Friday 16 September 2016

శ్రీ రమణ గారు "మిథునం" కథ ద్వారా మనందరికీ పరిచయమే.... "నాకు నచ్చిన కథ" శీర్షికన ఆయన వ్రాసిన మరో ఆణిముత్యం "బంగారు మురుగు" కథ పరిచయం చేయబోతున్నాను...నేను ఎంతవరకూ న్యాయం చేయగలనో తెలియదు..ఎందుకంటే వారి కథలను క్లుప్తీకరించి వ్రాయడం సాహసమే...అచ్చతెలుగు కథలకు మరో ఉదాహరణ ఈ " బంగారు మురుగు"..
ఈయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయస్థాయి వివేకానందా వ్యాస రచన పోటీలలో వరుసగా ఆరుసంవత్సరాలు ప్రథమ బహుమతి అందుకున్నారట..బాపు రమణలతో కలిసి చిత్రపరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేసారట...ప్రస్తుత కథ 1993 సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వార పత్రిక కోసం వ్రాసినది..ఈ కథకు "జ్యేష్ట లిటరరీ" అవార్డు లభించింది....
ఓ ఇంట్లో ఓ బామ్మకీ, మనవడికీ ఉన్న బంధం గురించి చెప్తుందీకథ. మడి, పూజ వంటివి లేకపోయినా, "మొక్కకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...ఇవే బామ్మకు తెలిసిన బ్రహ్మసూత్రాలు...గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే ఓ స్వాములారి సేవలో కొడుకుకు ఉన్న మడులూ, మాన్యాలూ అంతరించిపోగా, మనవడికి అంతా తానై పెంచుతుంది...పెరట్లో ఉన్న బాదం చెట్టు ఇద్దరికీ ఆవాసం..రాలిపడిన బాదం కాయలూ, అమ్మకి తెలియకుండా, చెట్టుతొర్రలో మిఠాయిలూ, జీళ్ళూ దాచే బామ్మే మనవడికి తోడూ, నీడా, దైవం అన్నీనూ...పరువు తక్కువగా... బయటి చిరుతిళ్ళు మనవడికోసం కొని పెడుతోందని తెలిసిన కొడుకూ కోడలూ బామ్మ చేతికి డబ్బులు అందకుండా చూస్తే,....... బియ్యం ఎదురిచ్చి జీళ్ళు కొంది బామ్మ....ఆ తరువాత బియ్యం డబ్బాకి కూడా తాళం పడితే, మనవడి పీచుమిఠాయి కోసం దేవుడిగదిలో కంచు గంటకి కాళ్ళొస్తాయి...మిఠాయిలూ, జీళ్ళూ, పీచుమిఠాయి ఆరోజుకి ఇచ్చేసి, మరుసటి వారం సంతరోజు వాడొచ్చి ఇంకా బాకీ ఉన్నానని మరిన్ని జీళ్ళూ, వగైరా ఇచాకగానీ ఇంట్లో కంచుగంట ఆచూకీ తెలియలేదు...పూజలూ, పునస్కారాలూ, స్వాములోర్లూ, సత్కారాలూ, జప తప హోమాదుల్లో మడులూ మాణ్యాలూ కరిగిపోవడం ఎలా తెలియలేదో, అంత దాకా ఒకటే కంచం, ఒకటే మంచంగా బామ్మతో బ్రతికిన మనవడికి కంచం , మంచం వేరయ్యాక గానీ, తనకి వయసొచ్చిందని తెలియలేదు...పెళ్ళీడు వచ్చాక, వరస అయిన మనవరాలు (కూతురి కూతురు) ఉన్నా కూడా ఆమే గుణం తెలిసి బయట సంబంధం చూస్తుంది బామ్మ..నాలుగు కాసుల బంగారం దగ్గర సంబంధం చేజారుతుందంటే, ఏదో మాయ చేసి, సంబంధం ఖాయం చేస్తుంది..పెళ్ళి సమయం లోనూ, మరణ శయ్య మీద ఉన్నప్పుడూ ...అసలు మనవడికి గ్రాహ్యకం వచ్చినదగ్గర్నుండీ ఎన్నో జీవిత సయ్తాలు చెప్తుంది బామ్మ....విచారించకు వెర్రి నాగన్నా....ఇప్పుడు వెళ్ళి, అటూ ఇటూ కాస్త పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అని మనవడికి భరోసా ఇచ్చి కన్ను మూస్తుంది...
స్థూలంగా ఇదీ కథ...అయితే, కథ ఆద్యంతం, తెలుగు భాష తీయదనం ప్రవహిస్తూ ఉంటుంది...బామ్మల దగ్గర బాల్యాన్ని గడిపిన అదృష్టవంతులందరూ ఈ కథలో తమ బాల్యాన్ని పోల్చుకుంటారు.
"పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ, వేధింపులూ బామ్మ దగ్గరలేవు"...
ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తీ రెండూ లేవు అంటే " దయ కంటే పుణ్యం లేదు..నిర్దయ కంటే పాపం లేదు...చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం,....నాకు తెలిసిందివే" ...
"మండువా లోగిలి పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువలా ఉండేది"...
"పిచ్చి సన్నాసీ! దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేవైనా ఉందీ!! మేలుకొలుపులూ మనకోసమే, చక్కెర పొంగలీ మనకోసమే!!"
"బాదం చెట్టు భోషాణం"..
"విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయిలు"...
"నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"...
"దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది---దిక్కులేని వాళ్ళకి"...
"ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నావరించింది"..
"ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?"..
" పిల్ల పొందిగ్గా ఉంది...పచ్చగా దొరసానిలా ఉంది...కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి...నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు..."
"అరటి దూట కూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, నైపుణ్యం కావాలి...అలాంటి అమ్మాయి సంసారాన్ని చక్కదిద్దుగోగలదు.."
"ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి.. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి...అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి"...
ఇలాంటి మనసు నిండే వాక్యాలు ఇంకా ఎన్నో ఈ కథలో, అన్నీ చెప్పాలంటే మొత్తం కథ చెప్పాలి...ఈకథని ఈపాటికి మీరందరూ చదివే ఉంటారు. చదవకపోతే తప్పనిసరిగా ఒక్కసారైనా చదవండి....ఒక్క సారి చదివాక, ఆరోజే మరో నాలుగైదు సార్లు చదవకుండా ఉండలేరు...ఇంత మంచి కథను చదవడం మిస్ అయ్యరంటే మాత్రం జీవితంలో కొన్ని అనుభూతులను మిస్ అవుతున్నట్లే...
మీ స్పందనని తెలియపర్చడం మర్చిపోవద్దు...
చిన్నతనంలో మేము చదివిన స్కూల్ లో ప్రతిరోజూ మూడు భాషల్లోనూ, డిక్టేషన్ వ్రాయించేవారు....ఈ మూడు భాషల టీచర్లూ క్లాసులోకి రాగానే ముందు డిక్టేషన్ చెప్పవలసిందే..ఆ తరువాత హోం వర్కులు చూసి, అప్పుడు కొత్త పాఠం మొదలుపెట్టడం...మూడు భాషలోనూ డబల్ రూల్ పుస్తకాల్లో కాపీ రైటింగ్ వ్రాయాల్సిందే....అందువల్ల మాకు ఇప్పటికీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వ్రాయడం వస్తుంది. మిగిలిన గ్రూప్ సబ్జెక్ట్స్ కి ఎంత విలువ ఇచ్చేవారో, తెలుగు, హిందీ, ఇంగ్లీషు కీ అంత ప్రాధాన్యత ఇచ్చేవారు...ప్రతి సబ్జెక్ట్ లోనూ పాఠాలు వివరంగా చెప్పటం, పద్యాలు అయితే రాగయుక్తంగా పాడటం, పిల్లలచేత పాడించటం చేసేవారు మా టీచర్లు...మా హెడ్మిస్త్రెస్స్ పిల్లలతో ఎంత చనువుగా ఉండేవారో, తప్పు చేస్తే అంతగానూ శిక్షలు ఉండేవి...పిల్లల్తో చాల కలిసిమెలిసి ఉండేవారు ఆవిడ. ప్రతి విద్యార్థీ ఏ క్లాసు, ఏ సెక్షను అనేది ఆవిడకి ఎప్పుడూ గుర్తే...ప్రైవేటు స్కూల్ అయినా కూడా ఆవిడ మమ్మల్ని అన్ని పోటీలకూ పంపేవారు, అన్ని పరీక్షలూ వ్రాయించేవారు. ఏవో కేంద్ర ప్రభుత్వ పరీక్షలూ, తి.తి.దే. వారి పరీక్షలూ ..ఏమిటో చాలా చాలా వ్రాసేవాళ్ళం...ఒక్క చదువే కాకుండా చాలా ఇతర వ్యాపకాలలోనూ, ఆటల్లోనూ కూడా చాలా పోటీలకు వెళ్ళి, మా స్కూల్ పిల్లలు ఎన్నో బహుమతులు గెల్చుకునే వారు. ...మా హెడ్మిస్టెస్ టీచర్లను ఎలా సెలెక్ట్ చేసుకునేవారో కానీ, ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యం... పుస్తకాల్లో పాఠాలే కాక, ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్చుకున్నాం వారి దగ్గర...ఈరోజుకి, మేము ఉద్యోగాలు చేయకపోయినా, మా పిల్లలకు ట్యూషన్లు లేకుండా సొంతంగా ఇంట్లో చదువుచెప్పుకుని, వాళ్ళకు ఇంత క్రమశిక్షణ నేర్పగలిగాము అంటే అదంతా మా టీచర్లు, హెడ్మిస్ట్రెస్ చలవే...ఆ స్కూలు 1983 లో వదిలేసినా, ఈరోజుకి తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు...ఇప్పటికీ మా స్కూల్ మీద, మా టీచర్ల మీద గౌరవభావం , ప్రేమ అలాగే ఉన్నాయి నాకు..నాకే కాదు, మా స్కూల్ పిల్లలందరికీ అంతే బహుశా...
ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదూ..కాకినాడలో అప్పట్లో పేరెన్నిక గన్న స్కూల్....టాగూర్ కాన్వెంట్ హై స్కూల్...హెడ్ మిస్టెస్ పేరు శ్రీమతి సి.ఎం. ఇందిరా దేవి గారు. తెలుగుకి సుబ్బలక్ష్మి టీచర్, లెక్కలికి జోసెఫ్ మాస్టారు, సైన్స్ కి రాఘవలక్ష్మి టీచర్, పి.వి. శర్మ గారు, సోషల్ కి సావిత్రి మేడం, హిందీకి పద్మావతి టీచర్, పి.టి. సర్ సూర్యనారాయణ గారు, డ్రాయింగ్ కి సత్యనారాయణ సర్, ఇంగ్లీషుకి ఛార్లీ మాస్టారు...అబ్బబ్బ....అందరూ ఎంత బాగా చెప్పేవారో....
ఇవీ మా స్కూల్ విశేషాలు...ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా మా జీవితాలను తీర్చిదిద్దిన ఆ గురువులందరికీ పాదాభివందనాలు...
మీ అందరి స్కూల్ విశేషాలు కూడా పంచుకోండి మరి...
శ్రీ గురుభ్యో నమ:
ఈ సమూహం లో సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయులకు నా మన:పూర్వక "ఉపాధ్యాయ దినోత్సవ "శుభాకాంక్షలు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటం లో తల్లితండ్రుల తర్వాత మీ పాత్ర అమోఘమైనది. విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక నేర్పి ఉన్నత సంస్కారాలను విద్యార్ధులలో పాదుకొల్పడం లో మీ కృషి శ్లాఘనీయం . ఒక దేశ భవిష్యత్తు ఆ దేశం లోని యువత మీదనే ఆధారపడి ఉంది. అటువంటి యువతను తయారు చేసేది మీరు. అంటే పరోక్షంగా ఒక దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉంది.
పురాణం కాలం నుంచి రామ లక్ష్మణులను, కౌరవ పాండవులను మరెంతో మంది శిష్యులను ప్రతి యుగం లోను ఉన్నతమైన వ్యక్తులుగా రూపొందించిన గురువులు కలిగిన వేదభూమి మనది. ఈ ఆధునిక కాలం లో కూడా శ్రీ రాధాకృష్ణన్ వంటి ఎంతో మంది గురువుల నీడలో పెరిగిన ఎంతో మంది నేడు ప్రముఖులై దేశమాత సేవలో తరిస్తున్నారు.
. యువత మార్గనిర్దేశనం లో మీ పాత్ర ఎంతో విలువైనది. ఈ సమాజ నిర్మాణంలో మీ భాగస్వామ్యం విలువ కట్టలేనిది. మీ ఋణం తీర్చుకోలేనిది. దేశం లోని ప్రతి పౌరుడు మీకు సదా కృతజ్ఞులై ఉంటారు....
గురుర్బ్రహ్మా, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ:
పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చే పొరపాటు చేయకండి..అది ఇంట్లో ఉండే మిగిలిన పిల్లలతో అయినా సరే, ఇతరుల పిల్లలతో అయినా సరే..ఒక్కొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉండచ్చు...దానిని కనుక్కొని వెలికితీసి ప్రోత్సహించడం తల్లితండ్రులుగా మన విధి...పెద్దవాడికి చదువులో ఆసక్తి ఉంటే, చిన్నవాడికి పాటల్లో ఉండచ్చు....చాలా ఇళ్ళల్లో సాధారణంగా వినబడే మాట ఏంటంటే, అన్న లాగా నువ్వు ఎందుకు ఉండవు?, అక్క లాగా ఎందుకు ఉండవు? ఇద్దరూ ఎందుకు ఒకలాగా ఉండాలి? ఉండరు కూడా....అలా పోల్చి తిట్టడం వలన వాళ్ళ మనసుల్లో ఏర్పడే న్యూనతా భావం కొన్ని సంవత్సరాల వరకూ ఉండిపోవచ్చు...దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి...ఇంట్లో పెద్దవాళ్ళు అలా అనడమే కాకుండా...ఎవరితో అయినా చెప్పేటప్పుడు కూడా, పెద్దవాడు చాలా బాగా చదువుతాడండీ, చిన్నవాడికి అంత శ్రధ్ధ లేదు, ఆటల్తోనూ, టీవీ తోనూ సరిపోతుంది ...ఇలా చెప్పడం వలన, పెద్దపిల్లలు చిన్నవాళ్ళను చులకన చేయడం, బయటి వాళ్ళు కూడా చులకనగా చూడడం జరుగుతాయి. దీని ప్రభావం చిన్న వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది..ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే, వారందరి మధ్యన, ఒక బంధం, ఐకమత్యం ఉండేలా పెద్దవాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి..ఇలా సంతానం మధ్యన పోల్చి చూడటం వల్ల, వాళ్ళ మధ్యన ఉండే ఐకమత్యం, ప్రేమ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి బిడ్డా ప్రత్యేకమే..ఏ ఇద్దరూ ఒక్కలాగా ఉండరు. ..రేండో సంతానాన్ని కనేటప్పుడు తల్లి తండ్రులు గుర్తుంచుకోవలిసిన ముఖ్యమైన విషయం ఇది.

Sunday 28 August 2016

నిజంగా ఈ స్త్రీవాదం అంటే ఏంటో అంతుపట్టదు నాకు....మగజాతినీ, మగపుట్టుకనీ, చెడతిట్టడమేనా స్త్రీవాదం అంటే....నిజమే..పురాణకాలం నుంచీ స్త్రీలు వివిధ రకాలుగా, పురుషుల చేతుల్లో సమాజం చేతుల్లో బాధలు పడ్డారు....అలా అని మొత్తం మగజాతిని ద్వేషించలేము కదా....కొంతమంది స్త్రీవాదులు పెళ్ళితో వచ్చే సౌభాగ్య చిహ్నాలు కూడా వద్దనుకుని, తెల్లచీర, (సుమంగళులైనప్పటికీ) బోసి నుదురు, మెడ, చేతుల్తో వెలిగిపోతున్నారు..వాళ్ళ ఆశయాలకు హేట్సాఫ్....కొంతమందికి భారతం, రామాయణం లాంటి పురాణాల్లో కూడా బూతులు కనబడతాయి...ఈనాడు ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకుంటున్న ఈ ఇతిహాసాల్లో వాళ్ళకు తప్పులు కనబడుతున్నాయంటే, వాళ్ళది ఎంత వంకర చూపు, ఎంత వంకర ఆలోచనలు? హవ్వా, వీళ్లకు చెప్పేవాళ్లే లేరో లేకపోతే చెప్పినా వినరో నాకు తెలియదు..ఎక్కడో ఏదో జరిగిందని, మగజాతిని, సమూలంగా ద్వేషించడం తప్ప వీళ్ల అజెండాలో ఇంకేమీ కనిపించదు...పోనీ ఇంత స్త్రీవాదులు ఆడవాళ్ళకు జరిగే అన్యాయాలకు న్యాయం ఏమైనా చేయగలుగుతున్నారా అంటే అదీ లేదు...స్త్రీల మీద రేపులు జరిగాక, రోడ్ల మీదకు రావడం తప్ప, బాధితులకు ఏ పిసరైనా సాయం, న్యాయం చేసారన్న దాఖలాలు ఉన్నాయా? వీళ్ళ చొరవ వల్ల, నేరస్థులకు తొందరగా శిక్ష పడిందా ఎక్కడైనా, ఎప్పుడైనా? పోనీ, వ్యభిచార కూపం లో ఉన్న, పెళ్ళి ముసుగులో, పనివాళ్ళ ముసుగులో దుబాయికి అమ్మేయబడుతున్న ఆడపిల్లల గురించి ఏమైనా చేసారా? వాళ్ళకు (ప్రభుత్వ సాయం లేకుండా) శాశ్వత జీవనోపాధిని కల్పించారా? ముంబాయిలో డాన్సు బార్లు మూసినప్పుడు, హర్షం వెలిబుచ్చిన వీరు క్రికెట్ మ్యాచుల్లో సగం సగం గుడ్డలేసుకొని ఎగిరే చీర్ గర్ల్స్ ని ఎందుకు నిషేధించమనరు? ఇంకా బార్ గర్ల్స్ వల్ల కొంతమందికి పరోక్షంగా ఉపాధి ఉంది...చీర్ గర్ల్స్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం? వీరు అడిగే మరో ప్రశ్న, ....మగవాడు చేస్తే తప్పులేనిది మేము చేస్తే తప్పా? అమ్మా తల్లుల్లారా! మగవాడికి, ఆడదానికి ప్రకృతి పరంగా కొన్ని బేధాలు ఉన్నాయి. మానసికంగా కూడా స్త్రీ పురుషుని కన్నా బలవంతురాలు...అందుకే, అత్తింటి బాధ్యతలు, పిల్లల పెంపకం వంటివి ఆడదానికి కేటాయించాడు భగవంతుడూ, సమాజమూనూ...ఇది మనకు గర్వకారణం అనుకోవాలి....స్త్రీ మెదడు ఒకేసమయంలో రకరకాల విషయంలో గందరగోళం లేకుండా ఆలోచించగలదు..అందుకే స్త్రీ అన్ని విధులను ఏకకాలంలో సమర్ధించగల నిపుణురాలు...అందుకే అన్ని రకాల మనుషులను టాకిల్ చేయగలదు....స్త్రీకి గల ఇంత ఉన్నత వ్యక్తిత్వాన్ని వదిలేసి, మగవాళ్ళతో సమానంగా అర్ధరాత్రి తిరిగితే తప్పేమిటి, ప్యాంట్లు వేసుకుంటే తప్పేమిటి, చీరలే కట్టుకోవాలా?.......మా వస్త్రధారణ మా ఇష్టం, ...ఇదే అక్కర్లేని ఐడియాలజీ....అందర్నీ చెడగొట్టడం..... ఈ కాలం లో మగవాళ్ళు మరీ ఇదివరకటిలా కాకుండా కొంచెం మెరుగు....అయినా మగవాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు అంటే వాళ్ళను పెంచిన తల్లులది కూడా కొంత బాధ్యత ఉంది కదా...మరి అది ఎవరూ మాట్లాడరేం? మగైనా , ఆడైనా పిల్లలు చెడిపోయారన్నా, నడత బాలేదు అనుకున్నా, పెంచిన తల్లుల బాధ్యత ఉంటుంది...అంటే ఇక్కడ తప్పు ఆడవాళ్ళది కూడా కదా.. ఇలా మాట్లాడుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి....ఇప్పటికివి చాలు..
"తెలుగు భాషా దినోత్సవం"...ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మన భాషను మనమే చంపేసుకుంటున్నాం కనుక...ఓ పక్క భాషను  పూర్తిగా కప్పెట్టెయ్యడానికి లోతైన గోతులు తీసేస్తూ, "దినోత్సవం" చేసుకోవడంలో అర్ధం లేదు. ఏడాదికి ఓసారి మన భాషను గుర్తు చేసుకొని వలవలా ఏడవడం మనకే చెల్లింది...ప్రతిరోజూ గుర్తున్నా లేకపోయినా......పక్క వాళ్ళతో అన్నిటికీ పోటీపడతాం...పనికొచ్చే వాటికి తప్ప.....కొంచెం చిత్తశుధ్ధి ఉంటే చాలు...మన భాషను మనం కాపాడుకోవచ్చు.

