విషయం అందరికీ తెలిసినదే. తులసి ఆకుల రసంతో తేనే కలిపి ఇస్తే, పసిపిల్లల్లో కఫ బాధలు తొలగిపోతాయి. తేనెను కొంచెం వెచ్చబెట్టి ముఖానికి వ్రాసుకుని 20 నిముషాల తర్వాత కడిగేస్తే, నల్లమచ్చలు పోతాయి.
తేనెను నిమ్మరసం లేకుండా తీసుకుంటే, కొన్ని రకాల అల్సర్స్, అన్నవాహిక కు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. తేనెను రోజు తీసుకోవటం వలన కొన్ని రకాల కేన్సర్ల లో బాధలు తగ్గించుకోవచ్చు. ఇది తక్షణ శక్తి నిచ్చే ఒక మంచి ఔషధం. ప్రాచీన కాలం లో ఒలింపిక్ క్రీడాకారులు పోటీలకు ముందు సామర్ధ్యం పెంచుకోవడానికి తేనెను సేవించేవారుట. చర్మము తేమ కోల్పోయి పొడి పొడి గా తయారయినపుడు తేనే ఒక మంచి నివారణా సాధనం.
తేనెటీగలు ( రెండవ భాగం)
తేనెటీగలు ఒక్క అంటార్కిటికా లో తప్ప ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో ఈని జాతులున్నాయో తెలుసా? దాదాపు 2000 రకాలు! ఇవన్నీ కూడా పోద్దునీ జామ్మ్మంటూ పట్టు వదిలి ఎగిరిపోయి దాదాపు 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్షలాది పూల మిద వాలుతూ తేనెను సేకరించి పట్టుకు తెస్తుంటాయి. ఎందుకంటే, ఆ పట్టులో ఉండే ఏకైక రాణీ ఈగ రోజుకు సుమారు 2000 గుడ్లు పెడుతూ ఉంటుంది. ఒకో గుడ్డూ ఒకో గదిలో ఉండేలా తేనెటీగలు మైనంతో పట్టు నిర్మిస్తాయి. ఆ గుడ్డు నుంచి వచ్చే లార్వాలకు ఆహారంగా ఇవ్వడానికే తేనెటీగలు తేనెను సేకరిస్తాయి. ఆ తేనెను తింటూ గుడ్డు దశ నుండి 21 తోజుల్లో తేనెటీగలు తయారవుతాయి. అపడు వాటిలో కొన్ని ఈ పట్టు నుంచి మరో చోటకి ఎగిరిపోయి ఇండో పట్టు కట్ట్కుంటాయి. అవి కేవలం వాటి కోసమే తేనే సేకరించు కుంటున్నా, మధ్యలో మనకి ఎంతో ఉపకారమ చేస్తున్నాయి అన్నమాట. మీకు ఇంకో విషయం తెలుసా! ఎన్ని సంవత్సారాలు నిలవ ఉన్నా, పాదవని ఆహార పదార్ధం ప్రపంచం మొత్తం మీద తేనే ఒక్కటే!
ఇంతకీ తేనెటీగలు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అదే అంతుబట్టడం లేదు. దీని మీదనే శాస్త్రవేత్తలు పర్శోధనలు చేస్తున్నారు. తేనెటీగలు తపిపోతున్న పరిస్థితికి colony collapse disorder అని పేరు పెట్టి రరకాల పరిశోధనలు చేస్తున్నారు. పంట పొలాల్లో వాడె అపయకరమైన్ క్రిమి సంహారక మందుల వాళ్ళ, కొని రకాల వైరస్ ల వలన, చెట్లు కొట్టేయడం వలన అలా జరగవచ్చని భావిస్తున్నారు. అలాగే మనం విపరీతంగా వాడే సెల్ ఫోనుల ద్వారా వ్యాప్తి చెందే సూక్షం తరంగాల వాళ్ళ కూడా తేనెటీగలు తమ దారి తెలుసుకోవటం లో గందరగోళానికి గురి అయుతున్నాయి అనేది మరో ఊహ.
ప్రక్రుతి వైద్యం లో తేనెను చాల విలువైన ఔషధ గుణాలు ఉన్నదిగా గుర్తించి చాలా విరివిగా వాడతారు. ప్రక్రుతి వైద్యం లో తేనెకు చాలా విశిష్టమైన ప్రధానమైన స్థానం ఉంది. ప్రక్రుతి వైద్యాన్ని, తేనెను విడదీసి చూడలేము. ముఖ్యంగా ఉపవాస దీక్షలో తేనే చేసే మేలు ఇంతని చెప్పలేము.
తేనెటీగలు పూల నుంచి సేకరించిన తేనెను, తెనేతుట్టలో భద్రపరుస్తాయి. ఈ తేనెలో 75 శతం నీరు ఉంటుంది. కానీ కొద్దికాలమైన తరువాత తేనే చిక్కని నీరు ఆవిరి అవుతుంది. తేనెటీగలు కేన్ షుగర్ రూపంలో తేనెను సంగ్రహించినా, తేనే తుట్టలో రసాయనిక మార్పు జారిగి దేక్ట్రోస్, లేవులోస్ గా మారుతుంది . ఇందులో ఐరన్, ఫోస్ఫరాస్, కాల్షియం , సోడియం, పొటాషియం, మేగ్నేషియం. సల్ఫర్, ఉంటాయి. తయమిక్, విటమిన్ సి, నియాసిన్ కూడా ఉంటాయి. దీనిలోని చక్కర పదార్ధం చాలా చక్కగా జీర్ణం అవుతుంది.
గమనిక..... ఈ పోస్ట్ నా సొంతం కాదు. ఒక కరపత్రం లోని సారాంశం. బాగుంది అని పోస్ట్ చేస్తున్నాను. ఇది వ్రాసిన వారికీ నమస్కారాలు.
ప్రపంచం లో ఒక్క తేనెటీగ కూడా లేకుండా పోతే, ఈ భూమి మిద మనుషులందరూ కేవలం నాలుగేళ్ళలో మరణిస్తారు. ఈ మాటలన్నది ఎవరో కాదు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్. తేనెటీగల అవసరం మనకు అలాంటిది. తేనెటీగల కారణంగా ప్రపంచం మొత్తం మిద ఉత్పత్తి అవుతున్న ఆహారం విలువ ఎంతో తెలుసా? 215 బిలియన్ డాలర్లు. అదేంటి? తేనెటీగల వలన వచ్చేది తేనే ఒక్కటే కదా అంటారా? వీటి వల్ల రకరకాల ఆహార పదార్ధాలలో మూడో వంతు లభిస్తోంది. ఈ వంతు ఆహారాన్ని సమకూర్చడానికి వెనుక కనీసం 6 లక్షల తేనెటీగల శ్రమ ఉంది.
తెనేతీగాలకీ, పంత్గాలకీ సంబంధం ఏమిటనే సందేహమా? పుప్పొడి వ్యాప్తి చెందితేనే, పుష్పాలు ఫలదీకరణం చెందుతాయి అని తెలిసినదే. మన ఆహారం లో ఆపిల్స్, పైనపిల్స్, పుచ్చకాయలు, స్త్రబెర్రీలు, మామిడి పళ్ళు, వాటితో తయారు చేసే జం లు, జెల్లీలు, అలాగే, గోధుమలు, రాగులు, సోయాబీన్స్, బఠానీలు, బాదాం పప్పులు, మొక్కజొన్న, చెర్రీలు లేకుండా మనం ఉండగలమా? తేనెటీగలు ఉండకపోతే ఇవన్ని ఉండవు మరి. తేనెటీగలు తేనే సేకరణ లో భాగంగా ఒక పువ్వు పై నుండి, మరొక పువ్వు పై వాలి పుష్పాలు ఫలదీకరణ చెందటం లో సహాయం చేస్తాయి.
అయితే, ఇప్పుడు తేనెటీగలు తప్పిపోతున్నాయి. ప్రపంచం అంతా కంగారు పడుతున్న విషయం ఇది. పట్టు వదిలి తేనే కోసం బయటికి వెళ్ళిన చాలా తేనెటీగలు తిరిగి వెనక్కి రావడం లేదట. దాంతో తేనెపట్టులో ఉండే వాటి పిల్లలకు ఆహారం అందక చనిపోతున్నాయి. ప్రప్రంచ వ్యాప్తంగా కోట్లాది తెనేపత్తులు ఇలా ఖాళీ అయిపోతున్నాయి. అమెరికా, యూరప్ దేశాలలో మరీ ఎక్కువగా ఉంది.
(ఇంకా ఉంది)
రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.
రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,
1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
రుద్రాక్షమాల ధారణవిధి:-
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.
రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:-
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.
జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు:-
నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని నవముఖి
భరణి షణ్ముఖి
కృత్తిక ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి ద్విముఖి
మృగశిర త్రిముఖి
ఆరుద్ర అష్టముఖి
పునర్వసు పంచముఖి
పుష్యమి సప్తముఖి
ఆశ్లేష చతుర్ముఖి
మఖ నవముఖి
పుబ్బ షణ్ముఖి
ఉత్తర ఏకముఖి, ద్వాదశముఖి
హస్త ద్విముఖి
చిత్త త్రిముఖి
స్వాతి అష్టముఖి
విశాఖ పంచముఖి
అనురాధ సప్తముఖి
జ్యేష్ఠ చతుర్ముఖి
మూల నవముఖి
పూర్వాషాఢ షణ్ముఖి
ఉత్తరాషాఢ ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం ద్విముఖి
ధనిష్ట త్రిముఖి
శతభిషం అష్టముఖి
పూర్వాభాద్ర పంచముఖి
ఉత్తరాభాద్ర సప్తముఖి
రేవతి చతుర్ముఖి............... ఓం నమఃశివాయ.. హరహర మహదేవ శంభోశంకర
శ్రీ మోడీ గారిని ఒక మహిళా అడిగిన ప్రశ్న , దానికి మోదిజీ ఇచ్చిన జవాబుకు తెలుగు అనువాదం. మిత్రుల కోరిక మిద పోస్ట్ చేయడమైనది.
ప్రశ్న:
మీరు భవిష్యత్ భారతాన్ని దర్శిస్తున్నారు కాదా? మీరు భారత దేశాన్ని పూర్తీ స్థాయి హిందూ దేశం గా ఊహిస్తారా? లేక అందులో ముస్లిములకుకూడా స్థానం ఉందా?
మోడీ గారి జవాబు.
ఈ ప్రశ్న హిందూ మరియు హిందుత్వ ను అర్ధం చేసుకోలేని వాళ్ళు వేసే ప్రశ్న. హిందుత్వ ఏమి చెప్తుంది" "ఏకం సత్ విప్రం బహుధా వదంతి". సత్యం ఒక్కటే, దానిని తెలుసుకొనే, తెలియపరిచే మార్గాలు వేరు వేరు. ప్రపంచం లో ఒక్క హిందూ మాత్రమె భగవంతుడు ఒక్కడే అని చెప్తాడు. హిందువుగా పుట్టిన వాడు ఎవ్వడూ,క్రిస్టియన్ ల దేవుడు, ముస్లిముల దేవుడు, సిక్కుల దేవుడు అని చెప్పదు. భగవంతుడు ఒక్కడే అని చెప్తాడు. భక్తుడు ఎలా ఊహిస్తే, భగవంతుడు అలా కనిపిస్తాడు. ఒక పహిల్వానుకు హనుమంతుడు దేవుడు. ఎక్కడైతే భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతం పుట్టిందో, ఈరోజు ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు ఉదయించడానికి కారణం, మనం హిందుత్వను అర్ధం చేసుకోలేక పోవడమే. ఇజ్రాయెల్ యొక్క అధికారిక గ్రంధం లో ఇలా వ్రాయబడి ఉంది. " మా మీద ఒక్క జర్మనీ ఏ కాదు, ఈ 2500 సంవత్సరాలలో, ప్రపంచం లో ఎ మూల కు వెళ్ళినా, మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క భారత దేశం లోనే గత 2500 సంవత్సరాలలో మా మీద దాడులు, అత్యాచారాలు జరగలేదు. "
పార్శీలు మన దేశానికి వచ్చినపుడు గుజరాత్ తీరానికి వచినపుడు , గుజరాత్ లో రాజుల పాలన ఉండేది. వారు తమతో తీసుకువచ్చిన అగ్ని ని ఒకచోట స్థాపించి, మా సంప్రదాయం ప్రకారం, ఈ అగ్నిని స్థాపించిన చోటుకు 50 కిలోమీటర్ల పరిధిలో ఇరానియన్ కాని వారు ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పారు. అప్పుడు ఉన్న రాజులూ హిందువులు. అప్పుడు ఉన్న సమాజం హిందూ సమాజం. కానీ వారు చేసిన డిమాండ్ మాత్రం హిందూ వ్యతిరేక డిమాండ్. కాని మన రాజులూ దానిని వ్యతిరేకించలేదు. మీ సంప్రదాయాన్ని, మీ విశ్వాసాలను గౌరవిస్తాము అని భరోసా ఇచ్చి, వారి కోరికను మన్నించి, అందుకు తగిన ఏర్పాట్లు చేసారు. అటువంటి దేశం ఈనాడు, తీవ్రవాదం అనే కోరల్లో చిక్కుకుంది. ఈ అంశంలో ఎమోషనల్ సపోర్ట్ ఉందొ లేదో తెలియదు కానీ, ఎమోషనల్ బ్లాకు మెయిలింగ్ మాత్రం బాగా జరుగుతోంది. ఇక్కడ మతం అనేది బాగా ఉపయోగపడుతోంది. దానికి కారణం మీ మతం కన్నా, మా మతం గొప్పది అనే బావన. ఎక్కడ ఈ భావన జనిస్తుందో, అక్కడ సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ తీవ్రవాదం వరకు వెళుతుంది. హిదువులు సర్వమత సహనం కలవారు. అన్ని మతాలను గౌరవించే వాళ్ళు. ఎవరైనా, మీరు పూజించేది ఎ దేవుదినైనా, విశ్వాసం తో పూజించండి, మీకు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని కానీ, మీరు ఎ మత గ్రంధాన్ని చదివినా, పాటించినా విశ్వాసం తో చేయండి అని చెపితే, వాడు ఖచ్చితంగా హిందువే. ఎందుకంటే మౌలికంగా ఇది హిందుత్వ సిద్ధాంతం. కానీ, ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోలేదో, ఈ విషయంపై సందేహాలు లేవనేత్తుతారో, వారి వల్లే సమస్య ఉత్పన్నం అవుతుంది అని నేను భావిస్తున్నాను.
పూర్వం రోజుల్లో అంటే ఓ 20, 30 సంవత్సరాల వెనుక పిల్లలకు ఎలాగైనా చదువు రావాలి అనే ఉద్దేశ్యం తో బళ్ళో టీచర్లకు అప్పగించి, కొట్టో, తిట్టో, మా వాడికి కాసిని అక్షరం ముక్కలు నేర్పించండి అనేవారు తల్లితండ్రులు. ఆ టీచర్లు కూడా, వాళ్ళ కి ఉన్న జ్ఞానాన్ని అంతా పిల్లల మెదళ్ళలోకి పంపడానికి శతవిధాలా ప్రయత్నించే వారు. పరీక్షల రోజుల్లో కొంచెం డల్ గా ఉన్న విద్యార్ధులను ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ చదివించేవారు. పరీక్షలు ఉన్నన్నాళ్ళు పిల్లల పడక మాస్టారి ఇంట్లోనే. ఈ క్రమంలో పిల్లలు చదవలేదనో, పాఠం అప్పచేప్పలేదనో, పనిష్మెంట్ ఇవ్వాలి అంటే, బెత్తం తో కొట్టడమో, గోడ కుర్చీ వేయించాడమో, బెంచి మీద నుంచో బెట్టడమొ, లేదా మోకాళ్ళు వెయించడమొ, ఇటువంటి శిక్షలు ఉండేవి. తప్పితే దెయ్యం అవహించినట్టు పిల్లవాడి ప్రాణాలకే ముప్పు వచ్చేలా కొట్టటం ఉండేది కాదు. పిల్లలు కూడా మాస్టారు అంటే భయపడే వారు కానీ, సినిమాలలో చూపించినట్టు వారినే బ్లాకు మెయిల్ చెయ్యడం ఆనాటి కుర్రాళ్ళకి చేతకాలేదు. పిల్లలకు ఇంట్లో తల్లితండ్రుల, తాతల భయం, స్కూల్లో టీచర్ల భయం ఉండేది. క్రమశిక్షణతో ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో తల్లితండ్రుల గారం, సరే, తాతలు ఇప్పుడు వాళ్లతో ఉండడం లేదు కాబట్టి, ఆ ప్రశ్నే లేదు. స్కూల్లో పిల్లలను కొడితే ఏమౌతుందో అనే భయం, ఎవడు పోట్లాడడానికి మీదకు వస్తాడో అనే భయం, ఎప్పుడు శ్రీముఖం అందుకోవాలో అనే భయం. వీటి వలన, పిల్లలకు చదువు వచ్చేలా చెప్పడం అనే బాధ్యత నుండి టీచర్లు తప్పుకుని, కేవలం చదువు చెప్పేస్తున్నారు అంతే. ఇదివరకు 40, 45 మంది పిల్లలు ఉన్న క్లాస్సులో ఎవరు తెలివైన వాడు, ఎవరు కొంచెం డల్ స్టూడెంట్ అనేది గమనించుకుని, డల్ స్టూడెంట్స్ మీద ప్రత్యెక శ్రద్ధ తీసుకునే వారు. ఎంత మొద్దు వెధవ అయినా కనీసం స్కూల్ ఫైనల్ పాస్ అయేలా చదువు చెప్పేవారు. ఇప్పుడు దానికి వ్యతిరేకం. ఎవరు తెలివైన వాడో, ఎవరు మెరిట్ స్టుడెంటొ చూసి, వాళ్ళకు రాంకులు వచ్చేలాగా చదువు చెప్తున్నారు. ఎందుకంటే తెలివైన వాడు మంచి రాంక్ తెచుకుంటే వీళ్ళ స్కూల్ కి పబ్లిసిటీ జరుగుతుంది. మరి డల్ స్టూడెంట్ ని పట్టించుకునే వాడెవడు? వాడు కూడా వాళ్లతో సమానంగా ఫీజు కట్టి, గంగలో కలవాలి. మెరిట్ స్టూడెంట్ కి ఫీసు లో రాయితీ. డల్ స్టూడెంట్ చచ్చినట్టు మొత్తం ఫీజ్ కట్టాల్సిందే. యింక క్లాసు టెస్ట్ లో వచ్చిన మార్కులను బట్టి సెక్షన్లు మార్చడం ఇంకో దౌర్భాగ్యం. ఒక డల్ స్టూడెంట్ ఇంకా వెనుక సెక్షన్ లోకి వెళ్తే, వాడి మనోభావాలు ఎలా ఉంటాయి.