Friday 13 May 2016

అసలు సాయిబాబా దేవుడా కాదా, ఇదో పెద్ద చర్చా కార్యక్రమం,...ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మిన వాళ్ళు పూజిస్తారు. సనాతన ధర్మాన్ని పాటించేవారు బాబాను దేవుడిగా, ఒక సద్గురువుగా ఒప్పుకోకపోవచ్చును. దానివల్ల బాబాగారికి కానీ, ఆయనను పూజించే భక్తులకు కానీ నష్టం ఏమీ లేదే... ఇది వారి వారి వ్యక్తిగత వ్యవహారం....

బాబా ఎన్నడూ తాము దేవుడిననో, భగవంతుని అవతారం అనో చెప్పుకోలెదు. ఆయన తాను కేవలం "అల్లాకు బానిసను " అని మాత్రమే చెప్పుకున్నారు. బాబా భగవంతుని అవతారం అనో, సద్గురువు అనో భావించి తమను పూజించే భక్తులకు ఎన్నడూ ఆయన మీ మీ ఇష్టదేవతలను పూజించడం మానుకొని, నన్నే పూజించండి అని చెప్పలేదు. తనకు అసలు పూజ చేయవలసిన అవసరమే లేదు అని, పూలు, గంధాలు సమర్పించే అవసరం లేదు అని, నేను కూడా మీలాంటి మనిషినే అని ఎన్నోసార్లు చెప్పారు. మీ మీ ఇష్టదేవతలను మీ మీ సంప్రదాయాల ప్రకారం పూజించుకొన్న తర్వాతే నా దగ్గరికి రమ్మని చెప్పేవారు. శ్యామా కు ఒకసారి "విష్ణు సహస్రనామం" ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పారు. మేఘుడికి శివలింగం ఇచ్చి పూజించుకోమన్నారు. శ్రీమతి కపర్దే కు "రజా రాం " అనే మంత్రాన్ని జపించుకోమని చెప్పారు. బాబా స్వయంగా ఎన్నోసార్లు సందర్భానుసారం భగవద్గీత లోని శ్లోకాలను ఉటంకించేవారు కూడా...ఆయనకు మతబేధాలు అంటగట్టడం అసందర్భం...

ఆయన ఎన్నడూ తన స్వలాభం కోసం లీలలు, మహిమలు చేయలేదు...ఆయన ఒకేఒక్కసారి మశీదులొ దీపాలు వెలిగించడానికి వర్తకులు నూనె ఇవ్వని సందర్భంలో నీటితో వెలిగించి తమ లీలను చూపించారు. అది కూడా దీపాలు తానొక్కడికే కాదు అని, అవి వెలిగించడం వలన ఆ దారిన పోయేవారికి వెలుతురు ఉంటుంది అని, అదీ కాక, ఏ వస్తువునైనా  ఇవ్వటానికి ఇష్టం లేకపోతే ఇవ్వము అని చెప్పాలి కాని, లేదు అని అబధ్ధం ఆడకూడదు అని, ఇంకా, కులమతాల అధారంగా ఒకరిని హింసించడం తప్పు అని ఆ నూనె వర్తకులకు తెలియచెప్పడానికి మాత్రమే చేసాను అని చెప్పారు కూడా..

బాబా బోధించిన శ్రధ్ధ, సబూరి ని మనస్పూర్తిగా పాటించేవారు, బాబా బోధలను క్రమం తప్పక పాటించేవారు జీవితం లో ఎంతో ఉన్నతిని, మనశ్శాంతిని పొందుతారు. అది ఆయనను పూజించే భక్తులకు ఎన్నోసార్లు అనుభవం లోకి వచ్చింది. ఆయన సర్వజ్ఞతను, దివ్యత్వాన్ని ఆయన సమాధి చెందిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత ప్రశ్నించడం , బహిరంగ చర్చలు పెట్టడం, మనుషులలోని అల్పబుధ్ధిని తెలియచేస్తుంది కాని, ఆయన కీర్తి ప్రతిష్టలు ఏమాత్రం మసకబారవు....ఆయనను గాఢంగా విశ్వసించి, పూజించే భక్తుల యొక్క విశ్వాసాన్ని ఎవరూ ఆపలేరు, అడ్డుకోలేరు...