1. ఎంత హోదాలో ఉన్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడడం.

2. ముఖ్యంగా పెద్దవాళ్లతో పిల్లల సంభాషణ తెలుగులోనే ఉండేలా చూడడం.

3. పిల్లలను ' గొ, తకె థిస్, స్లీప్ బబ్య్ , సిత్ ప్రొపెర్ల్య్ " అంటూ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో పెంచడం..

4. చిన్న పిల్లలకు కాలక్షేపానికి గాడ్జెట్స్ ని ఇవ్వకుండా..ఆడుతూ పాడుతూ వారికి తెలుగు భాష నేర్పించడం..

5. కొంచెం ఎదిగిన పిల్లలకు రామాయణ భారతాల వంటి గ్రంధాలను తెలుగులో పరిచయం చేసి చదివించడం...

6. పిల్లలకు ముఖ్యంగా "ణ, ళ, " వంటి అక్షరాలను ఉచ్చారణ దోషం లేకుండా పలకడం నేర్పించడం....

7. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినపుడు తెలుగులోనే మాట్లాడుకోవడం....మనకు ఉన్న ఈ జాడ్యం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా జోక్స్ వేసినా, మనకు బుధ్ధిరాదు...

ఇవన్ని మనం మన పిల్లల పట్ల ఆచరిస్తే, తెలుగు భాష ఇంకో తరం పాటు సజీవంగానే ఉంటుంది. మన పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే, మరో తరం వరకు భేషుగ్గా వెలిగిపోతుంది మన భాష...మన తెలుగు కే సొంతం అయిన పద్య రచన, అవధానాలు, రంగస్థల నాటకాలు ఇటువంటి వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. మొదట్లో పిల్లలు వినకపోతే, ఓ పెద్ద బాలశిక్ష పుస్తకమో, తెలుగు లో బొమ్మల రామాయణాలో, కథల పుస్తకాలో వాళ్ళ కంటికి ఎదురుగా ఉండేటట్లు పెట్టండి. వాటినలా చూసి, చూసి, వాళ్ళకే ఆసక్తి కలుగుతుంది. చిన్న చిన్న నీతి కథలు, సామెతలు, ఇటువంటికి ఆసక్తిని పెంచేలా చెప్తే, పిల్లలకు భాష నేర్చుకోవాలనే జిజ్ఞాస పుడుతుంది.

ఎవరైనా తల్లితండ్రులు  మా పిల్లలకు తెలుగు మాట్లాడ్డం, చదవడం చేతకాదండీ అని బీరాలు పోయినపుడు రోతెక్కిపోతుంది..ఆ తప్పు ఎవరిది? పిల్లలది కాదు..ఖచ్చితంగా పెద్దవాళ్ళదే...


Thursday 25 August 2016

వర్ధనమ్మ ఇల్లు తాళం వేసి ఎక్కడికో బైల్దేరబోతోంది. ఇంతలో ఢిల్లీ నుంచి కాంఫరెన్సుకు ఊళ్ళోకొచ్చిన  పెద్దకొడుకు ఆటో దిగుతూ కనబడ్డాడు. తాళం తీసి ఇంట్లోకి ఆహ్వానించింది...ఇంట్లో అతనికి పెట్టడానికి ఏమీ లేవు..కుశలప్రశ్నలు అయ్యాక భోజనానికి ఉండమంటుందని ఆశపడ్డాడు కొడుకు. తన భార్యకి ఒంట్లో బాగుండడంలేదు. అమ్మ ఒప్పుకుంటే నాలుగు రోజులు తీసుకెళ్ళచ్చు అనుకున్నాడు...తల్లిని చూడడానికి వట్టిచేతుల్తో వచ్చాడు తను. సంభాషణ ఎలా మొదలెట్టినా తల్లి క్లుప్తంగా జవాబులు చెప్పి మాట మధ్యలోనే తుంచేస్తోంది. ..అమ్మ బాగా మారింది అనుకున్నాడు...ఒక్కదానివి ఉండడం ఎందుకు? తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడు కదా, వాడి కుటుంబాన్ని దగ్గర పెట్టుకో....చేదోడువాదోడుగా ఉంటాడు అని సలహా ఇచ్చి, డబ్బులు ఇద్దామని తీయబోయిన పర్సు కూడా మళ్ళీ జేబులోనే పెట్టేసుకుని శెలవు తీసుకున్నాడు...

నాలుగు రోజుల తర్వాత ఊళ్ళో ఉటున్న చిన్నకొడుకు వచ్చాడు తల్లిని చూడడానికి...పెళ్ళి అయిన మొదట్లో భార్య మాటలకు తందానా పాడి విడికాపురం వెళ్ళిపోయాడు....ఆదాయం పెరగక, ఖర్చులు ఎక్కువై, ఎదిగిన పిల్లల్తో రెండు గదుల ఇంటి కాపురం చేయడంలో కష్టం తండ్రి పోయాక, తల్లి ఒంటరిగా ఉంటున్నప్పుడు తెలిస్తోంది...తల్లి ఇంట్లోనే అందరూ కలిసి ఉంటే అద్దె ఉండదు. పిల్లల మీద తల్లి అజమాయిషీ ఉంటుంది. తల్లి ఎలాగూ పని చేయకుండా కూర్చునే రకం కాదు కాబట్టి భార్యకు పనిలో కాస్త వెసులుబాటు ఉంటుంది. భార్య మెదడులోని ఆలోచన , అతని మనసులో రూపుదిద్దుకుంటోంది.
 
చిన్నకొడుకు ఎంత లౌక్యంగా మాట్లాడినా వర్ధనమ్మ తాను ఒంటరి జీవితానికే ఇష్టపడుతున్నాను అని అంతకన్నా గుంభనంగా చెప్పింది...అన్నయ్య డబ్బు పంపుతున్నాడు కాబట్టి, అమ్మ ఇలా మాట్లాడుతోంది..అనుకున్నాడు చిన్నకొడుకు కేశవ...అన్నగారు రెండుమూడు నెలలనుంఛీ డబ్బు పంపని విషయం తెలియక...తన మాట చెల్లకపోయేసరికి విసుక్కుంటూ ఇంటిదారిపట్టాడు...

ఒంటరిగా మిగిలిన వర్ధనమ్మ మనసులో ఏవేవో ఆలోచనలు...పదహారేళ్ళకు పెళ్ళి అయ్యి కాపురానికి వచ్చినదగ్గర్నుంచీ ఒకటే పని....చేసి చేసి అలసిపోయింది...దానికి తోడు భార్యను అజమాయిషీ చేయడం తప్ప  ప్రేమించడం పరువుతక్కువ అనుకునే భర్తతో ఆర్నెల్ల క్రితం వరకూ ఓ భార్యగా పక్కన కాకుండా, వెనకనే నడిచింది...తన మీదున్న బాధ్యతలన్నీ సంపూర్ణంగా తీర్చుకుంది...అందరికీ తలలొ నాలుకలా మెలుగుతూ....తండ్రి చనిపోయాక 12రోజుల కర్మలు చేసి అస్థి నిమజ్జనం తో సరిపెట్టుకున్నారు కొడుకులు. బతికున్నప్పుడు ప్రేమ చూపకపోయినా, భార్య పట్ల బాధ్యతగా తన పేరన ఒక ఇల్లు, కొంత బ్యాంకు బాలన్సూ ఉంచి వెళ్ళాడని ఆయన పోయినతర్వాతే తెలిసింది వర్ధనమ్మకు...లేని భర్తకీ, ఉన్నాడో లేడో తెలియని దేవుడికీ దణ్ణస్లుపెట్టుకుంది..ఆ పన్నెండు రోజుల్లోనే కొడుకుల, కోడళ్ళ అవకాశవాదాలు తెలిసొచ్చాయి...కాలం మహిమ అనుకుంది, కానీ ఎవరిని తప్పుగా అనుకోవడానికి మనస్కరించలేదు..

ఆరునెలలౌ గడిచింది...ఇంట్లో ఓ మూడు గదులు అద్దెకిచ్చింది..ఆ అద్దె, బ్యాంకు వడ్డీ...రోజు గడుస్తోంది లోటు లేకుండా... ఇంట్లో పనులు బాగానే జరుగుతున్నాయి...మరి బయటవాటి సంగతి? ఎవరి చేస్తారు? గుళ్ళ పేరు పెరిగిపోయింది...అతుకు పెట్టించాలి..భర్త ఉంటే ఏంచేసేవాడో ఆలోచించింది..ఆయన ఉండగా ఎప్పుడూ బయటికి వెళ్ళిన మనిషి కాదు...తలుపు తాళం వేసి ఆచారి దుకాణం పేరు చెప్పి రిక్షా మాట్లాడుకుని వెళ్ళి పని పురమాయించింది...మొదట ఎవరేమనుకుంటారో అని బెరుకు అనిపించింది. పని పూర్తయ్యాక ధైర్యం వచ్చింది... కొన్ని రోజులయ్యాక ఆమేకు సినిమా చూడాలనిపించింది..సినిమా చూసి కొన్నేళ్ళు అయింది...తోడు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు...అయినా తనలాంటి ముసలి, ఒంటరి దానితో వేచ్చేవారెవరు? ఒక్కతే చూసి వచ్చింది..అందులో హీరోయిన్ తీసుకున్న నిర్ణయం సమాజ విరుధ్ధం అయినా ఆమె తెగువకి ముచ్చటపడింది....

ఈ పరిస్థితుల్లో తను కొడుకుల దగ్గరకు వెళ్తే జరుగుబాటు బాగానే ఉంటుంది? కానీ ఎణ్ణాళ్ళు? మళ్ళీ బాధ్యతల మడుగులో కూరుకుపోతుంది...కొంతకాలమైన తనకు దొరికిన ఈ స్వేచ్చ అనుభవించాలని ఉంది. ...సాయంత్రం పూట ఏమీ తోచలేదు...భర్త కాలక్షేపం ఏమిటో గుర్తు చేసుకుంది...దగ్గరగా ఉండే పార్కుకు వెళ్ళి కూర్చునేవాడు ఆయన...తను కూడా వెళ్ళింది..పిల్లలు, పెద్దలు, అందరితో సందడి సందడిగా ఉంది...వర్ధనమ్మకు ఊపిరాడినట్టయింది...మనసుకు రెక్కలు మొలిచినట్టు ఉంది....పిల్లల చేతుల్లో "పిడత కింద పప్పు" చూడగానే నోరూరింది...కాసేపు మడీ ఆచారం పక్కన పెట్టి, వాడు అడిగిన రూపాయిన్నర ఇచ్చి ఓ పొట్లం కొనుక్కుంది...బెంచి మీద కూర్చుని పొట్లం విప్పింది. ..పక్కనే ఉన్న ఏడెనిమిదేళ్ళ ముష్టి కుర్రాడు ఆశగా  తనకేసి చూస్తుంటే సగం వాడి దోసిట్లో పోసి, మిగిలినది తాను తింది. నోరు చుర్రుమంది..కాని కొత్త రుచి నోటికి తగిలింది...తన జీవితం మీద తనకి ఓ స్పష్టత వచ్చింది...భర్త కొంత ఆస్తి తనపేర వ్రాసి, తనకు కర్తవ్య బోధ చేసినట్టు తోచింది. ...ఆమె మనసు కొత్త రెక్కలు తొడుక్కున్నట్లయింది..

ఈ కథ ప్రముఖ రచయిత్రి అబ్బూరి చాయాదేవి గారు 1996 లో ఇండియా టుడే కోసం వ్రాసినది...ప్రత్యేకించి స్త్రీ స్వేచ్చ గురించి కాకపోయినా, భర్త, అత్తవారిల్లు, పిల్లలు, సంసారం వీటితోటే అలసిపోయిన స్త్రీలకు, కొంత వయసు తర్వాత బాధ్యతలు తీరిపోయాక, భర్త ఉన్నా, లేకపోయినా, తమకంటూ ఒక జీవితం ఉంది అని స్త్రీలకు స్పష్టంగా చెప్పిన కథ ఇది....ఇందులో మానవతా వాదం తప్ప స్త్రీవాదం లేదు...స్త్రీలు తమను తాము ఐడెంటిఫై చేసుకోవాలనే సందేశం తప్ప....

మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి మీ స్పందన తెలపండి. 

Tuesday 23 August 2016

మాతృశక్తి 26

వ్యక్తి వ్యక్తిలో సంస్కార నిరమాణం చేసే కార్యం చేయటానికి భారతీయులు స్వయంగానే ముందుకు రవాలి. మాతృశక్తి విషయంలో ఆలోచనా ధోరణిలో వచ్చిన వికృతిని తొలగించడానికి స్వయంగా సంస్కృతి, మాతృశక్తి విషయాన్ని సమగ్రంగా తెలుసుకొని ఇతరులకు తెలియచేసే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో కేవలం స్త్రీలను జాగృతపరచటమే కాక సంపూర్ణ సమాజం యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు రావటం అవసరం. ఏ సమాజంలోనైనా స్త్రీకి లభించే గౌరవాన్ని బట్టే ఆ సమాజం యొక్క శ్రేష్టత్వం ఆధారపడి ఉంటుంది. కాని కేవలం అధికారాల కోసం పోరాటం జరుపుతుంటేనే స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం లభించదు. మాతృశక్తి పరిజ్ఞానం స్వయంగా పొంది కర్తవ్య నిష్టతో స్వంత ఆచరణ ద్వార స్త్రీ పురుషులతో సహా సంపూర్ణ సమాజాన్ని ఈ మార్గంలో జాగృతపరచాల్సిన అవసరం ఉంది. " నాకంటే శ్రేష్టురాలు ఇంకెవరూ లేరు...ఎందుకంటే నను సర్వశ్రేష్ట వ్యక్తులకు తల్ల్లిని. నేను నిష్కామ భావంతో ప్రతిఒక్కరికీ సేవ చేసే తల్లిని. " ఇలాంటి ఉత్తమభావనను  తల్లి కలిగి ఉంటుంది. ఆమె హృదయ పవిత్రతకు ప్రబల నిదర్శనం ఇది. మాతృశక్తి యొక్క మూలతత్వం ఇదే. సృష్టి య్క్క శాశ్వత సత్యాలతో నిండిన భారతీయ సంస్కృతి సొంతం అవడం వల్ల మన దేశం స్థిరంగా ఉంది. ఇందులోని రహస్యం మాతృశక్తిని గౌరవించడం, దాన్ని సద్వినిఓగపరచడం లాంటి భావాలు ప్రజలందరి హృదయాలను స్పందింపచేసి మళ్ళి ఒకసారి మొత్తం సమాజం మాతృశక్తి భావనతో ఉవ్వెత్తున లేచి నిలబడినప్పుడే సమాజంలో స్త్రీకి మళ్ళి పూర్వపుగౌరవం లభిస్తుంది. భారతాజాతి కూడా కోల్పోయిన తన స్వాభిమానాన్ని తిరిగి పొంది శక్తివంతమైన, సుదృఢమైన జతిగా అవతరించి ఈ క్రింది విధంగా మాతృభూమికి వందనం చేస్తుంది.

"పూజనీయే ఆధారభూతే మాతృశక్తే
నమోస్తుతే, నమోస్తుతే, నమోస్తుతే."


******************************సమాప్తం********************************




మాతృశక్తి 25

రెండువేల సంవత్సరాల విదేశీ దురాక్రమణ కాలంలో తమ సంస్కృతిపై భారతీయులకున్న శ్రధ్ధాసక్తులను నిలిపి ఉంచటానికి ఈ దేశంలో భక్తి సాంప్రదాయం ముందుకొచ్చింది. అనేక మతాలకు చెందిన భక్తులు శ్రద్ధతో, త్యాగభావంతో భారతీయ సంస్కృతీ ప్రచారం చేసారు. దానివల్ల కూడా భారతీయులకు చాలా మేలు కల్గింది. తమ సంస్కృతిమీద భారతీయులకున్న దృఢవిశ్వాసం కారణంగా భారతీయరాజులు శతృవులతో వీరోచింతంగా పోరాడారు. క్రీ. శ. 17, 18 శతాబ్దాలలో వచ్చిన ముస్లింలు , మొగలులు భారతీయ రాజుల ముందు నిలబడలేకపోయారు. భక్తి సాంప్రదాయం వల్ల ఆ కాలంలో కల్గిన పెద్ద మేలు ఇది.

18వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశంలో చాలా భాగాలనుండి విదేశీయుల రాజ్యాలు తొలగిపోయి వాళ్ళ అత్యాచారాలు కూడా తగ్గిపోయాయి. వివిధ ప్రాంతాల్లో భారతీయ రాజ్యాలేర్పడ్డాయి. రెండువేల సంవత్సరాలుగా జరిగిన విదేశీ దురాక్రమణ ప్రముఖంగా రాజకీయానికి సంబంధించిందే.చివరి వేయి సంవత్సరాల్లో మాత్రం రాజకీయాలతో పాటు మత సంబంధం కూడా ఉంది. దురాక్రమణదారులు భారతీయుల అనేక మందిరాలను, విద్యాలయాలను గ్రంధాలయాలను దోచుకోవటం, నాశనం చేయట చేసారు. స్త్రీలను దోచుకోవడంతో పాటు మానభంగాలు చేశారు. కాని వీళ్ళ ప్రయత్నాల ద్వారా భారతీయౌలకు తమ సంస్కృతి పట్ల ఉన్న శ్రధ్ధ ఏమాత్రం తగ్గలెదు. 18వ శతాబ్ది ప్రధమార్ధంలో సంపూర్ణ భారతాన్ని రాజకీయింగా స్వతంత్రం చేయాలనే భారతీయప్రయత్నాలు ఇంకా పూర్తి సఫలం కాకముందే సముద్రమార్గం ద్వారా వ్యాపారం చేసుకోవడానికి భారతదేశం వచ్చిన ఆంగ్లేయులు సంపూర్ణ భారతాన్ని ఆక్రమించుకోవడానికి తీవ్రంగా కృషి చేసారు. క్రీ.శ. 1757 లో జరిగిన ప్లాసీ యుధ్ధంలో విజయం సాధించిన వాళ్ళు 70,80 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. ముస్లిం దురాక్రమణ దారులవలెనే ఆంగ్లేయులు కూడ స్త్రీల మీద అత్యాచారాలు జరిపి భయకంపితులను చేయటానికి ప్రయత్నించారు. దాంతోపాటే భారతీయులకు సుదీర్ఘకాలం నుండి తమ సంస్కృతి పట్ల తమ పూర్వజుల పట్ల ఉండే భక్తి శ్రధ్ధ, విశ్వాసాలను దూరం చేసే ప్రయత్నం కూడా చేసారు. ఈ పనిని వాళ్ళు ప్రముఖంగా 19 వ శతబ్దం మధ్య కాలం నుండి తాము స్వయంగా స్థాపించిన విద్యాలయాల ద్వారా చేసారు. అంతకు పూర్వం జరిగిన అత్యాచారాల కారణంగా భారతీయులు ఇదివరకే ధర్యం కోల్పోయి ఉన్నారు. ఆంగ్లేయుల సామ్రాజ్య నిర్మాణ శక్తిని, వాళ్ల సాధన సంపత్తిని చూసి ఇంకా వాళ్ళ ప్రభావానికి లోనైనారు. ఉద్యోగాల దృష్టి తో లాభదాయకంగా ఉన్న వాళ్ళ విద్యా విధానం కూడా భారతీయులను మానసికంగా వాళ్ళకు బానిసలుగా అయ్యేట్లు చేసింది. ఆంగ్ల విద్యాభ్యాసం ద్వారా భారతీయుల సాంస్కృతిక నిష్ట క్రమంగా తగ్గిపోయింది. వాళ్ళలో భోగలాలస పెరిగింది. "వివాహోన విలాసార్ధం, సంతానార్ధం చ కేవలం ' అన్న పూర్వపు భావన క్రమంగా మారిపోయి ససంభోగ సుఖ వాంచయే వివాహ లక్ష్యమైంది. ఆర్యత్వ లక్షణాలు తగ్గిపోయాయి. ఈ భోగ సంస్కృతి ప్రభావానికి గురైన ఈనాటి యువకులు నా తల్లి నాకు జన్మనిచ్చింది అని కాక, "నేను పుట్టాను, నా తల్లితండ్రుల భోగవాంచకు ఫలితమే నా పుట్టుక" అని అంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో మాతృశక్తి మహత్వం తెలియని కారణం గానే ఇలాంటి వాతావరణం నిర్మాణమైంది. ఇది పూర్తిగా వికృతి లక్షణం.

(ఇంకా ఉంది )

మాతృశక్తి 24

ఆంగ్లేయులకు ముందు రెండున్నరవేల సంవత్సరాల నుండి భారతదేశం మీదికి దండెత్తివచ్చిన విదేశీయులు భారతదేశ వాయవ్య, పడమటి దిక్కుల నుండి వచ్చారు. అప్పటివరకు ఆ దేశాలకు భారతీయ సంస్కృతి ప్రచారకులు చాలా కొద్ది సంఖ్యలోనే వెళ్ళారు. అందువల్ల సృష్టిలో మాతృశక్తి యొక్క మహత్వాన్ని గురించి అక్కడి ప్రజలు చాలా కొద్దిమందే తెల్సుకోగలిగారు. మాతృశక్తి మహత్యం తెలియని విదేశీ ఆక్రమణకారులు స్త్రీని కేవలం భోగవస్తువుగానే చూడసాగారు. ధన సంపదను దోచుకున్నట్లే వాళ్ళు స్త్రీలన్ దోచుకుని మానభంగాలు చేసి ఎత్తుకుపోయేవారు. క్రీ. శ. ఇస్లాం మత స్థాపన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన మహమ్మద్ద్య దురాక్రమణదారులు ఇక్కడి స్త్రీలను ఒక భోగవస్తువుగా చూడటమే కాక, స్త్రీలలో సంతానోత్పాదన శక్తిని తమ సంఖ్యాబలం పెంచుకోవడానికి సాధనంగా వాడుకోవాలని నిశ్చయించారు. ఈ ఉద్దేశ్యంతో ఒక్కొక్క పురుష దురాక్రమణ దారుడు అనేకమంది స్త్రీలను బలాత్కరించి వివాహం చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అధిక సంఖ్యలో సంతానొత్పత్తి చేసి ఇస్లాం మతస్థుల జనాభా వృధ్ధికి కారకులైనారు. వాళ్ళు ఈ పని ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తమ ఈ లక్ష్య పూర్తికి వాళ్ళు భారతీయ స్త్రీ పురుషుల మీద అనేక అత్యాచారాలు జరిపారు. స్త్రీలతో ఇలాంటి వ్యవహారం భారతీయులకు పూర్తిగా కొత్త. అందువల్ల ఈ అత్యాచారాలు చూసి స్త్రీలు భయకంపితులైపోయారు. దైర్యం కోల్పోయిన పురుష సమాజం కూడా వాళ్ళకు పూర్తి రక్షణ ఈయలేకపోయింది. స్వయంగా స్త్రీయే ఈ అత్యాచారులతో పోరాడి పోరాడి అలసిపోయి, చివరకు పోరాడే శక్తిని కోల్పోయి అబలగా మారింది. తండ్రి కొడుకులు మొదలైనవాళ్ళు ఇక తన్ను రక్షించలేరని తెలుసుకున్న స్త్రీలు వాళ్ళకు ఇబ్బంది కలుగకుండా ఉండలని తమ వ్యవహారాలను ఇంటివరకే పరిమితం చేసుకుని ఇంటికే బందీలైపోయారు. నీతిమంతమైన, పవిత్రపూర్ణమైన తమ సమాజమనే ఆకాశంలో స్వేచ్చగా విహరించే స్త్రీ ప్రంజరంలో పక్షి వలె పూర్తిగా స్వేచ్చను కోల్పోయి తనకు తానే కృంగి కృశించిపోయింది.

భారతీయ సంస్కృతి విషయంలో భారతీయుల శ్రధ్ధాసక్తులు ఎప్పటివలెనే దృఢంగా ఉన్నాయి. మాతృశక్తిని గురించిన అవగాహన, ఆచరణ విషయంలో వాళ్ళలో మార్పులేదు. దురాక్రమణదారులతో జరిగిన యుద్ధాల్లో భారతీయులు విజయం పొందినా వాళ్ళు ఆక్రమణదారుల స్త్రీలను దోచుకోవటంగాని, బలాత్కరించి వివాహం చేసుకోవడం కాని చేయలేదు. కళ్యాణ్ సుబేదారుతో జరిగిన యుద్ధంలో శివాజీ సైనికులు అనేకమందితో పాటు సుబేదారు కోడలును కొడ బంధించి శివాజీ ముందుకు తీసుకువచ్చారు. అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవ పూర్వకంగా సుబేదారు దగ్గరికి తిరిగి పంపించి ఇలాంటి చెడుపనులు ఇక ముందెప్పొడూ చేయవద్దని తన సైనికులను హెచ్చరించాడు.

(ఇంకా ఉంది )

మాతృసక్తి 23

తల్లిని పూజిస్తే మోక్షం లభించటం అసంభవమేమీ కాదు. భగవంతుని పూజలలో కెల్లా శ్రేష్టమైనది తల్లి పూజయే.. మాధుర్య సాగరం, ఊవులలో ఉండే కోమలత్వం, గంగా జల నిర్మలత్వం, చంద్రుని సౌందర్యం, సముద్రుని అనంతత్వం, భూమి సహనశీలత, తల్లి అనే రెండు అక్షరాలలో ఇమిడి ఉన్నాయి. ఇదే ఉత్తమ దైవం. ఆమె నాగురువు. అన్ని కోరికలు నెరవేర్చే కల్పవృక్షం..అని సోనే గురుజీ అన్నారు.

"ఒక వేళ తూచినట్లయితే మొత్తం ప్రపంచం కంటే తల్లే ఎక్కువ బరువు తూగుతుంది. నాలో ఏమేమి మంచి గుణాలున్నాయో అవన్ని నాకు నా తల్లి నుంచే లభించాయి." అని ప్రపంచ ప్రఖ్యాతుడైన నిపోలియన్ బోనాపార్ట్ అనాడు.

అలెగ్జాండర్ అయితే తన తల్లి కళ్ల నుండి ఏమాత్రం దు:ఖాశ్రువులు కారినా సహించేవాడు కాదు. వాటిని తుడవడానికి అతడు ఎంతకైనా సిధ్ధపడేవాడు.

మొత్తం ప్రపంచ భారాన్ని మోయగల ఓర్పు తల్లులలో ఉంది. జాతి అభివృధ్ధి తల్లులపైనే ఆధారపడి ఉంది. జాతి పతనోన్నతులు తల్లి కోరికపైననే ఆధారపడి ఉంటాయి. పతనాన్ని ఆమె ఎప్పుడూ కోరుకోదు.

ఈనాడు వ్వతావరణ కాలుస్యం గురించి చాలా చర్చ జరుగుతున్నది. కాని మతృశక్తి యొక్క దురుపయోగంతో ఏర్పడుతున్న సంస్కార కాలుష్యం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

భారతీయ ఋషులు అతి ప్రాచీన కాలంలోనే మాతృశక్తిలోనే సృష్టి నిర్మాత యొక్క సృజనశక్తి కలదని తెలుసుకొన్నారు. మాతృశక్తి గొప్పతనాన్ని వాళ్ళు భారతీయులకు తెలియచేసి దాన్ని ఎల గౌరవించాలో కూడా వాళ్ళకు నేర్పారు. ఆ కారణంగానే రాక్షస రాజైన రావణుడు సీతతో అలా మర్యాదగా వ్యవహరించడం సాధ్యమైంది.

మాతృశక్తి గురించిన సంపూర్న పరిజ్ఞానం కలిగి దాన్ని ఆచరణలో పెడుతూ వస్తున్న భారతీయుల సామాజిక జీవనం వేదకాలం నుండి అంటే 8, 10 వేల సంవత్సరాల నుండి ఈనాటికీ నిన్రంతరాయంగా కొనసాగుతూ వస్తున్నది. గత రెండున్నర వేలసంవత్సరాల నుండి భారతీయ రాక్షసులకంటే అతి క్రూఉలైన విదేశీయ దురాక్రమణలకు అది గురి అయింది.

(ఇంకా ఉంది  )
రాధాకృష్ణుల ప్రేమ అజరామరం...అమలినం...వారిరువురి బంధం మనసుకే పరిమితం.....కృష్ణుడు రాధ యొక్క ప్రేమతత్వం అయితే, కృష్ణుని యొక్క సర్వగత చైతన్యం రాధ....రాధా కృష్ణుల రాసలీలలు మోక్షానికి ఉద్దేశించినవే... ఆమె హృదయ స్పందనలోనూ, ఆమే మనసంతా నిండిన నందబాలుడే గోచరమవుతాడు...విరహం వేధిస్తున్నా రాధమ్మ తన కృష్ణుణ్ణి బాధించదు.....ఆమెకు తెలుసు, కన్నయ్య తనకే కాక, ఈ సర్వ జగత్తుకూ నాథుడని, జగన్నాధుడని...ఒకరిలో ఒకరు లీనమైన ఆ జంటకు విరహమనేదే లేదు....ఎందుకంటే, వారిరువురిదీ ఒకటే తత్వం...ఏకత్వం..... కృష్ణుని స్మృతుల్లో రాధకు మనసు పులకాంకితమైతే, రాధను తలచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది.....పొన్నలు నిండిన బృందావనం , వెన్నెల రాత్రులు, మురళీ నాదం, యమునా తీరం.....వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు..
కృష్ణుని యశోదా తనయునిగా, వ్రేపల్లే ముద్దుబిడ్డగా, పాండవోద్ధారకునిగా, రాయబారిగా, అర్జునుని మార్గదర్శకునిగా, రథసారధిగా, మహామహిమాన్వితమైన గీతోపదేశకునిగా ,,, ఎన్ని తీరుల్లో మనం ఆరాధించినా, కృష్ణ ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే ప్రేమిక "రాధ." వారి ప్రేమ తత్వం జగతికి ఆదర్శం....తరతరాలకూ మరువలేని కావ్యం...
శ్రీకృష్ణ శ్శరణం మమ

Monday 22 August 2016

మాతృశక్తి 22

సర్వే భద్రాణి పశ్యంతు:

అందరి శ్రేయస్సు కావాలనే కోరిక మాతృహృదయంలో ఉన్నతగా స్త్రీ యొక్క ఇతర రూపాలలో ఉండదు. ఎందుకంటే భద్రతా భావం ఆమెకెంతో ప్రియమైనది. తన పుత్రుడు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తిస్తే ఆమె సహించలేదు. మొత్తం ప్రపంచం శుభ్రంగా ఉండాలనే ఉదాతా ఆశయమామెది. అందరి శ్రేయస్సు కోసం ఆమె ఎంత కష్టాన్నైనా సహించటానికి సిధ్ధపడుతుంది. ఆపదలో ఉన్న రాక్షస రాజ్యాన్ని రక్షించడానికి శర్మిష్ట దేవయాని దాస్యత్వానికి సిధ్ధపడింది. సావిత్రీ బాయి ఫూలే స్త్రీలలో విద్యావ్యాప్తి చేసే ప్రయతంలో ఆమె వ్యతిరేకులు విసిరిన రాళ్ళ దెబ్బలు, పేడ దెబ్బలు సహించింది. ఎందుకంటే స్వయంగా కష్టపడినా సమాజ కళ్యాణం జరిగినట్లయితే జీవితం ధన్యమని ఆమె భావించంది.

మనువు--తండ్రి, కొదుకు, భర్త, అన్న--వీళ్ళందరూ స్త్రీకి రక్షకులుగా ఉంటారని చెప్పాడు కాని, పురుషులకు సన్మార్గ ప్రవర్తకులుగా నిర్మించే బాధ్యత స్త్రీదే..తన సోదరులను, భర్తను, పుత్రులను ఎన్నోరకాలుగా కర్తవ్యోన్ముఖులను చేసి, వారి విజయానికి, కీర్తి పొందుటకు  దోహదపడిన స్త్రీమూర్తులు ఎందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. మాతృత్వం యొక్క ఈ అనేక గుణాల కారణం గానే స్త్రీ పూజ్యురాలైంది. ఆబాలగోపాలానికి ఆమె యందు గౌరవభావం ఏర్పడింది.

సమర్థ రామదాసు ఇలా అన్నారు..." తన సంతానం యొక్క పోషణలో తల్లి ఎప్పుడూ అలసిపాదు. ఆమెకు సోమరితనం లేదు. ఆమె ఎప్పుడూ చికాకుపడదు. తలిలాంటి ప్రముఖ వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు."

తల్లి ప్రేమ మరియు ఆమె ఆశీర్వాదం లోనే లోక కళ్యాణం ఉంది. భగవంతుడు, తల్లి ఇద్దరూ సమానమే. మంచి తల్లియే మహాపురుషులకు అన్మనిస్తుంది. " అని స్వామీ వివేకానంద. అన్నారు. రూపుదాల్చిన భగవంతుని వాత్సల్యమే తల్లి  అని వినోబా భావే వచించారు.

(ఇంకా ఉంది )





Thursday 18 August 2016

విదురనీతి 71

"ప్రయత్నించకపోతే తప్పుకదా! అది నేను చెయ్యకూడదు కదా " అన్ని తెలిసి ఈ ప్రయత్నానికి సిధ్ధమయ్యానటాడు...

"వీరి మన్స్తత్వాలు తెలుసు. జరుగబోయే యుధ్ధము తెలుసు. ఇది అనివార్యము. ఈ మహాయుధ్ధము జరగాలి. జననాశనం జరగాలి. దురాత్ములు సమూలంగా నశించాలి. భూమి చల్లబడాలి. అంటే తన భారం తీరిందని సంతోషించాలి. ఇప్పుడు నేను కనుక రాయబారిగా రాకపోతే..

కృష్ణుడు కవాలని ఈ మారణకాండ దగ్గరుండి జరిపించాడని అనవసరంగా ముందు నన్ను ఆ తదుపరి పాండవులను నిరసిస్తారు. ఇప్పుడు జరుగబోయేది సర్వం గ్రహించినట్లు "విధి విపరీతం" అని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. కనుక, ఇది పొసగదు అని తెలిసి కూడా తప్పక వచ్చాను అని విదురునికి వివరించాడు.

రాయబారం విఫలమౌతుంది.

మూర్ఖులు, మందులైన దుర్యోధనులు కృష్ణుని బంధిస్తే పాండవుల ఆట కడుతుందని, అవివేకంతో ఆ మహనీయుని బంధింపతలచి చేసిన ప్రయత్నం వారికే బెడిసికొడుతుంది. కనీసం కృష్ణుని సంపూర్ణంగా కళ్ళతో చూదలేకపోతారు. చచ్చినట్టు బ్రతికి బయటపడతారు. పాండవుల ప్రతీకార, శపధాలు నెరవేర్చుకోవడానికి అన్నట్లు జీవచ్చవాలై మిగులుతారు.

ఆ తరువాత, ఉభయులు యుధ్ధ సమ్రంభాలు ప్రారంభిస్తారు. కురుక్షేత్రం చేరి ఉభయులు, సైన్యాలతో మిత్ర, ప్రియ, ఆశ్రిత రాజులతో, ధనుష్టంకారం చెయ్యడానికి వీలుగా శంఖధ్వానాలు చేస్తుంటే..