వాడు అసలు చదువుతాడా? ఇంకా డల్ అయిపోతాడ? అలాగే ఒక మెరిట్ స్టూడెంట్ ఖర్మ కాలి ఒక సెక్షన్ వెనుకకు వెళ్తే, వాడి ఆందోళన వర్ణనాతీతం. 16,17 సంవత్సరాల లోపునే పిల్లలకు ఇంత ఒత్తిడి అవసరమా? గదికి 70 మందికి పైబడి విద్యార్ధులు ఉన్న క్లాసులో పిల్లలకు టీచర్ కి మధ్య ఒక అనుబంధం ఉంటుందా? ఆ స్కూల్ చదువు అయిపోయి బయటికి వెళ్ళిపోయాక 4,5 సంవత్సరాలకు ఆ టీచర్ చెప్పినది కాని, ఆ టీచర్ తో ఉన్న బంధం కానీ పిల్లలు గుర్తు చేసుకుంటారా? ఇక ఇంటికి వచ్చి టీచర్ మీద ఏదైనా నెపం వేస్తె, ఇదివరకు అయితే, టీచర్ ని సమర్ధించి పిల్లలతోనే పోట్లాడేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు నీకెందుకు, నేను రేపు వచ్చి మాట్లాడతానుగా అని పిల్లలను సమర్ధిస్తే, వాడు అసలు ఎవరి మాట వింటాడు? ఫలానా ఒకడు పాస్ అవ్వాలి, ఇది నాకు ఒక సవాల్ అని టీచర్లు అనుకోవడం లేదు. గురుర్బ్రహ్మా, గురుర్విష్ణు అని పిల్లలూ, తల్లితండ్రులు అనుకోవడం లేదు. పైగా పిల్లలతో సమానంగా పెద్దలు కూడా టీచర్ల పై సెటైర్లు. ఈ పరిస్థితులలో పెరిగిన పిల్లలు, రేపు సమాజానికి ఎలా ఉపయోగపడతారు? వారు సమాజానికి ఏమి సందేశం ఇస్తారు?
ఈ పోస్ట్ నేను ముఖ్యం గా స్త్రీల కోసం వ్రాస్తున్నాను. స్త్రీల యొక్క శరీర పని తీరును బట్టి, వారి హార్మోన్ లెవెల్స్ ను బట్టి వారికీ కాల్షియమ్ చాలా చాలా అవసరం. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినా స్త్రీలకూ కాల్షియమ్ ప్రతిరోజూ తీసుకోవడం తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ వారిలోని హోర్మోన్స్ యొక్క అసమతుల్యత వల్ల కాల్షియమ్ తగ్గుతూ ఉంటుంది. శరీరం తయారుచేసుకునే కాల్షియమ్,తీసుకునే ఆహారం నుంచి వచ్చే కాల్షియమ్ వారికి సరిపోదు. ఫలితంగా ఎముకల మిద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మగవారిలో కన్నా స్త్రీలకూ ఎముకల సంబంధించిన వ్యాధులు ఎక్కువ గా రావడానికి ఇదే కారణం. సాధారణంగానే స్త్రీలు ఇంటిలోని మిగిలిన సభ్యుల ఆరోగ్యం మిద పెట్టె శ్రద్ధ, తమ ఆరోగ్యం మిద చూపించారు. పని వత్తిడి, కొంత నిర్లక్ష్యం వీటికి కారణాలు. ఈ కాల్షియమ్ లోపాన్ని అధిగమించ డానికి వైద్యులు పాలు, పెరుగు, పనీర్, వంటి పదార్ధాలు, కాల్షియమ్ టాబ్లెట్స్ తీసుకోమని చెప్తారు. నడివయసు స్త్రీలలో కాల్షియమ్ తీసుకోవడం తప్పని సరి. కాల్షియమ్ నిల్వలు ఎక్కువగా ఉండే పదార్ధాలు. : పాలు, పాల ఉత్పత్తులు, పాలకూర, టమాటాలు, జామకాయలు, మొదలైనవి. ఐతే, మన అందరికీ తెలియని ఇంకొక పదార్ధం రాగులు. వీటిలో ఉండే కాల్షియమ్ నిల్వలు అపారం. కొంత మంది దీనితో జావ కాచుకుని తాగుతారు. కొంతమంది రాగి మాల్ట్ లాగా చేసుకుని పాలతో తీసుకుంటారు. మరి కొంతమంది దీనితో ఇడ్లీలు, అట్లు చేసుకుంటారు. రాగులు కాల్షియమ్ కొరకే కాకుండా ఇంకా ఎన్నో విధాల మనకు మేలు చేస్తాయి.
1. వీటిని ఇంక పోలిష్ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి, పూర్తీ ప్రక్రుతి పరమైన అన్ని లాభాలు పొందవచ్చు. 2. వీటిలో పీచు పదార్ధం చాలా విరివిగా ఉంటుంది కాబట్టి, జీర్ణ సమస్యలకు, బరువు తగ్గటానికి ఉపయోగ పడుతుంది. 3. కాన్సర్ రాకుండా కాపాడుతుంది. 4. అన్నవాహిక కు మేలు చేస్తుంది. 5. చెడు కొవ్వును తొలగిస్తుంది కాబట్టి, రక్త నాళాలు మూసుకు పోయే సమస్య ఉత్పన్నం కాదు. 6. తద్వారా గుండె పోటు ముప్పును తొలగించుకోవచ్చు. 7. పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ రోగులకు కూడా మంచిది. 8. ఐరన్ విరివిగా ఉండడం వలన రక్తహీనత ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 9. ఇందులో antioxidants మరియు aminoacids ఉండటం మూలంగా వత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 10. ప్రోటీన్లు, ఎమినో ఆసిడ్లు, రిబోఫ్లావిన్ ఇంకా ఎన్నో ఖనిజాలు రాగులలో పుష్కలంగా ఉన్నాయి. 11. ఇందులో ఉండే విటమిన్ సి. ఐరన్ ను శరీరం చక్కగా ఉపయోగించుకునేలా చూస్తుంది. అందువలన రక్తహీనత ఉన్న రోగులకు రాగులు చక్కటి ఆహారం. 12. పాలిచ్చే తల్లులకు పాలు మరింత పెరిగేటట్టు తోడ్పడుతుంది. 13. చర్మం ముడుతలు పడకుండా, బిగుతుగా ఉంది యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
1. రాగులు ఒకసారి కడిగి ఎండలో ఆరనిచ్చి పొడి కొట్టుకుని కొంచెం మరిగిన నీళ్ళలో కలిపి జావ చేసుకోవచ్చు.
2. రాగులు కడిగి గుడ్డలో మూటకట్టి, మొలకలు వచ్చాక నీడలో ఆరబెట్టి, కొంచెం వేయించి, ఏలకులు, బాదాం పప్పు తో సహా పొడి కొట్టి, పాలలో కలుపుకొని తీసుకోవచ్చు.
3. ఉడికిన నీటిలో కలిపి ముద్దగా చేసుకొని తినవచ్చు.
4. బియ్యం పిండి, రాగి పిండి, మైదా కలుపుకొని అట్లు లా తినవచ్చు.
5. ఇలా ఏ విధంగాను ఇష్టం లేని వారు, మామూలుగా చేసుకునే దోసెలు, చపాతీలు, వంటి వాటిల్లో ఒక్కో గరిటెడు పిండి కలుపుకొని దోసెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు.
6. స్వీట్ ఇష్టమైన వారు రాగి పిండిని నేతిలో పచ్చి వాసనా పోయేవరకు వేయించి అందులో బెల్లం పొడి కలిపి, నేతితో ఉండలు చుట్టుకుని మినప సున్ని లాగా కూడా చేసుకోవచ్చు.
7. రాగి జావ ను, ఉప్పు కలిపి మజ్జిగాతోను, లేదా బెల్లం పొడి కలిపి తీపిగాను కూడా తీసుకోవచ్చు.