స్వస్తి.......

Wednesday 4 May 2016

అబ్బబ్బ....ఏం వంట? ప్రతి రోజూ, ప్రతి పూటా..రోజుకు ఉన్న 24 గంటల్లో 6 గంటలు  నిద్రకి మినహాయిస్తే, మిగిలిన 18 గంటలు  చేసే పనులు వంటకి, తిండికి సంబంధించినవేనాయే....రాత్రి పడుకునేటప్పుడు రేపు పొద్దున్న టిఫిన్ కి ఏంటి? వంటకి ఏంటి? అనుకోవటం,...తెల్లారి లేవగానే ఇవాళ ఏ పప్పు నానబెట్టాలి? ఏ పప్పు రుబ్బాలి? ఇదే రంధి.... అసలు ఇంట్లో చేసే పనుల్లో 70% పనులు తిండికి, వంటకి సంబంధించినవే....అసలు లోకం లో ఈ  తిండిగోల   లేకుండా ఉంటే ఎంత బాగుండేది? సరుకులు  తెచ్చుకోవక్కర్లేదు,కూరలు తెచ్చుకోవక్కర్లేదు,  వండుకోవక్కర్లేదు, గిన్నెలు తోముకోక్కర్లేదు, అందుకోసం ఓ పనిమనిషిని పోషించక్కర్లేదు, ఎంత డబ్బు మిగులో, ఎంత టైం మిగులో...హాయిగా ఆ టైం లో పుస్తకాలు చదువుకోవడమో, సంగీతం వినడమో చేయచ్చు...అహా. తలుచుకుంటేనే స్వర్గంలో ఉన్నట్టుంది.

ఉన్నవి 20 రకాల కూరలు, వాటిల్తో 60 రకాల వంటలు, వాటికి మళ్ళి 150 రకాల కాంబినేషన్లు.....అబ్బ...ఎంత శ్రధ్ధగా వండుకుని తింటున్నామో కదా....పనసపొట్టు, గుత్తివంకాయ కూర ఉన్నప్పుడు ముద్దపప్పు ఉండాల్సిందే...సాంబారు పెట్టినప్పుడు అప్పడాలు వేయించాల్సిందే...ఆవకాయకి గడ్డపెరుగు, కంది పచ్చడికి ఉల్లిపాయ పులుసు  జోడీ...ఇవి చేయని, చేయలేని ఇల్లాలికి ఉరికి సమానమైన శిక్ష వేసేయచ్చు...(మాలాంటి ఇళ్ళల్లో అయితే)...

రోజూ ఉండే టిఫిన్లు ఓ రకం...పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే, సాయంత్రం దవడ ఆడించడానికి మురుకులో, జంతికలో వాటికి తోడుగా సున్నుండలు, లడ్డూలు,...ఇవి ఇంకో రకం, పండగలు పబ్బాలకు సరే సరి...ఇక ఏడాదికోసారి పలకరించి ఒళ్ళు హూనం చేసే ఊరగాయలు, ఒడియాలది మరో ముచ్చట...ఆవకాయకి సన్న ఆవాలు తేవోయ్ ...(ఆఘాటుకి గొంతు మండుతున్నా, పెద్ద ఆవాలు వాడకూడదు....అదో ముచ్చట....) మార్చ్ వచ్చిందంటే చాలు, ఇంట్లో, ఎటొచ్చీ ఆవు కథ లాగా, ప్రతి సంభాషణా ఊరగాయలు , వడియాలమీదకే పోతుంది..(పగలైనా, రాత్రైనా)...మనిషి జన్మ మీద విరక్తి కలిగేటట్టు. ...హాయిగా జంతువులమైతే పచ్చగడ్డి ఒక్కటీ సరిపోయేది కదా..."ఏమో, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కదమ్మా, అందులో దేనిది ఏ రుచో మనకేం తెలుసు, అవి కూడా సెలెక్టివ్ గా రుచుల ప్రకారం తింటాయేమో" ....పిల్లల సెటైర్లు ఇవి...