అర్జునుదు జావగారిపోతాడు. అతన్ని ఉత్సాహపరచడానికి,నీతి-ధర్మశాస్త్రమనే మహాభారతంలో శ్రీకృష్ణుడు జగదాచార్యుడై దర్శనమిస్తాడు. ధర్మ బోధ చేస్తాడు. అదే భగవద్గీత.

యుద్ధభూమి లో ఏం జరుగుతోందో చూసి చెప్తున్న సంజయుని మాటలకు ధృతరాష్ట్రుడు కుంగిపోతాడు. అధర్మవర్తనులైన తమ కొడుకులు ఎక్కడ విజయం సాధించరో అని దిగులుపడతాడు. మనసు వికలమైన ధృతరాష్ట్రుడు మనశ్శాంతి కోసం విదురుని రప్పించి మనసుకు సాంత్వన కలిగేటట్లు మంచి మాటలు చెప్పమని కోరుతాడు...ఆ సందర్భంలో విదురుడు పలికిన మాటలే విదుర నీతి.

శ్రీకృష్ణ శ్శరణం మమ ....

***************************(సమాప్తం) ********************************



విదురనీతి 70

అనురాగ హృదయం గల ప్రభువు ప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు పుష్పిత వృక్షం వలే ప్రసన్నుడై ఉండాలే కానీ, అధిక ఫలాలనందివ్వకూడదు. మనఒవాక్కాయ కర్మలతో ప్రజలకు సంతోషం కలిగించే ప్రభువు ప్రఖ్యాతుడౌతాడు. రజుచేసే దుష్కర్మలు రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పరంపరాగతంగా సజ్జనులాచరించే మార్గాన నడిచే మహీపాలునిక్కీ సిరిసంపదలతో రాజ్యం వృధ్ధిపొందుతుంది.

దరిద్రునకు ఆకలి ఎక్కువ .  ధనికుడికి జీర్ణ శక్తి తక్కువ. అధముడు జీవితానికీ, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికీ భయపడతారు. సురాపాన మదం, ఐశ్వర్యం కలిగించే మదం కంటే ఎక్కువేమీ కాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్తేనే కానీ ఆ మత్తును వదలలేడు . జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలే వృధ్ధిపొందుతాడు.

***********************************************************************

ధర్మప్రభోధం

భారతంలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో లేనిదేదీ భారతం లేదు. ఒకసారి చెప్పినది మరల మరల చెప్పను అన్నాడు. నిధిల ధర్మశాస్త్రము, సర్వసక్షణ సారము, నీతివంతమైన ఈ భారతం పంచమవేదం అని ప్రశస్తి పొందినది ఇందుకే... జ్ఞాభిలాషులు, ధర్మతత్పరులు, నీతికోవిదులు, ఇంకా ఇంకా తెలుసుకోవాల్ని ఆశిస్తారు. "వ్యాసో, నారాయణో హరి:" అన్న ఆ పరమాత్మ వ్యాసుని రూపంలో మనకందించిన మహాద్భుత మధురానందకర దివ్యప్రబంధము "మహాభారతం".

ధర్మాత్ముడైన విదురునికి జరుగుతున్న ప్రతి సంఘటన బాధించసాగింది. చేసుకున్న పాపకర్మకు దుర్యోధనుడు, తమను అభిమానించి, ఆశ్రయించిన రాజులు, సేవకులతో పద్దెనిమిది అక్షౌహిణుల సేన తో సహా నాశనమయ్యారు. ఇప్పుడు అధర్మం నశించింది. ధర్మం జయించింది అని చెప్పాల్సి ఉంటుంది.

సంజయుని రాయబారం ధృతరాష్ట్రునికి నీతిబోధ అవుతుంది. ఆ విచారంలో ఉన్న మహారాజు మహామంత్రి విదురుని పిలిపించుకుని నాలుగు మంచి మాటలు చెప్పమంటే ధర్మప్రియుడైన విదురుడు ధర్మబధ్ధంగా చేయవలసిన విధివిధానాలను నీతిదాయకంగా చెప్తాడు.

తదుపరి శ్రీకృష్ణుడు పాండవుల తరఫున రాయబారిగా వస్తాడు. ఆయనకు సాదరస్వాగతం లభిస్తుంది. దుర్యోధనుడు విడిది ఏర్పాటు చేస్తానంటే "అవసరంలేదు ! అయినా రాయబారులు రాజభవనాలలో ఉండకూడదు అని, విదురుని ఇంటికి వెళతాడు..అప్పుడు విదురుడు శ్రీకృష్ణునితో

"దేవదేవా! నీ ప్రయత్నం ఫలిస్తుందనే వచ్చావా?" అని అడుగుతాడు.

(ఇంకా ఉంది ) 
విదురనీతి 69

క్రోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవని చేరువలో ఉండవో వాడే విద్వాంసుడు. ప్రజలు ఎవని సలహాలను గ్రహిస్తారో వాడే విద్వాంసుడు. ధర్మార్ధాలననుసరిస్తూ లోకవ్యవహారం గ్రహిస్తూ భోగచింతలేక పుర్షార్ధాన్ని సాధిస్తూ సక్త్యనుసారం కృషి చేస్తూ విషయాలను స్వల్ప కాలంలో గ్రహిస్తూ అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండాఅ దుర్లభవస్తువులను కోరకుండా పోయినవాటికోసం శోకించకుండా విపత్తులలో ధర్యం పోగొట్టుకొనకుండా ఆరంభించిన కార్యాలను మధ్యలో అప్పకుండా, సోమరియై కూర్చోకుండా , మనసును వశపరుచుకొని చరించువారు నిజమైన పండితులు. ఇంకా చెప్పాలంటే బుధ్ధిమంతులు.

ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజించకూడదు. తనకు తానై విషమ సమస్య్లలో నిశ్చయాలు చసిఉకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండకూడదు. ఇది విద్వాంసుల మార్గము. సాగర తరణానికి నౌక ఏకైక సాధనమైనట్లు స్వర్గం చేరడానికి సత్యమే ఏకైక సాధనం.

అల్పబుధ్ధినీ, దీర్ఘసూత్రునీ, త్వరపడేవానినీ, స్తోత్రపాఠకునీ, రహస్య సమాలోచనలకు పిలువకూడదు. కుటుంబవృధ్ధజనులనూ, విపతులలో పడిన ఉన్నత కుటుంబీకులనూ, దరిద్రులైన మిత్రులనూ, సంతాన విహీనయైన సోదరినీ ఆశ్రయమిచ్చి పోషించాలి.

విద్య పరిపూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతరం పురుషుడు స్త్రీని, పని జరిగిన మీదట సహకరించినవారిని నదిని దాటాక నావనూ, రోగవిముక్తానంతరం వైద్యునీ విస్మరించడం సహజం...అది తగదు.

వృధాగా విదేశాలలో తిరిగేవాడూ, పాపులతో మైత్రి చేసేవాడూ, పరస్త్రీగామీ, పాషండుడూ, చోరుడూ, కుటిలుడూ, మధుపానం చేసేవాడూ దు:ఖాలలో పడతారు. క్రోధమూ, తొందరపాటూ, పురుషార్ధరాహిత్యమూ, అనృతవాదిత్వమూ దు:ఖ హేతువులు.

(ఇంకా ఉంది )  
విదురనీతి 68

మహాభారతంలో కర్ణుదు "నేనొక సూతపుత్రుణ్ణీ...హీనకులజుణ్ణి" అని తలపోతూ వ్యతిరేక దృక్స్పథంతో అన్వయిస్తూ మహాభారతం పొడుగునా విచార భారంతోనే గడిపాడు. మరి.. అదే కథలోని మరో పాత్ర విదురుడు. అతను ధృతరాష్ట్రుడికి తమ్ముడే అయినా దాసి పుత్రుడు. అయిదూళ్ళు కాదుకదా అయిదంగుళాల రాజ్యభాగానికి కూడ అర్హతలేని వాడు. కానీ ఇవేవీ విదురుడి సహజస్థితికి విఘ్నం కలిగించలేదు. కారణం అతను వేతినీ వ్యతిరేక దృష్టితో చూడలేదు. ఆత్మన్యూనతతో బాధపడుతూ, దాసీపుత్రుణ్ణని దండోరా వేసుకోలేదు. ధర్మ నిరతితో మెలిగాడు. దయాగుణంతో ఎదిగాడు.

తోటివారితో, సమస్త జీవరాసులతో ప్రకృతితో అనుసంధానం కావాలి. పవిత్ర సహజీవనాన్ని అలవరచుకోవాలి. అప్పుడు ఎవరో మంత్రించి మాయం చేసినట్లు "మనో మాయా భూతం" క్షణంలో అదృశ్యమైపోతుంది.

ఇళ్ళకు నిప్పుపెట్టేవాడూ, విషం త్రాగించేవాడూ, జారులవల్ల కలిగిన సంతాన ధనం తినేవాడూ, సోమరసం విక్రయించేవాడూ, శస్త్రాలు నిర్మించేవాడూ, మొసగాడూ, మిత్రద్రోహీ, పరస్త్రీలంపటుడూ, భ్రూణ హత్యలు చేసేవాడూ,గురుపత్నిగామీ, సురాపానం చేసే విప్రుడూ, కర్కశ స్వభావం గలవాడూ, వేదనిందకుడూ, గ్రామ పురోహితుడూ, కాకివలే అరచేవాడూ శరణార్థులను వధించేవాడూ, బ్రహ్మహత్యా పాతకుడూ...సమానులే...

ఇతరుల విషయంలో పరుషప్రసంగాలు చెయ్యనివాడు, చేయించనివాడు ఇతరులచేత అవమానితుడై కూడా ప్రతీకారాన్ని తలపెట్టనివాడూ, అవమానమూ పొందికూడా ఇతరులపై ప్రతీకార చర్యలకు సాహసించని వాడూ, మరణించిన తర్వాత స్వర్గానికి వెళతారు ..ఆ సమయంలో అతనికి దేవతలు స్వాగతం పలుకుతారు. వాక్కు ఎప్పుడు ఉత్తమైనదీ? మౌనం కంటే ప్రియంగా ఉన్నప్పుడూ, ధర్మ సమ్మతం కూడా అయినప్పుడు వాక్కు ఉత్తమమైనది. మానవుడు తాను ఎవరిని సేవిస్తాడో ఏ పరిసరాలలో మెలగుతుంటాడో ఎటువంటి పరిణామం వాంచిస్తాడో అది తప్పక పొందుతారు.

కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయి.

ఒక కార్యం చేయబోయే ముందు దాని వల్ల సిధ్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. అసాధ్యాల్ కోసం కృషి చెయ్యడం అనవసరం...అది తెలిసి కూడా కృషి చేస్తే అది వ్యర్థమే కదా.. అనవసరంగా కోపించే వాడిని, అకారణంగా సంతోషించే వానిని ప్రజలు రాజుగా గ్రహించరు.

(ఇంకా ఉంది )

విదురనీతి 67

విదురుడెరిగించిన కొన్ని నీతులను. ధృతరాష్త్రునికి ఆ నీతుల ద్వారా చెప్పిన కొన్ని ఆచరణలు.

** మాతృభూమిని సేవించాలి.

** ధర్మపరాయణుణ్ణి సత్యమనే నావపై దాటిస్తారు.

** భగవాన్!! మాకందరికీ జ్ఞానాన్ని కలిగించు. సత్సంకల్పాలు    కలిగించు.

**  దేవతలు యజ్ఞయాగాలు చేసేవారిని, పురుషార్ధానికి పాటుపడే వారిని కోరుతారు కాని, సోమరిని ఎప్పటికిని ప్రేమించరు.

** మనమెప్పుడూ మంగళాన్ని కలిగించే వాక్కులనే విందాం.

** పరమేశ్వరా!! మా సంతానానికి సుఖం కలిగించు.

** ఎవరి ధనానికీ, సంపదకూ ఆస్తికి ఆశపడవద్దు.



విద్వాంసులను నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటివానిని నింధించడమే స్వభావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస ధుష్టులకు బలం...దండనీతి రాజులకు బనక్. సేవ స్త్రీలకు బలం. క్షమ గుణశీలికి బలం.

వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం మహాకష్టమైన పని...చమత్కార యుక్తులతో, విశేషార్ధాలను ప్రతిపాదించగల వాని వాక్కు మితంగానే ఉంటుంది. మధుర శబ్దయుతమైన విషయం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్టులతో నిండితే అనర్ధదాయకమవుతుంది. గొడ్డలి దెబ్బలుతిన్న అరణ్యం లోని  వృక్షాలు చిగురించవచ్చు. కానీ కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు.

ప్రబూ! వృధ్ధులూ, గురువులూ లేనిది సభ కాదు. ధర్మం చెప్పలేనివాడు గుర్వూ, వృధ్ధుడూ కాదు. సత్యబధ్ధం కానిది ధర్మం కాదు. కపటమైనది సత్యం కాదు. సత్య., వినయశాస్త్రజ్ఞానము, కులీన, శీల, బల, ధన, శూరత్వ, విద్యా, మృదుభాషితాలు స్వర్గహేతువులు. నిందితుడెప్పుడూ పాపకర్మలే చేస్తూ తత్ఫలమే పొందుతారు. పుణ్యాత్ములు సత్కర్మలే చేస్తూ స్వర్గం చేరుతాడు. పాపకర్మలు బుధ్ధిని నశింపచేస్తాయి. ధీమంతుడు సత్కర్మలే ఆచరిస్తూ ఏకాగ్ర చిత్తుడై పుణ్యకర్మ రతుడౌతాడు.

Wednesday 17 August 2016

విదురనీతి 66

ఈ మానవశరీరమొక రథం. దానికి సారధి--బుధ్ధి...ఇంద్రియాలు అశ్వాలు. వీనిని వశం లో ఉంచుకొనే వాడు మహా రధికుని వలె సంసార సంగ్రామం లో జయం పొందుతాడు. వశంతప్పి పట్టుతప్పిన గుర్రాలు మధ్యే మార్ఘంలో సారథిని పడగొట్టినట్లు వశంలో లేని ఇంద్రియాలు పురుషుని అర్ధానర్ధ జ్ఞానాన్ని నశింపచేసి దు:ఖభాగుని చేస్తాయి...ధర్మార్ధాలను విడిచి విషయలోలుడై చరించేవాడు అచిరకాలంలో ఐశ్వర్య,ప్రాణ, స్త్రీ, ధనాలను పోగొట్టుకొంటాడు. ఆత్మజ్ఞానాన్ని గ్రహించడానికి నిరంతరం కృషిచెయ్యాలి. ఆత్మకు మించిన మిత్రుడూ,శత్రువూ లేరు. దాన్ని జయించిన వానికి అదే మిత్రము. లేకపోతే అదే పరమ శత్రువు. సూక్ష్మ రంధ్రాలు కల వలలో పడ్డ చేపలు దానిని కొరికివేసినట్లు, కామక్రోధాలనే మీనాలు వివేకాన్ని నశింపచేస్తాయి. ధర్మార్ధాలన్ పరిశీలించుకొని విజయం కోసం కృషి చేసేవాడు సులభంగా వానిని సాధిస్తాడు. చిత్త వికారానికి హేతుభూతాలైన పంచేంద్రియాలను శత్రువులుగా భావించి వానిని జయిస్తేనే శతృ విజయం సాధ్యమవుతుంది.

విదురనీతిలో ముఖ్యాంశాలు...

** జీవితం పాదరసం ...దానిని పట్టుకొనుట కష్టం.

** డబ్బు ప్రతిమనిషిని కలుపుతుంది. విడదీస్తుంది.

** ఉన్న సంపాదనలో కొంత దానం చేయాలి...అదే  చివరకు మిగిలేది.

** మానవుని జీవితం క్షణభంగురం ...అది ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.

** నీవు చేసే ప్రతి పని పదిమందికి ఉపయోగపడాలి.

(ఇంకా ఉంది ) 
విదురనీతి 65

స్వేచ్చానుసారం చరిస్తూ పరేచ్చను పరిగ్రహించకుండా తన ఆలోచనాల్ను గుప్తంగా ఉంచుకుంటూ సీయకార్యాలను సక్రమంగా నిర్వహించుకోవాలి. సత్యవాదీ, కోమలస్వభావుడూ, ఉన్నతాభిప్రాయుడూ, ఆదరశీలీ, అయినవాడు శ్రేష్ఠ రత్నంలా జాతివారిలో ప్రసిద్ధుడౌతాడు. లజ్జాశీలిని సర్వప్రజలూ గౌరవిస్తారు. ఏకాగ్ర చిత్తంతో శుధ్ధ హృదయంతో అనంతతేజస్సుతో ఆ పురుషుడు సూర్యునివలే భాసిస్తాడు.

అనురాగహృదయం గల ప్రభువుప్రజల ఆదరానికి పాత్రుడౌతాడు. ప్రభువు ఫలభరిత పుష్పవృక్షం లాగ ప్రసన్నుడై ఉండాలేగాని అధిక ఫలాలనందివ్వగూడదు. మనోవాక్కాయ కర్మలతో ప్రజలకు సంతోషం కలిగించే ప్రబువు ప్రఖ్యాతుడౌతాడు. భయంకరుడైన ప్రభువును ప్రజలు పరిత్యజిస్తారు. ప్రభంజనం కారుమేఘాలు చిన్నాభిన్నం చేసినట్లు దుష్కర్మలు రాజ్యాన్ని పాడు చేస్తాయి. ప్రంపరాగతంగా సజ్జనులాచరించే మార్గాన నడిచే మహీపాలునికి సిరిసంపదలతో రాజ్యం వృధ్ధిపొందుతుంది.  ధర్మమార్గం విడిచి అధర్మంగా పోయే ప్రభువు ఏలుబడిలోని రాజ్యం నిప్పుమీద పడ్డ చర్మంలా ముడుచుకుపోతుంది.

పరరాజ్య సాధనార్ధం చేసే ప్రయత్లానతో పాటు స్వీయరాజ్య సంరక్షణానికి కూడా కృషి అవసరం. ధర్మంతోనే రాజ్యాన్ని సంరక్షించాలి. ధర్మబద్ధుడైన రాజును రాజ్యలక్ష్మి విడువదు.  రాజు, అధికప్రసంగుల నుండీ , ఉన్మత్తులనుండీ, వ్యర్ధప్రేలాపకులనుండీ, బాలురనిండీ అవసరమైన విషయాలను, శిలల నుంచి బంగారం గ్రహిచినట్లు గ్రహించాలి. వేదాల వల్ల విప్రులూ, గంధంవల్ల గోవులూ, గూఢచారుల వల్ల రాజులూ వాస్తవాలను గ్రహిస్తారు.

పశురక్షకుడు మేఘుడు .ప్రభువుకు సహాయకుడు మంత్రి. స్త్రీకి ఆప్తుడు భర్త. బ్రాహ్మణులకు వేదాలే బంధువులు. సత్యం చేత ధర్మం రక్షింపబడుతుంది. విద్య యోగ రక్షితము. సౌందర్యానికి శుభ్రత రక్షణాధారము. నీచకులజుడైనా సదాచారం వల్ల శ్రేష్టుడౌతాడు.