తమిళ వాళ్ళు ఈ రాగి జావను తప్పని సరిగా ఉదయాన్నే తీసుకొంటారు.దయచేసి, ఈ రాగుల గొప్పదనం గుర్తించి, వీటిని మీ ఆహారం లో ఒక భాగం చేసుకుని, ఆరోగ్యం పొందండి. . మహిళలు అందరికీ ఇదే నా విన్నపం
హేవిటో ! ఆడవాళ్ళు నిముషానికి 19 సార్లు కనురెప్పలు ఆడిస్తే, మగవాళ్ళు 11 సార్లే ఆడిస్తారుట. ఇందులో కూడా పిసినారి తనమే..... మాట్లాడడం తక్కువ, నవ్వటం తక్కువ.... కనురెప్పలు ఆడించటానికి నొప్పి ఏమిటండీ విడ్డురం కాకపోతే, ఏదైనా అంటే ఆడవాళ్ళను హేళనగా మాట్లాడడం, లోడలోడా వాగుతారు అని. అసలు ఆడవాళ్లు మాట్లాడకపోతే, ఎంత నష్టం ఉందొ మగవాళ్ళకు ఏమి తెలుసు? ఆశమ్మ, పోశమ్మ కబుర్లు అని మనను ఆడిపోసుకుంటారు కానీ, మన వాళ్ళ ఎంత బ్రాండెడ్ బిజినెస్ జరుగుతోందో? ఫలానా షాప్ లో నెక్లెస్ ల డిజైన్లు బాగున్నై, ఈ సారి అక్కడ ట్రై చేయండి, ఫలానా షాప్ లో కొన్న కాటన్ చిర రంగు పోతోంది, అక్కడ కొనకండి, ఫలానా హోటల్ లో భోజనం బాగుంది, ఫలానా షాప్ లో పప్పులు బాగు చేసుకోక్కర లేకుండానే వందేసుకోవచ్చుట అనే పబ్లిసిటీ ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుంది? ఇది నా మాట కాదండోయ్. ఒక సర్వే లోనే చెప్పారు. ఆడవాళ్ళ మౌత్ పబ్లిసిటీ బ్రాండెడ్ పబ్లిసిటీ కన్నా ఎక్కువ పని చేస్తుంది అని. అందుకే హోటల్స్ కు ఎక్కువ ప్రచారం చేయరు చూసారా! ఒక ఫంక్షన్ కి వెళ్లి ఆడవాళ్ళ మాటలు వింటే, వికెపెడియా ఎందుకు పనికొస్తుంది? చిన్న పిల్లల దగ్గర కూర్చుంటే ఆనందం, వయసులో ఉన్న ఆడపిల్లల వద్ద కూర్చుంటే ఫాషన్ ప్రపంచం మన కళ్ళ ముందు ఉండదూ... అలాగే, వయసయిన వాళ్ళ దగ్గర కూర్చుంటే, వాళ్ళు చెప్పే కబుర్లలో పుణ్యానికి పుణ్యం, జ్ఞానానికి జ్ఞానం వచ్చేయ్యవూ... అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కన్నా మంచి కౌన్సిలర్లు ఎన్ని డిగ్రీలు చదివినా ఉంటారా? ఇప్పుడంటే ఈ దిక్కుమాలిన టీవీ సేరియల్లు వచ్చి, ఎవరికీ వారు తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు కానీ, ఇదివరకు ఇరుగమ్మలు పొరుగమ్మలు కలిసి ఎంత కాలక్షేపం చేసేవారు? అసలు ఆ గంటా రెండుగంటలు వారు మాట్లాడుకునే మాటలు విజ్ఞాన భాండాగారాలు కదూ....మగవాళ్ళూ ఉన్నారు ఎందుకూ... నలుగురు కలిస్తే, చతుర్ముఖ పారాయణం, ఒక ఫంక్షన్ కి వెళ్ళినా అదే ఏడుపు. కూడా వచ్చినా పెళ్ళాం, పిల్లలు ఏ గంగలో కలిసారో అక్కర్లేదు. బుగ్గన కిళ్ళీ బిగించి, పేక ముక్కలు పంచడం మొదలెడితే, ఇహ కాఫీలు, టిఫిన్ లు అక్కడికే, ఇడ్లియే తింటున్నారో, పచ్చడే తింటున్నారో కూడా తెలియకుండా వెధవ ఆటా వీళ్ళూను. కొంత వరకు నయం, అక్షితలు వేయడానికైనా లేచి వస్తారు, వాళ్ళనే లేచి ఆట దగ్గరకు రమ్మనకుండా.... హవ్వ.... ఇక భోజనాల దగ్గర మాట్లాడుకునే మాటలు చూడాలి, దేశం అంతా వీళ్ళ వలనే నడుస్తున్నట్టు. వెధవ రాజకీయాలు వీళ్ళూను. పైసా కి పనికిరాని మాటలు, ఆ మంత్రి అలాగండీ, వీడు ఇల్లాగండీ అని దిక్కుమాలిన విశ్లేషణలు.... వీళ్ళు చర్చిన్చుకున్నంత మాత్రాన దేశ రాజకీయాలు మారిపోతాయా, ఇంక ఆఫీసు కబుర్లకు వస్తే, మరీ ఘోరం, వాళ్ళ ఆఫీసు వలననే దేశ ఆదాయం వచ్చి పడిపోతోంది అన్నట్టు వెధవ బిల్డప్ లు. మీ ఆఫీసు లో మీరేం చేస్తారు, మీరేం చేస్తారు అంటూ పోట్లాటలు. పచ్చడి పూర్తీ చేసి, , పులుసు లోకి వచ్చేసరికి వీళ్ళల్లో వీళ్ళే కత్తులతో పొడిచేసుకుంటారో, తలకాయలు నరికేసుకుంటారో అని చచ్చే భయం వేస్తుంది చూసే వాళ్ళకు.
ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ మాటలను పనికిరాని మాటలుగా కొట్టి పారేస్తారు. వాళ్ళేదో పెద్ద మేధావులు అనుకుంటారు కానీ, ఆడవాళ్ళ విలువ తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోతుంది టండీ ఈ మగ మహారాజులకి.... ఇంక ఉంటాను. మళ్ళి కలుద్దాం. ఇంకో విషయం తో.
ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ... గీతా జయంతి. పవిత్ర భారత దేశం లో పుట్టే భావి తరాల ప్రజల ఉద్ధరణ కోసమై భగవానుడు అర్జునుడి వంక పెట్టి మనకు అందించిన అత్యద్భుత సందేశం. భారతీయులమైన మనం దీని గొప్పతనాన్ని మర్చిపోయినా, విదేశాల వారు గుర్తించి, చదివి, ఆచరించి ఎన్నో లాభాలు పొందుతున్నారు. ప్రతి యుగం లోనూ, ప్రతి వయసుకూ, ప్రతి వ్రుత్తి, వ్యాపారా ఉద్యోగాలలో, నిత్య జీవితం లో ఎదురయ్యే సమస్యలకు, విషమ పరీక్షలను తట్టుకునే మనోస్తైర్యం ఇచ్చే బృహత్తర గ్రంధం ఈ భగవద్గిత. ఇది మన భూమిపై పుట్టినందుకు మనం గర్వించాలి. చిన్నప్పటి నుంచి చదివి అర్ధం చేసుకుంటే, మన భావి జీవితం ఎంతో సుఖమయం ఔతున్ది. అరిషడ్వర్గాలను జయిచే సాధన అలవడుతుంది. అయితే, ఇటువంటి బృహత్ గ్రంధాలను ఒకసారి చదివితే ఏమాత్రం అర్ధం కావు. పదే పదే చదవడం వలన, ఎన్ని సార్లు చదివితే అన్ని కొత్త అర్ధాలు గోచరిస్తాయి. దయచేసి, ఈ గ్రంధాన్ని, చిన్న వయసు నుంచి చదవటం అలవాటు చేసుకుని, అర్ధం చేసుకుని ఆచరించ ప్రార్ధన. ఇప్పటికిప్పుడు చదవాలని మనసు లేకపోతే, ఈ గ్రంధాన్ని ఎల్లవేళలా కంటికి కనపడేటట్లు ఎదురుగా పెట్టుకోండి. కొన్నాళ్ళకు చదవాలని జిజ్ఞాసా పెరుగుతుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ...
ఈ పోస్ట్ నేను చాల సార్లు గ్రూప్స్ లో పోస్ట్ చేశాను. మళ్లీ మళ్లీ చేయవలసిన అవసరం అనిపించి మళ్లీ పోస్ట్ చేస్తున్నాను.
తల్లి తండ్రులకు ఒక గమనిక, ఒక విన్నపం.
పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా పౌరులుగా తీర్చిదిద్దాలి అనుకుంటే, అది మీ చేతులలోనే ఉంది.
1. రోజులో ఒక పది నిముషాలు పిల్లలు ( వారు ఎ వయసు వారైనా ) చెప్పే మాటలను శ్రద్ధగా, సంతోషంగా , ఆసక్తిగా విని, వారితో పదినిముషాలు గడపడం అలవాటు చేసుకోండి.