ఒకళ్ళు నూనె వస్తువులు తినద్దంటారు, ఒకరు ఉప్పు తగ్గించమంటారు, ఒకరు నెయ్యి, స్వీట్లు తినద్దంటారు, ఒకరు కారం, పులుపు నిషేధించాలంటారు. మరొకాయన అయితే, ఉప్పు, కారం, నూనె, నెయ్యి, తీపి, పులుపు అన్నీ మానేసి పచ్చి కూరలు, పండ్లు తిని బతికేయమంటాడు. (ఇంతకీ ఈయన ఉగాది పచ్చడి ఎలా చేస్తాడో చూడాలని ఉంది ఒకసారి )  అంతదానికి వెయ్యేళ్ళు బతికి ఏంచేయ్యాలో తల బద్దలుకొట్టుకున్నా  అర్ధం కాదు. సుబ్బరంగా అరిసెలు, సున్నుండలు తిని అరాయించుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంది....అవి మానేసి, ఇవి మానేసి డైట్ ప్రకారం  తింటుంటే అన్నం మానేసి, ఆ వంతుకి మందులు మింగాల్సొస్తోంది....ప్రతివాళ్ళకి, చిన్నా పెద్దా తేడా లేకుండా రోజుకి అరడజను మందులు..మందుల కంపెనీలకి మహరాజ పోషకులం....

ఇంటి తిండి అయితే కొంచెం నయం...చాటో, పానీ పూరీయో,  సమోసావో, ఉత్తరమో, తూర్పో ఏదో ఒకటి మన దేశం తిండే తింటున్నాం అనే ఓ తృప్తి...డబ్బులు పెట్టి కొన్నందుకు ఏదో కొంత కడుపు నిండడం.....ఇప్పుడు కొత్తగా ఇటలీ తిండిట...పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, ....అబ్బబ్బ.....చూడడం వరకూ అక్కర్లేదు, తలుచుకుంటేనే వెలపరం వచ్చేస్తోంది....పైగా కళ్ళు తిరిగే రేట్లు....కడుపు నిండదు.....బైట ఫేషన్ గా తిని ఇంటికొచ్చి పెరుగన్నం తింటేనే కాని, ఆ వెలపరం పోదు.

ఇవేవీ లేకుండా మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.....ఇవన్నీ ఒక్క కాఫీలోనే ఉండి, రోజుకి 16 కప్పులు కాఫీ తాగినా మీ ప్రాణానికి హాని లేదు, మాదీ గ్యారంటీ అని ఎవరైనా చెప్తే ఎంత బాగుండును? ఎంత పని తగ్గుతుంది? తెల్లారే చక్కని, చిక్కని డికాషన్ తీసుకుని, వేడిగా నురగలు కక్కే కాఫీని పెద్ద గ్లాసులో తెచ్చుకుని (ఇంట్లో ఝూలా ఉంటే ఇంకా బెటరు)  ప్రశాంతంగా తాగుతూ ఉంటే...మరుక్షణం చచ్చిపోయినా పర్వాలేదు అన్నంత తృప్తి ఉండదూ...అబ్బే,,,,,ఆ తృప్తి ఎక్కడ మిగులుస్తారు మనకీ.....పొద్దున్న లేస్తూనే కాఫీ తాగద్దు,అందులొ కెఫిన్ ఉంటుంది, ఇంకోటుంటుంది అని ఒకటే భయపెట్టడం. నాకు తెలియక అడుగుతా...ప్రపంచంలోని సైంటిస్టులందరికీ ఒక్క కాఫీయే దొరుకుంతుందా అండీ రిసెర్చ్ చేయడానికి, మన ప్రాణాలు  తోడేయ్యడానికి కాకపోతే...తాగే మూడు కప్పుల కాఫీని కూడా వంటపట్టనివ్వరు వెధవ భయాలు కల్పించేసి....