సజ్జనులకు విద్యా, ధన, కుల మదాలనుండకూడదు. ఉత్తములకు సహాయం చేసేవారు సత్పురుషులు. ఉత్తమ శీల స్వభావాలు కలవారు సర్వులనూ జయిస్తారు. వ్యక్తికి ప్రధానమైన శీలం నశిస్తే వాని జీవితం వ్యర్ధమే..

దరిద్రునికి ఆకలి ఎక్కువ. ధనికుడికి జీర్ణశక్తి తక్కువ. అధముడు జీవితానికీ, మధ్యముడు మృత్యువుకూ, ఉత్తముడు అవమానానికి భయపడతారు.

ఐశ్వర్యం కలిగించే పదం కంటే సురాపానమదం అధికమైనది కాదు. ఐశ్వర్యమత్తుడు సంపదలు నశిస్తే కానీ ఆ మత్తును వదలలేడు. ఇంద్రియాలు వశంలో పెట్టుకోని వానికి కష్టాలే....జితేంద్రియుడు శుక్లపక్ష చంద్రునివలె వృధ్ధిపొందుతాడు. అంత:స్సత్రువులను జయించకుండా బాహ్య శత్రువులను జయించలేము.

(ఇంకా ఉంది )  

Monday 15 August 2016

విదురనీతి 64

క్రోధమూ, తొందరపాటూ, పురుషార్ధరాహిత్యమూ, అనృతవాదిత్వమూ దు:ఖహేతువులు, మిత్రుల క్షేమం కోసం పోరాడనివాడూ, ఆదరించినవారి క్షేమం కోసం ఆరాటపడనివాడూ, వివేకహీనుడూ, పరదోషాలపై దృష్టి నిలుపువాడు, దయారహితుడూ, అధికప్రసంగీ, లోకంలో పెరుప్రఖ్యాతులు పొందలేడు. వేషపటాటోపం లెకుండా ఆత్మప్రశంస  చేసుకోకుండా క్రోధం కలిగినా కటువుగా భాసించకుండా ఉండే మానవుడు సర్వజనాదరణీయుడవవుతాడు. గర్వరహితుడూ, హీనంగా ప్రవర్తించనివాడూ, శాంతించిన వైరాన్ని ప్రకోపింపచెయ్యనివాడూ, ప్రమాదాలు మీదపడ్డా అనుచితానికి సాహసించనివాడూ, ఇతరుల దు:ఖానికి సంతోషించని వాడూ, దానం చేసి విచారించని వాడూ, సజ్జనశ్రేష్టులూ, దేశవ్యవహారావసరాలూ జాతి ధర్మాలూ తెలిసినవానికి ఉత్తమాధమ వివేకం కలుగుతుంది. అటువంటి వివేకి జనసంఘంలో తన ప్రతిష్టను సంస్థాపించుకోగలడు. రాజద్రోహియై మోసదృష్టితో పాపకర్మలు చసేవాడూ, గర్వ్వ్వ్, మత్సర్డూ, మోహీ, మత్తుడూ, ఉన్మత్తుడూ ఆదిగాగల వారితో వివాదానికి పోరాదు. దాన హోమ పూజా ప్రాయశ్చిత్తాది లౌకిక కర్మలను నిర్వహించేవాడు వృధ్ధిలోకి వస్తాడు. సమానశీలురతో వివాహమూ, మైత్రీ వ్యవహారం సాగించాలి. గుణసంపన్నులను ముందుంచుకొని నడిచేవాడు నీతివిదుడు. ఆశ్రితులకు తృప్తిగా పెట్టి మితంగా భుజిస్తూ అధికకాలం కృషి చేసిచేసి తక్కువగా నిదురిస్తూ అర్ధులకు దానం చేస్తూ ఉండేవాడు. పరమార్ధ రక్షకుడౌతాడు..

(ఇంకా ఉంది )  
విదురనీతి 63

ఋణగ్రస్థుడు కాకపోవడం, ప్రవాసం ప్రాప్తించకపోవడం, సత్పురుష సాంగత్యం, కులవృత్తితో జీవికా నిరవహణం అనేవే ఈ లోకంలో సుఖాన్నిచ్చేవి, ఈర్ష్యాద్వేషాలతో అసంతోషక్రోధాలతో అనుక్షణ శంకతో పరభాగ్యజీవికతో ఉండేవారు దు:ఖ భాగులే..కామినీ జన సాంగత్యాన్నీ, వేటనూ, మద్యపానాన్నీ, జూదాన్నీ, పరుషప్రసంగాలనూ, ధన దుర్వినియోగాన్నీ, కఠోరదండనీతినీ ప్రభువు పరిత్యజించాలి. బ్రహ్మద్వేషమూ, బ్రాహ్మణధనాపహరణా, విప్రదండనా, వీరిని నిందించడంలో సంతోషమూ, వారి ప్రస్తుతిని ఆకర్షించలేకపోవడమూ, యజ్ఞ యాగాదులలో వారిని విస్మరించడమూ, అర్ధించినప్పుడు విప్రకోటిపై దోషారోపణ చేయడమూ అనే దోషాలను ధీమంతులు  దరిచేరనివ్వగూడదు. మిత్ర సమాగమమూ, ధంప్రాప్తీ, పుత్రాలించనమూ, దారా సంగమమూ, కాలానుసారం ప్రియవచనాలాపమూ, నిజప్రజల ఔన్నత్యమూ, అభీష్టవస్తుసిద్ధీ, సంఘ ప్రతిష్టా అనేవి సంతోషకరాలు, లౌకిక సుఖాలకు ఎవే సాధనాలు, కులీనత, ఇంద్రియ నిగ్రహము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము, ధీశక్తి, మితభాషిత్వము, యధాశక్తి దానము, కృతజ్ఞత అనేవి కీర్తికి హేతువులు. నవద్వారాలతో త్రిస్తంభాలతో పంచసాక్షులతో ఆత్మకు ఆవాసస్థానమైన ఈ దేహ గృహం యొక్క తత్వం గ్రహించడం కంటె వేరే జ్ఞానం లేదు.

సావధానరహితుడూ, ఉన్మత్తుడూ, మధ్యపానం చేసేవాడు, అలసినవాడూ, క్రోధి, క్షుధార్తుడు, తొందరపడేవాడు, లోబి, భయబీతుడు, కాముకుడూ, ధర్మతత్వం గ్రహించలేడు.

ప్రపంచంలో ఎవరైనా ఒకరు మరొకరికి అపకారం చేసే అతడు కోపంతో తిరగబడతాడు. అపకారం చేసినవానిపై కోపం వెళ్ళగ్రక్కుతాడు. కోపం వల్ల అనర్ధాలు కలుగుతాయి. ధర్మం  క్షీణిస్తుంది. అధర్మం తాండవిస్తుంది. మోక్షం దూరమవుతుంది.

కామక్రోధాలను విడిచి పాత్రులకు దానం చేస్తూ శాస్త్రజ్ఞానం తెలుసుకుంటూ కర్తవ్యాన్ని నిర్వహించే రాజుకు ప్రజలు శిరస్సు వంచి మరీ నమస్కరిస్తారు. ప్రజలలో విశ్వాసం కలుగచేస్తూ అపరాధులను  దండిస్తూ చరించే ప్రభువు సర్వవిధాల సంపన్నుడౌతాడు. సావధానుడై దుర్బలులను అవమానించకుండా శతరువులతో చతురవ్యవహారం సాగిస్తూ బలవంతులతో సంగ్రామం సాగించక అవకాశానుసారం పరాక్రమం ప్రదర్శిస్తూ ఉండే ధీరుడు ఎన్ని విపత్తులు వచ్చి మీదపడ్డా విచారసాగరంలో మునిగిపోకుండా వాటిని సహిస్తూ ప్రయత్నశీలుడై ఉంటే అవలీలగా శత్రువులను, జయించాచ్చు. వృధాగా విదేశాలలో తిరిగేవాడొ, పాపులతో మైత్రి చేసేవాడూ, పరస్త్రీగామీ, పాషండుడూ, చోరుడూ, కుటిలుడూ, మధుపానం చేసేవారు ధు:ఖాలలో పడతారు.

(ఇంకా ఉంది ) 

Thursday 11 August 2016

విదురనీతి 62

సత్య, దాన, క్షమ, అనసూయ (అసూయ లేకుండుట) కర్మపరతంత్రాది సద్గుణాలను సావధానంతో అలవరచుకోవాలి. ధనప్రాప్తీ, ఆరోగ్య దేహమూ, అంకూలవతి,ప్రియభాషిణీ అయిన అర్ధాంగీ, చెప్పుచేతల్లో ఉంటే కుమారులూ, ధనార్జనకు ఉపయుక్తమైన విద్యా ఈలోకంలో పరమసుఖదాయకలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాది అరిషడ్వర్గాలనూ జయించి జితేంద్రియుడై చరించాలి. దొంగలు ప్రమత్తులవల్ల, వైద్యులు రోగివల్ల, కామినీ జనము కాముకుల వల్ల, పురోహితులు యజమానుని వల్ల, స్పర్ధను వాంచించె విద్వాంసుడు మూర్ఖుని వల్ల జీవితం గడపాల్సి ఉంటుంది.

సంరక్షణ లేకపోతే  గోవూ, వ్యవసాయమూ, స్త్రీ, విద్యా నశిస్తాయి. అప్రమత్తతతో చరించకపోతే శూద్రస్ఖ్యమూ, సేవా వినాశనానికి దారితీస్తాయి. విద్యా పరిపూర్తి అయిన అనంతరం శిష్యుడు గురువునూ, వివాహానంతరం తల్లిని కుమారుడూ, భోగఫలానంతరం పురుషుడు స్త్రీనీ, పని జరిగినమీదట సహకరించిన వార్నీ, నదిని తరించాక నావనూ, రోగవిముక్తానంతరం వైద్యుని విస్మరించడం తగదు.

(ఇంకా ఉంది ) 
విదుర నీతి 61

వరప్రసాదమూ, రాజ్యప్రాప్తీ, పుత్రోదయమూ అనే మూడూ ఏకకాలంలో ప్రాప్తించడం కంటే శత్రువులు పెట్టే బాధలనుండి విముక్తిని పొందడం ఘనమైనది. నేను నీవాడననీ సేవకుడననీ నీకు భక్తుడననీ ఆర్ధించిన వారిని ఎటువంటి విపత్తులలోనూ విదిచిపెట్టకూడదు. అల్పబుధ్ధినీ తీర్ఘసూత్రునీ త్వరపడేవానినీ స్తోత్రపాఠకునీ రహస్య సమాలోఅచనలకు పిలువకూడదు. వీరిని విద్వజ్జనులు గుర్తుపట్టగలరు. కుటుంబ వృధ్ధజనులనూ, విపత్తులలో పడిన ఉన్నత కుటుంబీకులనూ దరిద్రులైన, మిత్రులనూ సంతాన విహీనయైన సోదరినీ ఆశ్రయమిచ్చి పోషించాలి.

ప్రభూ! ఇంద్రుని అభ్యర్ధన మీద బృహస్పతి చెప్పిన విషయాలు కొన్ని చెబుతాను. వినండి. దైవసంకల్పమూ, ధీమంతుల శక్తి, విద్వాంసులయెడ వినయమూ, పాపవినాశనకర కార్యాచరణమూ అనే నాలుగూ మానవుని భయన్ని దూరం చేస్తాయి. సక్రమంగా సాగించకపోతే అవే భయహేతువులు.  అగ్నికార్యమూ, మౌనవ్రతమూ, శ్రధ్ధయుతమైన స్వాధ్యాయమూ, ఆదరదృష్టితో యజ్ఞానుష్టానమూ నడపాలి. తల్లితండ్రులనూ, అగ్నినీ, గురువునూ, ఆత్మనూ పంచాగ్నులుగా భావించి సేవించాలి.

దేవ, పితృ, సన్యాస అతిథి మానవులను పూజించేవాడు కీర్తిశాలి  అవుతాడు. మానవుడెక్కడకుపోయినా మిత్రుడూ, శత్రువులూ ఉదాసీనులూ ఆశ్రయం పొందినవారూ, ఆశ్రయమిచ్చేవారు వెంట ఉంటారు. ఈ జ్ఞానేద్రియ పంచకంలో ఏ ఇంద్రియం దోషయుక్తమైన దానినుండి బుద్ధి క్షీణిస్తూనే ఉంటుంది. సిరిసంపదలు కోరవాడు నిద్రా భయ క్రోధ అలస దీర్ఘ సూత్ర తంత్రాది దుర్గుణాలను విడిచిపెట్టాలి. అధ్యాపనం చెయ్యని గురువూ, మంత్రోచ్చారణ లేని హోతా, రక్షణకు అసమర్ధుడైన రాజూ, కటువుగా భాషించే భార్యా, గ్రామంలో వసించగోరని గొల్లవాడూ, వనవాసం వాంచించే  మంగలీ పరిత్యజించవలసినా వారు..

(ఇంకా ఉంది ) 

Wednesday 10 August 2016

విదురనీతి 60

ఈ భూమండలంలో ఇద్దరే ఇద్దరు అధములు. ఒకరు కర్మను విడిచిపెట్టిన గృహస్తూ, రెండు కర్మబధ్ధుడైన సన్యాసీ... శత్రువులను అలక్ష్యం చేసే ప్రభువునూ, పరదేశాలు తిరుగని విప్రునీ ఈ పృథివి కబళిస్తుంది.  దరిద్రుడై అమూల్యవస్తువులను అభిలషించేవాడూ, అసమర్ధుడై క్రోధంతో ఉండేవాడూ, తమకుతామే శత్రువులు. శక్తి కలిగి క్షమతో ఉండేవాడూ, నిర్ధనుడైనా ఉన్నంతలో దానం చేసేవాడూ స్వర్గంలో ఉన్నతస్థానం పొందుతారు.

న్యాయోపార్జిత ధనం రెండు విధాల దురుపయోగమవుతుంది. సత్పాత్రునకు దానం చెయ్యకపోవడం, అపాత్రునకు దానం ఇవ్వడం...ధనికుడై దానం చేయనివాడూ, దరిద్రుడై కష్టాలు సహించలేని వాడూ, ఉంతే వారి మెడకొక బండరాయి కట్టి మడుగులో పడేయాలి... సక్రమంగా సన్యాసం సాగించిన్ వాడూ, సంగ్రామ రంగంలో శత్రుహస్తాలలో మరణీంచినవాడూ సూర్య మండలాన్ని చేదించుకుని ఉత్తమలోకాలకు పోతారు.

ప్రభూ! కార్యసాధనకు ఉత్తం మధ్యమ అధమ రీతులు మూడున్నాయి. ఆ మూడుదారులూ శృతిప్రోక్తములే..వీటిని యథాప్రకారంగా ఆచరించే వారు సంపదలకధికారులు అవుతారు. దారా, పుత్ర, దాసులకు సంపదలపై అధికారం లేదు. ఈ ముగ్గురూ ఎవరి ఆధీనంలో ఉంటే వారి సంపదలు కూడా వారి ఆధీనంలోనే ఉంటాయి. పరధనాపహరణ, పరనారీసాంగత్యమూ, సుహృజ్జన పరిత్యాగమూ అనే కూడు దోషాలూ మానవుని ధర్మ ఆయుర్దాయ కీర్తులను క్షీణింపచేస్తాయి. కామ, క్రోధ, లోభాలు నరకానికి తెరచిన మూడు దారులు..

(ఇంకా ఉంది )

విదురనీతి 59

ఏకృషీ చెయ్యకుండా సంపదలు వాంచించేవాడూ, స్వీయకార్యాలు విడిచి పరాచారాలు పాటించేవాడూ, మిత్రులతో అసంబధ్ధంగా చరించేవాడూ, అయోగ్యులను వాంచించేవాడూ, మిత్రులను తిరస్కరించేవాడూ, బలవంతులతో వైరం పెంచుకునేవాడూ, శత్రువులతో మైత్రి సాగించి మిత్రకోటితో శతృత్వం నెరపే వాడూ, సందేహచిత్తుడై సర్వకార్యాలనూ సకాలంలో నిర్వర్తించంది వాడూ, అనాహూతుడై ఆగమించేవాడూ, పృచ్చలేకుండా భాషించేవాడూ, కృతఘ్నులను విశ్వసించేవాడూ, దోషాచారపరాయణుడూ, పరదోషగ్రహణ చిత్తుడూ, వ్యర్ధక్రోధీ, అనధికారులకు ఉపదేశాలిచ్చేవాడూ, శూన్యాన్ని ఉపాసించేవాడూ, కృపణులను ఆశ్రయించేవాడూ వీరందరూ మూర్ఖులే..



విద్యాధనాలు విరివిగా ఉన్నా, గర్వంలేకుండా చరించేవాడు పండితుడు. తనవల్ల పోషింపబడే వారికి భోజన భాజనాదులు సమకూర్చకుండా తన సుఖసంతోషాలు చూసుకొనేవాడు మహామూర్ఖుడు. మానవుడు ఒక్కడు చేసిన పాపం ఎందరినో వేధిస్తుంది. పాపఫలానుభవంతో అది వారిని విడిచిపెడుతుంది. కాని కర్త మాత్రం దోషిగానే ఉంటాడు. మాహావీరుని హస్తంలోని ధనుస్సునుండి వెలువడిన బాణం ప్రతిపక్ష వీరులలోని ఎవరినీ వేధింపక పోవచ్చును..కాని విద్వాంసుని వాక్కు సర్వప్రజాసమూహంతో రాష్ట్రాన్ని కూడా నశింపచేయగలదు. ఆత్మబుధ్ధితో కర్వ్యాకర్తవ్యాలను నిశ్చయించుకొని శత్రుమిత్ర ఉదాసీనులను సామ దాన బేధ దండోపాయాలతో వశపరచుకొని పంచేంద్రియలను జయించి, సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ సమాశ్రయ గుణాలను గ్రహించి స్త్రీ, ద్యూత, మృగయావినోద, మద్యపాన, కటువచన , కఠినదండన స్వభావ కర్కశప్రవర్తనాది అన్యాయాలను విడిచి సుఖించాలి.