2. ఆ పదినిముషాలు టీవీ, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంకా ఇతరత్రా వ్యాపకాలు లేకుండా చూసుకోండి.
3. అలాగే సాధ్యమైనంత వరకు, రోజులో ఉదయం అల్పాహారం కానీ, రాత్రి భోజనం కానీ కుటుంబ సభ్యులు కలిసి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ టైం లో కూడా వీలైనంత వరకు, జోక్స్, సరదా కబుర్లతో గడపండి.
4. అలాగే, పిల్లల ఎదురుగా ఎవరినీ విమర్శించడం అలవాటు చేసుకోకండి. పిల్లల ఎదురుగా పోట్లడుకోకండి. అలాగే, ఒకరి పుట్టింటి వారిని ఒకరు పిల్లల ఎదురుగా విమర్శించకండి.
5.వారానికి ఒకసారి అయినా, పిల్లలతో కాస్సేపు ఆడుకోండి.
6. వీలైనంత వరకు మీరు టెక్నాలజీ ని పిల్లల ఎదురుగా సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించండి.
7. పిల్లల స్నేహితుల మీద, వారి తో కలిసి తిరిగే సమయం మీద ఒక కన్నేసి ఉంచండి.
8. పిల్లల స్నేహితులు ఇంటికి వచ్చినపుడు, వారి వారి ప్రత్యెక గదులలో కాకుండా ఇంటిలో కామన్ హాల్ లో కూర్చొని, మాట్లాడుకోమని చెప్పండి.
9. మీరు వారి మాట వింటారు అనే నమ్మకాన్ని, పిల్లలలో కలుగ చేయండి. మీ పిల్లలు చెడిపోతే అది మీ బాధ్యతే.
10. పిల్లలు పార్టీలకు, గెట్ టుగెదర్ లకు వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి రావలసిన సమయాన్ని మీరు నిర్ణయించండి.
11. పిల్లల ముఖ్యమైన స్నేహితుల, ప్రొఫెసర్ ల ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోండి.
12. ఒకవేళ పిల్లలు పరీక్షలలో విఫలం అయినా, వారిని ఇతరులతో పోల్చితిట్టకండి. అది వారి మనసు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
13. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము అనే నమ్మకాన్ని వారిలో కలిగించండి.
14. ఇంట్లో పెద్దవాళ్ళు ( నానమ్మలు, తాతయ్యలు ) ఉంటె వారితో కొంతసేపు గడపడం అలవాటు చేయండి.
15. వారి పట్లమీరు గౌరవం చూపిస్తే, పిల్లలు కూడా వారిని గౌరవిస్తారు.
ప్రతి తల్లితండ్రులు ఈ సూచనలు పాటిస్తే, పిల్లలు కొంతవరకు ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు.
దంపతులు అందరికీ ఒక విన్నపం.
పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. రెండు కుటుంబాల కలయిక. రెండు విభిన్న సంస్కృతుల కలయిక. వివాహం తో రెండు కుటుంబాలు ఒక్కటి అవుతాయి. వ్యక్తులు నచ్చినా నచ్చకపోయినా, కుటుంబాలు నచ్చినా నచ్చకపోయినా, జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి, కొన్ని కొన్ని చోట్ల సర్దుకుపోవడం తప్పదు. నీ, నా అనే బేధాలు వదిలి ఇద్దరూ కూడా, ఇది మన జీవితం, మన సంసారం అనుకోగలిగితే, సంసారం సుఖంగా నడుస్తుంది. నీ తల్లి తండ్రులు, నీ అలవాట్లు, నీ ఆసక్తులు, అనుకుంటే ఎప్పటికీ కలవని రైలు పట్టాల లాగే ఉంటుంది జీవితం కూడా, ఒకవేళ అలా "మన" అనే భావన మనసులో రాని వాళ్ళు దయచేసి పెళ్లి చేసుకోకండి. మీ భాగస్వామిని బాధపెట్టకండి.
పూర్వం నీతి పద్యాలూ, శతకాలు, పురాణాలు-ప్రబంధాలలోని పద్యాలు పిల్లల చదువులలో భాగం గా ఉండేవి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా పాఠం మధ్యలో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి గురించి పిల్లలకు చెప్పేవారు. చరిత్ర పాఠాలలొ, మన దేశ సంస్కృతీ, ఔన్నత్యాల గురించి చెప్పేవారు. ముఖ్యంగా మహిళల గొప్పదనాన్ని గురించిన పాఠాలు ఉండేవి. ఇక ఇంటికి వస్తే, తాతలు, అమ్మమ్మలు రాత్రిపూట పక్కన పడుకోబెట్టుకుని, మంచి మంచి నీతి కధలు, కబుర్లు చెప్పేవారు.... ఇవన్ని పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చి దిద్దడానికి దోహదం చేసేవి. ఇప్పుడు మరి మనం ఎం చేస్తున్నాం? పసి పిల్లలకు అన్నం పెట్టడం కూడా టీవీ ముందే. వాళ్ళ కాలక్షేపం బొమ్మలు, బొమ్మల పుస్తకాలతో కాకుండా, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇచ్చేసి, మన పనులకు అడ్డం రాకుండా చేస్తున్నాం. ఇక కాస్త పెద్ద పిల్లలు ఇంట్లో వాళ్ళ వాళ్ళ గదుల్లో కూర్చుని, ఇంటర్నెట్ చూస్తున్నారో, చదువుకుంటున్నారో, అడుకుంతున్నారో చూసే తీరిక మనకు లేదు. వాళ్ళ మిద ఒక కంట్రోల్ లేదు. ఏదన్న అంటే, వాళ్ళ ప్రైవసీ కి మనం అడ్డు రాకూడదు అని పాఠాలు. ప్రైవసీ ఎవరికీ ఇస్తారు? మన ఇంట్లో మన చెప్పుచేతల్లో పెరగ వలసిన పిల్లలకు ప్రైవసీ ఏంటి? మన పెంపకం ఎలా ఉంటె, వాళ్ళ పెరుగుదల అలాగే ఉంటుంది. ఇప్పుడు వస్తున్నా టెక్నాలజీ ని మనం ఎలాగు ఆపలేము. కానీ వీలు ఉన్నప్పుడల్లా, మన పురాణాలూ, పురాణ పురుషుల గురించి, నీతి కధలు, బాలల కధల గురించి, మీ పిల్లలకు చెప్తూ ఉండండి... వారి మనసులు చిన్నతనం లోనే కలుషితం కాకుండా చూసే బాధ్యత తల్లి తండ్రుల పైననే ఉంది. ఇది వంద శాతం నిజం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భయంకరమైన సమాజం ఇంకా భ్రష్టు పట్టకుండా వుండాలంటే, మన విద్య విధానం తప్పనిసరిగా మారాలి. అది మన చేతులలో లేదు. ప్రభుత్వానికి ఇవన్ని చూసే తీరిక లేదు. అందుకే దయచేసి, తల్లితండ్రులారా! ముందు మీరు మారండి. మీ సంతానానికి మంచి మార్గదర్శకులు అవ్వండి. ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి సహకరించండి.
సత్యం, అహింస, ధర్మం, శాంతి, దయ, ఇవన్నీ మానవునికి ఉత్తమ గతులను కల్పించగల లక్షణాలు. ఇవన్నీ మన పురాణాల లోను, శాస్త్రాల లోనే తెలుపబడి ఉన్నాయి. ఎల్లవేళలా సత్యం పలుకమనే చెప్తూ, " న బ్రూయాత్ సత్యం అప్రియం" అని చెప్పాయి ఉపనిషత్తులు. అంటే, అప్రియమైన సత్యాన్ని పలుకవద్దు. ఎప్పుడూ ప్రియము గానే భాషించవలెను అని, ఒక విషయం సత్యం అయినప్పటికీ, అది అప్రియముగా ఉంటె, మనసులను బాధ పెట్టేది అయితే దానిని పలుకవద్దు ఆని చెప్పారు. అహింస అంటే కేవలం జంతువులను హింసించకుండా ఉండటమే కాక, సాటి మనుషుల మనసులను కూడా బాధపెట్టవద్దు అని అర్ధము. ధర్మో రక్షతి రక్షిత: అని వేదం ఏనాడో చెప్పింది. మన మన స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటె, మనం ధర్మాన్ని రక్షించిన వారం అవుతాము. ధర్మ ప్రకారం మానవులందరూ నడుచుకుంటే, మనం అందరం ఎంతో సురక్షితమైన జీవితాన్ని గడపగలము.ధర్మం ఏనాడూ సాటి మనుషులను హిమ్సించమని, ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పలేదు. ఏ సమాజం లో ధర్మం రక్షింప బడుతుందో, ఆ సమాజం సురక్షితంగా ఉంటుంది. అంటే ధర్మం మనలను కాపాడినట్లే కదా.. ఇదే "ధర్మో రక్షతి రక్షిత:" అంటే భావము. పురాతనకాలం నుంచి వస్తున్న మన సంస్కృతీ, సంప్రదాయాలను, ధర్మాన్ని ఈనాడు గౌరవించక పోవటం వలనే సమాజం లో ఈనాడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి.
సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. సాటి మనుషుల పట్ల దయ కలిగి ఉండాలి. మన కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారిని చూసి జాలి పడాలి. అటువంటి వారికీ సహాయం చేసే బుద్ది కలిగి ఉండాలి.
ఇవన్ని మనసుకు శాంతి ని ప్రసాదించి, మనిషిని దైవం వైపు ప్రయాణించడానికి మార్గాన్ని చూపిస్తాయి.
సర్వేజనా సుఖినో భవంతు....
ఈరోజు కన్ను మూస్తే రేపటికి రెండు. ఈ లోకం లో పుట్టిన వాడెవ్వడూ శాశ్వతం గా ఇక్కడ ఉండిపోయి భోగాలు అనుభవించలేదు. పుట్టిన ప్రతివాడూ చావవలసిందే. స్వర్గం నరకం మాట తరువాత. మనం ఎలా జివిస్తామో, దాన్ని బట్టే మనకు ఈ భూమి మిద గౌరవ ఆదరాలు దొరుకుతాయి. మన మనసు, మాట స్వచ్చం గా ఉంటేనే, మనను ముందు వెనుక కూడా గౌరవిస్తారు. లేదంటే, ముందు మెచ్చుకున్నా, వెనుక తిట్టుకుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. మాట కు ఖరీదు ఏమి చెల్లించక్కరలెదు. హృదయం లోనుంచి వచ్చే మాట ఎదుటివారికి సంతోషాన్ని ఇస్తుంది. జీవితం లో ఏమాత్రం పనికిరాని విషయాలలో అబద్ధాలు ఆడి, అవాకులు, చెవాకులు మాట్లాడడం వల్ల ఈరోజు బాగానే గడిచిపోవచ్చు, కానీ, మీ హృదయానికే తెలుస్తుంది తప్పు ఎక్కడ ఉందొ! పక్క వాళ్ళకు కూడా మీ మీద గౌరవం పోతుంది. అశాశ్వతమైన విషయాల కోసం, శాశ్వతమైన గౌరవాన్ని పోగొట్టుకోకండి. మనం పోయినా, మన మాట ముందు తరాలు మంచిగా చెప్పుకోవాలి. అది జీవితానికి సార్ధకత. అబద్ధాలతో, ఒకరి మిద చాడిలతో, ఇతరుల మనసు గెల్చుకోలేరు. గుర్తుంచుకోండి.
మా చిన్నతనాల్లో, క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తోందంటే, అదో పెద్ద హడావిడి. షాప్స్ నిండా క్రిస్మస్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్, పెద్ద పెద్ద స్టార్స్ తో ఎంతో కళకళ లాడేవి. మంచి ఖరీదైన కార్డు కొనాలంటే 5 , 10 రూ. మధ్య ఉండేది, ఇంక కొంచెం తక్కువ లో అయితే, 2 రూ. వచ్చేవి. అందులోనే, మంచి సేనరీలు, పువ్వులు, ఉన్న కార్డు లు ఒక రకం, సినిమా తారల కార్డు లు ఒక రకం. మళ్ళీ మధ్యలో వ్రాసి ఉండే సందేశం హృదయానికి హత్తుకునేలా ఉండాలి. అదో రూలు. సాదాసీదాగా విష్ యు అ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉన్న కార్డు ఎవరైనా ఇస్తే వాళ్ళకు ఈస్తటిక్ సెన్స్ లేదు అనుకునే వాళ్ళం. ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ కి ఇచ్చేవి కొన్ని, పొరుగు ఊళ్లకు పంపవలసిన గ్రీటింగ్ కార్డు ల కయితే అదో పెద్ద పని. ముందు, ఒక్కొక్కరికి ఎంత మంది ఫ్రండ్స్ ఉన్నారు, ఎన్ని కార్డు లు కావాలి, అని లెక్క పెట్టి పెద్దవాళ్ళకు చెప్తే, వాళ్ళు అన్ని కొనటానికి approve చేయాలి. తరువాత budget వాళ్లే నిర్ణయించి డబ్బు లెక్కపెట్టి ఇచ్చేవాళ్ళు. పొరుగు ఊళ్లకు పంపే కార్డు లకు పోస్టల్ స్టాంప్ లు కొని, అతికించి, అడ్రెస్ వ్రాసి పోస్ట్ చేయాలి. మిగిలిన చిల్లర లెక్కపెట్టి తిరిగి ఇవ్వాలి ఇంట్లో. మధ్యలో కొంత చిల్లర పోయిందంటే, ఆ నష్టం మనకే. డబ్బు నష్టమే కాకుండా, డబ్బు పోగొట్టినందుకు చీవాట్లు మళ్ళీ బోనస్. న్యూ ఇయర్ నాడు, క్రిస్మస్ నాడు ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ కి ఇళ్ళకు వెళ్లి ఇచ్చి రావాలి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏమి తినకూడదు. ఇవన్నీ కూడా దైనందిన చదువుకు ఆటంకం కాకుండా చేయాలి. ఒకవేళ న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ కి వెళ్ళాలి అంటే, ముందు రోజు బాగా చదివి అన్నీ అప్పచెప్పాలి. ఇలా బోలెడు ఆంక్షలు ఉండేవి. న్యూ ఇయర్ హడావిడి అయిన తర్వాత, మనం కార్డు లు ఇచ్చిన వారిలో ఎంతమంది మనకు తిరిగి ఇచారు, ఎంత మంది ఊరికే విష్ చేసారు, ఇవన్ని వేరే లెక్కలు ఉండేవి... న్యూ ఇయర్ ధనుర్మాసం మధ్యలో వస్తుంది కాబట్టి, ఎవరి ముగ్గు ఎంత అందంగా ఉంది, ఎవరు న్యూ ఇయర్ అని ముగ్గుతో వ్రాసారు , ఎవరెవరు ఎన్ని కలర్స్ వేసారు ముగ్గుకి అనే లెక్కలు మళ్ళీ వేరే.డిసెంబర్ 31 నాడు అర్ధరాత్రి వరకు మెలుకువగా ఉండి సరిగ్గా 12 గంటలకు ఇరుగు పొరుగు వాళ్ళకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడం అదో హడావిడి... కొన్నాళ్ళ తరువాత ఫోన్ లో గ్రీటింగ్స్ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి చెప్పటం అదో సరదా.... లైన్ లు కలవక పోవడం, అవతలి వాళ్ళు ఫోన్ చేసినా, మనమే ముందు విష్ చేసేయటం, అదో వేడుక. తరువాత మొబైల్ ఫోన్ లు వచ్చాక మెసేజ్ లు... తరువాత రోజుల్లో, ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మెసేజ్ లకు డబ్బులు ఛార్జ్ చేయడం మొదలు పెట్టాయి సెల్ కంపెనీలు.... అప్పుడు ముఖ్యమైన వాళ్ళకు రాత్రి విష్ చేసి, మిగిలిన వాళ్ళకు మర్నాడు పొద్దుటే ఫోన్ లో గ్రీటింగ్స్ చెప్పడం.... అదో సందడి....తరువాత పేస్ బుక్ అలవాటు అయిన కొత్తలో కానీ ఖర్చు లేకుండా, అందులో విష్ చేయడం, ఇప్పుడు whatsapp . కొత్తనీరు వచ్చి పాత నీరును కొట్టేస్తుంది అన్నట్టు, whatsapp అలవాటు అయిన తరువాత, పేస్ బుక్ msg లు తగ్గిపోయాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లు వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచేసింది. ఇవన్ని ఒకరి సందేశాలు ఒకరికి అందచేస్తున్నాయి క్షణం ఆలస్యం లేకుండా కానీ, ఆ సందేశాలలో, ఇదివరకటి ఆప్యాయత, మమకారం ఉంటోందా అని నా లాంటి వాళ్ళకు ఒక చిన్న సందేహం. యంత్ర జ్ఞానం ( Technology ) ఎక్కువైనా కొద్దీ యాంత్రికత కూడా ఎక్కువ అయిపోతోంది. గ్రీటింగ్ కార్డ్స్, సెలెక్ట్ చేసి, అందులో మన స్వహస్తాలతో ఒక సందేశం వ్రాసి, పోస్ట్ చేయడం, లేదా స్వయంగా ఇవ్వడం అనేది ఒక చక్కటి అనుభూతి. అది ఇప్పుడు కోల్పోయాం. నాలాంటి చాదస్తులు ఒకవేళ అలా ఇచ్చినా వెర్రిదాన్ని చూసినట్టు చూస్తారు. కొండొకచో భయపడతారు కూడా, నాకు ఏమైందా అని. కాల ప్రవాహం లో మనమూ కొట్టుకుపోవడమే.....
మా చిన్నతనాల్లో సంక్రాంతి.
మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వస్తోంది అంటే అబ్బో... పెద్ద హడావిడి. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ముగ్గులు.. గొబ్బిళ్ళు....తెల్లవారే లేచి గుడికి వెళ్ళడం (ధనుర్మాసం ప్రసాదం మీద భక్తి, దేవుడి మీద కాదు. ) అసలు ధనుర్మాసం లో వైష్ణవ ఆలయాల్లో పెట్టె చక్కర పొంగలి, దద్ద్యోజనం రుచే వేరు. సత్యం శంకరమంచి గారు అమరావతి కధలలో చెప్పినట్టు, దద్ద్యోజనం లో వేసే కరివేపాకు కూడా మహా రుచిగా ఉంటుంది లెండి. ఇంటి ముందు పెట్టె ముగ్గులు మహా కుట్రలతో కూడుకొన్నవి. మేము ముగ్గులు రాత్రి పూట వేసేవాళ్ళం. ముందుగ పెట్టేస్తే, మా ముగ్గు ఎవరైనా కాపీ కొడతారేమో అని బాగా పొద్దుపోయాక వేసేవాళ్ళం. చుక్కలు ఎన్నో తెలియకుండా, ముగ్గులు పెట్టడం లో మా అక్క మహా నేర్పరి. ఉన్న ముగ్గుకి ఎన్నో సొగసులు అద్ది, చుక్కలు ఎన్నో తెలియకుండా చేసేది. మళ్లీ తెల్లవారే లేచి, గుడికి వెళ్తూ వెళ్తూ, ఎవరి ముగ్గు బాగుంది, ఎవరెవరు ఈ సంవత్సరం కొత్త ముగ్గులు వేసారు అని విశ్లేషణలు.....ఇంక ధనుర్మాసం చివర వచ్చే కనుమ, ముక్కనుమ రోజు వేసే రధం ముగ్గులు ప్రతి సంవత్సరం ఒక కొత్త రకంగా వేసేది మా అక్క. ఆ రధం తాడును ప్రతి ఇంటి ముందు రధం ముగ్గుకి కలిపి (మధ్యలో ఎవరైనా మాకు నచ్చకపోతే, వారి ఇంటి ముగ్గుకి కలపకుండా )వీధి చివర వరకు లాగే వాళ్ళం.
గొబ్బిళ్ళ కథలు వేరు. ఉదయాన్నే ఆవుపేడ తెచ్చి, గొబ్బెమ్మలు చేసి, పూజ చేసి, అప్పుడు స్కూల్ కు వెళ్ళవలసి వచ్చేది. సాయంత్రం ఎవరో ఒకరి ఇంట్లో సందె గొబ్బెమ్మల పేరంటాలు... ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగుతూ పాటలు పాడడం, మంగళ హారతి పాటలు పాడడం, అదో మధుర జ్ఞాపకం. భోగి పండుగకు రెండు మూడు రోజుల ముందరే, మా వీధి లో మగపిల్లలు చెక్కలు, కట్టెల కోసం ఇల్లిల్లూ తిరిగి చందాలు వసూలు చేసేవారు. అప్పట్లో, స్నానానికి వేడి నీళ్ళు కాచుకోవడం కట్టెల పొయ్యి మీదనే కాబట్టి, ఇంట్లో చెక్క మొద్దులు, కట్టెలు సేకరించి ఉంచుకున్న వారు ఈ మగపిల్లలతో మిగిలిన ఏడాది అంత ఎలా ఉన్నా, ఈ భోగి రోజుల్లో మహా మంచిగా ఉండేవారు, వారి కట్టెల కి ఏఅపాయమూ రాకూడదు అని. మగపిల్లలు మహా టక్కరి వాళ్ళు. వాళ్లతో మంచిగా ఉంటూనే సగం కట్టెలు, దూలాలు ఎత్తుకోచ్చేసే వారు. ఇక భోగి రోజు నడిరాత్రి నుంచే భోగి మంటల సందడి. ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటున్నా వినకుండా అక్కడే తెల్లరేవరకు మా మకాం. తరువాత అమ్మతో సహస్ర నామార్చన ఎలాగు ఉండేది. సాయంత్రం భోగి పండ్ల పేరంటాలు. అప్పట్లో టీవీ ఉండేది కాదు కనుకా ఈ సరదాలు అన్నీ ఎంతో చక్కగా మనసారా ఆస్వాదిన్చాము.
సంక్రాంతి పండుగకు ప్రతి సంవత్సరం పట్టు పరికిణీ, పూలజడ తప్పనిసరి. మాకే కాదు. మకర సంక్రాంతి నాడు మా కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఆడపిల్లకు మా అమ్మ పూల జడ కుట్టేది. సాయంత్రం బొమల కొలువు పేరంటం. ఇక మా ఇంట్లో బొమ్మల కొలువు అంటే 10 రోజుల ముందు నుంచి తయారీ. పార్క్ కోసం ఆవాలు మొలకేత్తించడం, కొత్త కొత్త బొమ్మలు కొనడం, ఒక పల్లెటూరు, కొండ మీద ఒక గుడి, పార్క్, బడి, దశావతారాలు, పెండ్లి వారు, సీతా కళ్యాణం, ఈ బొమ్మలన్నీ పైనుంచి తీసి దులపడం, అమర్చడం, రోజూ ఉదయం సాయంత్రం హారతి ఇవ్వడం,ఇవన్ని ఒక ఎత్తైతే, పండగ సరదా తీరి, అలసిపోయిన తర్వాత అవన్నీ తీసి మళ్లీ పెట్టెల్లో పెట్టి దాచడం ఒక పెద్ద పని.
ఇక కనుమ రోజు పిల్లలకు పెద్దగా పని ఉండేది కాదు. గుడికో, లైబ్రరీ కో వెళ్లి వచ్చి అమ్మ చేసిన గారెలు తినడమే.
ఇక ధనుర్మాసం మొత్తం హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్ళు, కొమ్మ దాసరి వాళ్ళు, పిట్టల దొరలూ, ఇవన్ని మధురమైన జ్ఞాపకాలు. హరిదాసు చిడతలు వీధి చివరన వినబడగానే, పిల్లలందరూ బియ్యం పట్టుకొని వాకిళ్ళలో నుంచునే వారు. గంగిరేద్దులకు పాత బట్టలు ఇచ్చెవాల్లమ్. ఆ గంగిరెద్దు విన్యాసాలు చేస్తూ ఉంటె ఆశ్చర్య కరంగా ఉండేది. ఇక పిట్టల దొర కబుర్లకు ఆకాశమే హద్దు.
సంక్రాంతి పండుగలో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ పండగ half yearly ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలవులు ఇచ్చేవారు. ఒక పక్క ముగ్గులు ఇతరత్రా హడావిడి, ఒక పక్క పరీక్షల టెన్షన్. అంతా అదో సందడి.... ఇవండీ మా సంక్రాతి కబుర్లు.....
సభ్యులందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు....
ప్రతి రోజు మనం వార్తల్లో వింటూనే ఉంటున్నాం, దినపత్రికలలో చదువుతూనే ఉంటున్నాం. అయినా ప్రతి వీధికి ఒకరుగా వెలుస్తున్న దొంగ బాబాలను నమ్ముతూనే ఉన్నాం. మొన్ననే దేవిశ్రీ బాబా గారి గురించి వార్తల్లో విని ఆశ్చర్య పోయాను. అయన ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో జ్యోతిష్యం చెప్పడం నేను చూసాను. సామాన్యుల సంగతి సరే, ప్రముఖులు, రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు, సినీ నటులు, ఇలా ఎందరెందరో దొంగ బాబాల కు శిష్యులు అవుతారు. రాజకీయ నాయకులూ, సినీ నటులను పలుకుబడి కో, ప్రచారానికో ఉపయోగించు కుంటారు సరే, ఎంతో చదువుకుని, ఎంతో అనుభవం కలిగి, కోట్ల తో వ్యాపారం చేసే వ్యాపారస్తులకు, మరెంతమందో మేధావులకు ఈ బాబాల వలలో పడే అవసరం ఏముంది? ఏ వంచకుడి చరిత్ర చూసినా ఎక్కువ చదవుకోలేక పోవడం, అపరిమితమైన తెలివి తేటలు, ఎదుటివారిని బోల్తా కొట్టించా గల మాట చాతుర్యం ఇవి common గా కనిపిస్తున్న లక్షణాలు. వీరు ఆడవారిని కూడా వంచించి తమ శారీరిక అవసరాలకు వారిని బలి చేస్తున్నారు. మోసగాడు ఎప్పుడూ మోసగాడే.... మరి చదువుకున్న స్త్రీలు కూడా ఎలా వీరి వలలో పడుతున్నారో అర్ధం గాకుండా ఉంది. ప్రతి దొంగ స్వామీ, మహిళలను మోసం చేసి వారిని తరువాతే బెదిరించే వాడె. ఆ స్త్రీల ఇండ్లలో ఈ విషయం తెలియడం లేదా? అసలు, పూజలు చేయాలి, నువ్వు ఒక్కదానివే నా దగ్గరకు రా అని పిలిచే పరాయి మగవాడి ( వాడు స్వామి అయినా, బాబా అయినా సరే) దగ్గరకు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, వేరేవారి తోడూ లేకుండా మహిళలు ఇటువంటి వారి దగ్గరకు వెళ్ళటం మానుకోవాలి. ఒకవేళ వెళ్ళిన తరువాత ఏదైనా జరగకూడనిది జరిగితే, తప్పని సరిగా వారిని చట్టానికి పట్టించాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడి మౌనంగా ఉండటం కాకుండా, బయటికి చెప్పటం నేర్చుకోవాలి.