సరి .....నాకు కూడా భోజనం టైం అయ్యింది...వంటల్లో రకాల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. 

Tuesday 3 May 2016

ఈ పెద్దవాళ్ళకు ఏమీ తెలియదు కాని, చిన్న పిల్లల్ని తిట్టమంటే మాత్రం రెడీ.....అక్క అల్లరి చేయదు, అక్క బాగా చదువుతుంది, అక్కని చూసి నేర్చుకో, అబ్బబ్బ...రోజూ ఇదే పాట...అల్లరి చేయడం అంత ఈజీనా? ఎంత టాలెంట్ ఉండాలి దానికి? వెధవ చదువుదేముంది? అందరూ చదివేస్తారు పుస్తకాలు ఇచ్చి, బళ్ళో పడేస్తే.....అల్లరి ఒకరు నేర్పితే వచ్చేదా? స్వతహాగా పుట్టుకతో రావాలి. చదువు చదవడం అంత ఈజీ కాదు అల్లరి చేయడం..పాఠాలు అర్ధం కాకపోతే, ప్రైవేటు చెప్పించుకోవచ్చు, గైడ్లు చదవచ్చు...అల్లరి చేయటానికి ఇవన్నీ ఉండవే...ఎవరి తెలివితేటల్ని బట్టి వాళ్ళు చేయడమే...ఎంత కష్టం? ఎవరినైనా వెక్కిరించి ఏడిపించాలంటే ముందు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ మాటతీరు, మాడ్యులేషన్ అన్నీ పట్టుబడాలి. వాళ్ళ నడక, నడత అన్నీ గమనించాలి..అన్నీ చూసి, అప్పుడు వెక్కిరించాలి. నిక్ నేంస్ పెట్టాలి...ఇదంతా ఎంత పెద్ద పని? చదువు పట్టకుండా అస్తమానూ ఆడుకుంటావు అని పెద్ద్ల కంప్లైంటు...దీనికి కూడా జవాబు చెప్తా...అలా ఇరవై నాలుగ్గంటలూ ఆడుకోవాలి అంటే ఎంత స్టామినా ఉండాలి? మధ్యలో అలిసిపోకూడదు. ప్రతిసారీ గెలవాలి. (లేకపొతే పక్కవాళ్ళు ఏడిపిస్తారు..గొడవలు అవుతాయి. గొడవలు పైకి వస్తే ఇక ఆటలకి పంపించరు...ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా) ఎంత ఆడుకున్నా, మర్నాటికి చేయవలసిన హోం వర్క్ పూర్తి చెయ్యాలి. లేదంటే స్కూల్లో చెడ్డపేరు...అందులోనూ, మనకన్నా పెద్దవాళ్ళు అన్నో, అక్కో, మన ప్రాణానికి అదే స్కూల్ లో చదువుతున్నారనుకోండి, ఇక అక్కడ కూడా టార్చర్ మొదలవుతుంది. మీ అక్క బాగా చదువుతుంది, నీకేమయింది? మీ అన్నకు వచ్చినన్ని మార్కులు నీకు రావేంటి? ఇవీ టీచర్ల ప్రశ్నలు.....ఇది మరీ విడ్డూరం....ఏ అల్లరి చేయకుండా, ఏ కాలక్షేపమూ లేకుండా పొద్దస్తమానూ చదివినవాళ్ళకి 90% వస్తే, అల్లరి చేస్తూ, అమ్మని ఏడిపిస్తూ, ఆడుకుంటూ, ఇంటి పనులు చేస్తూ చదివి పరీక్షలు రాసి 85% తెచ్చుకుంటే ఎవరు గొప్పండీ? మీరు చెప్పండి పోనీ..అస్తమానూ పుస్తకం పట్టుకుని కూర్చునేవాళ్ళకి ఇంట్లో పనులు కూడా చెప్పరు..."చదువుకోనీ వాళ్ళని, నీకెలాగూ కుదురు లేదు...ఈ పని చేసుకురా....." అంటూ..ఎంత అన్యాయం? వాళ్ళు చేసే ఏకైక పని చదువే కదా.....మనకెన్ని (అల్లరి పిల్లలకి) ఎన్ని వ్యాపకాలు? రోజూ ఒకటే అల్లరి చేయలేము ఏళ్ళ తరబడి....మధ్యలో కొత్త కొత్తవి పుట్టుకొస్తాయి....వాటి గురించి కూడా ఆలోచించాలి. చేసే అల్లరి అందరికీ నచ్చాలి. లేదంటే చెడ్డ పేరొచ్చేస్తుంది. మన అల్లరితో అందరూ నవ్వుకోవాలి.