త్రాగినవానినే విషం చంపుతుంది. బాణం గుచ్చుకొన్నవానినే యమసదనం చేరుస్తుంది. ప్రజలతో రాజును నసింపచెయవచ్చు. "ప్రభూ! ఏకాకిగా ఆహారం భుజింపకూడదు. తనకు తానై విషమ సమస్యలలొ నిశ్చయాలు చేసుకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకూడదు. అందరూ నిద్రిస్తూండగా ఒక్కడు మేల్కొని ఉండాకూడదు. ఇది విద్వాంసుల మార్గము. సాగర తరణానికి నౌక ఏకైక సాధనమైనట్లే స్వర్గం చేరడానికి సత్యమే ఏకైక సాధనం. ఈ విషయాన్ని మీరు గుర్తించడం లేదు. క్షమకంటే బలమైనది లేదు. సమర్ధునికి అది ఒక భూషణం వంటిది. ఈ జగత్తులో క్షమను మించిన వశీకరణశక్తి లేదు.
శాంతి అనే ఖడ్గం ధరించిన వానిని ఏ దుష్టుడూ ఏమీ చెయ్యలేడు. క్షమాహీనుడు తనతోపాటు ఇతరులను కూడా బాధకు గురిచేస్తాడు. ధర్మమే కళ్యాన పథము. ఓరిమియే శాంతిమార్గం. విద్యయే ఆనంద హేతువు..

(ఇంకా ఉంది )  

Tuesday 9 August 2016

విదురనీతి: 58

ప్రభూ! ఉత్తమల్క్షణాసమ్న్వితుడైన ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. అటువంటివాడు మీ ఆజ్ఞలను సర్వదా శిరసావహిస్తున్నాడు. ఆ విషయం విస్మరించి మీరు వానిని అడవులకు పంపారు. మీరు ధర్మాత్ములూ, ధర్మజ్ఞులూ అయినా అంధులు కావడంవల్ల వానిని గుర్తించలేక విపరీతమార్గాన ప్రవర్తిస్తూ వారి రాజ్యభాగం కూడా వారికివ్వలేకపోతున్నారు. ధర్మజుడు సత్యపరాక్రముడు, ధర్మనిష్ఠుడు, మీయంది గురుభావం కలవాడు. ఇన్ని సద్గుణాలు వానిలో ఉన్నాయి కనుకనే ఎటువంటి క్లేశానైనా నిర్లిల్ప్తంగా సహిస్తున్నాడు. మీరు దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ప్రభృతి అయోగ్యులపై విశ్వాశముంచి రాజ్యభారం వారికప్పగించి శాంతిని వాంఛించడం వివేకం కాదు. సాత్వికస్వభావమూ ఉద్యోగ యత్నమూ దు:ఖసహనమూ నిశ్చల ధర్మస్థితీ కల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడు. వానినే విద్వాంసుడని మనీషులంటారు. దుష్కర్మలకు దూరంగా ఉంటూ ఆస్తిక బుధ్ధితో, శ్రధ్ధాసక్తులతో సత్కర్మలను అనుష్టించడమే పండితలక్షణం.

క్రోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవనిని వంచించవో వాడే విద్వాంసుడు. ప్రజలు ఎవని సలహాలను గ్రహిస్తారో వాడే విద్వాన్సుడు. ధర్మార్ధాలనుసరిస్తూ లోకవ్యవహారం గ్రహిస్తూ భోగచింతలేక పురుషార్ధాన్ని సాధిస్తూ శక్త్యనుసారం కృషిచేస్తూ, విషయాలను స్వల్పకాలంలో గ్రహిస్తూ అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండా దుర్లభవస్తువులను కోరకుండా పోయిన వాటికోసం శోకించకుండా విపత్తులో ధైర్యం పోగొట్టుకొనకుండా ఆరంభించిన కార్యాలను మధ్యలో ఆపకుండాఅ సోమరియై కూర్చోకుండా మనస్సును వశపరచుకొని చరించువారు పండితులు. వారెప్పుడూ మంచిపనులే చేస్తారు. కృతజ్ఞులై చరిస్తారు. ఆదరిస్తే ఆనందమూ, అనాదరిస్తే ఆగ్రహమూ పొందరు. గంభీర గంగా ప్రవాహ సదృశ హృదయంతో ఉంటారు. పదార్ధాల యదార్ధస్వరూపం వారికి తెలుస్తుంది. ఒకానొక కార్యం నిర్వహించడానికి ఉత్తమసాధనాలు వారెరిగి ఉంటారు.

ఉపాయాలలో అపాయంలేని విధానాలు వారికి తెలుస్తాయి. వారి వాక్కుకు అనరోధముండదు. వారి ప్రతిభ గ్రంధ విషయాలను అవలీలగా గ్రహిస్తుంది. తార్కిక శక్తి వారి సొమ్ము. వారి బుధ్ధి విద్యను అనుసరిస్తుంది. వారి విద్య బుద్ధి యొక్క అదుపులో ఉంటుంది. శిష్టాచారాలను వారుల్లంఘించరు. విద్యావివేకం లేనిదే గర్వంతో చరించేవాడూ, దరిద్రుడై తీవ్రమనోరధాలు కలవాడూ మూర్ఖుడే...

(ఇంకా ఉంది )  

Monday 8 August 2016

విదురనీతి: 57

"మహారాజా! ఎదుటివాని పతనాన్ని కోరకుండా చరించేవ్యక్తి అర్ధించక పోయినా వానికి కళ్యాణమార్గమే చెప్పాలి. రానున్న విపత్తులు కూడా సూచించాలి. నేను కళ్యాణప్రదాలూ ధర్మయుక్తాలూ అయిన విషయాలు రెండూ చెబుతాను వినండి. దుష్టమార్గాన కపట వ్యవహారాలు సాగించడంకోసం మీరు యత్నించకండి. సన్మార్గాన సదుపాయాలలో కృషిచేసినప్పుడు అది ఫలించకపోయినా ధీమంతుడు విచారించకూడదు. ఏ ప్రయోజనంతో మనం కర్మ ప్రారంభిస్తున్నామో అది ముందుగా నిశ్చయించుకొని దాని విషయమై పూర్వాపరాలు చింతించి తొందరపడకుండా సావధాన చిత్తంతో దాని పరిణామాలను ఫలితాలను పరిశీలించి ముందుకడుగు వేయాలి.

లాభమూ, హానీ, ధనమూ, దేశకాల స్థితులూ, దండనీతీ ఎరుగని రాజు రాజపదవికి అర్హుడు కాడు. పై విషయాలన్నీ గ్రహించి ధర్మార్ధాలయందు  సావధాన చిత్తుడై చరించేవాడు రాజ్యార్హుడూ. రాజపదవి లభించింది కదా అని అనుచితంగా వ్యవహరించకూడదు. వార్ధక్యం సౌందర్యాన్ని హరించేటట్లు ఉద్దండవ్యవహారం సంపదలను నశింపచేస్తుంది. గాలపు ముల్లుకు గ్రుచ్చబడిన ఆహారాన్ని వాంచించే చేప దాని పరిణామాన్ని ఆలోచించలేదు. పురుషుడు ఈ విషయం గ్రహించి తనకు ఆరోగ్యం కలిగించే వస్తువునే గ్రహించాలి. హితకరమైనదీ జీర్ణమయ్యేదీ ఆరగించాలే కానీ పచ్చి కాయలు కోసినట్లయితే దానివల్ల రసం సిధ్ధించదు. అది వానికి ప్రయోజనకారి కాకపోగా దాని బీజం కూడా నశిస్తుంది. పక్వఫలాలు స్వీకరించడం వల్ల ఫలరసాలతో పాటు బీజం కూడా నిలబడుతుంది. తుమ్మెద పువ్వులకు ప్రమాదం కలగకుండా మకరందం గ్రోలేటట్లు  తోటమాలి చెట్టుకు ప్రమాదం రాకుండా పువ్వులు కోసేటట్లు ప్రభువు ప్రజలకు హాని  కలుగకుండా ధనం (పన్నులు)సంగ్రహించాలి.

ఒకానొక కార్యం చెయ్యబోయే ముందు దానివల్ల సిధ్ధించే ప్రయోజన అప్రయోజనాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. అసాధ్యాలకోసం కృషి చేయ్యడం అనవసరం అని తెలిసి కూడా కృషిచేస్తే అది వ్యర్ధమే కదా. అనవసరంగా క్రోధం కలిగే వానిని అకారణంగా సంతోషించే వానీ ప్రజలు రాజుగా గ్రహించరు.

ఈ మాటల్ని విదురుడు చెప్పడంలో ఒక అంతరార్ధం ఉంది. పాండవులు ధర్మపరులు. వారికి న్యాం చేయమని ధృతరాష్ట్రునికి విదురుడు హితవు చెబుతున్నాడన్నమాట.

(ఇంకా ఉంది)  
విదురనీతి 56

 దేశలాభం కోసం తన కుటుంబ లాబాన్ని, కుటుంబ లాభం కోసం తన సొంతలాభన్ని రాజు పరిత్యజించాలి. అలాగే దేశ సౌభాగ్య్మ కోసం తన గ్రామ లాభాన్ని విడిచిపెట్టాలి. అలాగే పాలకులు ప్రజాహితాన్ని పట్తించుకోకుండా, స్వార్ధపరులైతే తాత్కాలిక సుఖాలు పొందుతారు. కాని ప్రజల నిరాదరణకు గురి ఔతారు. కాని అదే ప్రజల క్షేమంకోసం పాటుపడిన పాలకులను ప్రజలభిమానిస్తారు. శాశ్వతంగా వారే పాలకులుగా ఉండాలని కోరుకుంటారు. అవసరమైతే అటువంటి వారి కోసం, ఎన్ని త్యాగాలకైనా సిధ్ధంగా ఉంటారు. చరిత్రలో ఉత్తమ పరిపాలకులను ప్రజలెన్ని విధాలుగా ఆదుకొన్నారో, తెలుసుకొంటే ఎన్నో ఉదాహరణలున్నాయి.

పాండురాజు శాపగ్రస్తుడైనా పాండవులైదుగురూ జన్మించారు. ఇంద్ర సదృసులైన వారిని చిన్ననాటినుండి మీరే పెంచి పోషించి విద్యాబుధ్ధులు నేర్పారు. వారూ మీ ఆదేశాలను అంజలి ఘటించి అనుసరిస్తున్నారు. ఈనాడు వారి రాజ్యభాగం వారికిచ్హి మీ బిడ్డలతో మీరు సుఖంగా ఉండండి. ఇలా చేసినట్లయితే దేవతలు సంతోషిస్తారు. ఈ ప్రజానీకం మిమ్మల్ని వేలెత్తి చూపదు అని విదురుడు ముగించాడు.

నా మనస్సులోని చింత నాకు నిద్రపట్టనివ్వడంలేదు. ఇప్పుడు నేను చెయ్యవలసిన పనేమిటో నిర్ణయించి చెప్పు! ధర్మార్ధవిదుడవైన నువ్వు బాహా వివేచనం చేసి సత్యపథం నిర్దేశించు. కురుపాండవులకు ఏది హితమైనదో దానినే చెప్పు. నా హృదయం అరిష్టాలనే శంకిస్తోంది. కనుక నా కవే గోచరిస్తూ వేధిస్తున్నాయి. ధర్మరాజు ఏం కోరుతాడో ఆలోచించి చెప్పు-- అని ధృతరాష్ట్రుడు ప్రస్నించగా విదురుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు.

(ఇంకా ఉంది )

Saturday 6 August 2016

విదురనీతి 55
"ప్రభూ! బలవంతులతో విరోధం దుర్బలులకు ఉచితం కాదు. అటువంటి వారికి రాత్రి వేళల లిద్ర రాదు. ఇటువంటి దోషాలు మీలో లేనప్పుడు మీకెందుకు నిద్ర రావడం లేదు? పరధనాన్ని మీరు ఆశించడం లేదు కదా? అని విదురుడు ప్రశ్నించగా ధృతరాష్ట్రుడు--నేను నీ ముఖం నుంచి ధర్మప్రవచనం కోరుతున్నాను.." అని దీనంగా అంటాడు.
పాలకుడు ప్రజలను రక్షించకుండా, న్యాయాన్ని విడిచి ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించే పాలకుడు, వరికుప్పకు నిప్పుపెట్టి, వడ్లు పేలాలైతే వానిని ఏరుకుని తెనేవానితో సమానము. కుప్ప నూరిస్తే ఎన్నో బస్తాల వడ్లు వస్తాయి. ఆ వడ్లు ఎందరి ఆకలినో తీరుస్తాయి..సంపదనందిస్తాయి. అవ వడ్లు మళ్ళి విత్తనాలుగా ఉపయోగిస్తాయి. మళ్ళి పంటనిస్తాయి. ఆ కుప్పకు నిప్పు పెడితే గడ్డి కూడా కాలిపోతుంది. పశుగ్రాసం కూడా లభించదు.
కొన్ని వడ్లు పేలాలౌతాయి. అవి ఏరుకొని తినే వాడెంత అవివేకి? కుప్ప నూర్చిన తర్వాత కొద్ది ధన్యాన్ని వేయించుకొంటే కావల్సినన్ని పేలాలు లభిస్తాయి. అంటే స్వల్పలాభం కోసం అధిక నష్టాన్ని కొని తెచ్చ్చుకోవడమంటే ఇదే...ప్రజలు వరి కుప్పలాంటివారు. వారిని సక్రమంగా పాలిస్తే వారు సంపనులౌతారు. ప్రభుత్వానికండగా ఉంటారు పన్నులు చెల్లిస్తారు. దేశాభివృధ్ధికెంతగానూ తొడ్పడతాడు. ఆ పాలకులు కూడా శాశ్వతంగా ప్రజానురాగాన్ని చూరగొంటారు.
(ఇంకా ఉంది )
"నాకు నచ్చిన పుస్తకం" శీర్షికన ఈరోజు నేను ఒక రష్యన్ అనువాద నవల గురించి పరిచయం చేయబోతున్నాను. మా చిన్నతనాల్లో చాలా రష్యన్ నవలలు తెలుగులోకి అనువాదం అయ్యేవి..అప్పుడు ఆ నవలలు చదివే అలవాటు ఉన్నవారు ఈ నవల చదివే ఉంటారు..

నవల పేరు "సెర్యోష". ఒక ఏడుసంవత్సరాల పిల్లవాడి కథ. మన దేశంలో లాగా, చిన్నతనం నుంచీ పుస్తకాలతో కుస్తీ పట్టించడం విదేశాలలో అలవాటులేదు, అందునా రష్యాలో పిల్లలకు, వారి భవిష్యత్ కీ ఎంతో విలువ ఇచ్చేవారు కాబట్టి అక్కడ చిన్నపిల్లలపై అంత చదువు ఒత్తిడి లేదు...

సెర్యోష ఏదు సంవత్సరాల పిల్లవాడు. వాడి చిట్టి బుర్రనిండా ఎన్నో సందేహాలు..వాడి చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో గమనించవలసిన విషయాలు ఎన్నెన్నో...ప్రతి రోజూ రాత్రి అయ్యేలోపల వాడికి చుట్టూ ఎన్నో ఆశ్చర్యాలు..ప్రతీదాన్నీ అనుభవించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస తో రాత్రి అయ్యేసరికి ఒంటినిండా గాయాలు, ఎంతో అలసట.

వాళ్ళు నివసించే ఆ చిన్ని పట్టణంలో వాళ్ళు ఉండే "దాల్నయ వీధి" లో వాడు, వాడికన్నా వయసులో పెద్దవాళ్ళైన కొంతమంది ఫ్రెండ్స్...వాస్య, జేన్య, షూర, లీద (అమ్మాయి) .....అందరివీ మధ్యతరగతి కుటుంబాలే...ఒక్కొక్కరిదీ ఒక్కో కుటుంబ నేపధ్యం...యుద్ధసమయం..ముసలివాళ్ళు తప్ప వయసులో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతే, ఎదిగీ ఎదగని ఈ పిల్లలే కుటుంబ బాధ్యతలు తీసుకోవడం....వీటన్నిటి మధ్య పెరుగుతున్న సెర్యోష కు జీవితం అంటే అవగాహన లేదు...తెలిసినదల్లా తాను, తన స్నేహితులు, తన ఇల్లు, అమ్మ, పాష అత్తయ్య, లుక్యానిచ్ మామయ్య...యుధ్ధంలో సెర్యోష తండ్రి ఎంతో కాలం ముందే మరణించడంతో అతనికి తండ్రితో పరిచయం లేదు...అసలు నాన్న అనే మాటకు అర్ధం తెలియదు...తల్లి వీడి భవిష్యత్ కోసం మరల పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది..కొత్త నాన్న వాడిని ఏమాత్రం ప్రేమించలేడని భయపెట్టినప్పటికీ తనకు కొత్త తండ్రిగా వచ్చే "కొరొస్తెల్యోవ్" తనకు ముందే పరిచయం కావడం వల్ల, అతను చాలా మంచివాడని నమ్మిన సెర్యోష అతనితో తనకు ఇబ్బంది ఏమీ ఉండదని నమ్ముతాడు. అతని ప్రేమలో జీవితంలో కొత్త పొజిషన్ ని ఎంతో ఆనందంగా అనుభవిస్తుంటాడు.. వాడికి గుండె కొట్టుకోవటం, కొత్తనాన్న వచ్చిన రోజునే తనను చిన్న పిల్లవాడిగా పరిగణించకుండా పెద్ద కుర్రాడిలాగా చూడడం, ఓ ట్రైసికిల్ కొనిస్తానని మాట ఇవ్వడం,  పొడవైన తండ్రి భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని జయించినంత గర్వంగా బయటకు వెళ్ళడం, ఇవన్నీ అంతులేని ఆశ్చర్యానికి కారణాలే...

కొత్త పరిచయాలు, కొత్త బంధువులు, కొత్త బంధాలు..కొత్త నాన్న యొక్క తల్లి మరణం వాడికి భయం కొల్పుతుంది.. నేవీలో పనిచేసే వాస్య మామయ్య వంటి మీద ఉన్న పచ్చబొట్టులు చూసిన పిల్లలందరూ సొంతంగా ట్రై చేయడం సెర్యోష ప్రాణాలమీదకి వస్తుంది...వాడికి కొత్తగా తమ్ముడు పుట్టడం కూడా ఎంతో ఆశ్చర్యకరమైన విషయం...అంత చిన్న దేహంతో, అంత చిన్న తలకాయతో ఉన్న పిల్లవాడు ఎలా ఊపిరితీసుకుంటాడో కూడా వాడికి అయోమయమే...

ఇంతలో తండ్రికి వేరే ఊరు బదిలీ అవుతుంది. అక్కడి మంచుతో కూడిన వాతావరణం సెర్యోష కు పడదని, వాడిని ఇక్కడే ఉంచేసి తల్లి, తండ్రి, తమ్ముడు మాత్రమే వెళ్ళాలని వారు తీసుకున్న నిర్ణయంతో హతాశుడవుతాడు....కానీ, తండ్రి అప్పుడెప్పుడో మగవాళ్ళు ధైర్యంగా ఉండాలి, లేకపోతే ఇంటిని ఎలా చూసుకుంటారు, యుద్ధం ఎలా చేస్తారు అనే మాట మేరకు కన్నీళ్ళు , బాధ గొంతులోనే ఆపుకుంటాడు. ..చివరి క్షణంలో వాడి ముఖంలోకి చూసిన తండ్రి తట్టుకోలేక ఆరునూరైనా సరే, వాడిని కూడా తమతో తీసుకెళ్ళాలని తీసుకున్న నిర్ణయం వాడికి తండ్రి మీద మరింత ప్రేమను, నమ్మకాన్ని పెంచుతుంది...