అసలు ఈ ప్రపంచం లో పుట్టిన ప్రతివాడికి, వాడి స్థాయి, జీవితాన్ని బట్టి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ధైర్యం గా పరిష్కారం వెతుక్కోవాలి కాని ఈ దొంగ స్వాముల వెంట పడకూడదు. పిల్లల చదువు, వివాహం, ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు అందరి ఇండ్లలో సామాన్యం. కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించు కోవాలి. లేదా పెద్దలను సలహా అడగాలి. అంతే కానీ పరాయి వారి దగ్గర మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకోవటం మూర్ఖత్వం.
అలాగే ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలకు సమాధానం చెప్తాము, మీ కోసం పూజలు చేస్తాము అనే వారిని కూడా లోపలి రానివ్వకూడదు. మన బలహీనతలే వారి పెట్టుబడి. అటువంటి వారిని ప్రోత్సహించ కండి. మన శాస్త్రాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయ్. పెద్దవారిని అడిగితె తెలుస్తుంది. నిజమైన స్వామి ఎవరూ కూడా భక్తులకు ఏకాంతంగా పూజలు చేయాలి అని చెప్పరు. వారి వద్ద నుండి పెద్ద మొత్తం లో డబ్బు వసూలు చేయరు. నిజమైన సన్యాసి, స్వామి దేవుడిని నమ్ముకో, లేదా ఫలానా దేవుడికి ఫలానా పూజ చేయి అంటారే కాని, నాకే పూజ చేయి, లేదా నేనే నీ తరఫున పూజ చేస్తాను, అని చెప్పడు.
ముఖ్యంగా ఇండ్లలో ఒంటరిగా ఉండే స్త్రీలు ఈ విషయాన్ని గమనించండి. సాధారణంగా కొంత మంది స్త్రీలు వాకిట్లో నుంచుని, పెద్ద పెద్దగ మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు గమనించక పోయినా, మీ కబుర్లు మోసగాళ్ళ దృష్టిలో పడితే, మీరే వారికీ సమాచారం ఇచ్చిన వారు అవుతారు. బయట ఉన్నప్పుడు ఫోన్ లలో మాట్లాడేటప్పుడు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు, మీ విషయాలు ఎవరు వింటున్నారు , మీ చుట్టుపక్కల ఎవరైనా వింటున్నారా అనే విషయాలు గమనించు కోవాలి. లేదా ఫోన్ వచ్చినా ముఖ్యమైన విషయాలు బయట మాట్లాడకుండా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడం మేలు.
ఇవన్ని దృష్టి లో ఉంచుకుని మోసగాళ్ళ నుంచి దూరంగా ఉండండి.
Like · 
అమ్మా, అయ్యా, నేను చాలా ఇళ్ళల్లో చూసిన వాటిని, విన్న వాటిని, మరి కొన్ని ఇళ్ళల్లో అనుభవించిన వాటిని గర్హిస్తూ, పిల్లల పెంపకం లో పెద్దలు పాటించ వలసిన అంశాలను ప్రస్తావిస్తున్నాను. మీకు నచ్చితే ఒప్పుకోండి. నచ్చకపోతే, చదవడం మానేయండి. చర్చ ప్రారంభించ వద్దు.
1. పిల్లలు ఎంత చురుకైన వాళ్ళు అయినా, మేధావులు అయినా, ఆడ/ మగ పిల్లలు ఇద్దరికీ కొంచం అయినా ఇంటి పని తెలిసి ఉండాలి.
2. ఇంట్లో అమ్మకు కొంచెం తల నెప్పి వస్తే కనీసం ఒక టీ పెట్టి ఇచ్చే బాధ్యత తెలిసి ఉండాలి.
3. వాళ్ళు ఎంత బిజీ గా ఉన్నా సరే, కాలేజీ/ స్కూల్ నుంచి రాగానే ఒక అరగంట ఇంట్లో అమ్మతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. జరిగిన రోజు గురించి, స్నేహితుల గురించి తల్లితో మాట్లాడే అలవాటు ఉండాలి.
4. ఇంట్లో తల్లితండ్రుల ముఖం చూసి, మాట తీరు చూసి, వాళ్ళు నీరసంగా /అలసటగా ఉన్నారా అని గ్రహించు కోవాలి.
5. ఇంటికి వచ్చిన బంధువులతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి.
6. ఇంటి ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని వ్యవహరించాలి. విద్యార్ధి దశలో ఉండగా ఖరీదైన వస్తువులు, బట్టల కోసం పేచి పెట్టకూడదు.
7. *** ఇప్పటి పిల్లలకు చాలా ముఖ్యంగా నేర్పవలసినది ఏంటంటే, స్నేహితుల తోనూ, పెద్దలతోనూ, బంధువులతోనూ, ఒకేలా మాట్లాడకూడదు అని, ఎవరి స్థాయిని బట్టి వారితో సంభాషించాలి అని.
8. ఏ విషయం లో అయినా, నీకేం తెలుసమ్మా దీని గురించి, అని తల్లి తండ్రులను చిన్నబుచ్చే అలవాటును పిల్లలలో మొగ్గ లోనే తున్చేయండి.
పిల్లలు సరి అయిన మార్గం లో నడవాలి అంటే, పెద్దలు ముందు అలా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ అన్ని కనీస మర్యాదలను మీరు పిల్లలకు నేర్పించాలి.

ఈ చరాచర సృష్టిని ఏ అంతరాయము లేకుండా నడిపిస్తున్న ఒక మహాశక్తి పేరే దైవము. పవిత్రమైన హిందూ ధర్మం దైవశక్తిని ఒక రూపానికి మాత్రమే పరిమితం చేయ లేదు. కోట్లాదిమంది మానవుల భావనలకు తగినట్టుగా దైవశక్తి కోట్లాది రూపాలను సంతరించుకున్నది. అఖండమైన ఆ శక్తి, సృష్టి, స్థితి, లయ కారకులుగా శ్రీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, జ్ఞానమునకు అధిదేవతగా సరస్వతి దేవి, ధనానికి అధిదేవతగా లక్ష్మి, ధైర్యము, సాహసమునకు ప్రతీకగా హనుమంతుని ఇలా ఎన్నెన్నో రూపాలు కలిగి భక్తుల మనోభీష్టాలను నేరవేరుస్తున్నది. జీవుడు పుట్టిన దగ్గర్నుంచి, దేహం విడిచే వరకు ఎన్నో కర్మలు (పనులు) చేస్తాడు. వాటన్నిటి కారణంగా అతనికి పాపపుణ్యాలు కలుగుతాయి. అవి అతని జీవన క్రమానికి బాటలు వేస్తాయి. మంచి పనులు చేస్తే, మంచి జీవితము, చెడు పనులు చేస్తే చెడు జీవితము ప్రాప్తిస్తుంది అనేది పెద్దల మాట. ఒక మానవుని యొక్క ఆజన్మాంతం ఎన్నో విధాలుగా సహకరిస్తున్న ఆ దైవానికి మనం ఏ విధంగా ఋణం తీర్చుకుంటున్నాం? మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలలో చెప్పిన పూజలు, వ్రతాలు ఆచరించటం ద్వారా... అయితే అందుకు ఆశక్తులైన వారు ఏమి చేయాలి? భగవంతుడు మనలను కష్టపెట్టి తాను పూజలు జరిపించుకోవాలి అని ఆశించడు. ఎవరి శక్తి కొలదీ వారు తనను ఆరాధించమనే భగవంతుడు చెప్పాడు. భగవంతుని తృప్తి పరచడానికి ఒక సులభమైన మార్గం, భగవంతుని నామ స్మరణ. నవ విధ భక్తీ మార్గములలో ఒకటి అయిన ఈ దైవ నామ స్మరణ తో భగవంతుని సులభంగా దర్శించవచ్చు. నడుస్తున్నా, తిరుగుతున్నా, ప్రయాణం లో ఉన్నా, అనారోగ్యం తో ఉన్నా, మనసులో కాని, పైకి ఉచ్చరిస్తూ కాని, భగవంతుని నామ జపం చేయవచ్చు. ఎవరి ఇష్ట దైవమును వారు మన: పూర్వకంగా భక్తీ తో స్మరించు కోవచ్చు.
ఓం నమో నారాయణాయ.
ఓం శ్రీ రామ...
ఓం నమ: శివాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం సాయి రామ్
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం హనుమతే నమ:
ఓం శ్రీ సరస్వత్యై నమ:
భగవంతుడు స్మ్రుతి మాత్ర ప్రసన్నుడు. మనం నిండు మనసుతో, అయన నామాన్ని నిరంతరం స్మరిస్తే, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనలను రక్షిస్తాడు.
శుభం...