నాకు తెలియక అడుగుతానూ, చిన్నప్పుడు అల్లరి చేయకపోతే, పెద్దయ్యాక, పిల్లలకు ఏ ముచ్చట్లు చెప్పుకుంటారండీ! కొంత వయసు వచ్చాక, చిన్ననాటి జ్ఞాపకాలు ఏం గుర్తు తెచ్చుకుంటారు? నేను అస్తమానూ లోకం తెలియకుండా చదువుకునేదాన్ని..అని చెప్పడం ఎంత చిరాగ్గా ఉంటుంది? వాక్....నాకు అస్సలు నచ్చదు. సంతానం లో పెద్ద పిల్లలు అయినంత మాత్రాన, లేని పెద్దరికం పైన వేసేసుకుని, గంభీరంగా కూర్చోవటం...ఏదో ప్రపంచం బరువుబాధ్యతలన్నీ వీళ్ళే మోస్తున్నట్టు...అబ్బ....ఎంత చిరాకో.....పైగా మనం అల్లరి చేస్తున్నాము అని మన మీద నిఘా ఒకటి...

ఆడుకోవాలి అంటే ఎన్నెన్ని ఆటలు? బొంగరాలు, గోళీలు, ఏడుపెంకులు....ఇవన్నీ మగపిల్లలు ఆడే ఆటలే అని అమ్మ గోల...మగపిల్లాడిలాగా బయటిపనులు చేసినప్పుడు లేదు కాని, ఆటలకి తప్పొచ్చింది...చిన్నప్పుడు అల్లరి చేసేస్తే ఇంకో లాభం కూడా ఉంది...పెద్దయ్యాక, మన పిల్లలు అల్లరి చేస్తే మనకు కోపం రాదు.....పైగా వాళ్ళతో కూడా సరదాగా అల్లరి చేసేయగలం .....పిల్లలకీ హాయి, మనకీ హాయి. చిన్నప్పుడు మా పెద్దవాడు అల్లరి చేయకపోతే, చచ్చే భయం వేసింది నాకు...వీడేవిటిరా, చిన్నప్పుడే వివేకానందుడిలాగా అని, చదువుతో పాటు అల్లరి కూడా దగ్గరుండి నేర్పించవలసి వచ్చింది....అదో చక్కటి జ్ఞాపకం....పిల్లలు శరీరంలో ఏ హార్మోన్ తక్కువైతే అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటారా అని లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరగేయవలసి వచ్చింది...ఇప్పుడి టాపు లేపుతున్నాడు అనుకోండి..అది వేరే సంగతి....



ఇంకొన్ని అల్లరి జ్ఞాపకాలు మరోసారి.