క్లుప్తంగా ఇదీ కథ....అయితే ఈ నవలను రాసిన రచయిత్రి, "వేర పనోవా"  తన ముందు మాటలోనే "ఈ నవల నేను కేవలం పిల్లల కోసమే కాక, తల్లితండ్రుల కోసం, భార్యాభర్తల కోసం వ్రాసాను" అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీ లేదు...... మనం సాధారణంగా "చిన్నపిల్లాడివి, మాట్లాడకు, నోర్మూసుకో, చిన్నపిల్లాడు, వాదికేం తెలుస్తుంది" అని కొట్టివేసే వాళ్ళ మనసుల్లో ఎంతటి దృఢమైన ఆలోచనలు ఉంటాయి, ప్రతి విషయాన్నీ ఎంత కూలంకషంగా ఆలోచించగలరు అనే విషయం చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది ఈ పుస్తకం చదివితే....ఈ పుస్తకాన్ని ఆమె తన పిల్లలు నతాల్య, యూరియ్, బోరిస్ లకు అంకితం ఇవ్వడంలోనే ఆమె పిల్లలకు ఎంత విలువ ఇస్తుందీ అర్ధం అవుతుంది. ఈ నవలను 1960 లో సినిమా గా కూడా తీసారు..అనుకుంటాను సినిమా పేరు....ఈ చిత్రానికి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి...


పిల్లలను అక్కర్లేని కట్టుబాట్లు, కచ్చడాల్లో పెంచకుండా, అవసరమైన విషయాలలో తగినంత స్వేచ్చ ఇస్తే, పిల్లలు ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు, ఎంత వికాసాన్ని పొందుతారు, ఎంత పాజిటివ్ గా ఆలోచించగలుగుతారు, ఎంత ధైర్యంగా పెరుగుతారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు...

ఈ నవల మూల రచయిత్రి "వేర పనోవా"...శ్రీ ఉప్పల లక్ష్మణ రావు గారు తెలుగులోకి అనువాదం చేసారు. ప్రగతి ప్రచురణాలయం , మాస్కో వారు ప్రచురించారు.....అప్పట్లో ఈ పుస్తకం వెల ఒక్క రూపాయి. .ఈ కాలం లో వచ్చిన మరికొన్ని పుస్తకాలు పిడిఎఫ్ లో దొరుకుతున్నాయి...అందరూ తప్పక చదివి తీరవలసిన పుస్తకం ఇది...

Thursday 21 July 2016

ఇవాళ ఇంట్లో మగపిల్లలు ఉండడానికి, ఆడపిల్లలు ఉండడానికి తేడా ఏంటి అనేదాని మీద చర్చ మొదలైంది ఇంట్లో.....మా ఉదయం కాఫీ టైము మా చర్చా సమయం...లోకాభిరామాయణాలు అన్నీ ఆ టైములోనే...అప్పుడు చర్చ కొంచెం సుదీర్ఘంగా సాగిందంటే వంటకు ఉరుకులు, పరుగులే.....మాకున్నది ఇద్దరూ మగపిల్లలే కాబట్టి మావారు చాలా జాలిగా, ప్రేమగా మగపిల్లల పక్షాన మాట్లాడుతుంటారు...నా మొహం.....ఇంట్లో ఒక్క ఆడపిల్లైనా లేకపోతే అందమా, చందమా...మగపిల్లలకి కొండానికి ఏముంటాయి? అవే పేంట్లు, షర్ట్లు, వాటిల్లో కూడా ఓ రంగు వేరియేషన్ ఉండదు...అవే నలుపు, నీలం...పెద్ద బోరు...అవే గళ్ళు, అవే చారలు...ఇంకా పెద్ద బోరు..అదే ఆడపిల్ల అయితే, రకరకాల వెరైటీ డ్రెస్సులు,రంగురంగుల చీరలు,  వాటికి మళ్ళి మ్యాచింగ్ గాజులు ఎట్సెట్రా, పువ్వులు, పండగలకి పూలజడలు, అసలు నట్టింట్లో ఆడపిల్ల తిరిగితే ఆ అందమే వేరు....పండగ సెలవు వస్తే మగపిల్లలు తుర్రుమని పారిపోతారు బయటికి...ఇంట్లో ఉండి కాస్త పూజ, పని చేసేది ఆడపిల్లే అని నా ఉద్దేశ్యం..."దానికి మా పెద్దవాడు గండి కొట్టేస్తాడు.."ఇప్పుడు ఏ ఆడపిల్లలు జడేసుకుంటున్నారే, పువ్వులు పెట్టుకోవడానికి, మా కన్న బెత్తెడు జుట్టు ఎక్కువ వాళ్ళకి అంతేగా...అందరూ విరబోసుకుని తిరుగేవాళ్ళేకదా....నువ్వు నీ కాలం కబుర్లు చెప్పకే" అంటూ...పండగ పూట ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటే నీకు బయట తిరిగేది ఎవరో ఎలా తెలుస్తుందే...ఆడపిల్లలు కూడా బైకులేసుకుని తిరిగేస్తున్నారు తెలుసా అంటాడు...పండక్కి కనీసం గడపకి పసుపు పూసి, పూజకు వస్త్రాలు, యజ్ఞోపవీతాలు చేసే దిక్కు లేదు, పిండివంటల్లో చేయి సాయం చేసే తోడు లేదు....ఇలా అనుకుంటే, "అమ్మా ...ఎక్కువ ఆశపడకే...ఇంకా మేమే నయం...నీకు హడావిడిగా ఉంటే అన్న కూరలు తరిగిపెడుతున్నాడు...నాన్న ఇల్లు సర్దిపెడుతున్నారు...ఆడపిల్ల ఉంటే ఇవన్నీ కూడా నువ్వే చేసుకోవలసివచ్చేది" అని చిన్నవాడి వకాల్తా...


అది నిజమే...కాస్త పువ్వులు కోసుకుని రావాలన్నా, కూరలు తరగాలన్నా, తలనెప్పిగా ఉంటే కాస్త కాఫీ నోట్లో పోయాలన్నా ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలు చేస్తారు....అందరి టిఫిన్లూ అయ్యాక, నాకు దోసెలు కూడా వేస్తారు...
 
రకరకాల నగలు చేయించాలన్నా, ఓ వెండి సామాను కొనాలన్నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంట్రస్టు ఉంటుంది...మగపిల్లలకు ఏం చేయిస్తాం? మెళ్ళో ఓ గొలుసు, చేతికి నాలుగు ఉంగరాలు తప్ప.....ఆడపిల్లకయితే మన శక్తి కొద్దీ ఒంటినిండా చేయించచ్చు.... "నీకు పోటీ వచ్చేవారు లేరు కదా...సంతోషించవేం!" మావారి దెప్పిపొడుపు.....మెళ్ళో వేసుకునే నగలకీ, తల్లో పెట్టుకునే పువ్వులకీ కూడా పంచుకునే పిల్లలు ఇంట్లో  ఇంకోకరు లేకుండా అన్నీ నాకే అంటే పరమ బోరు కదూ...

ఇంకా సంక్రాంతికి వాకిట్లో ముగ్గులు పెట్టాలన్నా నేనే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలన్నా నేనే....శ్రావణ మాసం పూజ కూడా ఏకాకిలా నేనొక్కదాన్నీ చేసుకోవడమే కదా...మగవాళ్ళకు ఇవన్నీ అర్ధం కావు.....గుమ్మానికి పచ్చని తోరణం, ఇంట్లో పట్టు పరికిణీ, పూలజడతో ఓ అమ్మాయి తిరుగుతుంటే ఇంటికి ఎంత కళ?


ఇప్పుడు ఆడ, మగ అందరు పిల్లలూ ఈ ఐ.ఐ.టి ల వేటలో పడి, ఎనిమిదో క్లాసు నుంచే హాస్టల్ బతుకులైపోయాయి....ఆడపిల్లలకు కూడా ఓ టీ పెట్టడం చేతకావడంలేదు...అది వాళ్ళ తప్పు కాదు పాపం..అక్కడ చదివి చదివి వస్తారని, మనమే వాళ్ళకి పని చెప్పకుండా రెస్ట్ ఇచ్చేస్తాం...

మన ఇంటి ఆడపిల్లలు అయితే, కాస్త మన అలవాట్లు, సంప్రదాయాలు, పద్ధతులు మర్చిపోకుండా నేర్పించచ్చు అని నా పిచ్చి ఆశ...ఆ అలవాటు అలా తరతరాలు కొనసాగుతుంది కదా అని.....

"మగపిల్లలైనా ఆడపిల్లలైనా మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలి...మారుతున్న కాలంలో కొన్ని కుదరవు కూడాను...వాటికి మనమే సర్దుకుపోవాలి...ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి అని నలుగురూ గొప్పగా చెప్పుకోవాలి.....అదే కదా మనకు కావల్సింది...." ఇదంతా ఏంటనుకుంటున్నారు? గ్లాసుడు కాఫీ నింపాదిగా తాగడం అయిపోయిన తర్వాత మా వారు చెప్పే నీతిబోధ.....నాకు...ప్రతి నెలరోజులకూ ఒకసారి ఈ టాపిక్ మా ఇంట్లో రాకమానదు....వెర్రిదానిలా నన్ను వాగించి, ఆఖరికి చిదానందస్వామి వారిలా మా ఆయన చేసే ప్రవచనం ఇది....అక్కడికి ఏదో సర్దుకుపోవటం నాకు చేతకానట్టు....పాతికేళ్ళ నుంచి ఈయనతో సర్దుకుపోవడంలా....హతవిధీ.....

ఈ ప్రవచనం చెప్పేసి, ఇంక పేపరు చేతిలోకి తీసుకున్నారు అంటే, ఇంక వెళ్ళి నీ వంట పని చూసుకో అన్నట్టు అర్ధం....మళ్ళి నేను, నా వంటగది మామూలే....

ఇదంతా విని (చదివి) ఆడపిల్లలు ఉండడానికి, మగపిల్లలు ఉండడానికి లాభనష్టాల మీద చర్చా కార్యక్రమం (కామెంట్ల ద్వారా ) మొదలుపెట్టకండేం...పుణ్యం ఉంటుంది....ఏదో సరదాగా రాసినది, సరదాగా తీసుకోండి.....

Sunday 10 July 2016

జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే!!

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం.
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం !!

వ్యాసాయ విష్ణురూపాయ
వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే
వాసిష్టాయ నమోనమ:!!

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు:
గురూదేవో మహేశ్వర
గుర్స్సక్షాట్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:

గురుపూర్ణిమ అనగానే వ్యాసుమహర్షి గుర్తొస్తాడు....మన సౌలభ్యం కోసం వేదాలను విభజించడంతో పాటు, మానవులకు ఉత్తమ ధర్మాలను బోధించి, వారి జీవనాన్ని సుఖమయంగా చేసుకునేందుకు తగిన సూత్రాలతో కూడిన మహాభారతాన్నీ, మానవులను సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలొ నడిపి సద్గతి వైపుగా మరల్చేందుకు ఆ పరమాత్మ లీలావిశేషాలతో కూడిన  శ్రీమద్భాగవతాన్ని మనకు అందించిన మహాగురువు వ్యాసులవారు....లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా మానవుల శ్రేయస్సును కోరిన ఉత్తమగురువు ఆయన...ఈ గురుపూర్ణీమ నాడు ఆయనను స్మరించుకుని పూజించుకోవడం మన కర్తవ్యం...

పూర్వకాలం లో పిల్లలను చిన్నవయసులోనే తగిన గురువు వద్ద వదిలి గురుకుల పధ్ధతిలో విద్య నేర్పించేవారు తల్లితండ్రులు...గురువు, శిష్యుల మధ్య గొప్ప అనుబంధం ఉండేది...తల్లి తండ్రుల తరువాత పిల్లలకు తమ గురువుతోనే ఎక్కువ అనుబంధం ఉండేది..అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత, పూజించడానికి అర్హునిగా గురువునే చెబుతారు...శిష్యులకు వారికి తగిన చదువు నేర్పి, సమర్ధులుగా రూపొందించడం, వారిలోని చెడు గుణాలను తొలగించి, మంచి మార్గంలో నడిపించడం ఇవన్నీ ఒక సద్గురువు యొక్క బాధ్యతలు.....ఇప్పుడు అటువంటి గురుకులాలు లేకపోయినప్పటికీ మన భవిష్తత్తును తీర్చి దిద్దుతున్న గురువులను పూజించుకోవటానికి ఈ గురుపూర్ణిమ ఒక మంచి అవకాశం....

ఈసందర్భంగా అపర శంకర అవతారమై వెలిసి, జగద్గురువు అని పిలువబడిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని తప్పకుండా స్మరించుకోవాలి..దుష్టాచారములను నశింపచేసి, శ్రౌత, స్మార్త క్రియలను సుసంపన్నం చేసి, వైదిక మార్గాన్ని పున:ప్రతిష్టించడానికి ఆ నీలలోహితుడే (శంకరుడు--ఈశ్వరుడు) శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారని కూర్మ పురాణం చెప్తుంది. సాక్షాత్తూ వ్యాసులవారే శంకరులు వ్రాసిన భాష్యాలన్నీ ఉత్తమమైనవి అని, బ్రహ్మసూత్రాలను కేవలం శంకరులే సరి అయిన మార్గంలో అర్ధం చేసుకోగలిగారని ప్రశంసించారు.... అంతటి ఉత్తమ గురువులను గురుపూర్ణిమ నాడు పూజించి వారి ఆశీ:బలం పొందడం మన అదృష్టం.

వీరే కాక, సమర్ధ సద్గురువుగా శ్రీ సాయిబాబాను నమ్మేవారు కూడా ఈరోజు ఆయనను తమ జీవితాలను సరి అయిన మార్గంలో నడిపిస్తున్న గురువుగా భావించి ఆరాధిస్తారు.....ఆయనను మనస్పూర్తిగా విశ్వసించే భక్తులకు ఆయన ముస్లిమా, హిందువా అనే సంకోచం ఉండదు...

గురువుకు భారతీయ సంస్కృతిలో ప్రముఖ స్థానం ఇవ్వబడింది... వ్యాస మహర్షి జన్మించిన  ఆషాఢ పూర్ణిమ ను " గురు పూర్ణీమ" గా జరుపుకోవడం మన సంప్రదాయం....అందరికీ "గురుపూర్ణీమ "  శుభాకాంక్షలు....

Saturday 9 July 2016

"ఏవండీ! నాకు ఈసారి ఊరు మారినప్పుడు ఓ ఉయ్యాల బల్ల కొనరా!" వంటింట్లోంచి అడిగాను నేను....

"ఏంటి! మిరియాల పాలు కావాలా? ఏం? ఇంట్లో మిరియాలు లేవా? తెస్తాలే!!" మావారి జవాబు...హాల్లోంచి...

అప్పుడే అనుమానం వచ్చింది నాకు...ఈయన గారు ఏంచేస్తున్నారా అని, ఇలా అవకతవక జవాబు ఆయన నోటినుంచి వచ్చిందీ అంటే ఖచ్చితంగా దినపత్రిక పఠనం లో ఉండి ఉంటారు...పేపరు చదువుతున్న పతిదేవుణ్ణి పలకరిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి...ఎన్నేళ్ళొచ్చినా, ఎన్నేళ్ళ నుంచో  ఇంట్లో జరుగుతున్న భాగోతమే అయినా నాకు బుధ్ధి రాదు...మిరియాల పాలు కావాలంటే నేను కలుపుకోనూ.....ఎప్పుడూ వంటింట్లోనే వేళ్ళాడుతూ ఉంటాను కదా, ఏదో పొద్దున్నే గుర్తొచ్చి  ఉయ్యాల బల్ల అడిగాను...

చెప్పాలంటే నావి కొంచెం పాత టేస్టులు...మండువా లోగిలి ఇల్లు...(అంత కుదరకపోతే, ఓ పెద్ద వసారా, పెంకుటిల్లు,) ముత్తైదువలు ఇంటికి వస్తే బొట్టు పెట్టి ఓ కొబ్బరిబొండాం ఇవ్వడానికి వీలుగా ఓ కొబ్బరి చెట్టు, దొడ్లో ఓ నుయ్యి, ఓ పెద్ద తులసి కోట...ఇంటికి ముందువైపో, వెనక వైపో ఎత్తరుగులు.....ఇవన్నీ నా ఊహల్లో కట్టుకున్న ఇంటి నమూనా.....నా పిచ్చికి నన్నొదిలేసి ఓ నాలుగు గోడల అపార్టుమెంటు కొనేసారు మావారు...ఇప్పుడు ఇది సులువై పోయింది...రెడీమేడ్ జీన్సు, చొక్కా కొనుక్కుని వచ్చేసినట్టు, డబ్బు పట్టుకెళ్ళడం, సంతకం పెట్టేసి మనది అని మమ అనిపించుకోవడం....ఇల్లు సొంతం అవ్వాలంటే కష్టం లేదు..ఇసుక మోయాలనే బాధ లేదు, దింపిన ఇటుకలు ఎన్నున్నాయో లెక్కెట్టుకోక్కర్లేదు...నాలాంటి పిచ్చోళ్ళని పక్కనపెడితే..... ఇందులో ఉండే లాభాలు ఇందులో ఉన్నాయిలెండి....

ఉయ్యాలబల్ల మీద పడుకుని ఓ శ్రీపాద వారి కథలో, అమరావతి కథలో చదువుకుంటుంటే ఆ మజాయే వేరు...పక్కన సన్నగా జేసుదాసు గారి పాటలు వినిపిస్తుంటే, ఆక్షణాన్న ఊపిరి ఆగిపోయినా ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తామన్న నమ్మకం నాకు...


 ఏమిటో జీవితంలో చిన్న చిన్న సరదాలే తీరవు....పెద్ద పెద్ద కొరికలు వెంటనే తీరతాయి....ఇదేం రహస్యమో తెలియదు.....లక్ష రూపాయలు పట్టుకెళ్ళి ఓ నెక్లెస్ కొనుక్కోవడం అవుతుంది..స్టీలు సామాను కొట్లో 10 రూపాయలకు దొరికే బుజ్జి గుండుచెంబు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు పడుతుందో...అద్దాల్లోంచి ఊరిస్తూ ఉంటుంది బుజ్జి తల్లి......అక్కడ ఆగి కొనుక్కోవడమే అవ్వదు ఎప్పుడూనూ....నా సొంత ఇల్లు కూడా అలాగే కలలా మిగిలిపోయింది....

ప్చ్....కొన్ని కలలు అంతే...ఏం చేయలేం.....

Wednesday 6 July 2016

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం!!
పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం
పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు పరిష్కార మార్గాలు ఏంటి ?ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండు ( డిమాండు అనడం ఇక్కడ తప్పుగా భావించకండి )ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది. అందునా మంచి భార్వ లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి.
. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న మగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.
సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ !
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||
ఓ గ్రూప్ లో కొచ్చెర్లకోట జగదీష్ గారి కూరల కొనుగోలు కష్టాలు పోస్ట్ చూసాక, నా కష్టం కూడా మిత్రులతో పంచుకోవాలనిపించింది.
ఏమన్నా అంటే అన్నాం అని బాధపడతారు కానీ, శ్రీవారు కూరలకెళ్ళేటప్పుడు నేను పక్కన లేకపోతే, నాకే పనిష్మెంట్... ఏదో బధ్ధకించి ఆయనొక్కరినీ పంపామా, కూరకుంటే, పచ్చడికి ఉండదు, పచ్చడికి ఉంటే పప్పుకి కావల్సిన కూర ఉండదు. ఉండేది ఇద్దరం......ఈ దోండకాయలు అమ్మేవాడు ఎంతబాగా మట్లాడాడో, ఎంత మంచివాడో, ఓ కిలో వేసుకోండి లేతగా ఉన్నాయి అంటే, కిలో తెచ్చాను అని చెప్తే, వాటన్నిటినీ ఏం చేయను నేను? వారం అంతా కుదరదు కదా అని, ఆకుకూరలన్నీ ఒకరోజే తెచ్చేస్తే, అవి వలిచేందుకు దుంప తెగుతుంది...వంటలోకి స్పెషల్సే చేయ్యాలా? ఇవి వలుచుకుంటూ కూర్చోవాలా? ఆదివారం వస్తోందంటే ఏడుపు వచ్చేస్తుంది....కూరలు తెచ్చి పడేసిన మహానుభావుడు హల్లో అడ్డంగా పోసేసి, ఈ వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో చూడు, అల్లం పచ్చిమిర్చి వేసి వండు...ఈ బెండకాయలు వేపుడు చేసి తగలెయ్యకు, చక్కగా పోపునెయ్యి...అని వర్ణిస్తూ చెప్తూ ఉంటే వంట మొదలెట్టేందుకు వేళ 11...రోజూ తీసే చిన్న కునుకు కూడా కరువే ఆదివారం.....ఆయనకేం? మూడు పేపర్లు తెచ్చుకుని అంత:పురంలోకి వెళ్ళి చదువుకుంటూ శేషశాయి లాగా సీనేస్తారు...వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమలు ఆస్వాదిస్తూ...మధ్యమధ్యలో ఓసారి తొంగిచూసి, పోపులో మెంతులు వేసావా? అని అడిగితే చేతిలో ఉన్న గరిటుచ్చుకుని రెండు మొత్తాలనిపిస్తుంది....ఇవాళా, నిన్నా కాపురానికొచ్చానా? పాతికేళ్ళ నుంచి ఈయనకి తగ్గట్టు వండుతూనే ఉన్నానాయె...ఉద్యోగంలో ఉండగానే ఇలా ఉంది..రేపు ఈయన కాస్తా రిటైర్ అయితే నా పరిస్థితి?...ఇకప్పుడు అన్నీ ఆదివారాలేగా......బాబోయ్...తలుచుకుంటేనే భయం వేస్తొంది...
కూరలతో పాటు పళ్ళో...ఛప్పన్న రకాల పళ్ళూ ఆరోజే కొని తగలేయడం....తినేవాళ్ళు ఎంతమంది అని చూసుకోవడం లేదు...అవన్నీ ఎక్కడ దాచను? ఎంతమందికి పంచను? అన్నీ కలిపి ఫ్రిజ్ లోకి తోసేస్తే, మర్నాడు పొద్దున్న ఫ్రిజ్ డోర్ తీయగానే అన్ని రకాల వాసనల కలగలుపు,...కడుపులో
.దేవేస్తూనూ...అందులో మళ్ళి ఓ బొగ్గు ముక్కో, ఇంత వంట సోడాయో పెట్టడం....అబ్బ...ఇవన్నీ పైకి చెప్పుకోలేని కష్టాలు....మీకేమమ్మా? అన్నీ అయ్యగారే తెచ్చి పడేస్తారాయే అని పని అమ్మాయి సన్నాయి నొక్కులు....బుర్ర రామకీర్తన పాడించాలనిపిస్తుంది...
ఇక కిరాణా సరుకుల ప్రహసనం ఇంకో తీరు...సబ్బులు అని రాసావు, ఏం తేవాలి అని అక్కడినుంచే ఓ ఫోను..గోధుమ నూక అని రాసావు, తెల్లదా ఎర్రదా అని అడుగుతున్నాడు అని ఇంకో ఫోను. టూత్ పేస్టు క్లోస్ అప్ లేదట ఏం తీసుకురాను , అని మూడోది...ఇంటికొచ్చేయండి, వేప్పుల్ల పెట్టి తోముకుందాం అన్నా ఒకసారి..దానికో ఇంత పొడుగు రోషం....లిస్టులో నెయ్యి రాసావు, మనం ఎప్పుడూ కోనం కదా అని అక్కడినుంచే ఫోన్ చేస్తే షాపు వాడి మొహం చూడాలి..ఇదివరకు కొనలేదు...నిజమే..ఎప్పుడు? ఎప్పుడో బతికున్నరోజుల్లో, ఇంట్లోనే వెన్న తీసి కాచుకున్న రోజుల్లో...ఇప్పటి ముచ్చటా అది?ఏదో సినిమాలోలాగా, ఈ మధ్య ఉన్న సంవత్సరాలన్నీ ఈయన మిస్ అయ్యారేమో అనిపిస్తుంది....ఈ గోల అంతా పడలేక, ఓ బ్యాగు భుజాన వేసుకుని నేను కూడా పోతుంటాను ప్రతిచోటకీ....చూసేవాళ్ళు అబ్బ! ఎంత అన్యోన్య దంపతులో? ప్రతి చోటికీ కలిసేవెళ్తారు చిలకల్లాగ అని అనుకోవడం....ఇంట్లో కాకుల్లాగా ఎంత కొట్టుకుంటామో వాళ్ళకేం తెలుసు? ఏ ఏ కారణాల చేత నేను కూడా పడి పోతున్నానో తెలిస్తే మూర్చ వస్తుంది వాళ్ళకి...
నాన్నంటే ఓ గొడుగు...
నాన్నంటే ఓ నీడ..
నాన్నంటే ఓ సరదా...
నాన్నంటే ఓ భరోసా..
నాన్నుంటే ఓ ధైర్యం. ..
నాన్నంటే ఓ బలం...
నాన్నంటే ఓ సినిమా హాల్..
నాన్నంటే ఓ షాపింగ్ మాల్...
నాన్నుంటే ఓ నిశ్చింత...
నాన్నంటే ఓ విజ్ఞానం..
కానీ ఈరోజు ...
నాన్నంటే కేవలం ఓ జ్ఞాపకం.....
పిలువకు కృష్ణా! నీ నోటితో 
నాపేరు పలకకు కృష్ణా!!
పిలుపు వినగానే 
కొత్తగా ఏదో 
మత్తుగా గమ్మత్తుగా
ఎందుకో ఈ మైమరపు!!
హృదయనాదము హెచ్చి, అడుగులు తడబడి
చిరు చెమటల తడిసిన
ముంగురులు ముడివడి
పెదవులు వణీకి, మేను కంపించి
వలపు ధారల తడిసి కన్నులు సోలి
ఎదురుచూసిన క్షణము ఎదుటపడగానే
ఎదురుచూపుల గడియ ముగిసిపోగానే
ఏల నాలో ఈ కలవరము!
ఎందుకింత పరవశము !!
జన్మజన్మల నుండి ఉన్నదేగా
మన బంధం!
ఎన్నో జన్మల పుణ్యమేగా
నాకు ఈ వరం!!
నీ ప్రతి తలపున వివశనై
ప్రతి పిలుపున పరవశనై
నన్ను నేను మరచిపోదును
రాధా హృదయ విహారీ!!
నీ పలుకు విన్న ప్రతిసారీ...
చిన్నపిల్లలు చూడండి....ఎవరిని చూసినా స్వచ్చంగా నవ్వుతారు..నిష్కల్మషమైన హృదయంతో ప్రేమిస్తారు....మనందర్నీ భగవంతుడు అలాగే సృష్టించాడు. పెరుగుతున్నకొద్దీ మనలో స్వార్ధం, అసూయ, ద్వేషాలు ఎక్కువ అయిపోతున్నాయి...ఎందుకలా? చిన్నపిల్లల్లాగా మనం ఎందుకు స్వచ్చంగా ఉండలేకపోతున్నాము? ఎదిగేకొద్దీ, మనలో మనకు తెలియకుండానే అహంకారం పెరుగుతుంది. మనం మాట్లాడే మాటలకో, ఇతరులకు చేసే సేవలకో, సహాయాలకో మనం వారి దగ్గర్నుండి మనకు తెలియకుండానే ఒక మెప్పునో, పొగడ్తనో, కనీసం ఓ గుర్తింపునో కోరుకుంటాం..అది దొరకనపుడు మనం బాధపడతాం..అదే పనిగా ఆ విషయమే ఆలోచిస్తూ ఉంటే క్రమంగా అది ఎదుటివారిపట్ల కోపంగానో, కొంచెం స్థాయి పెరిగి ద్వేషంగానో మారుతుంది...ఈ భావనలనుంచి మనన్లి మనం దూరం చేసుకోలేము...చిన్న పిల్లలు అలా కాదు..వారి ప్రపంచం వేరు..వారు ఎవరి దగ్గర్నుండి ఏదీ ఆశించరు..వారి ఆటలేంటో, వారి లోకం ఏంటో...అందుకే వారు అంథ స్వచ్చంగా ఉండగలుగుతారు...మనం అలా ఉండలేమా? మనలోని అహంకారాన్ని దూరం చేసుకుని, ఎదుటివారినుండి ఏదీ ఆశించనపుడు మనలో కూడా ఏరకమైన ఈర్ష్యాద్వేషాలు ప్రవేశించవు..ఈ విషయంలో మనం చిన్నపిల్లలనుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది...గీతాకారుడు కూడా ఇదే చెప్పాడు...ఏ పని అయినా చేసేటప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చెయ్యకు..నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చితీరుతుంది అని...ఇదంతా కేవలం యోగుల కొరకో, జ్ఞానుల కొరకో చెప్పినది అనుకుంటే పొరపాటే...వ్యక్తిగత జీవితంలోనూ, ప్రతి సమస్యకూ పరిష్కారం "గీత" లో దొరుకుతుంది....ఒక్కసారి ప్రతిఫలం ఆశించకుండా మన కర్తవ్యాన్ని నెరవేర్చడం అలవాటు చేసుకుందాం....అప్పుడు చిన్నపిల్లల్లాగా ఏ చింతలూ లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాము.....
"అమ్మోయ్" ! నాన్న పిలుస్తున్నారు....చిన్నవాడి గావుకేక....
"ఆయనకేం! పిలుస్తూనే ఉంటారు...ఇక్కడ ఖాళీ ఉండద్దూ రావడానికి"
"అప్పుడే పిలవకురా!" వచ్చిందంటే ఇద్దరికీ కలిపి పెడుతుంది....." మా ఆయన ఉవాచ...
"నన్ను ఇన్వాల్వ్ చేయకు నాన్నా.." చిన్నవాడి చెణుకు..
అప్పుడే ఏదో కనబడడం లేదు అని అర్ధం అయింది నాకు...నేను గాక ముగ్గురు..అందరూ ఎదిగిన వాళ్ళే....మూడు జతల ఆరు కళ్ళు...అందులో ఇద్దరికి "ఉప"నయనాలు....వెరసి 10 కళ్ళు...కానీ ఎదురుగా ఉన్న వస్తువు కనబడదు ఎవ్వరికీ...ఈ "ప్రత్యేకమైన " చూపు భగవంతుడు మా ఇంట్లో వాళ్ళకే ఎందుకిచ్చాడో అర్ధం కాదు...చిన్న పిల్లలు లేరు కాబట్టి, ఉన్న పిల్లలు ఇంట్లో ఉండడం లేదు కాబట్టి పెట్టిన వస్తువు పెట్టినచోటే ఉంటుంది...ఉండాలి కూడా...అలా ఉన్నా కూడా మా వాళ్ళెవరికీ నేను వస్తేనే కానీ అది కనబడదు...నేను వచ్చేవరకు అది అదృశ్య రూపంలో ఉంటుందో ఏమిటో జానపద సినిమాల్లో హీరో లాగా..
ఇంతా చేసి అది స్టేప్లరో, కత్తెరో, సెల్లొఫిన్ టేపో ....ఈ బాపతు వస్తువన్న మాట...మా ఇంట్లో ఇంకో విడ్డూరం....పక్కవాళ్ళు ఎవరైనా వచ్చి ఖర్మం జాలక థర్మామీటరు లాంటివి అడిగితే,
"మా ఇంట్లో ఉందో లేదో ఆవిణ్ణి అడగాలండి" ....ఇదీ వెధవ జవాబు మా ఆయన వాళ్ళకిచ్చేది...వాళ్ళకు ఆ జవాబు చేరిన తర్వాత నేను ఓ వెర్రి నవ్వు నవ్వి వాళ్ళకి కావల్సింది ఇవ్వడం జరుగుతుంది..
అక్కడికీ సూపర్ మార్కెట్ లో లాగా అడిగినవన్నీ వెంటనే తీసి ఇస్తూనే ఉంటాను ...ఇలాంటి అత్యవసరమైనవి అయితే, ఒకటికి రెండు కొని పడేస్తాను...మా వాళ్ళ కంటిచూపు గురించి క్షుణ్ణంగా తెలిసినదాన్ని కాబట్టి...
వాషింగ్ మెషీన్ లాంటి పెద్ద వస్తువులు కొన్నప్పుడు, బిల్లు, గ్యారంటీ కార్డు లాంటి వన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టి ఒక బ్రీఫ్ కేస్ లో పెడతాను...ఇంట్లో నన్ను కప్పెట్టినన్ని వస్తువులు, ఫోల్డర్ లో వాటిని మించిన కాగితాలు, ఓ సోమవారం మధ్యాహ్నం కూచుని, వేటికవి విడదీసి చక్కగా సర్దితే, మంగళవారమే ఆయనకేదో కాగితం అవసరం అవుతుంది....మళ్ళీ...పద్మా.....పిలుపు...
"అన్నీ అందులోనే ఉన్నాయి మహానుభావా! వెతుక్కుని తీసుకోండి" వంటింట్లోంచి నా కేక....
"ఫలానాది ఇందులోనే పెట్టాను..ఇప్పుడు కనబడడంలేదు...." కంప్లైంట్...
తీరా పొయ్యి ఆర్పి వచ్చి చూస్తే ఏముంది, గదినిండా కాగితాలు...మధ్యలో ఈయన...చుక్కల్లో చంద్రుడిలాగా....(నన్ను కిర్రెక్కించడానికి ఆయన్ని ఆయన అలా పోల్చుకుంటారులెండి ) అన్ని ఫోల్డర్స్ లో కాగితాలు కలగలిపేసి....మరి మండిందంటే మండదూ...హతవిధీ అనుకుంటూ వెతికి ఇవ్వడమే....సో, మంగళవారం మధ్యానం కూడా సర్దుళ్ళు తప్పవు నాకు...
"ఈ సంసారం, ఈ మనుషులతో నేను వేగలేను, సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళ్లిపోతాను ఎప్పుడో"....నా నిట్టూర్పు....
"అమ్మా! సన్యాసం తీసుకుంటే కాఫీ తాగడానికి ఉండదేమోనే...ఆలోచించి మరీ నిర్ణయించుకో...." నా కాఫీ పిచ్చి తెలిసిన పెద్దవాడి విసురు..
"సన్యాసం లేకుండా ఉట్టినే హిమాలయాలకు వెళ్ళే ఆఫర్ ఏదీ లేదా"? చిన్నవాడి అతి తెలివి..
"నువ్వెళ్ళిపోతే ఇక్కడ వంట ఎలాగా? ఇంట్లో నీలా మాట్లాడేవాళ్ళు ఉండకపోతే మాకు తోచద్దూ...." వంట కోసమే నేను పుట్టినట్టు మా వారి భావం...
"వంటమనిషిని ట్రై చేద్దాం నాన్నా...అమ్మని వెళ్ళనీ...అమ్మ కోరిక మాత్రం ఎప్పుడు తీరుతుందీ" ..ఇవో రకం సన్నాయి నొక్కులు..
"వంటమనిషి ఉన్నా సరే...బెండకాయ వేపుడు మాత్రం అమ్మే చేయాలి...చెన్నై లో నాకు దొరకదు..."
" ఆలూ ఫ్రై కూడా"..
"అప్పడాల పిండి మాత్రం అమ్మే కలపాలి నాన్నోయ్...ముందే చెప్పేస్తున్నా.....అన్నీ ఆలోచించుకుని పంపు అమ్మని...."
ఇంకా నాకు సన్యాసం తీసుకునే తీరికెక్కడా, హిమాలయాలకు పోయే భాగ్యమెక్కడా?
"అసలు హిమాలయాల్లో మిర్చి బజ్జీ చేసుకుని తింటే ఎలా ఉంటుందంటావ్? చల్లని మంచు కొండలు..వేడి వేడిగా అమ్మ చేసిన బజ్జీలు...ఒక్కసారి ఊహించుకోండర్రా పిల్లలూ...." మావారి బజ్జీ బులబాటం
భగవంతుడా! అయిపోయింది...నేను ఏ టాపిక్ రాకూడదని అనుకున్నానో అదే వచ్చింది..ఇంక నన్ను ఆ బ్రహ్మ కూడా రక్షించలేడు...మా ఇంట్లో వాళ్ళకి పై నుంచి కింద తరం దాకా మిర్చి బజ్జీలు అంటే ఓ రకంగా విటమిన్ ట్యాబ్లెట్లు....మార్కెట్ లో బజ్జి మిరపకాయల్ని చూసినప్పుడు మా వాళ్ళ కళ్ళు "మాస్క్" సినిమాలో హీరో కళ్ళల్లాగా గుండ్రంగా తిరుగుతూ, రెండుసార్లు బయటికొచ్చి, అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాయి....నెలకో ఆదివారం మాకు బజ్జీల ఆదివారం పోలియో ఆదివారం లాగా... ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా అవి చేయడం తప్పనిసరి...పెళ్ళయ్యి పాతికేళ్ళయినా, బజ్జీలకి మిరపకాయల్లో వాము పెట్టాలని చెప్తూనే ఉంటారు మావారు...చాదస్తం అనుకోవాలో, జాగ్రత్త అనుకోవాలో తెలియక బుర్ర పగలకొట్టుకుంటాను నేను...
ఆదివారం అందరికీ సెలవు అంటారు...మా లాంటి ఇళ్ళల్లో ఆదివారం ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా వంట...హు...ఏంటో ఇంటింటి రామాయణం..